టెన్ కమాండ్మెంట్స్ …మేకింగ్ ఆఫ్ ది మూవీ

(విజ్ఞాపన…ఈ వ్యాసాన్ని ఒక మత సంబధమైన అంశంగా మాత్రం పరిగణించవలదని, దీనిని కేవలం ఒక గొప్ప సినిమాగా గుర్తించి చదవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి గొప్ప కళాఖండం మరిక రాదనేది నిర్వివాదాంశం. ఈ సినిమాను మనతరం సభ్యులు రెండవ/మూడవ రన్ లో విడుదలైనప్పుడు బహుశా చూసివుండవచ్చునని నా ఊహ.)

జ్ఞానులు ఎవరు చెప్పినా దైవం ఒక్కడే అని! ఏ దైవం చెప్పినా అన్నీ మంచి మాటలే!! దేవుడైన యోహోవా మోజెస్ కు సినాయ్ కొండ మీద రెండు రాతి పలకలపై చెక్కిన పది పవిత్ర ఆజ్ఞలను అందజేశాడని బైబిల్ చెబుతోంది. అందులో భోగభాగ్యాలకోసం ఆశ పడవద్దని, దొంగతనాలు, హత్యలు చేయవద్దని, తప్పుడు సాక్ష్యాలు చెప్పవద్దని, దేవుని పేరును వృధాగా వాడవద్దని, తల్లిదండ్రులను ప్రేమతో చూడమనే ఆజ్ఞలు/సూక్తులు రాసి వున్నాయి. ఏసుక్రీస్తు జన్మించక పూర్వం పదహారవ శతాబ్దంలో ఈ ఆజ్ఞలు మోజెస్ కు అందాయని బైబిల్ చెబుతోంది. మూకీ యుగం నుంచే హాలీవుడ్ లో బైబిల్ ఆధారిత కథలతో సినిమాలు వచ్చాయి. మన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ లాగే హాలీవుడ్ చిత్రపరిశ్రమకు ‘సెసిల్ బి.డెమిల్లే’ కూడా ‘సినీ పితామహుడుగా’ మన్నన పొందాడు. మూకీయుగం లో బైబిల్ ఆధారిత కథలతో ‘ఫర్బిడన్ ఫ్రూట్’ (1921), ‘ఆడమ్స్ రిబ్’ (1923), ‘టెన్ కమాండ్మెంట్స్’ (1923) ‘ది కింగ్ ఆఫ్ కింగ్స్’(1927) వంటి సినిమాలను సెసిల్ బి.డెమిల్లే నిర్మించి విజయం సాధించాడు. టాకీయుగంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ‘క్లియోపాత్రా’ (1934) ‘ది క్రూసేడ్స్’ (1935) ‘శాంసన్ అండ్ డెలీలా’ (1949) వంటి బిబ్లికల్ సినిమాలను నిర్మించి 1956లో ‘టెన్ కమాండ్మెంట్స్’ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించి బ్లాక్ బస్టర్ గా నిలిపాడు. సెసిల్ బి.డెమిల్లే ఈ చిత్రాన్ని ఈజిప్ట్ లో నిర్మించనెంచి, అక్కడి అధికారుల అనుమతి కోసం సంప్రదించాడు. ఆ దేశంలో సెసిల్ బి.డెమిల్లే అభిమానులు అధికంగా వుండడం అతణ్ణి ఆశ్చర్య పరచింది. వారంతా ముక్తకంఠంతో ‘’మీరు నిర్మించిన ‘ది క్రూసేడ్స్’ (1935) సినిమా చూశాం. అందులో మా అరబ్బులను యెంతో హుందాగా చూపించారు. ఈ దేశంలో మీరు ఎక్కడైనా సినిమా నిర్మించుకోండి. మా సంపూర్ణ సహకారం మీకు ఎల్లప్పుడూ వుంటుం’’దని చెప్పడం వెనుక సెసిల్ బి.