
*తిరుపతిలో తెలుగు వికీపీడియా పండగ 2025.
*తెలుగు వికీపీడియా 21 వ వార్షికోత్సవ వేడుకలు.
*మూడు రోజుల పాటు వివిధ అంశాలపై సభ్యులకు శిక్షణ.
………………………………………………………………………….
మొదటిరోజు కార్యక్రమం: Telugu Wikipedia Festival 2025 : గ్రామాలు, ప్రముఖ వ్యక్తులు, చారిత్రక కట్టడాలు ప్రదేశాలు ఇలా ఏ సమాచారం కావాలన్నా వెంటనే గుర్తుకొచ్చేది వికీపీడియానే. ఇది తెలుగులోనూ విజ్ఞానాన్ని అందిస్తోంది. మొబైల్ యాప్‌లోనూ సమాచారం తెలుసుకునే వీలుంది. తెలుగు వికీమీడియా యూజర్ గ్రూప్ ఆద్వర్యంలో 2025 ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో తిరుపతి, హొటల్ కాంట్ బ్లిస్ లో “తెవికీ పండగ 2025” అనే పేరుతో తెలుగు వికీపీడియా వార్షిక సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 50 మందికి పైగా తె.వి.కీ. సభ్యులు పాల్గొన్నారు. ‘తెలుగు వికీపీడియా పండగ’కు హాజరైన సభ్యులందరికీ పేర్లు నమోదుచేసుకొని ప్రతీ సభ్యునికి ఒక రైటింగ్ పాడ్, పెన్, కప్పు, కేప్, టీ.షర్ట్ అందజేసారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పాలకోడేటి సత్యనారాయణ, శ్రీరామూర్తి, సుజాత, గుళ్ళపల్లి నారాయణరావు, రామేశం గార్లు జ్యోతి ప్రకాశనం చేశారు. స్వాగతోపన్యాసం సుశీల గారు చేశారు.

2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకు పైగా వ్యాసాలను కలిగి ఉంది. తొలిరోజు ప్రారంభ సభలో తె.వి.కీ. 21 వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సభ్యులందరూ విజయోత్సాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వికీపీడియాను విస్తరించే మార్గాలు, సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల, వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు, తదితర కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. మొదటి రోజున వివిధ వికీమీడియా ప్రాజెక్టుల గురించి అభిలాష్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ప్రతీ ప్రాజెక్టు గురించి చాలా విస్తారంగా దాదాపు గంటన్నర పాటు వివరించారు. అతను పరిశోధించి రాసిన, వికీపీడియా పై వచ్చిన మొట్ట మొదటి పరిశోధన పత్రాన్ని అందరికీ పరిచయం చేసి, సమర్పించారు.
రెండవరోజు కార్యక్రమం: హాజరైన తెలుగు వికీమీడియా సభ్యులందరి తమ స్వీయపరిచయాలతో సభ ప్రారంభమైంది. ఒక్కోక్క సభ్యుడు తమకు వికీలో కలిగిన అనుభవాలను, ఎదురైన సంఘటనలను, ఇతర సభ్యులతో తమకున్న అనుబంధాన్ని వివరించారు. మధ్యాహ్న భోజనం తరువాత సభ్యులు ఆరు గుంపులుగా విడిపోయి ‘తెలుగు వికీపీడియాలో భాష’, ‘తెలుగు వికీపీడియా నిర్వహణ’, ‘తెలుగు వికీపీడియా విస్తరణ, శిక్షణ’, ‘తెలుగు వికీసోర్సు’, ‘వికీమీడియా కామన్స్’, ‘వికీడేటా, మీడియా వికీ, టూల్స్’ అనే అంశాలపై చర్చించి తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయాలను క్రోడీకరించి భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించి, గ్రూప్ ప్రతినిధులు ప్రకటించారు. మరియు, యొక్క, బడు వంటి పడికట్టు పదాలను వీలైనతవరకూ పరిహరించాలని, ఇదివరకు 20 వారాలు నడిచిన తెవికీబడి శిక్షణా కార్యక్రమం ఇకపై ప్రతీవారం నిర్వహించాలనే నిర్ణయాలు వాటిలో కొన్ని. తరువాత మొబైల్ ఫోన్లో ఎడిటింగ్ శిక్షణనిచ్చారు.
తెలుగు వికీపీడియాలో చేరండి – అందరికీ విజ్ఞానం పంచండి అనే నినాదంతో తిరుపతి వీధుల్లో సభ్యులు ర్యాలీ నిర్వహించారు. కరపత్రాలను పంచి ప్రజలకు దీనిపై అవగాహన కల్పించారు. తిరుపతి కూడలిలో వున్న శంకరంబాడి సుందరాచార్యులు వారి విగ్రహానికి పూలమాల వేసి “మా తెలుగు తల్లికి మల్లె పూదండ ” గీతాన్ని సభ్యులందరూ ఆలపించారు.

మూడవరోజు కార్యక్రమం: మూడవ రోజు ఉదయపు సదస్సులో ‘వేగంగా మారుతున్న సాంకేతిక పురోగతి వికీపీడియాపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది’ అనే అంశంపై ప్యానల్ చర్చ జరిగింది. ప్యానల్లో రవిచంద్ర, సాయిఫణి, రాధిక, ఐ. మహేష్ పాల్గొన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాజాలదని, దాని గురించి ఎక్కువ ఆందోళన చెందనవసరం లేదని, దానిని ఒక పరికరంగా ఉపయోగించుకొని వికీపీడియాలో చేపట్టవలసిన పనులను సులభతరం చేసుకోవాలని, హ్యూమన్ టచ్ లేని చర్యలు కృతకంగా ఉంటాయని సభ్యులు చర్చద్వారా అభిప్రాయపడ్డారు.
‘తెలుగు వికీపీడియా బడి’ పేరుతో త్వరలో ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు కోఆర్డినేటర్ కృపాల్ కశ్యప్ వెల్లడించారు. కొత్త సభ్యులు వీటి ద్వారా ఇందులో భాగస్వాములు కావొచ్చని అన్నారు. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని ఈ వేడుకల్లో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకునిగా యర్రా రామారావు ఎంపికయ్యారు. అదేవిధంగా చదువరి, ఎన్.ఆర్. గుళ్లపల్లి, శ్రీరామమూర్తి, బత్తిని వినయ్‌కుమార్ గౌడ్, స్వరలాసిక, టి. సుజాత, రవిచంద్ర, రామేశం, ఐ. మహేశ్, బీ.కే. విశ్వనాథ్ తదితరులను పురస్కారాలతో సత్కరించారు.
ఈ సభలో యువ వికీపీడియన్ ఉదయ్ కిరణ్ (16 ఏళ్ళు)తో ప్రముఖ రచయిత పాలకోడేటి సత్యనారాయణ జరిపిన సంభాషణ ఆశక్తికరంగా సాగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఉదయ్ కిరణ్ విద్యార్థి దశలోనే వ్యాసాలు రాయడం అభినందించదగ్గదని పాలకోడేటి అన్నారు. భవిష్యత్తులో మరింత కంటెంట్ సృష్టించి, సమగ్ర వికీపీడియా నిర్మాణానికి కృషి చేయడం, అలాగే కొత్త సహకారులకు మెరుగైన మద్దతు అందించేందుకు అవసరమైన సహాయక వనరులను అభివృద్ధి చేయడం వంటి కీలక నిర్ణయాలు తెలుగు వికీమీడియా యూజర్ గ్రూప్ ఈ సదస్సులో తీసుకుంది.
ఈ సదస్సు తెలుగు వికీపీడియా సామర్థ్యాన్ని మరింత పెంచడానికి, ఇంకా విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, తె.వి.కీ. లోకి యువరచయితలను పరిచయం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. సదస్సులో పాల్గొన్న యాభై మందిలో పదిమంది యువత వుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.
తెలుగు వికీపీడియా సభ్యునిగా నేను తొలిసారి ఇలాంటి వార్షిక సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని, తె.వి.కీ. వ్రాయడంలో వున్న అనేక సందేహాలకు సమాధానాలను పొందాను. ఎందరో మిత్రులను కలుసుకున్నాను. ఈ ఉత్సాహంతో తె.వి.కీ.లో చిత్ర-శిల్ప కళారంగానికి చెందిన అనేక కొత్త వ్యాసాలను వ్రాయడానికి ఉపక్రమిస్తాను. నా భావాలను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం కల్పించిన మిత్రులందరికీ, నాతోటి వికీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
–కళాసాగర్

Telugu Wikipedia 21st Anniversary Celebrations

Telugu Wikipedia Festival 2025, Tirupati users meet group


Telugu Wiki Awardees -2025

Young Wikipedian Uday Kiran (16 years) interview with Palakodeti Satyanarayanarao




Round table meet with different groups on various topics

తెలుగు వికీపీడియా అనేది ఒకటుందనే విషయం కూడా ఇంతవరకు నాకు తెలియదు. 2003 నుంచి ఇది పనిచేస్తుందని లక్షకు పైకి వ్యాసాలు దీంట్లో ఉన్నాయని తెలిసి ఆశ్చర్య చెకితుడనయ్యాను.
ఒకసారి నాకు దీని వివరాలు అందజేయండి. నేను కూడా వ్యాసాలు పెట్టడానికి ప్రయత్నిస్తాను.
తెవికీ పండగ మొదటి రోజున వివిధ వికీమీడియా ప్రాజెక్టుల గురించి అభిలాష్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ప్రతీ ప్రాజెక్టు గురించి చాలా విస్తారంగా దాదాపు గంటన్నర పాటు వివరించారు. అతను పరిశోధించి రాసిన, వికీపీడియా పై వచ్చిన మొట్ట మొదటి పరిశోధన పత్రాన్ని అందరికీ పరిచయం చేసి, సమర్పించారు. దీనిని గురించి ఇక్కడ ప్రస్తావించక పోవడం పక్షపాత వైఖరికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఏ అంశాన్నిగాని, వ్యక్తులను గాని ప్రస్తావించకపోవడం జరగలేదు. ఇంకా అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావనకు రాలేదు. అన్యదా భావించవద్దు.
-కళాసాగర్