అతని చిత్రాల్లో ప్రకృతి సోయగాలుంటాయి…
పక్షుల కిలకిల రావాలు వినిపిస్తాయి…
జంతువులను అమ్మాయిల కంటే అందంగా చిత్రిస్తాడు.
సాధారణంగా ఏ చిత్రకారుడైనా తన చిత్రాలను రేఖల అధారం చేసుకొని చిత్రీకరిస్తాడు.
కాని శ్యామ్ చిత్రాలలో మనకు రేఖలు ఎక్కడా కనపడవు.
తన కుంచెను రంగుల్లో ముంచి పేపర్ పై అద్దితే రంగుల జలపాతాన్ని తలపిస్తాయి.
సప్తవర్ణ హరివిల్లుతో వీక్షకులను ఊహాలోకాల్లో విహరింపజేస్తాడు.
ముప్పై రెండేళ్ళ శ్యామ్ కుమార్ కర్రి పుట్టింది విశాఖపట్నంలో. చిన్నప్పుడు పోలియో వచ్చి ఐదేళ్ళ వరకు నడవలేకపోయినా అన్ని ఆటలతో పాటే క్రికెట్ అంటే బాగా ఇష్టపడేవాడు శ్యామ్. ఆటల నుండి క్రమేణా కవిత్వం, పెయింటింగ్ వైపు మళ్ళింది శ్యామ్ ఆశక్తి. తన డ్రాయింగ్ టీచర్ ఉమగారి ప్రోత్సాహంతో చిత్రకళలో ఓనమాలు దిద్ది, తద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని సందర్శించాడు. ఆ ఉత్సాహంతో పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించాడు.
అలా పెయింటింగ్ లో పడి చదువును నిర్లక్ష్యం చేస్తాడేమోనని భయపడ్డారు శ్యామ్ తల్లిదండ్రులు. ఎందుకంటే గంటల తరబడి గదిలో కూర్చొని బొమ్మలు గీయడంలో శ్యామ్ నిమగ్నమయ్యేవాడు. ఒకసారి నేవీ వారు నిర్వహించిన పెయింటింగ్ పోటీలో శ్యామ్ చిత్రానికి బహుమతి రావడంతో శ్యామ్ కుటుంబాన్ని యుద్ధనౌకలో సముద్రంలో విహారయాత్రకు తీసుకెళ్ళారు నిర్వహకులు. అది వాళ్ళ నాన్నగారికి చాలా గొప్పగా అనిపించింది. అప్పటినుండి శ్యామ్ చిత్రకళాసాధనకు తండ్రి ఎప్పుడూ అడ్డుచెప్పలేదు.
ఇంటర్మీడియేట్ చదివిన రెండేళ్ళు హాస్టల్ లో ఉండడం వలన పెయింటింగ్ కు దూరం అయ్యాననుకున్న శ్యామ్ ఆ రెండేళ్ళలో తన చూసినదంతా ఊహించుకొని వేసవి శెలవులలో బొమ్మలు గీసుకుంటూ సంతోషంతో మునిగిపోయాడు. తర్వాత ఆర్కిటెక్చర్ విద్య అభ్యసించడానికి బ్యాచిలర్ డిగ్రీలో చేరడం శ్యామ్ జీవితంలో పెద్ద మలుపు. జీవితం పట్ల పరిమిత అవగాహనతో వున్న శ్యామ్ అపోహల్ని పటాపంచలయ్యాయి. అదే సమయలో జిడ్డు కృష్ణమూర్తిగారి ‘థింక్ ఆన్ దీజ్ థింగ్స్‘ అనే పుస్తకం చదువుతూ కృష్ణమూర్తి ఫిలాసఫీకి కనెక్ట్ అయ్యాడు శ్యామ్. అది నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేయడానికి, మనసును అదుపులో వుంచుకోవడానికి తనకెంతో సహకరించిందంటారు శ్యామ్.
వివిధ మతాలకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చదివిన శ్యామ్ కొడైకెనాల్ లోని జెన్ ధ్యాన కేంద్రంలో ఒక్కోసారి ధ్యాన సెషన్లు చేయడం ప్రారంభించాడు. ఇది శ్యామ్ మొత్తం దృక్పథాన్ని, కళ పట్ల అతని వైఖరిని మార్చింది. తుది ఫలం కన్నా దాని ప్రక్రియ ఎంతో మిన్న అన్న సత్యాన్ని శ్యామ్ గ్రహించాడు.
శ్యామ్ కాలేజీలో మూడవ సంవత్సరంలో వున్నప్పుడు వాటర్ కలర్ ను ఎంచుకున్నాడు. నీటి రంగుల మాధ్యమంలో వున్న సౌలభ్యాన్ని తెలుసుకున్న శ్యామ్ ఆశ్చర్యపోయాడు. తనకు సమయం దొరికనప్పుడల్లా వాటర్ కలర్స్ తో కృషికొనసాగిస్తూ… హంపిలో ఇంజనీర్ చేతన్ తో కలిసి ఆర్కిటెక్చర్ ప్రాక్టీస్ చేసేవాడు.
ఒక రోజు… శ్యామ్ ఉదయాన్నే నిద్రలేశాడు బొమ్మలు వేయాలన్న కోరికతో. హంపిలోని ప్రకృతి దృశ్యాలను చూస్తున్న శ్యామ్ కు, ఆ దృశ్యాలు తమని పెయింటింగ్స్ ద్వారా బయటకు తీసుకురమ్మన్న బలమైన కోరికతో వున్నట్లు భావనకలిగింది. శ్యామ్ మనసంతా బండరాళ్ళతో, ప్రకృతి దృశ్యాలతో నిండిపోయింది. మరోవైపు గంగావతిలో కొనసాగుతున్న నిర్మాణ ప్రాజెక్ట్ కోసం సైట్ సందర్శనకు హాజరు కావడానికి కొంత బాధ్యత అప్పగించబడింది తనకు. అయినా శ్యామ్ అత్మవిశ్వాసంతో తనకు సెలవు మంజూరు చేయమని వాళ్ళ బాస్ (చేతన్)కి ఇమెయిల్ పంపి, కొన్ని వారాలు… అతని సమాధానం కోసం చాలా టెన్షన్ గా ఎదురు చూశాడు. చివరికి ఆశ్చర్యం కలిగించే విధంగా శ్యామ్ ను పెయింటింగ్ ను కొనసాగించమని, పని గురించి దిగులు చెందవద్దని బదులు రాశాడు.
అంతా తన మంచి కోసమే జరిగిందని భావించిన శ్యామ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటికి తాళం వేసి పెయింటింగ్ చేయడంలో నిమగ్నమయ్యాడు… తను ఎక్కడికి వెళుతున్నాడో తనకే తెలియదు. పెయింట్ చేయడానికి మెటీరియల్ ని కొనుగోలు చేసే స్తోమత లేనప్పుడు.. బ్రౌన్ షీట్లు, ఇంక్ బాటిల్, బ్రష్ వంటి సాధారణ వస్తువులతోనే బొమ్మలేసేవాడు. తను బాగా అలసిపోయి ఇంటికి చేరేటప్పటికి ఇల్లంతా పెయింటింగులే పడి ఉండేవి. తన యజమాని వచ్చినప్పుడు శ్యామ్ ని చూసి పిచ్చివాడనుకున్నాడు! కానీ “మతిలేని పనులు” అనే అందమైన అనుభవం అంటే ఇదేనేమో.!
“పెయింటింగ్ నా బలం” అని భావించిన శ్యామ్ తన బలహీనతనూ అన్వేషించాలనుకున్నాడు. ఆర్కిటెక్చర్, మెటీరియల్స్ అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి శ్యామ్ దానిని అన్వేషించడానికి ఫర్నిచర్ డిజైన్లో మాస్టర్స్ తీసుకున్నాడు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్ లో ఉన్న రెండూ సంవత్సరాలలో, శ్యామ్ బొమ్మలకు దూరంగా వున్నాడు. అక్కడ క్యాంపస్ సహచరులతో ఆనందంగా గడుపుతూ, వషాలను పూర్తిగా ఆస్వాదించాడు. కానీ చదువుకు సంబంధించిన ఒత్తిడీ చాలా ఉండేది.
ఒక రోజు! శ్యామ్ ఎక్కడికీ వెళ్లకుండా గాలిలో తేలియాడుతూ, మెల్లగా గాలిలో ఊగుతూ, మెలికలు తిరుగుతూ ఎగురుతున్న పక్షి వైపు కిటికీలోంచి చూస్తున్నాడు. అది చూసి తనకు కన్నీళ్లు వచ్చాయి! “నేను ఆ పక్షిలా ఉంటే బాగుండుననుకున్నాడు.” చివరి సెమిస్టర్ పూర్తయ్యే సమయంలోనే శ్యామ్ కాలేజీ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తను ఏం చేయబోతున్నానన్న దానిపై క్లారిటీలేని శ్యామ్ కు, కుటుంబ సభ్యులు మళ్లీ కాలేజీలో చేరేలా ప్రేరేపిస్తారేమో నన్న భయం ఉండేది. అయితే విధి తనను కచ్చితంగా తను కోరుకున్న గమ్యానికి చేరుస్తుందని విశ్వసించాడు. ఇది శ్యామ్ జీవితంలో అత్యంత దుర్బలమైన పరిస్థితి. అయినా జీవితం తనపై విసిరే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు శ్యామ్ సిద్ధంగా ఉన్నాడు.
అప్పుడే విజయవాడ శివార్లలో ఉన్న ప్రత్యామ్నాయ పాఠశాల నుండి శ్యామ్ కు పిలుపు వచ్చింది. నగర శివార్లలో అడవిలో ఉన్న స్కూల్ క్యాంపస్ లో కొన్ని రోజులు పిల్లలతో మమేకమవ్వమని శ్యామ్ ని కోరారు. చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిలో పిల్లలతో మమేకమవుతూ పాఠశాలలో ఉండడం వల్ల శ్యామ్ తిరిగి పెయింటింగ్ లోకి వచ్చాడు. పిల్లలతో చిత్రకళలో మెళకువలను పంచుకున్నాడు మరియు అదే సమయంలో తనూ నేర్చుకున్నాడు.
తరువాత శ్యామ్ ధ్యానం చేయడానికి, పెయింటింగ్ చేయడానికి హిమాచల్, హంపి, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలకు ఎక్కువగా ప్రయాణించి, తిరిగి పాఠశాలకు వచ్చేవాడు. వికాస విద్యావనం పాఠశాలకు రావడం అంటే ఇంటికి వచ్చినట్లే. అక్కడ మంచి ఆహారం, పిల్లలతో గడపడం, పెయింటింగ్ చేసుకోవడం, చుట్టూ అందమైన ప్రకృతి. ఇలా సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న శ్యామ్ కు తన తల్లిదండ్రులకు తను ఏమి చేస్తున్నానో తెలియదన్న బాధ లోపల ఉండేది.
తర్వాత శ్యామ్ కు భువనేశ్వర్ లో ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ వచ్చింది. కాలేజీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పవన్, విష్ణులను తన ప్రాజెక్ట్ లోకి తీసుకొని ఒక సంస్థగా ఏర్పడి పని ప్రారంభించారు. స్థిరమైన అదాయం , చేతినిండా పనితో హ్యాపీగా నడిచిపోతున్న కాలంలో ప్రతి సంవత్సరం జెన్ ధ్యాన కేంద్రానికి వెళ్లి పెయింటింగ్ చేస్తుండేవాడు.
తనతో సర్దుకుపోయే భార్య దొరుకుతుందో లేదో అని… మొదట్లో పెళ్ళంటే చాలా భయపడ్డాడు శ్యామ్. కానీ… తనను పూర్తిగా అర్థం చేసుకున్న అర్థాంగి ఐశ్వర్య దొరికినందుకు, ఈ సృజనాత్మకరంగంలో హెల్ప్ ఫుల్ వైఫ్ తో తన కెరీర్ ను కలర్ ఫుల్ గా కొనసాగిస్తూ… ఆనందంతో శ్యామ్ వండర్ ఫుల్ చిత్రాలు సృష్టిస్తున్నాడు.
లాక్ డౌన్ కారణంగా ఆర్కిటెక్చర్ పనులు తగ్గడంతో సహజంగానే శ్యామ్ తిరిగి పెయింటింగ్స్ వైపు దృష్టి సారించాడు. అదృష్టం కొద్దీ కళాప్రియుల మద్దతుతో త్వరగానే తన చిత్రాలను విక్రయించగలుగుతున్నాడు శ్యామ్.
90 దశకంలో ఇండియాలో సమీర్ మండల్ అనే బెంగాలీ చిత్రకారుడు తన నీటిరంగుల చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. అతని స్ఫూర్తితోనే బొమ్మలు గీస్తున్న శ్యామ్ కుమార్ ని “ఆంధ్రా సమీర్ మండల్”గా పేర్కొంటే అతిశయోక్తి కాదేమో…!
– కళాసాగర్ యల్లపు
Thank you so much, for taking time to put this across sir. Very humbling.
Amazing Art.
Keep the flow moving.
Try to give coaching to budding artists.
The great feeling that I have met him in my life at intermediate education. he is always active and he achieved this far and he always motivates me with his paintings. He is a true dreamer. Each one of his paint are iconic and we can feel it.
Shyam and me went to the same school. I noticed his painting skills and passion for it then. I am truly glad he clinged to his greatest skill and sincerely wish for success in all of his future endeavours. Apart from this he an incredible and humble personality. Appreciate your work and good luck!
Sir I am very proud that I also know u through my son dinesh