ప్రజాస్వామిక కార్టూనిస్టు సుభాని

‘కింగ్ ఆఫ్ పురాణాస్’ అని డెక్కన్ క్రానికల్ లో వొచ్చిందండి అంటాడు ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే మాచవరపు అబ్బులు తన క్రెడిబిలిటీ ని నిరూపించుకునేందుకు.

మరి అలాంటి డెక్కన్ క్రానికల్ గ్రూప్ ఆఫ్ సంస్థల్లో నలభై సంవత్సరాల ప్రొఫెషనల్ ఇలస్ట్రేటర్, కార్టూనిస్ట్ జీవితం. జాతీయ అంతర్జాతీయ అవార్డులు, కార్టూన్ పుస్తకాల ప్రచురణ, సంస్థ నుంచి అపారమైన గౌరవం వెరసి కార్టూనిస్ట్ సుభాని గారు.

ఇప్పటికే ఆయన ది డ్రైవ్, పాయింట్ కౌంటర్ పాయింట్, ఆదాబ్ హైదరాబాద్, స్క్రీన్ టూన్స్, SPLENDID SPELLS పుస్తకాలు ప్రచురించారు.
ఆయన నుంచి వొచ్చిన కొత్త పుస్తకంTo The Point మొత్తం రెండువందల పన్నెండు పేజీలు, సుభాని గారి ఇంటర్వ్యూ, ప్రముఖులు ఆయన గురుంచి చెప్పిన మాటలు, ఫోటోలు, పాకెట్, మెయిన్ కార్టూన్లు (440) వాటర్ కలర్ ఇలస్ట్రేషన్లు (40) కారికేచర్లు (40) ట్రావెల్ స్కెచెస్ (40) కార్టూన్లు వేయడంలో మెళకువలు వున్నాయి.
ఒక ఇంట్లో జనం అంతా సోఫాలో కూర్చొని వుంటారు ఎదురుగా ఒక రోబో కుక్క గెంతుతుంటుంది, ఇంటిల్లి పాదీ దాన్ని చాలా ఆసక్తిగా చూస్తుంటారు. పాపం సోఫా వెనకాల వాళ్ళ పెంపుడు కుక్క ‘ కుయ్యో ‘ మని నీరసంగా కూర్చొని ఉంటుంది.(ఎప్పుడో ఆయన వేసిన కార్టూన్ ఇప్పటి సమకాలీన AI కి సరిపోయిందిగా) ఇది సుభాని గారి అవార్డు విన్నింగ్ కార్టూన్. ఇంకో కార్టూన్ చెట్లన్నీ నరికేసి ఉంటాయి ఒక జింక కొమ్ములకు ఆకులు మొలుస్తాయి దాన్ని తినడానికి మరో జింక ఆబగా ప్రయత్నిస్తుంటుంది. బీచ్ పక్కన ఒక పిల్లడు ఇసుక ఇల్లు కట్టుకుంటాడు దానిమీద ఒక బాంబ్ పడిపోతుంటుంది. (ఇది ఇప్పటి యుద్ధ నేపధ్యానికి సరిపోయే సరైన కార్టూన్) యుద్ధం, పర్యావరణం, మానవత్వం మీద వున్న ఈ కార్టూన్లు వేసిన పొలిటికల్ కార్టూనిస్టు సుభాని గారు, నలభై ఏళ్ళనుంచి తన కార్టూన్లతో రాజకీయ చరిత్రను రికార్డు చేస్తున్నారు.

ఎన్టీయార్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కార్టూను చూస్తే ఆనాటి రాజకీయ పరిస్థితి అర్ధం కావడం తో పాటు నువ్వుకూడా వస్తుంది. హైదరాబాద్ వరదలు, పెరిగిన గోల్డ్ రేటు, సెన్సెక్స్ పతనం, కుర్చీలాట, కొత్త పార్లమెంటు, కేజ్రీవాల్ వ్యవహారశైలి, ఇండియా కూటమి ఇగోలు, ధరలు, విమెన్ ఎంపవర్మెంట్, నాయకుల ప్రచార పిచ్చి ఇలా రాజకీయాలలో ఏ అంశాన్ని విడిచి పెట్టకుండా కొన్నిసార్లు ప్రత్యక్షంగా మరికొన్ని సార్లు పరోక్షంగా నవ్వించారు, వాతలేసారు, ఆలోచింపజేశారు.


కాసేపు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ కార్టూనింగ్ గురుంచి సింహావలోకనం చేస్తే సరైన పొలిటికల్ కార్టూనింగ్ రాంభట్ల కృష్ణమూర్తి నుంచి మొదలయ్యింది. కాస్త గట్టిగా కార్టూన్లు వేసినవాళ్లు నాలుగురైదుగురూ కూడా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ నుంచి ప్రభావం అయిన వారే. తెలుగు సమాజపు రాజకీయాలు, వాటి ఆంబిషన్స్ నుంచి రాజకీయ కార్టూన్లను విడి చేసి చూడలేము, సంపాదకులు యాజమాన్యాలచేతిలోనూ, ఆ సంపాదకుల చేతిలో కార్టూనిస్టులు ఇదొక చ ట్రం. అందువలన కె. యెన్. వై పతంజలి అనే రచయిత తన ‘పెంపుడుజంతువులు’ నవలలో సంపాదకుడు కార్టూనిస్టుతో అద్దె పెంచుమన్న తన ఇంటి ఓనర్ మీద రోజూ కార్టూన్లు వేయుంచుకున్నా, నవ్వుతూ రెండు పళ్ళు కనపడే సంపాదకుడు చెప్పిందల్లా వేసే ఆ కార్టూనిస్టు (?) గురుంచి రాసారంటే అప్పటికే కార్టూనిస్టుల పరిస్థితి అర్ధం చేసుకోవొచ్చు. అది అలా కార్టూనిస్టు పత్రికా అధిపతులకు ఎవరిమీద కోపం ఉంటే వాళ్ళమీద వేయాలనే పరిస్థితి కి వెళ్ళింది. అలా వేసినవాళ్ళే ఉద్యోగంలో నిలదొక్కుకోగలిగారు మరి. చాత్ అత్తెరీ.. నేను స్వంతంగా కార్టూన్లు వేస్తాను అంటే వేయనిస్తారా.? పత్రికలనేవి వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలకోసం పెట్టుకుంటారు కానీ కార్టూనిస్టు కోసం పెట్టరు కదా. సరే ఆ గొడవ అక్కడితో ఆగితే బాగుణ్ణు చదువు, సాహిత్యం, లెఫ్ట్ ప్రభావంతో వొచ్చిన కార్టూనిస్టుల సరసన ‘లైన్’ ప్రభావంతో వొచ్చిన కార్టూనిస్టులు కొద్దిమంది బయలుదేరారు. ఆయా వ్యక్తుల వ్యక్తి పూజతో వాళ్లే ఉద్యోగాలు పొందడం, కార్టూనిస్టులుగా చెలామణీ కావడం రెండు మూడు దశాబ్దాలుగా సైలెంటుగా వయలెన్సుతో జరిగిపోయిందని చెప్పడానికి నాకెటువంటి మొహమాటం లేదు. దాని వలన తెలుగు కార్టూను రంగానికి మంచో,చెడో, భజనో ఏదో జరిగిపోయింది.

కార్టూనిస్టు అంటే ఒక ఫిలాసఫర్ , కవి,ఆగ్రహ ప్రకటన చేసే ఒక కథకుడు, చిత్రకారుడు, ప్రజాస్యామ్యం ప్రజలకోసం అని తపించే ఒక పౌరుడు. అలా లైన్ ల వెంట, గుంపుల వెంట, నినాదాల వెంట వెళ్లకుండా..తన పని తాను ప్రశాంతంగా, క్రమశిక్షణతో నాలుగు దశాబ్దాలుగా చేసిన కార్టూనిస్టు సుభాని గారు. అనాటమీ, పెర్స్పెక్టివ్, చక్కని కంపొజిషన్ ఆయన కార్టూన్లలో చూస్తాము. చదువు, ఆర్ధిక వెసులుబాటు, కుటుంబ సహకారంతో నిండుకుండలా కనిపించే సుభాని గారు నిరంతరాయంగా నలభై సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఆపకుండా కార్టూన్లు వేయడం పెద్ద రికార్డు.

ఒక కార్టూనిస్టు వొచ్చి మరో కార్టూనిస్టుని గెంటుకోకుండా, పెద్దల, ప్రాంతీయ,కుల, సహకారంతో కాకుండా కేవలం తన టాలెంటుతో మానేజ్మెంటు గౌరవం పొందడం ఒక అదృష్టం.

ఏ పత్రికలో పనిచేస్తే ఆ పత్రిక పాలసీకి అనుగుణంగా పనిచేసేవాడే నిజమైన జర్నలిస్టు అని రాసారు పెద్దలు రాంభట్ల కృష్ణ మూర్తి, అలా ఆ మాటకు అక్షరాలా సరిపోయే కార్టూనిస్టు సుభాని గారు. పత్రిక పాలసీలో పనిచేస్తూనే తనదైన ప్రొఫెషనలిజం చూపించడం, ఇంగ్లీష్ జర్నలిజం లో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకోవడం సుభాని గారి ప్రత్యేకత. అది తెలుగు కార్టూనిస్టులకు గొప్ప. ఈ పుస్తకంపై ఉభయ రాష్ట్రాల్లో అనేక చోట్ల చర్చలు జరగాలి, కొత్త కార్టూనిస్టులు ఈ పుస్తక స్ఫూర్తితో చక్కని కార్టూన్లు వేయాలి.

హరి వెంకట రమణ (హరి)
…………………………………….
TO THE POINT
A Four Decade Journey of Wit
Satire and Political Cartoons

Author : SUBHANI
Cartoon Editor, Deccan Chronicle.
Pages : 212, Price : Rs. 499/-

for copies : NAAZ Arts and Crafts
naazartscrafts@gmail.com

Share via
Copy link
Powered by Social Snap