- విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం
స్వాతంత్ర్యోద్యమంలో తమ సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్యపరిచి ముందుకు నడిపించారని, సమాజానికి సాహితీవేత్తలు దిక్సూచిలాంటి వారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ ఆదివారం(06-03-22) విజయవాడలోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సుప్రసిద్ధ రచయిత శ్రీరామకవచం సాగర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ సెల్ ఫోన్ల వచ్చాక రానురాను పుస్తక పఠనం తగ్గిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో చిన్ని నారాయణరావు లాంటి పెద్దలు ఫౌండేషన్ల ద్వారా కథల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సాహిత్యానికి పూర్వవైభవం తీసుకురావడానికి నడుంకట్టిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కవులు, రచయితలను గౌరవించేక్రమంలో ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందించడంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు.
రాష్ట్ర మైనార్టీల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఏండీ ఇంతియాజ్ మాట్లాడుతూ రచయితలను ప్రోత్సహించేవిధంగా చిన్ని నారాయణరావు ఫౌండేషన్, మల్లెతీగ సంయుక్తంగా ప్రత్యేకంగా కథల పోటీలు పెట్టడం అభినందనీయమన్నారు. సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వడానికి కవులు, రచయితలు తమ వంతు కృషిచేస్తున్నారని కొనియాడారు. చిన్ని నారాయణరావు తమ ఫౌండేషన్ ద్వారా కవులు, రచయితలను మరింత ప్రోత్సహించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ సాహిత్యంపైన గాని, సాహిత్యానికి సంబంధించిన ఒరవడిపైగాని అంత ప్రజ్ఞ లేనప్పటికి ఒక ఉత్తేజపూరితమైన, ఒక ఉద్వేగభరితమైన ఆలోచనలైతే మాత్రంలో మనసులోకి వస్తున్నాయి.. అందుకేనేమో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచించి తనను కూడా మీలో.. మీ వాసనలు, మీ పరిమళాలకు దగ్గరగా ఉండేటట్టుగా విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించే గ్రంథాలయానికి చైర్మన్ హోదాలో నియమించినట్టుగా భావిస్తున్నానని చెప్పారు. సాహిత్యాన్ని సమాజానికి అందించే మీలాంటి వారి మధ్య ఈ రోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడాన్ని నేనొక అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తాను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలకు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. రాబోయే కాలంలో మీ ఆలోచనలను, మీ ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకుని సమాజానికి ఇంకా దగ్గరగా తీసుకువెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.
అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ కథారచనలపై ప్రముఖ రచయితలను ఉదహరిస్తూ సోదాహరణంగా మాట్లాడారు. కథాసాహిత్యం అభ్యదయ పథాన్ని వీడి జరగలేదని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో సాహిత్యానికి విలువ తగ్గిందా.. అవకాశం తగ్గిందా… అనే పరిస్థితుల్లో మల్లెతీగ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా కథల పోటీలు నిర్వహించడం తద్వారా రచయితలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ టి.జమలాపూర్ణమ్మ, చిన్ని నారాయణరావు ఫౌండేషన్ చైర్మన్ చిన్ని నారాయణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి నాగరాజు, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. తొలుత మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ అతిథులకు ఆహ్వానం పలికగా.. చొప్పా రాఘవేంద్రశేఖరావు కార్యక్రమ నిర్వహణను చేపట్టారు.
కథల పోటీల విజేతలు
మొదటి బహుమతి వాసంతి (సికింద్రాబాద్), మూడవ బహుమతి వడలి రాధాకృష్ణ (చీరాల), ప్రత్యేక బహుమతులు బాలి (విశాఖపట్నం), జిల్లెళ్ల బాలాజీ (తిరుపతి), తటవర్తి నాగేశ్వరి (కొవ్వూరు)లకు అతిథులు అందజేశారు. ఇక రెండవ బహుమతి సృజన్ సేన్ (హైదరాబాద్), ప్రత్యేక బహుమతులు విహారి (హైదరాబాద్), సింహప్రసాద్ (హైదరాబాద్), శరత్ చంద్ర (హైదరాబాద్), బళ్ళా షణ్ముఖరావు (విశాఖపట్నం), వియోగి (కర్నూలు), టి.తిప్పారెడ్డి (మదనపల్లి), జ్యూరీ బహుమతి శైలజామిత్ర (హైదరాబాద్)లకు త్వరలో అందజేస్తారు.
ఉగాది ప్రత్యేక పురస్కార గ్రహీతలు
చిన్ని నారాయణరావు ఫౌండేషన్ ఉగాది ప్రత్యేక పురస్కారాలను కవిసంధ్య సంపాదకులు డాక్టర్ శిఖామణి, సుప్రసిద్ధ రచయిత శ్రీరామకవచం సాగర్, సుప్రసిద్ధ కవి ఏటూరి నాగేంద్రరావు, నవమల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీలకు అతిథులు అందజేశారు. ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి చిన్ని నారాయణరావు ఫౌండేషన్ సౌజన్యం అందించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులకు సత్కారం చేశారు.
రచయితలకు మంచిప్రోత్సాహం
*అభినందనలు*