పర్యాటకాభివృద్ధిలో ఫొటోగ్రఫీ పాత్ర కీలకం

పర్యాటకం అభివృద్ధిలో ఫొటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సంస్కృతి సమితి సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం (18-8-2025) విజయవాడ బాలోత్సవ భవన్లో ప్రపంచ గిరిజన దినోత్సవం, ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల స్థితిగతులు, జీవన విధానాలు తెలియజేసేది ఫొటోగ్రఫీ అన్నారు. ఈ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. చరవాణులతో ఫొటోలు తీసినా.. కెమెరాతో తీసినంత స్పష్టత ఉండదన్నారు. గిరిజనుల జీవన విధానాలను కళ్లకు కట్టిన నిర్వాహకులను అభినందించారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే డా. మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ.. ఫొటోగ్రఫీని జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శ్రీనివాసరెడ్డి ని అభినందించారు. పర్యాటకాన్ని ఫొటోగ్రఫీ ద్వారా చిత్రీకరించి.. ప్రపంచానికి చాటాలని పేర్కొన్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. చిన్నపాటి కెమెరా నుంచి ఇప్పటి అత్యాధునిక కెమెరాలను వాడుకునే స్థాయికి ఎదిగిన ఫొటోగ్రఫీ రంగం ద్వారా సేవలందిస్తూ.. మొదటిసారిగా గిరిజన సంస్కృతిని వెలుగులోకి తెచ్చిన నిర్వాహకులను అభినందించారు.

నిర్వాహకుడు టి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం వేదికగా ఫొటోగ్రఫీలో గిరిజనులపై పోటీలు నిర్వహించడం తొలిసారిగా పేర్కొన్నారు. 16 రాష్ట్రాల నుంచి 487 ఎంట్రీలు రాగా.. 40 ఫొటోలు ఎంపికైనట్లు తెలిపారు. మొదటి మూడు స్థానాలు పొందిన విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. వేడుకలకు సంబంధించిన పలు ఫొటో క్యాటలాగ్ లు, ఆల్బమ్ లు ఆవిష్కరించారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి నిర్వాహకుడు గోళ్ల నారాయణరావు, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు సుందర్ కొపల్లి, ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి డైరక్టర్ అండ్ సీఈవో ఆర్ మల్లికార్జునరావు, ఫొటోగ్రాఫర్లు, ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Share via
Copy link
Powered by Social Snap