భారతీయ ఆత్మగౌరవ ప్రతీక: వందేమాతరం

గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో “వందేమాతరం – 150 ఏళ్ల జాతీయ చైతన్య గాథ”, “భావ సాగర మధనం” అనే రెండు గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సభ ప్రారంభానికి ముందుగా ముఖ్య అతిథులు, ప్రముఖులు, రచయితలు భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన విద్యా భారతి విద్వత్ పరిషత్ (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర ప్రముఖ్ బైరిశెట్టి మల్లికార్జున రావు గారు మాట్లాడుతూ.. భూమాతను దైవ స్వరూపంగా భావించే సనాతన భారతీయ భావజాలానికి ‘వందేమాతరం’ గీతం నిలువెత్తు చిరునామా అని పేర్కొన్నారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు మాట్లాడుతూ.. భరతమాతను బానిస సంకెళ్ల నుండి విముక్తురాలిని చేసే స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం గీతం ప్రజలను ముందుండి నడిపించిందన్నారు. సనాతన భారతీయ వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం చేరువ చేసే దిశగా మేధావులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య పరిషత్ రాష్ట్ర సంయోజక్ ఓంకారం నరసింహులు మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మాతృభాషను, సాహిత్యాన్ని ప్రోత్సహించే కవులు, రచయితలను సాహిత్య పరిషత్ ఎల్లప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని తెలిపారు.

పుస్తక రచయిత శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ.. తన సాహిత్య ప్రయాణానికి తన తండ్రి గారే స్ఫూర్తి అని కొనియాడారు. వందేమాతరం గీత ప్రాముఖ్యతను, తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. అప్పటికి, ఇప్పటికి సమాజంలో వచ్చిన మార్పులను వివరించారు. నేటి సమాజంలో పుస్తక పఠనం ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ ఆదిత్య గారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో దేశభక్తి, భాషాభిమానం పెంపొందాలన్నారు. 1905-1911 మధ్య కాలంలో జరిగిన బెంగాల్ విభజనను అడ్డుకోవడంలో వందేమాతరం గీతం ఒక ఉద్యమంలా రగిలిందన్నారు. ప్రపంచ చరిత్రలోనే మరే దేశానికీ లేని విధంగా, ఒక గీతం 150 సంవత్సరాలుగా కోట్లాది ప్రజల గుండెచప్పుడుగా నిలుస్తూ అజేయంగా, అమేయంగా, చిరంజీవిగా ప్రఖ్యాతి పొందడం మన గొప్పదనం అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జూపూడి నారాయణ, కొత్తూరు సుబ్బారావు, మార్కాపురం జిల్లా బీజేపీ ఇంచార్జ్ కొక్కెర శ్రీనివాస యాదవ్, కార్యక్రమ నిర్వాహకులు మనవ హనుమ ప్రసాద్, శీలం మల్లికార్జున రావు, కిషోర్, సాయి కృష్ణ, ఆర్.ఎస్.ఎస్ అభిమానులు, బీజేపీ వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మల్లిఖార్జున ఆచారి

Share via
Copy link
Powered by Social Snap