చిత్రసీమ కళానిధి …త్యాగరాజ భాగవతార్

(మార్చి 7 త్యాగరాజ భాగవతార్ జన్మదిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం….)

పుట్టుకతోనే ప్రావీణ్యులుగా గుర్తింపు పొందే కళాకారులు అతి కొద్దిమంది మాత్రమే. వారిలో అగ్రగణ్యులు ఎం.కె.టి అని ఆప్యాయంగా తమిళులు పిలుచుకొనే త్యాగరాయ భాగవతార్. మార్చి 7, 1910 న తంజావూరు జిల్లాలోవున్న మైలదుత్తురై (మాయవరం)లో జన్మించిన త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్. తొలితరం తమిళ చలనచిత్రరంగంలో ‘సూపర్ స్టార్’ స్థాయిని అందుకున్న తొలి నటుడు త్యాగరాజు. చిన్నతనం నుంచే అంటే 1920 నుంచే రంగస్థల వేదికలమీద కళాకారులు ఆలపించే పాటలను త్యాగరాజు ఆసక్తితో గమనించేవారు. బహుశా అందుకేనేమో భాగవతార్ దృష్టి చదువు సంధ్యలమీదకు మరలలేదు. నాటకాలు, పాటలు తిండిపెట్టవు అని భాగవతార్ తండ్రి కృష్ణమూర్తి హెచ్చరించినా భాగవతార్ దృష్టి నాటకాలనుంచి, సంగీతం నుంచి మరలలేదు. చివరకు కడప పట్టణంలో త్యాగరాజు తన గానమాధుర్యంతో సంగీతప్రియులను అలరిస్తున్న ఘటన తండ్రి కంటపడింది. దాంతో కృష్ణమూర్తి త్యాగరాజుకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. దక్షిణ రైల్వేలో ఉద్యోగం చేస్తూ ‘రసిక రంజన సభ’ పేరుతో ఒక నాటక సంస్థను నడుపుతున్న కె.జి. నటేశ అయ్యర్ త్యాగరాజ భాగవతార్ సంగీతపటిమను గమనించి, అతడిని తన నాటక సంస్థలో చేర్చుకొని తను ప్రదర్శించే ‘హరిశ్చంద్ర’ నాటకంలో లోహితాస్యుని వేషంలో నటింపచేశాడు. అప్పుడు త్యాగరాజుకు కేవలం పడేళ్లే! తన అద్భుత గళంతో ప్రేక్షకులను మెప్పించిన త్యాగరాజు అచిరకాలంలోనే ఖ్యాతిని ఆర్జించారు.

తొలిరోజులు

త్యాగరాజు జన్మించిన కొంతకాలానికే వారి కుటుంబం తిరుచిరాపల్లికి మకాం మార్చింది. అక్కడే త్యాగరాజు ప్రాధమిక విద్యను అభ్యసించారు. అయితే త్యాగరాజుకు చదువుమీద శ్రద్ధ కలుగలేదు. త్యాగరాజు గళప్రతిభను గుర్తించిన మదురై పొన్ను అయ్యంగార్ అనే కర్ణాటక సంగీత ప్రవీణుడు మరియు ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు యువ త్యాగరాజును చేరదీసి సంప్రదాయ సంగీతంలో అద్భుత శిక్షణను ఇచ్చారు. ఈ కఠోర సంగీత శిక్షణ ఆరు సంవత్సరాలు కొనసాగింది. శిక్షణానంతరం త్యాగరాజు తిరుచిరాపల్లిలో తొలి సంప్రదాయ కర్ణాటక సంగీత కచేరీ నిర్వహించి సంగీతాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సంగీత కార్యక్రమంలో తన గురువు గారే స్వయంగా వాయులీనం వాయించడం విశేషం. పెర్కుషన్ విద్వాంసుడు పుదుక్కోట్టై దక్షిణామూర్తి అందులో కంజీర వాయించడమే కాకుండా త్యాగరాజు సంగీత పటిమకు ముగ్ధుడై అతనికి ‘భాగవతార్’ అనే బిరుదును ప్రదానం చేశారు. అంత పిన్నవయసులోనే ‘భాగవతార్’ అనే బిరుదు ప్రదానం జరగడం ఒక విశేషమనే చెప్పుకోవాలి. అప్పటినుంచే త్యాగరాజు ‘త్యాగరాజ భాగవతార్’ గా పిలువబడుతూవచ్చారు. అంతటితో ఆగని త్యాగరాజు అళత్తూర్ వెంకటేశ అయ్యర్, పాపనాశం శివన్ ల వద్ద సంగీతంలో ఉన్నతశిక్షణ తీసుకున్నారు. 1920 నుండి త్యాగరాజు నాటకాలలో పాల్గొనడం ప్రారంభించిన త్యాగరాజు, 1926లో తిరుచిరాపల్లిలో ప్రదర్శించిన ‘పావళక్కోడి’ అనే నాటకంలో ప్రధమంగా హీరో అర్జునుడుగా వేషం వేశారు. త్యాగరాజు సరసన ఎస్.డి. సుబ్బులక్ష్మి హీరోయిన్ గా నటించి అతనికి ధీటుగా కీర్తనలు ఆలపించింది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోనే ఎన్నో నాటకాకు శ్రీకారం చుట్టారు. వాటిలో ‘వళ్లి తిరుమనం’, ‘నందనార్’ వంటి పోరాణిక నాటకాలకు అద్భుత ఆదరణ దక్కింది. మన్మధునిలా అందమైన విగ్రహంతోబాటు, అర్ధవంతంగా సంభాషణలు పలకడం, శ్రావ్యమైన కంఠస్వరంతో కీర్తనలు ఆలపించడం వలన ఆరోజుల్లో నాటక రారాజుగా కీర్తిప్రతిష్టలను త్యాగరాజు ఆర్జించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోనే కాకుండా త్యాగరాజ నాటకాలు శ్రీలంక, మలేసియా, మయన్మార్ దేశాలలో ప్రదర్శితమయ్యాయి.

చలనచిత్ర ప్రవేశం

Bhagavatar

మద్రాసులో ప్రముఖ వ్యాపారవేత్తలు లక్ష్మణన్ చెట్టియార్, అలగప్ప చెట్టియార్ లు చలనచిత్ర దర్శకుడు కె. సుబ్రమణియం తో కలిసి త్యాగరాజు నటించిన ‘పావళక్కోడి’ నాటకాన్ని తిలకించడం జరిగింది. చెట్టియార్లు ఆ నాటక విశిష్టతకు, త్యాగరాజ భాగవతార్ అర్జునుడిగా నటించి అద్భుతంగా గానం చేసినందుకు ఎంతగానో ఆకర్షితులై అదే నాటకాన్ని త్యాగరాజ భాగవతార్ తో సినిమాగా నిర్మించాలని నిర్ణయించి తగు యేర్పాట్లుచేయమని దర్శకుడు సుబ్రమణ్యంను కోరారు. అలా ‘పావళక్కోడి’ నాటకం అడయార్ స్టూడియోలో సినిమాగా రూపుదిద్దుకుంది. ఆ చిత్రం టాకీలు వచ్చిన కొత్తల్లో…అంటే 1934లో విడుదలై బాక్సాఫీస్ హిట్ గా నిలిచి త్యాగరాజుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయవంతం కావడంతో 1935 లో ‘నవీన సారంగధర’ అనే సినిమాలో త్యాగరాజు హీరోగా నటించడం జరిగింది. ఈ చిత్రానికి కూడా కె.సుబ్రమణ్యం దర్శకత్వం వహింఛారు. అది కూడా అద్భుత విజయం అందుకోవడంతో త్యాగరాజు ’ట్రిచ్చి త్యాగరాజ ఫిలిమ్స్’ అనే సొంత సంస్థను నెలకొల్పి మూడవ చిత్రంగా 1936లో ‘సత్యశీలన్’ అనే పేరుతో సినిమా నిర్మించారు. అందులో భాగవతార్ హీరో సత్యశీలునిగా, ఆస్థాన గాయకుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అలా దక్షిణాది చలనచిత్రసీమలో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఖ్యాతి త్యాగరాజ భాగవతార్ కు దక్కింది.

తిరుగులేని విజయాలు

1937లో త్యాగరాజ భాగవతార్ ‘చింతామణి’ చిత్రంలో బిల్వమంగలుడు గా నటించి మెప్పించారు. వై.వి. రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డు బ్రేక్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి సంవత్సరం రోజులకు పైగా ఆడింది. ముఖ్యంగా భాగవతార్ ఆలపించిన పాటలతోనే ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఇందులో ముఖ్యంగా త్యాగరాజు గానం చేసిన ‘’మాయాప్రపంచత్తిల్’’ అనే పాట మహిళలను ఎంతగా ఆకర్షించిందంటే, ప్రొద్దుటే కాఫీ కలుపుకుంటూ వంటగదిలో వారు ఈ పాటను పాడుకుంటూ కాఫీని ఆస్వాదించేవారు. అలాగే మగవారు ‘’రతే ఉనక్కు కోబమ్’’ అనే పాటను భార్యలముందు పాడుతూ వారి ప్రేమను పొందేవారు. ఈ సినిమాతో వచ్చిన లాభాలతో రాయల్ టాకీస్ యజమాని మదురైలో సినిమా హాలు నిర్మించి దానికి ‘చింతామణి థియేటర్’ అని పేరుపెట్టారు. అదే సంవత్సరం అమెరికన్ చిత్ర దర్శకుడు ఎల్లిస్.ఆర్. దుంగన్ ‘అంబికాపతి’ అనే చిత్రాన్ని నిర్మిస్తూ హీరో వేషాన్ని త్యాగరాజ భాగవతార్ కు ఇచ్చారు. ఈ సినిమా ‘చింతామణి’ సినిమాకన్నా విజయవంతంగా ఆడి ఆ సినిమా కలక్షన్లను అధిగమించింది. అలా ఒకే సంవత్సరంలో త్యాగరాజు రెండు సూపర్ హిట్ సినిమాలలో నటించి అలనాటి ప్రేక్షకులకు ఆరాధ్య దైవం అయ్యారు. తర్వాత 1939లో ‘తిరునీలకంఠర్’ అనే చిత్రంలో త్యాగరాజు నీలకంఠ నాయనార్ గా నటించి మెప్పించారు. అలా వెంటవెంటనే త్యాగరాజు 7 సినిమాలలో హీరోగా నటించారు.

చరిత్ర సృష్టించిన హరిదాస్

1944లో మదురై లోని ప్రముఖ వస్త్ర ఉత్పత్తుల సంస్థ రాయల్ టాకీస్ డిస్ట్రిబూటర్స్ త్యాగరాజ భాగవతార్ హీరోగా ‘హరిదాస్’ సినిమాను నిర్మించింది. కోయంబత్తూర్ లోని సెంట్రల్ స్టూడియోలో ఈ చిత్రనిర్మాణం పూర్తిచేసుకుంది. మరాఠీ దర్శకుడు సుందరరావు నాదకర్ణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరిదాస్ సరసన సుబ్బులక్ష్మితో సమాన స్థాయిగల సంగీతకారిణి ఎన్.సి. వసంతకోకిలం నటించగా పాపనాశం శివన్, జి. రామనాథన్ సంయుక్తంగా సంగీతం అందించారు. ఈ చిత్రం ద్వారానే పండరీబాయి చిత్రరంగ ప్రవేశం చేసింది. 16, అక్టోబర్ 1944 దీపావళి పర్వదినాన సినిమా విడుదలైంది. అలా వరసగా మూడు దీపావళి పండుగల దాకా ఈ సినిమా బ్రాడ్వేలోని సన్ థియేటర్ లో విరామం లేకుండా మూడు సంవత్సరాలు ఆడి చరిత్ర సృష్టించింది. అలా త్యాగరాజ భాగవతార్ తమిళ చిత్రరంగంలో తొలి సూపర్ స్టార్ గా అవతరించారు. పాపనాశం శివన్, జి. రామనాథన్ సమకూర్చిన సంప్రదాయ కీర్తనలతో ఈ సినిమా విజయవంతం కాగా అత్యంత అరుదైన, కష్టతర సంగీత బాణీలను త్యాగరాజ భవతార్ శ్రావ్యంగా ఆలపించి సినిమా సంగీతానికి వన్నె తెచ్చారు. ఈ చిత్రం ద్వారా వచ్చిన లాభాలతో నిర్మాతలు ఒక ఒక పెద్ద నిట్టింగ్ ఫ్యాక్టరీని మదురైలో నెలకొల్పారు. ఈ చిత్ర ఘనవిజయంతో త్యాగరాజ భాగవతార్ 12 సినిమాలలో బుక్ అయ్యారు. అయితే ఒకానొక హత్యకేసులో త్యాగరాజుని నిందితుడుగా గుర్తించి నవంబరు 1944లో అరెస్టు చేయడం, ఆపై జైలుకు పంపడంతో ఆ సినిమాలలో త్యాగరాజు నటించలేకపోయారు. ఆరోజుల్లో ద్రవిడ ఉద్యమం వూపందుకుంటున్నప్పుడు కూడా దైవచింతనకు అవకాశంలేని సినిమాలలో నటించమని త్యాగరాజు మీద ఒత్తిడి వచ్చినా ఆయన లొంగలేదు. వరస విజయాలతో త్యాగరాజు సంపదలో కూడా ఉన్నతుడైనాడు. విలాసవంతమైన తెల్లని గుర్రం మీద స్టూడియోకి వస్తుండేవారు. ఆ గుర్రాన్ని ‘హరిదాస్’ చిత్రంలో కూడా వాడారు. అతనికి దలహాయే 135MS, రోల్స్ రాయ్స్ ఫాంటమ్ II, మెర్సిడీస్ బెంజ్ 300SL వంటి అత్యంత ఆధునిక విదేశీ కార్లు ఎన్నో వుండేవి. త్యాగరాజుకు మద్రాసు నగరంలో మూడు విలాసవంతమైన బంగళాలు, తిరుచిరాపల్లిలో రెండు పెద్దపెద్ద బంగళాలు వుండేవి. ప్రతిరోజు పాలతో, ఫన్నీరుతో త్యాగరాజు స్నానం చేసేవారని చెప్పుకున్నారు. తిరుచిరాపల్లిలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ను ప్రారంభించినప్పుడు అందులో తొలి సంగీత కచేరీ చేసింది త్యాగరాజ భాగవతారే. ఆరోజుల్లో త్యాగరాజ భాగవతార్ సంగీత కచేరీలు దక్షిణ భారత దేశంలోని ప్రధాన ఆలయ ఉత్సవాలలో అధిక సంఖ్యలో జరిగేవి. ముఖ్యంగా దేవాలయాలలో జరిగే సంగీత ఉత్సవాలలో పాల్గొన్నప్పుడు త్యాగరాజు పారితోషికాలు తీసుకునేవారు కాదు. 1951లో తన గురువు పాపనాశం శివన్ షష్టిపూర్తి మహోత్సవాన్ని త్యాగరాజు ఘనంగా నిర్వహించి వారిని సత్కరించి తన గురుభక్తిని చాటుకున్నారు. 1934 నుండి 1959 వరకు త్యాగరాజు 14 సినిమాలలో నటించారు. ఒకటి రెండు చిత్రాలను మినహాయిస్తే అన్నీ సినిమాలూ బాక్సాఫీస్ హిట్లయినవే కావడం విశేషం.

చంద్రబింబంలో మచ్చ..

త్యాగరాజ భాగవతార్ చలనచిత్రరంగంలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నప్పుడు అతనికి దురదృష్టవశాత్తూ కోలుకోలేని దెబ్బ తగిలింది. 1944 నవంబరు మాసంలో జరిగిన సంచలనాత్మక సి.ఎన్. లక్ష్మీకాంతన్ (తమిళ సినీ జర్నలిస్టు) హత్య కేసులో త్యాగరాజ భాగవతార్, నటుడు ఎన్.ఎస్. కృష్ణన్, దర్శకనిర్మాత శ్రీరాములు నాయుడు, వడివేలులతోబాటు మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మీకాంతన్ ‘సినిమా తూట్టు’ అనే సినీ పత్రికను నడిపేవాడు. ఎక్కువగా నటీనటుల వ్యక్తిగత విషయాలను చిలవలు పలవలుగా అల్లి పత్రికనిండా నింపేవాడు. త్యాగరాజ భాగవతార్, ఎన్.ఎస్. కృష్ణన్, శ్రీరాములు నాయుడు నాటి గవర్నర్ ఆర్థర్ ఒస్వాల్డ్ జేమ్స్ హోప్ ను కలిసి లక్ష్మీకాంతన్ నడిపే సినీ పత్రిక లైసెన్స్ ను రద్దుచేయమని కోరారు. గవర్నర్ విచారణ జరిపి పత్రిక లైసెన్స్ ను రద్దుచేశాడు. కానీ లక్ష్మీకాంతన్ వేరే పేరుతో ‘హిందూనేశన్’ అనే పత్రికను నడపడం కొనసాగిస్తూ వదంతులను ప్రచురిస్తూ వచ్చాడు. పైగా తనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన త్యాగరాజు, కృష్ణన్ లమీద వదంతులు ఎక్కువగా రాయడం ప్రారంభించాడు. అతడు ఎక్కువగా ఫోర్జరీలు చేస్తూ నేరచరిత్ర కలిగినవాడు. ఫోర్జరీ కేసుల్లో దొరికి రాజమండ్రి, అండమాన్ కేంద్ర కారాగారాలలో ఏడేళ్లకు పైగా శిక్ష అనుభవించాడు. ఇంతటి నేరచరిత్ర కలిగిన లక్ష్మీకాంతన్ పరసువాక్కం వెళుతుండగా మద్రాస్ శివారు వేపేరీలో నవంబరు 7, 1944న గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. కేసు కోర్టులో చాలాకాలం నడిచింది. త్యాగరాజుతో బాటు మిగతా నిందితులను జైలులోపెట్టారు. శ్రీరాములు నాయుడు నిర్దోషిగా విడుదల కాగా త్యాగరాజు, ఎన్.ఎస్. కృష్ణన్ లను క్రిందికోర్టు దొషులుగానిర్ధారించింది. మద్రాసు హైకోర్టులో త్యాగరాజు, కృష్ణన్ పెట్టుకున్న అప్పీల్ ను కోర్టు కొట్టివేసింది. కేసు చివరకు లండన్ లోని ప్రీవీ కౌన్సిల్ వరకు వెళ్లింది. ప్రీవీ కౌన్సిల్ మద్రాసు హైకోర్టులోని జుడీష్యల్ కమిటీకి కేసును బదలాయియిస్తూ 1947లో నిందితులను నిర్దోషులుగా నిర్ధారించి విడుదలచేసింది. విశేషమేమంటే ఇంతవరకు లక్ష్మీకాంతన్ ను చంపినవారెవరో తెలియరాలేదు. త్యాగరాజ భాగవతార్ అలా 30 నెలలు జైలులో గడపాల్సివచ్చింది. దాంతో త్యాగరాజు మీద నీలినీడలు కమ్ముకొన్నాయి. అతని సంపాదన అంతా కోర్టు ఖర్చులతో అడుగంటింది. కేసు ముగిసిన వెంటనే త్యాగరాజు తిరుచిరాపల్లి వెళ్ళిపోయి సినిమాలలో నటించడానికి స్వస్తి చెప్పారు. అయితే 1948లో ‘రాజముక్తి’ సినిమాను నిర్మించి అందులో నటించారు. 1957లో ‘పుత్తు వళవు’ అనే సినిమాను చివరిగా నిర్మించి, తాత్విక చింతన, ఆధ్యాత్మిక ప్రపంచం సృష్టించుకొని తన చివరిరోజులను దైవ చింతనలోనే గడిపారు. బ్రిటీష్ ప్రభుత్వం త్యాగరాజ భాగవతార్ కు ‘రావు బహదూర్’ బిరుదు ప్రదానం చేయాలని ప్రతిపాదించినా త్యాగరాజు ఆ బిరుదును సున్నితంగా తిరస్కరించారు. జైలు జీవితం గడిపిన రోజుల్లో త్యాగరాజు రక్తపోటు, మధుమేహం వంటి రుగ్మతలతో బాధపడుతూ వుండేవారు. 1959లో వ్యాధి ముదరడంతో మద్రాస్ సాధారణ ఆసుపత్రిలో చేరారు. నవంబరు 1, 1959 న తనువు చాలించారు. అలా సంగీత ప్రియుల ఆరాధ్య సంగీత సామ్రాట్ శకం అంతరించింది.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap