ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు

(హైదరాబాద్ రవీంద్రభారతి లో ఉగాది ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు ప్రదానం)
జర్నలిజం లో ఇప్పుడు విలువలు లేవు! ఉన్నత ప్రమాణాలు లేవు! జర్నలిజం ఒక వ్యాపారం! ఎవరి ఎజెండా వారిదే! ఎవరి పార్టీ కి వారు డప్పు కొట్టుకోవడమే! యాజమాన్యాలకు ఇష్టమైన జెండా లు మోయాల్సిందే! బాకాలు ఊదాల్సిందే! జర్నలిస్టులు ఏ ఎండకు ఆ గొడుగు పట్టాల్సిన దుస్థితి! బతుకు తెరువు కోసం మనసు చంపుకుని భారం మోయాల్సిన పరిస్థితి! అయినా సరే, అక్కడక్కడా మిణుకు మిణుకుమంటూ జర్నలిజానికి వెలుగు అందిస్తూనే వున్నారు కొందరు నిజాయితీ నిఖార్సు అయిన పాత్రికేయులు! దివిటీ పట్టుకుని జర్నలిజం విలువలు కాపాడుతూ వున్నారు! అలాంటి కొందరిలో ఆణిముత్యాలను వెతికి, అవకాశం వున్న వారిని, వీలు కల్పించుకున్న పాత్రికేయులను సన్మానించి స్ఫూర్తి అందించే అద్భుత ప్రయత్నం జరిగింది!

Journalists Puraskaram -2021, Hyderabad

శృతిలయ ఆర్ట్స్, సీల్ వెల్ కార్పొరేషన్, కోవిద సహృదయ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యం లో నిన్న (9-04-21 న) హైదరాబాద్ రవీంద్రభారతి లో ప్లవ నామ ఉగాది ఉత్తమ పాత్రికేయ పురస్కారాల ప్రదానోత్సవం కనుల పండుగగా జరిగింది. ఉగాది పండుగ ముందస్తుగా రవీంద్రభారతి వచ్చేసింది! వార్త దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ శ్రీ ఎ.వి.వి.ప్రసాద్, సాక్షి సీనియర్ న్యూస్ ఎడిటర్, సాగుబడి వ్యవసాయ పేజీ ఇంఛార్జ్ శ్రీ పంతంగి రాంబాబు, నమస్తే తెలంగాణ బతుకమ్మ అనుబంధం ఇంఛార్జ్ సీనియర్ చీఫ్ సబ్ ఎడిటర్ శ్రీ దోర్బల బాల శేఖర శర్మ, తెలంగాణ టుడే డిప్యూటీ ఫీచర్స్ ఎడిటర్ శ్రీమతి మాధురి దశగ్రంధి, హన్స్ ఇండియా అసిస్టెంట్ ఫీచర్స్ ఎడిటర్ శ్రీమతి అస్కరి జాఫర్, ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ శ్రీ గుజ్జుల రమేష్, ఈనాడు ముషీరాబాద్ జర్నలిస్ట్ శ్రీ ఎ.వి.నర్సింగరావు ప్లవ నామ ఉగాది ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను స్వీకరించారు. ఈ పురస్కారాల ఎంపిక కమిటి చైర్మన్ గా మహమ్మద్ రఫీ వ్యవహరించారు. ముఖ్య అతిధిగా తెలంగాణ మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ కె.చంద్రయ్య హాజరై, సమాజాభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర కీలకం అన్నారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు! మారిన కాలం లో ఇంకా నీతి నిజాయితీ జర్నలిస్టులు చాలా మంది వున్నారని అభినందించారు. ప్రముఖ సామాజికవేత్త, కోవిద సహృదయ ఫౌండేషన్ అధినేత్రి డాక్టర్ జి.అనూహ్య రెడ్డి మాట్లాడుతూ కరోనా క్లిష్ట సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా జర్నలిస్టులు అద్భుత సేవలు అందించారని అభినందించారు. లయన్ వై.కె. నాగేశ్వరరావు అధ్యక్షత వహించిన సభలో శృతిలయ సంస్థ చైర్మన్ డాక్టర్ బి.భీంరెడ్డి, ప్రముఖ నాట్య గురు డాక్టర్ ఎస్.పి.భారతి, నేనూ పాల్గొని జర్నలిస్టుల బాధ్యతలను గుర్తు చేసి ప్రశంసించడం జరిగింది. ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కార గ్రహీతలు తమ స్పందనలో వారి అనుభవాలు, అనుభూతులు పంచుకున్నారు.

ఈ సందర్భంగా “మావి చిగురు పలికేనా” శీర్షిక తో శ్రీమతి ఆమని ఆధ్వర్యం లో నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆద్యంతం వీనుల విందు చేసింది. ఆమని గారు అన్నీ తానే అయి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సచివాలయం న్యాయశాఖ లో ప్రత్యేక అధికారిగా పని చేస్తున్న శ్రీ లంకా లక్ష్మీనారాయణ అద్భుత వ్యాఖ్యానం తో రసవత్తరంగా సభా కార్యక్రమానికి వన్నె తెచ్చారు! సంగీత విభావరి కి శ్రీ తులసీ రామ్ వ్యాఖ్యానం చేసి అలరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap