తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారాలు
తెలుగు విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారాలను ప్రకటించింది. 2019వ సంవత్సరానికి ప్రముఖ నాట్యాచార్యులు కళాకృష్ణను ఎంపిక చేశారు. 2018వ సంవత్సరానికి ప్రముఖ సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య ఎంపికయ్యారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే బహుమతీ ప్రదానోత్సవంలో భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఈ విశిష్ట పురస్కారం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం బహుకరిస్తారు.
కళాకృష్ణ: ఆంధ్ర నాట్యంలో గురువుగా, నర్తకునిగా విశేష సేవలు అందిస్తూ అంతర్జాతీయ గుర్తింపు పొందిన కళాకృష్ణ 1951 లో కరీంనగర్ లో జన్మించి హైదరాబాద్ లో ఉంటున్నారు. పద్మశ్రీ నటరాజ రామకృష్ణగారి దగ్గర గురుకుల పధ్ధతిలో ఆంధ్ర నాట్యం అభ్యసించారు. నవ జనార్ధన పారిజాతం ప్రదర్శించడంలో తనదయిన రసజ్ఞ మోహన ముద్ర వేశారు. అభినవ సత్యభామగా ప్రశంసలు అందుకున్నారు. కళాకారునిగా అధ్యాపకులుగా నాలుగున్నర దశాబ్దాలుగా సేవలందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో పురస్కారాలు, సన్మానాలు పొందారు.
ఈయన కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఖండాంతరాలకు కూచిపూడి గొప్పతనాన్ని వ్యాపింపజేశారు. వివిధ రాష్ట్రాలతో పాటు ఆఫ్రికా, మారిషస్, యుఎస్‌ఎ, యుకె, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, మస్కట్, జపాను మొదలైన ఎన్నో దేశాలలో ప్రదర్శనలిచ్చి మన కళలను ప్రచారం చేశాడు. పలు వీడియోలను రూపకల్పన చేశాడు. వివిధ సంస్థలు, ప్రభుత్వం తరపున దేశ విదేశాలలో వర్క్‌షాప్స్ నిర్వహించి ఎందరో కళాకారులకు మార్గనిర్దేశం చేశాడు.
అందుకున్న పురస్కారాలు:
2005 అక్కినేని నాగేశ్వరరావు బంగారు పతకం,
2009 కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు
వివేకానంద ఎక్స్‌లెన్సీ అవార్డు, వివేకానంద 150 జయంతి సందర్భంగా.
కూరెళ్ల విఠలాచార్య: యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో 1938 లో జన్మించిన ప్రముఖ కవి, విమర్శకులు కూరెళ్ల విఠలాచార్య ఇప్పటి వరకు 22 పుస్తకాలు ప్రచురించారు! ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొందాక తన స్వగృహాన్ని గ్రంథాలయంగా తీర్చిదిద్ది రెండు లక్షలకు పైగా సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉంచారు! సాహిత్య వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నారు.
అందుకున్న పురస్కారాలు:
వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి పురస్కారం
ప్రజాకవి సుద్దాల హనుమంతు పురస్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దాశరథి సాహితీ పురస్కారం.