ది జర్నీ ఆఫ్‌ ఎ జర్నలిస్ట్‌

ఓ పాత్రికేయుని పాతికేళ్ల ప్రయాణం

ఎవరి జీవితంలోనైనా ఒక పాతికేళ్లు సమయం అంటే ఒక తరాన్ని చూసిన అనుభవం. అందులోనూ పాత్రికేయరంగంలో పాతికేళ్లు గడిపిన జర్నలిస్టుకు ఎన్నో అనుభవాలు. ముఖ్యంగా ఏదో ఒక పత్రికకు, మీడియా సంస్థకు మాత్రమే పరిమితమైపోయి అందులోనే ఉండిపోయినవారి కంటే వివిధ పత్రికల్లో మీడియాల్లో పనిచేసినవారికి అన్ని అనుభవాలు నిత్యనూతనంగానే ఉంటాయి.
మీడియా, పత్రికలు వ్యాపార క్షేత్రాలుగా విస్తరించిన తర్వాత పాత్రికేయలకు అడుగడునా సవాళ్లు, సమస్యలూ ఎన్నో ఎదురవుతూనే ఉంటున్నాయి. చిత్తశుద్ధితో వ్యవహరించగలిగే జర్నలిస్టుకు సమాజంలోని కొన్ని వర్గాల నుంచే కాదు, స్వంత సంస్థల్లోని వారితో కూడా ఏదో ఒక రూపంలో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు మనసుకీ, చేతలకు మధ్య కూడా ఈ సంఘర్షణ ఉంటుంది. ప్రశంసలు లభించిన చోటే విమర్శలు ఎదురవుతాయి. మెప్పుకోళ్లు ఉన్నచోటే తప్పులు వెదికి పాత్రికేయుడిని ఎలా ఇరుకున పెట్టాలా..? అని అవకాశం కోసం కాచుక్కూర్చున్నవారూ ఉంటారు. అందువల్ల జర్నలిస్టు కథ అంటే అది వార్తల వెనుక కథల సమూహామే. అటువంటి ఎన్నో స్పందనలకు అక్షరరూపమే మిత్రులు కంభాలపల్లి కృష్ణ రాసిన ‘ది జర్నీ ఆఫ్‌ ఎ జర్నలిస్ట్‌’.

1994లో పాత్రికేయరంగంలోకి అడుగుపెట్టిన కృష్ణకు 1 నవంబర్‌ 2019తో పాత్రికేయ రజతోత్సవం పూర్తయింది. ఈ సందర్భంగానే తన అనుభవాలను ఈ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ప్రారంభం నుంచి పదేళ్లపాటు పత్రికారంగంలో, ఆ తర్వాత మరో పదిహేనేళ్లు వివిధ టీవీ ఛానళ్లలో పనిచేసి, ప్రస్తుతం తెలంగాణ న్యూస్‌ నెట్‌వర్క్‌ (టిఎన్‌ఎన్‌) ఛానెల్‌కు చీఫ్‌ ఎడిటర్‌గా కృష్ణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాతికేళ్ల తన ప్రయాణాన్ని పద్నాలుగు ప్రకరణాలలో చెప్పారు.
ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో ఉండే సూర్యాపేట కంభాలపల్లి కృష్ణ స్వస్థలం. అక్కడ నుంచే అతని పాత్రికేయ ప్రయాణం మొదలైంది. ఇందులో తొలిఅడుగులు ప్రజాశక్తి దినపత్రిక విజయవాడ కార్యాలయంలో 1994 నవంబర్‌ 1 నుంచి ప్రూఫ్‌రీడర్‌ ఉద్యోగంతో మొదలయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లాక తన ప్రతిభతో సబ్‌ఎడిటర్‌గా, రిపోర్టర్‌గా వివిధ విభాగాలో తన పనితీరుకి మరింత మెరుగులు దిద్దుకున్నారు. 2002లో ఆంధ్రజ్యోతి పున:ప్రారంభమైన తర్వాత అందులో సబ్‌ఎడిటర్‌గా చేరారు. సిటీలైఫ్‌ రిపోర్టర్‌గా కూడా ఎన్నో కథనాలు రాశారు. అనంతరం టీవీ9 తొలితరం టీమ్‌లో రిపోర్టర్‌గా చేరారు. ముంబాయి వరదలపైనా, ఢిల్లీలో రాజకీయ పరిణామాలపైనా ప్రత్యేక రిపోర్టింగ్‌ చేశారు. చండీఘర్‌లో భూకంప ప్రాంతాల్లో వార్తల కవరేజీ..ఇలా పలు అంశాలపై రిపోర్టింగ్‌, కార్యక్రమాల రూపకల్పనలో తనకు ఎదురైన అనుభవాలను సోదాహరణంగా వివరించారు.
ఈ క్రమంలోనే టీవీ9 నుంచి ఎన్‌టీవీకి మారడం, ఆ తర్వాత జీ24గంటలు ఛానెల్‌లో హైదరాబాద్‌ బ్యూరో చీఫ్‌గా చేరడం, అనంతరం వి6 ఛానెల్‌లో ఇన్‌పుట్‌ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించడం, టీవీ5లో తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమ రూపకల్పనకు చేసిన కృషి, ఆ తర్వాత కొంతకాలం స్నేహటీవీ, హెచ్‌ఎమ్‌ టీవీలలో పనిచేయడం….ఇలా విరామంలేని విధంగా కంభాలపల్లి కృష్ణ పాత్రికేయ జీవనగమనం కొనసాగింది. తన గురించిన విషయాన్ని చెబుతూనే సమకాలీన అంశాలను వివరించడంలో కృష్ణ కృతకృత్యులయ్యారు. పాత్రికేయరంగంతో పరిచయం లేని చదువరులను కూడా ఆసక్తికరంగా చదివించేలా రచన సాగడం విశేషం.

– బెందాళం క్రిష్ణారావు

పుస్తకం : ది జర్నీ ఆఫ్‌ ఎ జర్నలిస్ట్‌
రచన : కంభాలపల్లి కృష్ణ
పేజీలు : 160, ధర : రూ 100/-
ప్రతులకు : భూమి బుక్‌ ట్రస్ట్‌ ఎస్‌ఆర్‌టి 267/1,
జవహర్‌ నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌-హైదరాబాద్‌
ఫోన్‌ : 98499 08929

SA:

View Comments (1)