మహ్మద్ రఫీ కి తెలుగు వెలుగు పురస్కారం

రాజమహేంద్రవరంలో మూడు రోజులపాటు అంతర్జాతీయ తెలుగు మహాసభలు

రెండు రాష్ట్రాలు తెలుగు భాషను చంపేస్తున్నాయని, కవులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు తెలుగును బతికించి రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం గోదావరి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ క్యాంపస్ లో నిన్న శుక్రవారం అట్టహాసంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరిగాయి. ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాలను చత్తిస్ ఘడ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. వెయ్యి కవితలతో రాజరాజ నరేంద్రుడికి నీరాజనాలు పలికే నారాయణభట్టు వేదిక ప్రాంగణాన్ని మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. పద్య గద్య అవధానాల సదస్సుకు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ శుభారంభం పలికారు. డాక్టర్ కొలకలూరి ఇనాక్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్, కవి అందెశ్రీ, సిలికానాంధ్ర యూనివర్సిటీ చైర్మన్ కూచిభోట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించి కీర్తిశేషులైన తరిగొండ వెంగమాంబ, కవయిత్రి మొల్ల, పరవస్తు చిన్నయ సూరి, డొక్కా సీతమ్మ, గుర్రం జాషువా, దామోదరం సంజీవయ్య, బోయి భీమన్న, అల్లూరి సీతారామరాజు, మండలి వెంకట కృష్ణారావు, సి.వి.రాఘవాచారి, సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, తుర్లపాటి కుటుంబరావు, పద్మనాభం, జంధ్యాల, సురభి జమునరాయలు, వై.కె. నాగేశ్వరరావు తదితర మహానుభావుల తరఫున వారి కుటుంబ సభ్యులను, వారసులను తెలుగు వెలుగు పూర్ణ కుంభ పురస్కారాలతో సన్మానించారు.

వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న తనికెళ్ళ భరణి (సినిమా), డా. టి. గౌరిశంకర్ (భాషా సేవ), డా. రసరాజు (సాహిత్యం), డా. మహ్మద్ రఫీ (పత్రికా రంగం), అన్నాబత్తుని నాగమణి (నాటకం), గోగినేని శిల్ప (టివి రంగం), డా. వంశీ రామరాజు (సాంస్కృతిక సేవ), జిత్ మోహన్ మిత్రా (కళా సేవ) పూర్ణ కుంభ తెలుగు వెలుగు పురస్కారాలతో సన్మానించారు. డా. గజల్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కె.వి. సత్యనారాయణ రాజు సమన్వయం చేశారు. ఆకాశవాణి వాచస్పతి మక్దూమ్ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణ.

SA: