అమరావతి సాహితీమిత్రులు సభలో ప్రముఖ సాహితీవేత్త విడదల సాంబశివరావు పవిత్ర ప్రేమ ప్రతిపాదితమే పద్మావతి నవల అని ప్రముఖ సాహితీవేత్త విడదల సాంబశివరావు (చిలకలూరిపేట) తెలియజేసారు. “అమరావతి సాహితీమిత్రులు” ఆదివారం (21-08-2022) గుంటూరు ఉదయం బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాహిత్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తాటికోల పద్మావతి నవల “వర్షం సాక్షిగా” నవలను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. కథ నడపడంలో, పాత్ర చిత్రణలో, సన్నివేశ కల్పనలో రచయిత్రి ప్రదర్శించిన రచనా విశేషాల్ని వివరించారు. సంస్థ అధ్యక్షుడు డా. రావి రంగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో “వర్షం సాక్షిగా” నవల గురించి ప్రముఖ సాహితీవేత్త డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి సమీక్షించారు. నవల చదివించే రీతిలో ఆసక్తికరంగా రచించారని, సరళ శైలిని, శిల్ప విశేషాల్నివివరిస్తూ ఆమె రచయిత్రిని కొనియాడారు. ఈ సభలో ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచన “మండే సూర్యుడు” గురించి డా. రావి రంగారావు సోదాహరణ కవిత్వ విశ్లేషణ చేశారు. “ఈ మాసం కవి”గా నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి పాల్గొని దేశ భక్తి గురించి, గురువుల గురించి, మానవత్వం గురించి… అనేక పద్య రచనలను వినిపించి సభను రంజింపజేశారు. . పింగళి భాగ్యలక్ష్మి నిర్వహించిన కవి సమ్మేళనంలో గడల శివప్రసాద్, యక్కంటి పద్మావతి, ఈవూరి వెంకటరెడ్డి, సయ్యద్ జానీ బాషా, బండికల్లు జమదగ్ని, వెదుళ్లపల్లి సాంబశివరావు, డా. మైలవరపు లలితకుమారి, గింజుపల్లి బాపయ్య మొదలైన వారు పాల్గొన్నారు. సంస్థ అధ్యక్షులు డా. రావి రంగారావు, కన్వీనర్ పింగళి భాగ్యలక్ష్మి, డా. ఉయ్యురు లక్ష్మీ నరసింహారావు, నూతలపాటి తిరుపతయ్య, తాటికొల పద్మావతి దంపతులు, డా.టి. సేవకుమార్ అతిథుల్ని శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు.