రంగస్థల దర్పణం – 1
వావిలాల వాసుదేవశాస్త్రి (1851-1897)భాషాత్రయం(సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం)యందు మహా పండితులు. అటు కావ్య సాహిత్యము లోను ఇటు నాటక సాహిత్యములోను వీరిది అందె వేసిన చేయి. ఆధునిక ఆంధ్ర నాటకసాహిత్యాన అనేకానేక ప్రక్రియలకు నాంది పలికిన సాహిత్య వైతాళికులు వావిలాలవారు. తెలుగులో తొలి ఆంగ్లానువాద నాటకం, తొలి విషాదాంత నాటకం, తొలి స్వతంత్ర సాంఘికనాటకం, తొలి సాంఘిక(పద్య) నాటకం, ప్రచురణకు నోచుకున్న తొలి సాంఘిక (పద్య)నాటకం, అంతర్నాటకం కలిగిన తొలి తెలుగు నాటకాల రచయితగ చరిత్ర పుటలలో శాశ్వత యశస్సు సముపార్జించుకున్న ఘనత శాస్త్రిగారిది.
వావిలాలవారు రేపల్లె తాలూకా ‘కారుమూరు’ గ్రామవాసులే ‘అప్పయ్యశాస్త్రి, మహాలక్ష్మి’ దంపతులకుగల ఐదుగురు పుత్రులలో ద్వితీయునిగ భానువారం(1-6-1851)న జన్మించారు. వీరు హరితస గోత్రులు. వీరి తల్లిదండ్రుల పూర్వీకులంతా మహా పండితులు, సంపన్నులు. వీరి ప్రపితామహులగు వెంకట శివావధానులు ‘రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు’గారి ఆస్థాన విద్వాంసులు. పితామహులగు ‘సుబ్రహ్మణ్యం’ అగ్నిష్టోమాదులొనరించి సోమయాజైన విశిష్టమూర్తి. వీరి తండ్రియగు ‘అప్పయ్యశాస్త్రి’ శోత్రియులేకాక లౌకికావతంసులు, వ్యాపారవేత్తలు. వీరి మాతామహులగు ‘వఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి’ మదరాసు సదర్ అదా లత్(హైకోర్టు)లో న్యాయపండిత పదవిని నిర్వహించినట్టి ఉద్దండులేకాక తెలుగుభాషకు యెనలేని సేవచేసిన ‘సి.పి.బ్రౌదొర’కు సాక్షాత్తూ గురుదేవులు.
ఇంతటి పాండితీప్రకాండులకు మేధోవారసుడుగ ప్రభవించిన వావిలాలవారు బాల్యం నుండి సత్ప్రవర్తనకు, అఖండ మేధాశక్తికి పేరు గడించిరి. దాంతో వీరి తల్లిగారు వీరిని ‘వరప్రసాది’ అని పిలుచుకుంటూ అమిత గారాబంతో పెంచారు. వీరు బాల్యంలో వైదికవిద్య నభ్యసించారు. మేనత్త కుమారులైన ‘కొండుభొట్ల రామ లింగశాస్త్రి’ వద్ద జన్మస్థలిలో సంస్కృతాంధ్రాలను అభ్యసించారు. పిదప కొండుభొట్లవారి ప్రోత్సాహముతోనే వో యేడాదిపాటు గుంటూరులో ఆంగ్లభాష నభ్యసించారు. ఆ తదుపరి బందరు నోబెల్ కళాశాలలో చేరారు. వీరచ్చట పాఠ్యగ్రంథాల అధ్యయనంతో సంతృప్తి చెందక కళాశాలలో తమ గురుదేవులగు ‘కోరాడ రామచంద్రశాస్త్రి (మంజరీ మధుకరీయమనే తొలి తెలుగునాటక కర్త)’ దగ్గర నాటకాలంకార వ్యాకరణాలను, వేదుల వేంకటాచార్యులు’ వద్ద సంస్కృతాంధ్రాలను క్షుణంగా అభ్యసించారు.
1870లో జరిగిన ప్రవేశపరీక్షలో మొదటితరగతిలో ఉత్తీర్ణులైరి. ఆనాటి వీరి విజయం కళాశాల ప్రార్థనా భవనంలో ఒక ఫలకము పై లిఖింపబడింది. పిమ్మట 1873లో ‘ప్రథమశాస్త్ర(F…) పరీక్షలో ఆంధ్రదేశంలోనే ప్రథములుగ నిలిచారు. వీరికి కవిత్వం చెప్పే ధోరణి ఈ సమయంలోనే అలవడింది. 1873లోనే వీరి తండ్రి ఖలాలుఖానా (అబ్కారీ) యిజారాలను రెండు లక్షలకు కొని, తన వ్యాపారానికి అనువైన కేంద్రంగ నెంచి మకాం రాజమండ్రికి మార్చారు. దాంతో వీరు తండ్రియొద్దకు (31-12-1873’న వచ్చి కడదాక అక్కడే నివసించారు. F.A., పరీక్ష ఫలితాలు రాగానే స్థానిక సెంట్రల్ జైల్ లో లభించిన ఉద్యోగానికి తన ప్రవృత్తికి సరిపడనందున వీరు నెలరోజులలోనే రాజీనామా చేశారు. అంతలోనే 1873-ఏప్రియల్ లో స్థానిక దొరతనం వారి సర్వకళాశాలలో వీరికి ఉపాధ్యాయపదవి లభించింది. నాటి ప్రిన్సిపాల్ మెట్కా గారికి వీరంటే అమితానురాగం. అక్కడ వీరు ప్రథమశాస్త్ర (F.A..) తరగతికి గణితం, భూగోళశాస్త్రాలను – పట్టపరీక్ష(B.A.) కు భాషాశాస్త్రం (ఫిజియాలజి)ను బోధించారు. అలా వారు 23 ఏళ్ళపాటు అధ్యాపకవృత్తిలో పనిచేశారు. మధ్యలో ఒక యేడాది కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని పాఠశాలలకు సహాయపరీక్షాధికారిగా పనిచేశారు. ఇలా వీరు అధ్యాపకునిగా పని చేస్తూనే స్వయం కృషితో ప్రైవేటుగ ‘పట్టపరీక్ష(B.A.)’కు వెళ్ళారు. 1877లో (B.A.)లో ఉత్తములుగ నిలిచి మదరాసు విశ్వవిద్యా లయంవారి కల్నల్ మెక్డో నాల్డ్ స్వర్ణపతకాన్ని బహుమానంగా పొందారు. వీరి బంధువర్గమంతటిలోనూ వీరే తొలి పట్టభద్రులు అగుటచే, వీరిని వారందరూ ‘బి.ఎ.,’గారని సంబోధించేవారట.
వీరి సాహిత్యవ్యాసంగ విషయానికొస్తే – వీరు ‘సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, జ్యోతిషం, తత్త్వశాస్త్రము’లలో నిష్ణాతులు. దాంతో వీరు అధ్యాపకులుగా వుంటూనే భాషాసేవ అనేక విధములుగ చేశారు. ‘న్యాపతి సుబ్బారావు స్థాపించిన ‘చింతామణి’ పత్రికను నిర్వహించేవారు. ఆ పత్రిక నిర్వహించే నవలా పోటీల్లో విజేత నెంపిక చేసే సమితిలో సభ్యుడుగా వుండేవారు. ఇంకా ఈయన ‘రాజయోగి, వివేకవర్ధని’ పత్రికల్లో కొన్ని వ్యాసాలు వ్రాసేవారు. వీరికిగల భాషాపాండిత్యానికి వీరు పనిచేసే కళాశాలలో దేశభాషాధ్యక్ష పదవిని పొందారు. బళ్ళారిలో జరిగిన ఆంధ్ర కవిపండిత సభవారిచే సమగ్ర ఆంధ్రవ్యాకరణరచనకు నియమించబడిన ఉపసంఘసభ్యులుగ ఎన్నుకో బడ్డారు. రాజమండ్రిలో వీరితో కలిపి కవిత్రయముగ వ్యవహరింపబడ్డ ‘కందుకూరి వీరేశలింగం, వడ్డాది సుబ్బా రాయుడు(వ.సు. రాయకవి)’లు వీరికి సహోద్యోగులే. తమ రచనలతో తెలుగు నాటకసాహిత్యానికి ఎనలేని గౌరవం తెచ్చిన ‘చిలకమర్తి లక్ష్మీనరసింహంపంతులు, పానుగంటి లక్ష్మీనరసింహం, సుసర్ల అనంతరావు’లు వావిలాలవారి శిష్యులే.
శాస్త్రిగారు ‘తేటగీతి’ సొగసు కనిపెట్టి, ఇంగ్లీషులోని ‘బ్లాంక్ వర్స్’కి సాటిగతలచి ‘సీజరుచరిత్రము, నందక రాజ్యము’ అను నాటకాలను తేటగీతిలో వ్రాసేరు. వీరికి తేటగీతి పద్యమంటే యెంతిష్టమో గర్భబంధ కవిత్వ మన్నా అంతే యిష్టం. గర్భబంధకవిత్వరీతిలో పద్యాలు రాయించి, బొమ్మలతో సహా ప్రకటించారు. వీరు వ్రాసిన పది గ్రంథాల్లో ఆరు కావ్యాలు, నాలుగు నాటకాలు వున్నాయి. వీరి నాటకరచనలలో మూడు అనువాదాలు కాగా నందకరాజ్యమొకటే స్వతంత్రరచన. ఐతే, విశేషాంశమేమిటంటే – ఆధునికాంధ్ర నాటక సాహిత్య చరిత్ర ప్రథమదశలో నాటకరచన ‘స్వతంత్ర రూపకాలు, ఆంగ్లానువాద రూపకాలు, సంస్కృతానువాద రూపకాలు’ అనే మూడు రీతులుగా సాగింది. శాస్త్రిగారు ఈ మూడు రూపాలలోనూ రచనలు చేసిన చరిత్రకారులు. అవి సీజరుచరిత్రము(ఆంగ్లానువాద), ఉత్తరరామచరితము(సంస్కృతానువాదం), నందకరాజ్యము(స్వతంత్ర రచన)లు. మిగిలిన తొలిదశ రచయితల్లానే నాటకరచనలుచేసి వూరుకున్నారే తప్ప, వీరూ ప్రదర్శనలకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. వీరి రచనలలో ఒక్క ‘ఉత్తరరామచరితము’ మాత్రమే ప్రదర్శంపబడినట్లు తెలియ వస్తున్నది. ఐతే శాస్త్రిగారు ‘నందకరాజ్యము’ చివర ఆనాటి ‘వీధిభాగవతుల’ ప్రదర్శనారీతులను విమర్శించి క్రొత్త పద్ధతి ఆవశ్యకతను సూచించారు. దీనినిబట్టి వీరికి ప్రదర్శనప్రయోగముపట్ల అభిలాష వున్నట్లు భావించ వచ్చు. ఐతే నాటికింకా తెలుగు ‘నాట’క సమాజములేర్పడలేదు కనుకనే వీరి నాటకాలు ప్రదర్శనా భాగ్యానికి నోచుకొనలేదని విమర్శకుల, పరిశోధకుల అభిప్రాయం.
వీరింకా ‘మముక్షు తారకము (1874)’ పేరిట భజగోవిందసూత్రాలను, విలయమ్ కౌపర్ అనే వో ఆంగ్లకవి రచించిన ఓ ఖండకావ్యాన్ని ‘మాతృరూపస్మృతి (1879) పేర ఆంద్రీకరించారు. శూదకుని ‘మృచ్ఛకటికము (1891)ను ఆంద్రీకరించారు. వీనికితోడు ‘రథకలశం, రుక్మిణీ స్మరణం’అను గ్రంథాలునూ రచించారు. వీరి నాటకాలలో కొన్ని పాఠ్య గ్రంథాలుగ కూడా నిర్ణయింపబడ్డాయి.
వీరి కుటుంబజీవితవిశేషాలకొస్తే – వీరికి 1873లో నందిగామ వాస్తవ్యులైన ‘యడవల్లి వెంకటేశ్వర కామేశ్వర సోమయాజి’ పుత్రికయైన ‘రుక్మిణీ సోమిదేవమ్మ’తో పరిణయం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కల్గినా, ఒక్కరూ అక్కరకు రాలేదు. వీరి సతీమణి కూడా 1885లో ప్రసవించి మరణించారు. పిదప వీరు ఆమె పినతండ్రి పుత్రికగు ‘పూర్ణలక్ష్మమ్మ’ని వివాహమాడేరు. వీరిరువురికి యిద్దరు పుత్రికలు, ఒక పుత్రుడు కలిగారు. వీరిలోనూ ఒక్కరూ అక్కరకు రాలేదు. విద్యాబోధకు, సాహిత్య సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన శాస్త్రిగారు మంచి వదాన్యులు. దాంతో వీరిల్లు పేద, అనాధ విద్యార్థుల పాలిట ఓ కల్పతరువులా, ఓ శరణాలయంలా వుండేదని ఉత్తరరామచరితము పీఠిక ద్వారా తెలియవస్తుంది. వీరికి భక్తితత్పరత యెక్కువ. కాశీనుండి తాను తెచ్చిన శివలింగాన్ని రాజమండ్రిలో ప్రతిష్ఠంపచేసి, ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. కాని ఆ తలంపు ఫలించ లేదు. వీరి కోర్కెను వీరి మరణానంతరం వీరి సతీమణి 1907లో నెరవేర్చారు.
మేనల్లుడగు ‘కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి (బహునాటకకం, గుంటూరు ఫస్ట్ కంపెనీ స్థాపకులు)తో వావిలాలవారికి అనుబంధం చాలా ఎక్కువ. కొండుభొట్లవారు అస్వస్థులై మరణించుటతో మానసికంగా చాలా కలత చెందిన వావిలాలవారు చివరకు పక్షవాతంతో పీడితులైన ఇన్నీసుపేట (రాజమండ్రి)లోని తమ స్వగృహంలోనే ‘హేవళంబి జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి (13-06-1897)న పరమపదించారు. పిదప వీరి సతీమణి తమ బావగారి చతుర్థ పుత్రు లగు ‘సీతారామశాస్త్రిని దత్తత తీసుకున్నారు. వీరి జ్ఞాపకార్థం వీరి వద్దగల వివిధ కళలు, భాషలకు చెందిన షుమారు 2000 గ్రంథాలను గౌతమీ గ్రంథాలయానికి బహుకరించారు.
-మన్నె శ్రీనివాసరావు