(చిత్రకారులు, కార్టూనిస్టులు, రచయితల సమక్షంలో విజయవాడలో బాలి సంతాప సభ)
ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకుని బొమ్మలు గీయడమే నా పని అని ఆత్మవిశ్వాసంతో చెప్పిన గొప్ప చిత్రకారుడు బాలి అన్నారు, కామ్రేడ్ జీఆర్కె-పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు అన్నారు. సుప్రసిద్ధ చిత్రకారుడు, కార్టూనిస్టు, కథకుడు బాలి సంతాప సభ విజయవాడ, ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో శనివారం సాయంత్రం జరిగింది. మల్లెతీగ, కామ్రేడ్ జీఆర్కె-పోలవరపు సాంస్కృతిక సమితి, 64 కళలు.కామ్, జాషువా సాంస్కృతిక వేదిక, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సంతాప సభకు గోళ్ల నారాయణరావు అధ్యక్షత వహించారు. అతిథిగా కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి టి. జమలాపూర్ణమ్మ హాజరై బాలి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ- తాను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రోజుల్లో బాలితో వున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. బాలి గొప్ప చిత్రకారుడుగా తెలుసు. కానీ ఇటీవలే కథకులుగా కూడా రాణించారన్న విషయం తెలిసిందన్నారు. 64 కళలు.కామ్ ఎడిటర్ కళాసాగర్ మాట్లాడుతూ – ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా వుండే బాలి గారు క్రమ శిక్షణగల జీవితాన్ని గడిపారని, విజయవాడతో ముప్పై ఏళ్ల అనుబంధం బాలిగారిదన్నారు. కళాకారుడు చిరంజీవని, తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం బాలి పేరు వుటుందన్నారు. మల్లెతీగ సాహిత్యసేవా సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ మాట్లాడుతూ-కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా ప్రసిద్ధి పొందిన బాలి చివరి దశలో కథలు రాశారన్నారు. బాలి కథా సాహిత్యాన్ని ‘బాలి కథలు’ పేరుతో గ్రంథంగా తీసుకొచ్చే అదృష్టం మల్లెతీగకు దక్కిందన్నారు. జాషువా సాంస్కృతిక వేదిక కార్యదర్శి గుండు నారాయణరావు, సీనియర్ కార్టూనిస్టు ఏవియం సభలో పాల్గొని బాలి చిత్రపటానికి నివాళు లర్పించారు.
కార్యక్రమంలో రచయితలు గుమ్మా సాంబశివరావు, డి. శమంతకమణి, దుబ్బాక కార్తీక్, వెన్నా వల్లభరావు, గిరిధర్ అరసవిల్లి, అర్చన, ప్రజానాట్య మండలి కార్యదర్శి అప్పన్న, చిత్రకారులు చిదంబరం, అల్లు రాంబాబు, గంథం, ఆత్మకూరి రామక్రిష్ణ, రాము అలహరి, వేణుగోపాల్, కార్టూనిస్టులు డాక్టర్ రావెళ్ళ, ఆదినారాయణ, జమదగ్ని, నాగిశెట్టి, విష్ణుభొట్ల రామకృష్ణ, కిరణ్ తదితరులు బాలి గారితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
Very nice sir