
“మధ్య ప్రాచ్య దేశాల డయాస్పొరాతెలుగు కథ” – కథలకు ఆహ్వానం
రాబోయే నవంబర్ 21-22, 2024 లో జరిగే 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన వారు రచించిన కథా సంకలనం “మధ్య ప్రాచ్య దేశాల డయాస్పొరా తెలుగు కథ” అనే పేరిట ప్రచురించి ఆ సదస్సులో ఆవిష్కరిస్తే బావుంటుంది కదా అని ఆలోచన వచ్చింది. ఆయా దేశాలు (ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహరైన్, అబు దాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, యెమెన్, మస్కట్ మొదలైన దేశాలు), తదితర సమీప ప్రాంతాలలో (ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, టర్కీ మొదలైన దేశాలు) నివసిస్తున్న తెలుగు వారు రచించిన కథలు, వ్యాపార రీత్యానో, ఇతరత్రానో ఆయా ప్రాంతాలని వ్యక్తిగతంగా సందర్శించిన ప్రత్యక్ష పరిజ్ఞానంతో రచించిన కథలు అనే విస్తృత అర్ధంలో “మధ్య ప్రాచ్య డయాస్పొరా తెలుగు కథ” లో కథలకి ఆహ్వానం పలుకుతున్నాం. అక్కడి సమాజ స్పృహ, అక్కడి భిన్న సంస్కృతుల మధ్య జీవనం సాగిస్తున్న ఇతివృత్తాలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇతర కథా వస్తువులు కూడా ఆమోదయోగ్యమే.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూ జీలండ్, సింగపూర్, ఇంగ్లండ్ తదితర ప్రాంతాల డయాస్పొరా కథా సంకలనాలు, కథా సంపుటులు అందుబాటులో ఉన్న నేపధ్యంలో మధ్య ప్రాచ్య దేశాల డయాస్పొరా కథలు, కథకులకి తగిన గుర్తింపు రావడానికి ఇదే తొలి ప్రయత్నం అని భావిస్తూ, తెలుగు కథా సాహిత్య చరిత్రలో ఈ కథాసంకలనం ఒక మైలురాయిగా నిలుస్తుంది అని నమ్ముతున్నాం.
నియమాలు, నిబంధనలు, సూచనలు:
- మధ్య ప్రాచ్య దేశాల స్థానిక ఇతివృత్తాల కథలకి, ఆ ప్రాంత నివాసులైన రచయితల కథలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- వ్యాపార, పర్యాటక, తదితర కారణాలతో ఆయా దేశాలని సందర్శించి, ప్రత్యక్షంగా స్థానిక పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకున్న రచయితలు ఆ మేరకి హామీ పత్రాన్ని జతపరుస్తూ పంపించిన కథలు కూడా పరిశీలించబడతాయి.
- ఆయా దేశాలలోని స్థానిక జీవితాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, డయాస్పొరా సమస్యలు, మొదలైన వాటిని ప్రతిబింబించే కథా వస్తువులకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
- యూనికోడ్ (Word File, Google Doc) లో ఉన్న కథలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, JPEG, Scanned, వ్రాత ప్రతి, తదితర ఫార్మాట్ లలో వచ్చిన కథలు ఆమోదించబడవు.
- కథల నిడివి సుమారు 3000 పదాలకి మించకూడదు.
- ఒకే రచయిత రెండు కథలు పంపవచ్చును.
- అముద్రిత కథలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇది వరలో ముద్రించబడిన కథల తొలి ముద్రణ వివరాలతో అందిన కథలు పరిశీలించబడతాయి.
- రచన తమ సొంతం అనీ, దేనికీ అనువాదం, అనుసరణ కాదని హామీ పత్రం జతపరచాలి.
- కథతో పాటు ఫోటో, ఐదు-పది పంక్తులకి లోబడి క్లుప్తంగా తమ వివరాలు పంపాలి. ఈ వివరాలు అందని కథలు పరిశీలించబడవు.
- కథల ఎంపిక, ముద్రణ, తదితర సంబంధిత విషయాలలో అన్ని నిర్ణయాలు సంపాదకవర్గానివే. వాదోపవాదాలకు, చర్చలకు తావు లేదు.
- కథలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: ఆగస్ట్ 15, 2024.
- కథలు పంపవలసిన చిరునామా: Vangurifoundation@gmail.com
నవంబర్ 21-22, 2024 తేదీలలో ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో దోహా మహానగరం (ఖతార్ దేశం) లో జరిగే 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విశేషాలు త్వరలోనే ప్రకటించబడతాయి.
వంగూరి చిట్టెన్ రాజు
శాయి రాచకొండ