డెమిల్లే గొప్పతనం యెంతోవుంది. ఆర్ధిక రాబడిలో ‘టెన్ కమాండ్మెంట్స్’ సినిమా వసూళ్లను నలభై ఎనిమిదేళ్ళ వరకూ మరేచిత్రమూ అధిగమించలేక పోయింది. చివరికి 2004లో మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించిన ‘ది పాషన్ ఆఫ్ క్రైస్ట్’ చిత్రం ఆ రికార్డును అధిగమించింది. అయితే ‘టెన్ కమాండ్మెంట్స్’ చిత్రం బైబిల్ పాతనిబంధన (క్రీస్తు పూర్వం) కు సంబంధించింది కాగా ‘ది పాషన్ ఆఫ్ క్రైస్ట్’ బైబిల్ కొత్త నిబంధన నేపథ్యంలో నిర్మించింది కావడం విశేషం. ‘టెన్ కమాండ్మెంట్స్’ చిత్రం నవంబరు 8, 1956 న అమెరికా దేశంలో, 28 నవంబరు న యునైటెడ్ కింగ్డం లో విడుదలైంది. తరవాత వివిధ దేశాలతోబాటు మనదేశంలో కూడా విడుదలైంది. ఈ సందర్భంగా డిమెల్లీ నిర్మించిన ఈ ఆఖరి చిత్ర విశేషాలను గురించి తెలుసుకుందాం…

సెసిల్ బి.డెమిల్లే కలల పురాణం టెన్ కమాండ్మెంట్స్

1914-58 మధ్యకాలంలో దాదాపు 70కి పైగా మూకీలు, టాకీలు నిర్మించిన అద్భుత ఫిలిం మేకర్ సెసిల్ బి.డెమిల్లే. సెసిల్ బి.డెమిల్లే ఎక్కువగా పవిత్ర బైబిల్ ప్రబంధ కావ్యాలను నిర్మించాడు. ప్రఖ్యాత హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ‘పారామౌంట్ పిక్చర్స్’ సంస్థాపకుడు అతడే. 1923 లోనే సెసిల్ బి.డెమిల్లే బైబిల్ ఆధారిత చిత్రం ‘టెన్ కమాండ్మెంట్స్’ ను మూకీ చిత్రంగా నిర్మించి విజయం సాధించాడు. తరవాత 1934 లో నిర్మించిన ‘క్లియోపాత్రా’ టాకీ చిత్రం 7వ అకాడమీ బహుమతుల పోటీలో నాలుగు విభాగాల్లో అర్హత పొంది ఒక అవార్డును దక్కించుకుంది. 1949లో ‘శాంసన్ అండ్ డెలీలా’ పేరుతో మరో బైబిల్ నేపథ్య గాథను సెసిల్ బి.డెమిల్లే టెక్నికలర్ లో నిర్మించాడు. ఈ చిత్రం 23వ అకాడమీ బహుమతులకోసం ఇదు విభాగాల్లో పోటీపడగా రెండు ఆస్కార్ బహుమతులను గెలుచుకుంది. సెసిల్ బి.డెమిల్లే 1954లో రెండవసారి ‘టెన్ కమాండ్మెంట్స్’ చిత్రాన్ని టెక్నికలర్ వారి విస్టా విజన్ రంగుల్లో పునర్నిర్మించాడు. ఇదే సెసిల్ బి.డెమిల్లే నిర్మించిన ఆఖరి సినిమా కూడా. సినిమా క్లైమాక్స్ లో వచ్చే మహానిర్గమనం సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఫారోల రాజభవన సెట్టింగ్ లో భారీ ప్రధాన గేట్లమీద కెమెరాలు అమర్చారు. వాటి ఎత్తు 130 అడుగులు. అక్కడ అమర్చిన ఒకానొక కెమెరాలో చిన్న లోపం తలెత్తితే, దానిని సవరించేందుకు సెసిల్ బి.డెమిల్లే ఆ 130 అడుగుల సెట్టింగు పైకి ఎక్కాడు. అప్పుడే అతడికి గుండెనొప్పి వచ్చింది. రెండ్రోజులు విశ్రాంతి తీసుకొని ఆ సన్నివేశ చిత్రీకరణ పూర్తి చేశాడు. అప్పుడు సెసిల్ బి.డెమిల్లే వయసు డెబ్భై మూడేళ్ళు. వైద్య సహాయంతో సినిమా పూర్తి చేయగలిగినా మరెన్నోసార్లు గుండెనొప్పితో బాధపడ్డాడు. ‘టెన్ కమాండ్మెంట్స్’ చిత్రం నవంబరు 8, 1956 న విడుదల కాగా సెసిల్ బి.డెమిల్లే జనవరి 21, 1959న హాలీవుడ్ లో చనిపోయాడు. అతని సమాధిని హాలీవుడ్ లో భద్రపరచారు. ఈ చిత్రం ఏడు విభాగాల్లో 29వ అకాడమీ బహుమతుల కోసం పోటీలో నిలువగా స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో బహుమతిని గెలుచుకుంది.

టెన్ కమాండ్మెంట్స్ నిర్మాణం…

టెన్ కమాండ్మెంట్స్ చిత్ర కథను అనియాస్ మెకంజీ, జెస్సీ లాస్కీ, జాక్ గార్రిస్, ఫ్రెడరిక్ ఫ్రాంక్ అనే నలుగురు మేధావులైన రచయితలు రూపొందించారు. ఈ చిత్ర కథకోసం వారు అనేక ప్రాచీన ప్రామాణిక గ్రంధాలను పరిశీలిచారు. ‘ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్’, ‘పిల్లర్ ఆఫ్ ఫైర్’, ‘ఆన్ ఈగిల్స్ వింగ్స్’, ‘లైఫ్ ఆఫ్ మోజెస్’ వంటి గ్రంధాలను వీరు పరిశోధించి కల్పితాలు లేని నిజమైన కథకు రూపకల్పన చేశారు. సినిమా టైటిల్స్ లో ఈ స్క్రిప్టు రచయితలు ప్రామాణికంగా తీసుకున్న గ్రంధాల పేర్లను కూడా పేర్కొనడం ఈ చిత్ర నిర్మాణంలో ఎంతటి సూక్ష్మమైన అంశాలకు చోటు కల్పించారో అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. పైగా మోజెస్ ది కీలక పాత్ర కావడంతో, పవిత్ర బైబిల్ లో ఉదహరించని మోజెస్ జీవితానికి సంబంధించిన విషయాలను ‘పవిత్ర ఖురాను’ గ్రంధం నుంచి కూడా తీసుకున్నారు. పాత్రల ఎంపికలో సెసిల్ బి.డెమిల్లే తీసుకున్న శ్రద్ధను ప్రశంసించాలి. ఇందులో హీరో మోజెస్ పాత్రకు చార్లటన్ హెస్టన్ ను ఎంపిక చేసేముందు అతనికి ఆడిషన్ పరీక్ష నిర్వహించడం గొప్పవిషయం. అప్పటికే హెస్టన్ పేరుమోసిన అగ్రశ్రేణి నటుడు. పైగా సెసిల్ బి.డెమిల్లే నిర్మించిన ‘ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్’ (1952) సినిమాలో ’బ్రాడ్ బ్రాడెన్’ పాత్రను సమర్ధవంతంగా పోషించి వున్నాడు. అయినా హెస్టన్ కు ఆడిషన్ పరీక్ష తప్పలేదు. ప్రత్యామ్నాయంగా విలియం బాయ్ద్ పేరును ను కూడా వెయిట్ లిస్టులో పెట్టుకున్నాడు సెసిల్ బి.డెమిల్లే. ఇక ఫారో రామసేసే-II పాత్రకోసం రష్యన్ సినీ నటుడు యూల్ బ్రిన్నర్ ను ఎంపిక చేశారు. సినిమా మొత్తం సన్నివేశాలలో పైదుస్తులు లేకుండా వుండాలని దర్శకుడు చెప్పడంతో, చార్లటన్ హెస్టన్ కు ధీటుగా ఉండేందుకు యూల్ బ్రిన్నర్ ఎన్నో కసరత్తులు చేసి దేహదారుఢ్యాన్ని పెంచి పాత్రకు శోభ చేకూర్చాడు. అంతకు ముందే ‘ది కింగ్ అండ్ ఐ’(1951) సినిమాకోసం యూల్ బ్రిన్నర్ గుండు చేయించుకున్నాడు. అప్పటి నుంచి దానినే తన ట్రేడ్ మార్క్ విలక్షణతగా కొనసాగించాడు. మోజెస్ భార్య నెఫ్రేతిరి పాత్రకోసం ‘ఆన్నీ బాక్సటర్’ ను ఎంపిక చేశారు. జాషువా గా జాన్ డెరెక్, జాషువా ప్రేయసి లిలియాగా డెబ్రా పేజెట్, రామసేసే-I గా ఇయాన్ కీత్, ఇథియోపియా రాజుగా ఉడ్రో, డాథన్ గా ఎడ్వర్డ్ రాబిన్సన్ ను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో హీబ్రూలు గుంపులుగా కనిపించడంకోసం 14 వేలమంది జూనియర్ నటులను, 15 వేల రకరకాల పశువులను వినియోగించారు. మోజెస్ ధరించిన రాచరికపు నిలువుటంగీ ని ప్రత్యేకంగా ఆర్నాల్డ్ ఫ్రిబెర్గ్, డోరోథియాహల్స్ అనే ప్రఖ్యాత నేతగాళ్ళచేత చేతితో నేయించారు. ఇందులో రూపొందించిన దుస్తులు ప్రాచీన/పాత పవిత్ర గ్రంధాలలో వర్ణించిన విధానాన్ని బట్టి, కొన్నిటిని ఆనాటి శిల్పసంపద ఆధారంగా రూపొందించారు. 1954లో ట్వెంటీయత్ సెంచరీ ఫాక్ష్ సంస్థ నిర్మించిన ‘ది ఈజిప్షియన్’ సినిమా కోసం వాడిన దుస్తులను ఈ చిత్రంలోని కొన్ని పాత్రలకు వాడుకున్నారు. ఈ చిత్రానికి వాడినన్ని భారీ సెట్టింగులు మరే సినిమాకూ వాడలేదు. ఈజిప్షియన్ వాల్ పెయింటింగుల ఆధారంగా నాట్యగత్తెల ఆహార్యాన్ని రూపొందించారు. కొన్ని పాత్రల ఆహార్యాన్ని ఆరవ రాజవంశపు సమాధి మీద చెక్కిన శిల్ప సంపద ఆధారంతో రూపొందించారు. సెసిల్ బి.డెమిల్లే ఈ సినిమా నిర్మాణం కోసం ఎంతటి శ్రద్ధ తీసుకున్నాడో అనే అంశానికి వీటిని ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ఈ చిత్ర నిడివి సుమారు నాలుగు గంటలు. అంటే అది రెండు ఇంగ్లీషు సినిమాల నిడివికి సమానం. అయినా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఓపిగ్గా తిలకించారు.

సినిమా ప్రత్యేకతలు…సన్నివేశ చిత్రీకరణలు…

ప్రపంచ చలనచిత్ర సినిమారంగంలో ‘టెన్ కమాండ్మెంట్స్’ చిత్రం 10 వ గ్రేటెస్ట్ ఇతిహాసంగా రికార్డులకెక్కింది. 1923లో నిర్మించిన తొలి ‘టెన్ కమాండ్మెంట్స్’ (బ్లాక్ అండ్ వైట్) మూకీ సినిమాలో నటించిన అత్యధిక నటీనటుల్ని సెసిల్ బి.డెమిల్లే ఈ కలర్ చిత్రంలో కూడా నటింపజేశారు. ఆరోజుల్లోనే ఈ చిత్ర నిర్మాణానికి సెసిల్ బి.డెమిల్లే వందకోట్లకు పైగా ఖర్చుచేస్తే 460 కోట్ల వసూళ్లను నమోదు చేసి రికార్డుకెక్కిన చిత్రం ఈ ‘టెన్ కమాండ్మెంట్స్’. ఇస్రాయిల్ బానిసల చేత ఫారోస్ నివాస రాజభవనం సెట్టింగును ఈజిప్ట్ దేశంలోని లక్సర్ పట్టణ సమీపంలోని నైలు నది కి సమీపంలో నిర్మించారు. హీబ్రూలకు పుట్టిన రెండేళ్ళ పిల్లలనందరినీ చంపమని ఫారో రాజు డిక్రీ జారీచేయగా బాల మోజెస్ ను పేముబుట్టలో పడుకోబెట్టి నదిలో వదిలే సన్నివేశాన్ని నైలు నది పాయ వద్ద చిత్రీకరించారు. నెఫ్రేతిరి ని తనను వివాహమాడమని రామసేసే-II వచ్చే రాజభవన్ సన్నివేశాన్ని బ్యాక్ డ్రాప్ లో గిజా పిరమిడ్ వద్దగల స్పింక్స్ విగ్రహం కనిపించేలా చిత్రీకరించారు. మోజెస్ కు దైవం ప్రకటించి ఇచ్చే టెన్ కమాండ్మెంట్స్ గల పలకల సన్నివేశాన్ని ఈజిప్ట్ లోని పవిత్ర సినాయ్ పర్వత శ్రేణిలోని మౌంట్ మోజెస్ వద్ద చిత్రీకరణ జరిపారు. మోజెస్ జోర్డాన్ లోని మౌంట్ నెబో పర్వత శిఖరం మీద నిష్క్రమించే సన్నివేశాన్ని జోర్డాన్ లోని మదాబ ప్రాంతంలో చిత్రీకరించారు. అక్కడ నుంచి మోజెస్ దూరంగావున్న జెరూసలేం పట్టణం చూస్తూ కన్నుమూస్తాడు. హీబ్రూలచేత ఈజిప్షియన్ దేవత ఫారో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు తరలించే సన్నివేశం కోసం అచ్చంగా ఒరిజినల్ ఫారో విగ్రహమంత ఉండేలా తయారు చేయించారు. మోజెస్ తన ప్రజలను ఈజిప్టు లోని లక్సర్ దేవాలయం ద్వారా బయటకు తీసుకువచ్చే సన్నివేశాన్ని సహజ సెట్టింగులోనే చిత్రీకరిచారు. మోజెస్ ఆదేశానుసారం ఎర్ర సముద్రం చీలి ప్రజలకు దారి ఇచ్చే సన్నివేశాన్ని స్టూడియోలో సెట్టింగు వేసి చిత్రీకరించారు. దానికోసం మూడు లక్షల గ్యాలన్ల నీటిని పెద్ద ట్యాంకుల్లోనుంచి ఒలకబోస్తూ ఫిల్మ్ ని బ్యాక్ ప్రొజెక్షన్ లో నడుపుతూ చాలా జాగ్రత్తగా చిత్రీకరించారు. సముద్రపునీటి రంగు కనిపించేందుకు ట్యాంక్ నీటిలో జిలాటిన్ కలిపారు. మోజెస్ ఎడారిలో తన భార్య జిప్పోరా తో వుండగా ఎదురుగా మౌంట్ సినాయ్ శిఖరం నుంచి పొగలు వచ్చే సన్నివేశాన్ని ఆరోజుల్లోనే సూపర్ ఇంపోజింగ్ టెక్నాలజీ ని ఉపయోగిస్తూ సహజ వాతావరణంలో చిత్రీకరించారు. మహానిర్గమన సన్నివేశంలో డ్రమ్మర్ బాయ్ గా నటించిన హెర్బ్ ఆల్బర్ట్ తరవాతి కాలంలో ప్రఖ్యాత సంగీతకారుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఈ చిత్రప్రదర్శనకు ముందు వచ్చే పరిచయ వాక్యాలను చిత్ర సమర్పకుడు, దర్శకుడు సెసిల్ బి.డెమిల్లే స్వయంగా చెప్పడం గమనార్హం. ఈ సినిమా ప్రచారం కోసం ఆరోజుల్లో MGM సంస్థ ‘టెన్ కమాండ్మెంట్స్’ చెక్కించిన రెండువేలరాతి పలకలను వివిధ పౌరసంఘాలకు కానుకగా పంపిణీ చేసింది.

చిత్ర నిర్మాణ విశేషాలు…
ఇందులో ఆరోన్ భార్యగా నటించిన జూలియా ఫెయే ‘టెన్ కమాండ్మెంట్స్’ మూకీ వర్షన్ లో ఫారో భార్యగా నటించింది. రోమ్ నగరంలో ప్రముఖ శిల్పి మైఖెలాంజెలో రూపొందించిన మోజెస్ విగ్రహం వుంది. ఆ శరీర లక్షణాలు చార్లటన్ హెస్టన్ లో ఉండడంతో దర్శక నిర్మాత సెసిల్ బి.డెమిల్లే అతన్ని హీరో పాత్రకు ఎంపిక చేశాడు. ఈ సినిమా తరవాత ‘ది ఆగనీ అండ్ ది ఎక్స్ టసీ’ అనే సినిమాలో ఈ నటుడు మైఖెలాంజెలో గా నటించాడు. ఇందులో దేశత్యాగం చేసి వెళ్ళే ప్రజల్లో ‘అమినాదేబ్’ అనే ఒక ఇస్రాయెల్ వృద్ధుడు చనిపోయే సన్నివేశం వుంది. ఆ పాత్రను హెచ్.బి. వార్నర్ అనే నటుడు పోషించాడు. ఈ సినిమా తరవాత అతడు నిజంగానే చనిపోయాడు. నటి ‘మార్తా స్కాట్’ రెండు బైబిల్ ఆధారిత సినిమాలు ‘టెన్ కమాండ్మెంట్స్’, ‘బెన్హర్’ లో చార్లటన్ హెస్టన్ తల్లిగా నటించడం విశేషం. చిన్ననాటి రెండేళ్ళ మోజెస్ పాత్రను పోషించిన ఫ్రేజర్ క్లార్క్ హెస్టన్ నిజజీవితంలో చార్లటన్ హెస్టన్ కుమారుడే. ఈ సినిమా నిర్మాణంలో స్టీరియోఫోనిక్ ధ్వని పరికరాలను వాడలేదు. తరవాత సౌండ్ ను రీమిక్స్ చేశారు. ఆకాశం నుంచి వడగళ్ళ వర్షం పడే సన్నివేశం కోసం సురక్షితంగా ఉండేందుకు ఐస్ ముక్కల్ని, పాప్ కార్న్ ఉండలను ఆకాశం నుంచి వెదజల్లారు. దాంతో ఇవి నటీనటులకు ఎటువంటి ప్రమాదాన్ని కలుగజేయలేదు. వడగళ్ళనుంచి ఉద్భవించే మంటల సన్నివేశాన్ని మాత్రం యానిమేషన్ పద్ధతిలో చిత్రీకరించారు. నైలు నది బురదలోనుంచి కప్పలు తెప్పలు తెప్పలుగా వచ్చే మరొక సన్నివేశాన్ని కూడా చిత్రీకరించారు. కానీ, దానిని సినిమాలో వాడుకోలేదు. ఈ సినిమాలో కొన్ని వందల మిచెల్ కెమెరాలను సమాంతరంగా వాడుతూ సన్నివేశ చిత్రీకరణలు జరిపారు. వాటిలో పనికివచ్చే కెమెరా షాట్లను మాత్రమే ఎడిట్ చేస్తూ సినిమాకు రూపకల్పన చేశారు. నెబో పర్వత శిఖరం నుంచి వినిపించే ‘దేవుని వాక్యాల’ను విభిన్న గొంతుకలతో పలికించి, వాటిని ఒకదానిమీద మరొకటి వినిపించేలా సౌండ్ ఎఫెక్టులతో మిళితం చేసి రికార్డు చేశారు. అందుకే అవి మానవ భాషకు భిన్నంగా, దైవ భాషలో వున్నట్లు అనిపిస్తాయి. రామసేసే-II చనిపోయిన తన కుమారుని దేహాన్ని చేతుల్లో మోసుకెళ్ళి ‘సోకర్’ విగ్రహం చేతుల్లో పెడతాడు. ఆ సన్నివేశంలో వాడిన బాలుని శవం మైనపుబొమ్మ అంటే నమ్మలేం. సినిమా నిర్మాణానికి ముందు 1200 స్టోరీబోర్డు స్కెచ్ లు తయారు చేసి వాటి ఆధారంగానే సన్నివేశ చిత్రీకరణ జరిపారు. సినిమా సెట్టింగులు ఎక్కువగా ఈజిప్టు లోనే వేశారు. పైలాన్ వంటి ఇతర బ్యాక్ గ్రౌండ్ విశేషాలను పెద్దపెద్ద మ్యాటీ పెయింటింగ్స్ వేసి, వాటిని దూరంగా నిలబెట్టి సహజంగా కనపడేలా చిత్రీకరణ జరిపారు. నైలు నది ఎర్రగా మారే దృశ్య చిత్రీకరణకోసం ఎర్రరంగును హోస్ పైపుల ద్వారా నీటి అడుగునుంచి ప్రవహింపజేశారు. ఈ ఎర్రరంగు నీరు ఎర్రసముద్రం లోకి వెళ్ళే దృశ్యాన్ని యానిమేషన్ టెక్నాలజీతో చిత్రీకరించారు. సినాయ్ పర్వత శిఖర ఫ్రేమ్ ని సెసిల్ బి.డెమిల్లే తన పారామౌంట్ సంస్థ లోగో గా వాడుకున్నారు. నేటికీ అదే లోగో వాడకంలో వుంది. సెసిల్ బి.డెమిల్లే నిర్మించిన ఒకే ఒక వైడ్ స్కీన్ సినిమా ‘టెన్ కమాండ్ మెంట్స్’. ఈ సినిమా నెగటివ్ లను అమెరికన్ జాతీయ ఫిలిం రిజిస్ట్రీలో భద్రపరచారు.

కొసమెరుపు…కట్ ప్లీజ్…

సెసిల్ బి.డెమిల్లే 1923లో నిర్మించిన ‘టెన్ కమాండ్మెంట్స్‘ మూకీ సినిమాకు దక్షిణభారత చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు కుమారుడు సూర్యప్రకాశ్ సహాయకుడిగా పనిచేశారనే విషయం చాలామందికి తెలియదు. ప్రకాష్ అత్యంత ప్రతిభాశాలి. ‘టెన్ కమాండ్మెంట్స్’ మూకీచిత్రంలోని ఒక సన్నివేశ చిత్రీకరణ జరుగుతోంది. అందులో నటిస్తున్న ఎక్స్ స్ట్రా నటులు కెమెరా ముందునుంచి నడుస్తూ వుండడం క్లోజప్ లో చిత్రీకరింపబడుతోంది. వారి శరీరాల పైన ఆచ్ఛాదన లేదు. దర్శకుడు సెసిల్ బి.డెమిల్లే ‘స్టార్ట్’ చెప్పగానే కెమెరా తిరుగుతోంది. గుంపులు గుంపులుగా నటులందరూ నడుస్తున్నారు. సూర్యప్రకాశ్ ‘కట్ ప్లీజ్’ అంటూ అరిచాడు. కెమెరా ఆగిపోయింది. నటులంతా నిశ్చేష్టులై ఎక్కడివాళ్లు అక్కడే నిలబడిపోయారు. దర్శకునికి సూర్యప్రకాశ్ మీద కోపంవచ్చింది. ‘’ఎందుకు షాకు కట్ చెప్పావు?’’ అంటూ గర్జించాడు. సూర్యప్రకాశ్ వినయంగా ‘’సర్… ఈ సినిమా కథాకాలంలో వ్యాక్సినేషన్లు లేవు కదా. కెమెరాకు దగ్గరగా నడుస్తున్న ఒక మనిషి చేతిమీద వ్యాక్సినేషన్ మార్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిని చూడకుండా అట్లాగే వదిలేస్తే, ఫ్రేక్షకులు గమనించి మీ దర్శకత్వాన్ని విమర్శిస్తారు. మీమీద కళంకముద్ర పడకూడదని మీ అనుమతి లేకుండానే కట్ చెప్పాను. తప్పయితే క్షమించండి’’ అన్నాడు. మరొక దర్శకుడైతే ఎలా స్పందించేవాడో తెలియదుకానీ, సెసిల్ బి.డెమిల్లే మాత్రం వెంటనే సూర్యప్రకాశ్ భుజంతట్టి, అతని సునిశిత పరిశీలనను మెచ్చుకుంటూ, సహాయ దర్శకులలో అగ్రస్థానాన్ని సూర్యప్రకాశ్ కు ఇచ్చి గౌరవించాడు. దటీజ్ ఇండియన్ ఇంటెలిజెన్స్.
-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap