అంతులేని దీక్షతో… మొక్కవోని నిబద్దతతో నాటకరంగ సంస్థ వ్యవస్థాపకుడిగా, ‘కళాదీపిక’ పత్రిక సంపాదకుడిగా, నాటకరంగ వ్యాస రచయితగా ఐదు దశాబ్ధాల పాటు అవిరళ కృషిసల్పిన వి.యస్. రాఘవాచారి గారు ఇటీవల ప్రచురించిన ‘తెలుగు దీపికలు’ (తెలుగు ప్రముఖుల జీవన రేఖలు) పుస్తక పరిచయం మీకోసం.
గత కొన్ని సంవత్సరాలుగా రాఘవాచారి గారు ‘కళాదీపిక’ పేరుతో వాట్సప్ గ్రూపును నడుపుతున్నారు. ఈ వాట్సప్ గ్రూప్ లో సందర్భానుసారం తెలుగు ప్రముఖుల జీవన రేఖలను పోస్ట్ చేస్తున్నారు. అలా… పోస్ట్ చేయబడిన తెలుగు ప్రముఖుల జీవన రేఖలకు ఓ పుస్తక రూపం కల్పిస్తే, ఇటు నేటి తరానికి అటు భావి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా – ఉపయోగకరంగా, ప్రయోజనకారిగా ఉంటుందని ఎంతో కాలంగా, చాలా మంది కళాదీపిక పాఠకులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. అలా… తెలుగు దీపికలు పుస్తకానికి ఆవిర్భావానికి పునాది పడిందని చెప్పవచ్చు. కానీ… పుస్తక పఠనం అరుదైపోయిన ఈ రోజుల్లో.. అరచేతిలోని చరవాణి అంతర్జాలంలో అన్నీ ఇమిడి పోయిన ఈ ఆధునిక కాలంలో… ఈ పుస్తకాన్ని ఎవరైనా కొంటారా!… చదువుతారా!… అన్న మీమాంసలో రాఘవాచారి గారు వున్న సమయంలో కళాదీపిక పాఠకులలో కొందరు స్పందించి ఈ పుస్తకానికి ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చారు. అలా ఈ పుస్తకం పాఠకుల ముందుకొచ్చింది.
19వ శతాబ్దం ఉత్తరార్థంలో పుట్టిన తెలుగు ప్రముఖులలో ఓ 55 మంది ప్రముఖుల జీవన రేఖలను ఈ పుస్తకంలో పొదుపరిచారు. ఈ వ్యాసాలన్నీ ఎంతో మంది రచయితల మేధో మధనం నుండి వెలువడినవే. కొన్ని వ్యాసాలు కొన్ని పుస్తకాల నుండి, మరికొన్ని అంతర్జాలం, బ్లాగులు, వికీపీడియా, పత్రికలు తదితర మాధ్యమాల నుండి సేకరించినవే. అలా సేకరించిన ఆయా రచయితల వ్యాసాలను ఒక సంపాదకుడుగా కొన్ని మార్పులు, చేర్పులు, కూర్పులు చేసి ఈ పుస్తకంలో పొందుపరచి ఈ తెలుగు దీపికలు ప్రచురించారు రాఘవాచారి గారు.
‘తెలుగు దీపికలు’ పుస్తకం డొక్కా సీతమ్మ గారితో ప్రారంభించి, కందుకూరి, గురజాడ, ఆదిభట్ల నారాయణదాసు, టంగుటూరి, పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ, గుర్రం జాషువా, అల్లూరి సీతారామరాజు, దువ్వూరి సుబ్బమ్మ, దామెర్ల రామారావు, గరిమెళ్ళ సత్యనారాయణ, బండారు అచ్చమాంబ, అడివి బాపిరాజు, కొండా వెంకటప్పయ్య, బూర్గుల రామకృష్ణారావు వరకు 55 మంది సంఘ సేవకులు, సంఘ సంస్కర్తలు, అభ్యుదయ వాదులు, స్వాతంత్ర సమరయోధులు, కవులు, రచయితలు, అవధానులు, నటులు, చిత్రకారులు, చరిత్రకారులు, పత్రికా సంపాదకులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు తదితర రంగాల వారి సమగ్ర పరిచయాలు ఫోటోలతో సహా వున్నాయి.
పుస్తక ప్రియులు, నేటితరం యువత తప్పక చదవాల్సిన, దాచుకోవాల్సిన మంచి పుస్తకం తెలుగు దీపికలు. ప్రచురణ కర్తలకు, అందుకు సహకరించిన వారికి అభినందనలు.
-కళాసాగర్ యల్లపు
తెలుగు దీపికలు (తెలుగు ప్రముఖుల జీవన రేఖలు)
సంపాదకుడు: వి.యస్.రాఘవాచారి
పేజీలు: 160, వెల: రూ.150/-
ప్రతులకు: కళాదీపిక, తిరుపతి, మొబైల్: 99088 37451
తెలుగు ప్రముఖుల జీవితాల్ని ఒక పుస్తక రూపంలోతీసుకు రావడం చాలా మంచి పని. శ్రీ VS రాఘవాచారిగారు మిక్కిలి అభినందనీయులు. రచయిత కు మీకూ అభినందనలతో.. Bomman