పత్రికాక్షర ఘంటం – శ్రీకంఠం

తెలుగు భాష గొప్పతనము గురించి, సొగసు గురించి ఎందరో కవులు కావ్యాలు రాసారు. మరి అలాంటి భాష రాతలో ఎలా వుంటే బావుంటుందో ? ఎలా వుండాలో తన కరములతో అక్షరాలకు వన్నెలుదిద్దాడు ఈ టైపోగ్రాఫర్.  అసలు మనం రోజూ  చదువుతున్న దిన పత్రికల్లో అక్షరాలను  చేతితో రూపొందిస్తారని చాలామందికి తెలియకపోవచ్చు. ఇలాంటి నిపుణులను టైపోగ్రాఫర్ అంటారు.
దాదాపు అన్ని తెలుగు దినపత్రికలకూ అక్షరాలు దిద్దింది ఆయనే. అత్యంత అరుదైన ఈ వృత్తిలో నిష్ణాతుడైన వ్యక్తి జర్మనో, రష్యనో, అమెరికనో కాదు మన తెలుగువాడు… శ్రీకంఠం శ్రీధరమూర్తి !
దీనికి అక్షరం అందంగా రాయడం రావాలేమో అని అనుమానం రావడం సహజం. అందంగా రాయడాన్ని కాలిగ్రఫీ అంటారు. కానీ కాలిగ్రఫీకి టైపోగ్రఫీకి తేడా ఉంది. మొదటిదాన్లో అక్షరం అందంగా, ఆకర్షణీయంగా వస్తే సరిపోతుంది. కాని ఇందులో అక్షరం క్రమశిక్షణగా ఉండాలి. కంటికి హాయిగా ఉండాలి. ఎంత చిన్న సైజుకు కుదించినా ఒత్తులు, తలకట్టులు అక్షరంలో కలిసి పోయినట్టు ఉండకూడదు. ముద్రణలో ముద్దగా పడకూడదు. కుదురుగా ఉండాలి. ఎన్ని వందలసార్లు రాసినా ఆ అక్షరం అలాగే ఉండాలి.
పత్రిక పేరు చూడకుండా కిందెక్కడో చూస్తే ఇది ‘సాక్షి’ అక్షరం అనిపించవచ్చు. లేదు, ఇది ఫలానాది అని గుర్తుపట్టొచ్చు. ఏ పత్రికకు కావాల్సినట్టుగా అలా భిన్నంగా రాయడం టైపోగ్రాఫర్ పని. దాన్నే శ్రీధరమూర్తి చేస్తారు. సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త, ప్రజాశక్తి , నమస్తే తెలంగాణా పత్రికల్లో మీరు ఉదయాన్నే చదువుతున్న అక్షరాల్ని ఆ రూపంలో చెక్కింది ఈయనే. చాలా మంది దిన పత్రికల్లో ఉపయోగించేది ఏ అను ఫాంట్స్ అనుకుంటారు, ఎంత మాత్రమూ కాదు. ప్రతీ పత్రికకు ఒక ప్రత్యేక ఫాంట్ ను ఉపయోగిస్తారు.

అడుగులు పడిందెపుడు?
పదో తరగతి సమయంలోనే సొంతంగా సంపాదించాల్సి వచ్చింది. సంపాదించాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇంట్లో నీలం, నలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు పెన్నులు, స్కెచ్ లుండేవి. వాటితో రకరకాలుగా పేర్లు రాసేవాడు. రాయగా రాయగా వాటి పై ఆసక్తి పెరిగింది. సంపాదనకు అదే దారిలో పయనిస్తే బాగుంటుందన్న ఆలోచనతో సైన్ బోర్డులు రాయడం మొదలు పెట్టారు. నీలి మందు తీసుకోవడం, గోడల్ని అక్షరాలతో నింపడం, సున్నం వేయడం. రోజూ ఇదే ప్రాక్టీసు. ఖమ్మం పటణంలో ఎన్నో గోడలపై, షాపులపై ఆయన రాతలే కనిపించేవి. 1988లో  హైదరాబాద్ జేఎన్టీయూలో బి.ఎఫ్.ఏ. (పెయింటింగ్) , 1990 లో ఎం.ఎఫ్.ఏ.(గ్రాఫిక్స్) బరోడ యూనివర్సిటిలో పూర్తిచేసారు.  అనేక సంస్థల్లో పనిచేస్తూనే డిజైనింగ్ ప్రపంచంలో అప్డేట్ అవుతూ వచ్చాడు. తెలుగు పత్రికల్లో అక్షరాల రూపంలో దాగుండిపోయారు. తెలుగే కాదు ఆయన అక్షర ప్రేమ ఎంతటిదంటే మరాఠీ, ఒరియా, బెంగాలీ, తమిళం, మలయాళం లాంటి అనేక భారతీయ భాషలు శ్రీధరకు తెలుసు. ఇంకో భాషను కేవలం నేర్చుకోవడం కాదు, అందులో ఒక అక్షరాన్ని డెవలప్ చేయాలంటే దానికి తగిన కమాండ్ ఉండాలి.
నాగాలాండ్ లోని కొన్ని లిపి లేని తెగలకు కూడా ఆయన కొత్త లిపిని సృష్టించారు. పలక లేకుండా పిల్లలకు ప్రాంతీయ భాషల అక్షరమాలను నేర్చుకునే సరికొత్త పద్ధతిని రూపొందించాడు.
ఫాంట్ రూపకల్పనతో పాటు డిజైనింగ్ లోనూ సరికొత్త పోకడలు ప్రవేశపెట్టాడు శ్రీధర్. హ్యాండిల్ తో సహా ఎక్కడా ప్లాస్టిక్, నైలాన్ వాడకుండా పేపర్ బ్యాగుల తయారీ పద్ధతిని కనిపెట్టారు. దీనికి మేధో హక్కులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు.

ఖమ్మం టు డబ్లిన్ !
ఖమ్మం గోడల మీద రాతలు రాసిన శ్రీధరమూర్తి ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించడానికి ‘అసోసియేషన్ ఆఫ్ టైపోగ్రఫీ ఇంటర్నేషనల్’ ఐర్లాండ్ రాజధాని డబ్లీలో నిర్వహించిన ‘ది వర్డ్ – 2010’ సదస్సుకు హాజరయ్యారు. ఇంగ్లీష్ నేర్పే పద్ధతిలోనే మాతృభాషలు నేర్పుతున్నందు వల్ల అది భారతీయ ప్రాంతీయ భాషల పిల్లలపై చూపే దుష్ప్రభావాల గురించి మాట్లాడారు. లిపి ముద్రణ, ఫాంట్ లోపాల కారణంగా భారతీయులు తమ సొంత భాషలకు ఎలా దూరమవుతున్నదీ విశ్లేషించారు.

శ్రీధరమూర్తి ప్రస్తుతం హైదరాబాద్ నిఫ్ట్ లో గెస్ట్ ఫ్యాకల్టీగా, సింబియోసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, పూనే నందు విజిటింగ్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నారు. ముద్రిక అనే సంస్థను స్థాపించి టైపోగ్రాఫర్ గా, గ్రాఫిక్ డిజైనర్ గా ముద్రణారంగంలో తన సేవలను అందిస్తున్నారు. శ్రీధరమూర్తి గారు దేశంలోని అనేక ఆర్ట్ గ్యాలరీలలో తన చిత్రాలను ప్రదర్శించారు.

-కళాసాగర్ యల్లపు

________________________________________________________________________

ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.

4 thoughts on “పత్రికాక్షర ఘంటం – శ్రీకంఠం

 1. నేను అనేక పత్రికలకు లోగోలు తీర్చిదిద్దుటలో శ్రీకంఠ శ్రీధర మూర్తిమత్వమే నాకు స్ఫూర్తి.
  * మంచి ఆర్టికల్ ఇచ్చినందుకు
  సాగరా..మీకివే నా నమస్సులు.
  – శ్రీధర్ అక్కినేని.
  ( ఆర్టిస్ట్ ‘- జర్నలిస్ట్ )

 2. ధన్యవాదాలు కళాసాగర్‌ గారూ…
  మరింత మంది కళాకారులను, వైవిధ్య భరితమైన సృజనకారులను ఈ వేదికపైన పరిచయం చేస్తూండండి.
  Sridhara Murthy Srikantham 9246337890

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap