కవికుల ‘తిలకుడి ‘ శతజయంతి

ఆ అక్షరాలు దయాపారావతాలు, విజయ ఐరావ తాలు.. అవి సంకుచిత జాతి మతాల హద్దులు చెరిపేవి.. అకుం ఠిత మానవీయ పతాకను ఎగురవేసేవి.. అన్నింటికి మించి చరిత్ర రక్తజలధికి స్నేహసేతువులను నిర్మించేవి. ‘ప్రభాతము-సంధ్య’ వేళల్లో చూసినా, ‘అమృతం కురిసిన రాత్రి’గా అనిపించినా, ‘గోరు వంకలు’గా పలకరించినా, ‘కఠోపనిషత్తు’ను తలపించినా అన్నీ అవే..! ‘సాలె పురుగు’ తీరును, సుప్తశిల రీతిని తేటతెల్లం చేసిన రచనలు అవైతే – వాటి కర్త దేవవరకొండ బాలగంగాధర తిలక్. ఆగస్ట్ ఒకటిని ఉదయించిన ఆ కవికుల తిలకుడి శత జయంతి వసంత సందర్భమే ఇది. ఉత్తమ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించి ఇప్పటికీ అర్ధ శతాబ్ది దాటింది.

భావుక దృష్టి. అభ్యుదయ సృష్టి నిండిన రస గంగాధరుడు తిలక్. అన్నిటా అంతటా వెల్లివిరిసే తెలుగు దనానికి సిసలైన చిరునామా.. కవితాత్మతో పాటు కథన కుతూహలాన్ని నాటక పర మార్గాన్ని తనదిగా చేసుకున్న క్రాంతదర్శి.. రాతల్లో విశ్వమానవతా భావన ఉంది. జన జయకేతనం రెపరెపలాడుతుంటే చూడాలన్న కాంక్ష నిండింది. భావనా ప్రవాహం నానాటికీ వేగం పుంజుకుం దన్నా, అందులో ప్రధానంగా కరుణరసం పొంగి పొరలిందన్నా, అది పూర్తిగా ఆయన కలం బలమే..! తపస్వి, యశస్వి రెండూ తానే.. మది ఎంత సుకుమారమో, మాట అంతటి సునిశితం.. ఎక్కడ కనికరాన్ని కురిపించాలో, ఆగ్రహాన్ని భగ్గుమనిపించాలో బాగా తెలుసు.. ప్రాచీన భాషతో పాటు అత్యాధునిక హృదయ ఘోషనూ సమతుల్యం చేయగలిగారు. పద్యమైనా గద్యమైనా కొట్టిన పిండి.

ఇతివృత్తాన్ని, అభివర్ణనని ఎటు నుంచి ఎటుకైనా తిప్పడానికి సమర్ధత దండి.
వ్యథార్ధ జీవిత యధార్థ దృశ్యాలెన్నో చూశారాయన. హృదయ విదారక చరితలు తిలకించి చలించిపోయారు. భాషలో మధురిమ ఉంది. భావంలో సుకుమారత నెలకొంది. శైలిలో నవ్యత సర్వే సర్వత్రా వెల్లివిరుస్తూ వచ్చింది. జీవిత కాలం నాలుగున్నర దశాబ్దాలైనా, శతాబ్దాలకు సరిపడేంత రచనా సంపదను తెలుగువారందరికీ అందించారు. తన స్పందన స్వభావం అసా ధారణం. పరిగణకు అందనంత అతి సున్నిత తత్వం. అనుభూతిని మించిన ప్రకటిత వేగం వెల్లడైన సన్నివేశాలు ఎన్నెన్నో.. రెండు నాలుకలతో వంకర మాటలాడే వాళ్ళను నిర్దేతుక కృపా సర్పాలన్నారు. రాద్దాంతాలతో రోజులు దొర్లించే ప్రబుద్దులను సిద్ధాంత కేసరులంటూ ఈసడించారు. అందుకే సమకాలీన సమస్యల పరంపర పరంగా తానొక స్వచ్ఛ స్పటికా ఫలకం. మనోగతాన్ని కవిత్వీకరించడమంటే ఏమిటో రాసి చూపిన ఘనత ఆయనది. ఇక సామాజిక దృక్పథానికి కొదవంటూ ఏముంటుంది..?

వాస్తవికతను వీడలేదు. రసవాదన వాడనూ లేదు. కాంతి జలపాతాన్ని చూడగలరు. సుగంధపూరిత మానవతను అస్వాదించనూ గలరు. మనిషితనాన్ని మొదట, మధ్యనా, తుది లోనూ నమ్మారు కాబట్టే ఎప్పటికప్పుడు దీటైన రచనలెన్నో చేసి చూపగలిగారు. ఉద్వేగాలకు, ఉద్విగ్నతకు నడి మధ్యన ఉన్న సన్నటి గీతను తిలక్ చూసినంతగా ఇంకెవరూ చూడలేదనాలి. ఏ రచనా ప్రక్రియను చదివినా మనసు తేజోవంతమవుతుంది.

శిల్ప రహస్యాన్ని కనిపెట్టి పట్టుకున్నంత ఉత్తేజం ఆవహిస్తుంది. ప్రజా కవి, ప్రభారవి రెండూ తానే..!

ఉదాహరణ సాక్ష్యసహితాలుగా కథలూ, లేఖలూ రెండి ంటిని మనం చూపించవచ్చు. కవితల మాటకొస్తే ప్రార్థనను ప్రస్తా వించనూ వచ్చు. శీర్షిక అభ్యర్థనలా గోచరించినా, లోపల ఉన్న దల్లా నీతి నిజాయితీ కలగలసిన ధర్మాగ్రహ ప్రకటన. అందువల్లనే నటనలు కానీ, చుట్టూ కటకటాలు కానీ వద్దనే వద్దన్నారు. జీవితం చావు పుట్టుకల మధ్య సందేహంలా మారటాన్ని అసాంతం కళ్ళకు కట్టించారు. కనురెప్పల మాటున మెరుపు వీణ మీటడమంటే ఇదే నేమో..! తత్వాలూ, వాదాలూ ఏవీ కాదు.. మానవత్వానిదే గెలుపు బావుటా..

విద్యాలయం కాకున్నా, సమాజంలో ఒక వ్యక్తిగా ఎంతో చదువుకున్నారు. అందులో భాగమా అన్నట్లు దరిదాపు 70 ఏళ్ళ క్రితం ముంబై వేదికగా ఏర్పాటైనా జాతీయ స్థాయి అభ్యుదయ రచయితల సంఘం మహాసదస్సుకు హాజరయ్యారు. జీవితాను భవాలను మధించి, భావానుభూతులకు ఓ రూపమిచ్చి ‘అమృతం కురిసిన రాత్రి’ కావ్యాన్ని సృజించింది ఆ తర్వాతే.. తెలుగుకు దీటుగా సంస్కృత, ఆంగ్ల భాషా సాహిత్యాలనూ సమగ్ర అధ్య యనం చేసిన రచనా శిల్పి. బహుభావామృత రసధుని, రసరాగ సమన్విత కవిలోక ప్రతినిధి.

చెదరని ముద్ర ఆరుద్ర నిర్వచనం ప్రకారం… కవిత ఎలా చెబితే అందగిస్తుందో, ఆనందం అందిస్తుందో తెలుసుకోవాలన్నదే తిలక్ ప్రధాన ధ్యేయం. ఆ కారణంగానే రచనలన్నీ ఆ విధంగానే ఉంటాయి. మహాకవి శ్రీశ్రీ సంభావించినట్లు కవితా పుత్రుడు, సకల జగన్మిత్రుడుగా తిలక్ విలక్షణుడు. రసాత్మకతకు మారు పేరు. తనే రాసుకున్నట్లు… అందమైన వాడు.. ఆనందం మనిషైనవాడు..!
-జంధ్యాల శరత్ బాబు

SA: