తొలివైద్యుల చరిత్ర

ప్రపంచ వ్యాప్తంగా క్షౌరవృత్తి నిర్వహించే వారందరూ క్షౌర వృత్తితో పాటు వైద్యం, వాయిద్యం, సౌందర్య పోషణల ద్వారా వేల సంవత్సరాలుగా మానవజాతికి సేవలందిస్తున్నారనేది చారిత్రక సత్యం. అన్నవరపు బ్రహ్మయ్య రాసిన’తొలివైద్యులు” పుస్తకం చారిత్రకంగా మంగళ్ళు అందించిన సేవల గురించి వివరించడమే కాకుండా ఆ కులం నుండి రాజులైన వ్యక్తుల గురించి, పోరాటయోధుల గురించి తెలియజేశారు. ప్రాచీన భారతదేశంలో మౌర్యవంశానికి ముందు పాలకులుగా వున్న నందరాజులు మంగళ్ళని ఆయన తేల్చిచెప్పారు. ఈ పుస్తకంలో మహాపద్మనందుని గొప్పతనం గురించి ఆయన కుల చైతన్యం గురించి చెప్పారు. అలాగే బౌద్ధమతం పునాదులు వేసిన ఉపాలి గురించి రాశారు. క్షౌరవృత్తి చేస్తూనే తన ఆధ్యాత్మిక చైతన్యంతో ఆధ్యాత్మిక గురువుగా మారిన భగత్సౌయిన్ అనే పంజాబీ మంగలి గురించి వివరంగా తెలియజేశారు. గురుగ్రంథ రచనలో మంచి పాత్ర పోషించిన సిక్కుమత గురువు భాగ్సాహెబ్ సింగ్ అనే పంజాబీ మంగలి ప్రాధాన్యతను వివరించారు. అష్టదిగ్గజాలకే ఈర్ష్య కలిగించేంతటి కవితా ప్రభావం కలిగిన మంగలి కొండోజు గురించి తెలియజెప్పారు. చివరగా బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించిన కర్పూర్ ఠాకూర్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా ఇచ్చారు.

మంగలి వృత్తి బ్రహ్మండమైన కత్తిని, పని విధానాన్ని, శాస్త్రీయ ప్రక్రియను అభివృద్ది చేసింది. తర తరాలుగా వారు చేస్తున్న అభివృద్దిని గుర్తుంచు కోనందువల్ల వారి సామాజిక స్థితి ఇంకా దయనీయంగా వుంది.
బ్రహ్మయ్య గారు రాసిన ఈ పుస్తకంలో మంగళ్ళ శాస్త్రీయ జీవన విధానం నుండే కాక, ఆ కులం నుండి రాజులైన వ్యక్తుల గురించి, పోరాటయోధుల గురించి చర్చించారు కూడా. ఈ పుస్తకం ప్రచురించిన ఏడేళ్ళలో మూడవ ముద్రణకు రావడం హర్షనీయం.
ఇలాంటి పుస్తకాలు మంగలి కులస్థుల్ని చైతన్యపరచడమే కాకుండా వెనుకబడిన కులాల సమగ్ర చరిత్ర రచనకు దోహదం చేస్తుంది.
కె.పి. అశోక్ కుమార్

తొలివైద్యులు, అన్నవరపు బ్రహ్మయ్య, తెలుగుతోరణం ప్రచురణ, విజయవాడ.
వెల: 100/-, పేజీలు : 118. ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తక కేంద్రాలు

Mob: 94403 20886

SA: