
జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచః (భగవద్గీత ద్వితీయ అధ్యాయం 27 శ్లోకం)
…..అవును ఆతడు మరలా పుట్టిఉంటాడు…అతని కళ బ్రతికి ఉన్నంత వరకూ…!
కళాకారునికి మరణమే లేదు కదా!? మరి ఈ వర్ధంతి ఏమిటీ? అది కేవలం మనభౌతిక లోకాచారమే. ఆతడు జీవించియే ఉన్నాడు, నిజం, ఇది సత్యం. కానీ నేడు నిజ్జంగా ఆతడు క్షణాని కొకసారి క్షీణించి పోతున్నాడు, అవును, క్షణానికొక విధంగా కనుమరుగు అవుతున్నాడు, అవునా?- కాదా!!? ఆనాడు కాదు ఆతడు పంచభూతాలలో కలసిపోయినది!!. నేడు నిజమయిన లయ కృత్యం జరుగుచున్నది. నానాటికీ రామారావు గారి చిత్రారాజము లు కళ తప్పి కనుమరుగవుతున్నాయి. ఆయా చిత్రాలు మరీ మరీ మసకబారిన కళావిహీనంగా మారిపోతున్నాయి. ఇది నిజం కదా!? నేడు కీర్తిశేషులు దామెర్ల రామారావు గారి ఆర్ట్ గ్యాలరీ, మరియూ ఆతడు గీసిన చిత్రాల పరిస్థితి అంతటి క్షీణగతిలోనే ఉన్నాయి!, ఇది సత్యం…సత్యం…
కళ ఉన్నంత వరకు కళాకారునికి మరణమే లేదు అనే విషయం లోక విదితమే. కళాకారుని కృతులు జీవించి ఉన్నంత వరకు అతనికి మరణమే లేదు. అతని కళ అజరామరం అమరత్వాన్ని సంతరించుకుంటుంది.
అటువంటి అజరామరుడు కీర్తిశేషులు శ్రీ దామెర్ల రామారావు గారు మన తెలుగు జాతి ఉన్నంత వరకు మనం వేనోళ్ళ తలచవలసిన పేరు దామెర్ల రామారావు గారు. ప్రాతః స్మరణీయుడు ఆతని చిత్రకృతులు రాశికి గొప్పా!!? వాసికి గొప్పా!!? అని అడిగితే ఆ రెండు—- అతనికి అతనే గొప్ప. అతను గీసిన రేఖాచిత్రాలు వర్ణ చిత్రాల సంఖ్య చూస్తుంటే ఇంత చిన్న వయస్సుకే అంత ఎత్తుకు ఎదిగిన మేథ, అంత తక్కువ సమయంలోనే లెక్కకు అందనన్న చిత్రాలు గీసి ఒక స్థాయి రికార్డు ఆనాడే సృష్టించి, చిత్ర కళా జగత్తుకు దశ, దిశను సూచించ గలిగినవి ఆతని చిత్రాలు. రాజమండ్రి దామెర్ల రామారావు గారి Art Gallery అనేక సందర్భాలలో అనేక సార్లు నేను సందర్శించడం జరిగింది. తిండిబోతు తాయిలాలు దాచుకుని… దాచుకుని తిన్నట్లుగా చూసిన కొద్ది చూడాలనుకునే చిత్రాలు దామెర్ల వారి చిత్తరువులు. మరలా మరలా చూడాలనిపించే సౌందర్య ప్రజ్ఞగల చిత్రాలు వారు రచించారు.
వారి కాలం రాజారవి వర్మ…. చిత్రాల ప్రభావం బాగా ఉన్న రోజులవి. ఇంకా రాజులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు ఆతని చిత్రాల మోజులో ఆనందిస్తున్న కాలం. ఐరోపా చిత్ర ధోరణి వేళ్ళూరుకొంటున్న రోజులవి.
చిత్రకళా ప్రపంచం “isms” (వివిధ వివిధ కళా ధోరణలు) పేరుతో ఆధునిక చిత్రకళా ధోరణులు అనేక పుంతలు తొక్కుతున్న రోజులవి. అటువంటి రోజులలో మన భారతీయ చిత్రకళలో ఉన్న రేఖా లాలిత్యము, రూప భేదము, లావణ్యం, వర్ణ సంయోజనము, భావం, తనదే అయిన శైలిని కలిగి ఉన్నది. మన భారతీయ చిత్రసౌందర్యం కళా సౌరభాన్ని విష్ణు ధర్మోత్తర పురాణ సారములో ఉన్న చిత్రసూత్ర వ్యాకరణ పద్ధతినే పరోక్షముగా రామారావు గారు అవలంబించిరి అనుటకు నాకు కొన్ని ఆధారములు కనబడుచున్నవి.
దామెర్ల రామారావు గారి వంటి మహా చిత్రకారుడు ఈ ప్రపంచానికి వెలుగు కావాలి అంటే A.S. రామ్ వంటి నాటక నేపథ్య దృశ్య చిత్ర కళాకారుడు స్ఫూర్తి కావాలి!
ఒక కళాకారుడు ఎదగాలంటే ఒక ఆస్వాల్ జే. కూల్డ్రే దొర వంటి కళా ప్రోత్సాహకుడు కావాలి, ఒక కళాకారుని చిత్రాలు తన తదనంతరం బ్రతికి బట్ట కట్టాలంటే లేదా ప్రదర్శనా యోగ్యత పొందాలంటే ఒక వరదా వెంకట రత్నం వంటి ఆత్మీయ మిత్రుడు సహృదయ సహకారం కావాలి, అదే కళాకారుడు నిత్యం ఆరాధించబడాలి అంటే మోదేటి రాజాజీ వంటి కళారాధకుడు కావాలి. ఇటువంటి కళారాధకులు ఎందరో రాజమండ్రి చుట్టు ప్రక్కల కళాభిమాని, కళాపోత్సాహకుడు మాదేటి రవిప్రకాష్.. లాంటి కళ అంటే పిచ్చ వీరాభిమానులు కావాలి, కళ అంటే వెన్ను దన్ను గా నిలబడే మద్దూరి శివానందకుమార్ వంటి కళాపోషకుడు అంద దండగా నిలబడ గలగాలి, అప్పుడే ఆ కళ, కళాకారుడు ప్రపంచంలో అజరామరంగా చరిత్రలో నిలవగలరు.
ఆదే కళాకారుడు ఒక మహా వృక్షంగా ఎదిగి ఉంటే ఆతనినీ ఆలంబనగా చేసుకుని ఎదిగిన ఆ తరం కళాకారులు వరదా వెంకట రత్నం, బుచ్చి కృష్ణమ్మ, దామెర్ల సత్యవాణి, భగీరథి, ఆ కళాకారుడు ఒక మహా వృక్షం అయితే ఆతని నీడన ఆలంబనగా ఎదిగిన కళాకారులు తారా నగేష్, టేకి మృత్యుంజయరావు, దేవరకొండ మురళి, పద్మ, పి.యస్. ఆచారి, సత్యవాణి, నూకరాజు, యన్.యస్. శర్మ కొరసాల సీతారామస్వామి, ఉషారాణి, రాధారాణి పట్నాల, ఎల్లా సుబ్బారావు తదితర కళా విద్యార్థులు ఎందరో.. ఇంకెందరో!
రామారావు అనే వ్యక్తి చిత్రం ఒక పూనకం. ‘సౌత్ ఇండియన్ హవర్స్’ అనే పుస్తకం రాసిన కూల్డ్రే దొరగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను ఆర్ట్స్ కాలేజ్ కి ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తూనే బహు శాఖలలో అభిరుచులు కల్గిన వీరు ఒక చిత్రకారులు, సంగీతకారుడు, రచయిత, తెలుగు జానపద గీతాలను సేకరించే అభిరుచిగల ఒక అరుదైన కళాప్రవేశం కలవారు. ఇటువంటి కళాప్రేమి దృష్టిలో రామారావు గారు ఆనాడే సుస్థిర స్థానం సంపాదించారు.
కూల్డ్రే గారు 15 రోజులు పాటు రామారావుని అజంతా ఎల్లోరా ప్రాంతాలు సందర్శింపజేసి మన భారతీయ కళ పై మక్కువతో ఆతనిని భుజాల పై మోసి విద్య నేర్పిన ధన్యజీవి. భావితరం కళాకారునికి ఆతను ఇచ్చిన స్థానం తన భుజస్కంధములపై నిలిపి రామారావుకు ఆనాడే గరుడ సేవ చేసిన మహా కళా అభిమాని.
1916 జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో 3 వ సంవత్సరంలో చేరడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ముందే చేసి రామారావుకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన కూల్డ్రే దొరకు మన శుభాశయములు. J.J. కళాశాలలో విద్యాభ్యాసం తర్వాత రామారావు గారు సుమారు 1920 నాటికి భారత దేశంలో వివిధ ప్రాంతాలను సందర్శించటానికి పర్యటన సాగించి, జన జీవన విధానాన్ని అర్థం చేసుకోవటానికి తన Sketch books అన్నీ నింపుతూ వెళ్ళారు. ఈ పరిచయంలోనే 1921 లో కలకత్తా నగరంలోని కళాకారుల సాన్నిహిత్యంతో కళాచర్చలు జరిపినట్టు వినికిడి.
1922 న తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత చేసిన కళాకృషి భవ్య ప్రణాళికలతో రూపు దిద్దుకుంది. అప్పుడే కొన్ని చిత్రాలైన” ఋష్యశృంగ”, “తూర్పు కనుమలు”, పురాణ, ఇతిహాస చిత్రాలతో పాటు దృశ్య చిత్రాలు కూడా గీసి తనదే అయిన శైలిని విశిష్టమైన రీతిలో చిత్రించారు. ఇదే వయసులో సత్యవాణి గారితో వివాహం జరగటం వారి మధ్య మంచి స్నేహ సంబంధం ఏర్పడడం, ఆ తర్వాతి కాలంలో ఆవిడ రూపమే అతనికి మోడల్ గా ఉపకరించి అతని చిత్రకళా వ్యాసంగంలో దోహదపడింది.
‘ఆంధ్రా సొసైటీ ఆఫ్ ఇండియా’ అను చిత్ర కళా సంస్థను నెలకొల్పి తన ప్రణాళికలకు రూపం దిద్దుతూ నాయకత్వపు లక్షణాలను కలిగిన ఒక భవిష్యత్ దార్శకునిగా, మార్గదర్శిగా స్పూరించాడు.
భార్య సత్యవాణి, సోదరి బుచ్చి కృష్ణమ్మ, స్నేహితుడు వరదావెంకట రత్నం, చేమకూర సత్యనారాయణ వంటి సన్నిహితులతో తన కళాసృష్టి కొనసాగిస్తూ చేసిన కృషితో 1922-25 లోపు ఆతని జీవితంలో ఒక renaissance స్థాయి నెలకొల్పబదిండి.
వెంబ్లీ బ్రిటిష్ ఎంపైర్ ఎగ్జిబిషన్ లోనూ మరియు టొరంటో కెనడా జాతీయ ఎగ్జిబిషన్ లోనూ ప్రదర్శింపబడిన రామారావు గారి చిత్రాలు మన తెలుగు సంస్కృతిని ప్రతిబింపచేశాయి.
ఈ చిత్రాలను గమనించిన విదేశీ కళా ప్రియులు ప్రశంసల వర్షం కురిపించగా ఆనాటి వార్తా పత్రికలు, వార మాస పత్రికలు, మేధావి వర్గం వేనోళ్ళ కొనియాడారు.
ఇంతకూ వారి జీవితకాలంలో వారు గీసిన 34 తైల వర్ణ చిత్రాలు, 129 జల వర్ణ చిత్రాలు, 500 పెన్సిల్ తో రేఖా చిత్రాలు లభ్యమయ్యాయని అంచనా.
శ్రీమతి సత్యవాణి గారికి వైధవ్యం ప్రాప్తించినా తర్వాత కూడా సత్యవాణి గారు కీ.శే. శ్రీ రామారావు గారి స్పూర్తితో వారి మార్గాన్నే అనుసరించి ఎన్నో చిత్రాలకు ప్రాణం పోశారు.
“దేవ పుష్పము పరిమళించగా దాని సౌరభము తావికి కూడా అబ్బినట్టు” సత్యవాణి గారి చిత్రకళా రచన వారి జీవిత కాలము చిత్రరచన కొనసాగింది.

చిత్ర విశ్లేషణ:
ప్రతి చిత్రానికి composition values acdemic studies లో ఒక ప్రక్రియ.
పాశ్చాత్య చిత్రకళా రచనలో శరీరాన్ని ఒక రక్త మాంస కండరముల కూర్పుతో శరీరాన్ని కంటికి కనిపించే బాహ్య సౌందర్యాన్ని చిత్రం ద్వారా వ్యక్త పరచటం ఒక పాశ్చాత్య academic చిత్ర రచనా పద్ధతి.
అదియును కాక చిత్ర రచనా విషయాలను (subject) వివరించునప్పుడు మన ఎదురుగా ఉన్న దృశ్యాన్ని యధాతథంగా వెలుగు నీడలను ఆశ్రయించి రచించడం రచనా పద్ధతి.
Human figure అయితే model studies చేసినట్లు “బావి వద్ద” అనే చిత్రానికి, “సిద్ధార్థ రాగోదయం”, “శ్రీమంతం” అనే చిత్రాలకు సంబంధించిన ప్రతి పాత్రని కూడా model ను వాడినట్లు, అవి కూడా ఒకే model ను వాడినట్లు కనిపిస్తుంటుంది.
ఆ వాడిన model కూడా శరీరము చక్కని కొలతలతో ఉన్నట్లు 16 నుండి 20 వయస్సులో ఉన్న model నే వాడినట్లు మరీ శరీరాన్ని కామోద్రేకతతో లేకుండా సౌందర్యమే ప్రస్పుటమయ్యేటట్లు శరీరంలోని భంగిమను లాలిత్యపూర్వకంగా నిలుచుండబెట్టి, కూర్చుండబెట్టి ముందు, వెనుకలకు కూడా రూపం అవగాహన కోసం చేసిన study గానే కనిపిస్తాయి. ఆతని చిత్రంలో గాని భంగిమలో గాని దేహ సౌందర్యంలో అశ్లీలత పోటమరించకుండా ఉండేటట్లు జాగ్రత్త పడ్డాడు శ్రీ రామారావు గారు.
ఒక మహిళను చిత్రించేటప్పుడు classical form శాస్త్రీయ రూపానికే కట్టుబొట్టులు సంప్రదాయ రీతికి అద్దం పట్టేలా జాగ్రత్త పడ్డాడు చిత్రకారుడు.
ఇక రామారావు గారి చిత్రంలో తను చిత్రించిన పరిసరం కూడా తాను study చేసిన landscape study నుండే ఎక్కువగా reference తీసుకుని resketch చేశారా అన్నట్లు కొన్ని చిత్రాలు ఉన్నాయి.
“నూతి వద్ద” water colour చిత్రంలో కొంచెం proportions crowded composition గా చిత్రించిన చిత్రాలలో character ప్రతీది కూడా ప్రతి ఒక్క పాత్రను study చేసి శరీరాకృతిని model తీసుకుని దానిపై సంప్రదాయ దుస్తులు ధరింప చేసినట్లు అనిపిస్తుంది వారి చిత్రరచన పద్ధతి. ప్రతి చిత్రం గురించి ఇలా వివరించుకుంటూ పోతే ప్రతి చిత్రానికి వారు గీసి follow అయిన scribles గాని, sketches గాని compositional values గాని చాలా చాలా చేసి ఉండాలి అని నా ఊహ.
భగవంతునకు కూర్చిన కూర్పులా రామారావుగారికి దొరికిన సరిజోడు సత్యవాణి గారు. చాలా చిత్రాలకు facial features లో సత్యవాణి గారే అన్నట్లు ఆ చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ముఖ్యంగా ” పెండ్లి కూతురు” “శ్రీమంతం” వంటి చిత్రాలలో ఒకే model అనేక రూపాలలో సాక్షాత్కరిస్తున్నట్లు ఉంటుంది.

జల వర్ణ చిత్రాలు మరియు నాటి వర్ణ చిత్రాలు అన్నీ కుడా పోటీపడి ఏ మాధ్యమానికి కట్టుబడకుండా యధేచ్చగా చిత్రిస్తూ ఒక ప్రణాళికాబద్దమైన చిత్రరచన చేసి చిత్రకళా జిఙ్ఞాసులకు మార్గం చూపించారు.
“ఇతడు భారతీయ చిత్రకళకు మార్గదర్శకుడు” అని సూచించటానికి ఈతను వేసిన రేఖా చిత్రాలే పరిశీలనగా గమనిస్తే అర్థమౌతుంది.
అజంతా, ఎల్లోరా చిత్రాల తరువాత అటువంటి ఆహార్య సాంప్రదాయ కట్టుబొట్టులను కొన్ని జలవర్ణ, తైల వర్ణ చిత్రాలలో స్పష్టంగా పొందుపరిచారు. అజంతా వంటి చిత్ర శైలి, స్థంభాలు, వాస్తు రీతులు, పరదాలు, డేరాలు. స్థంభాల మధ్య ఉన్న gapsను, fabric walls లేదా curtains తో పూరించి ఆనాటి విధానాన్ని పునఃస్థాపితం చేసినట్లు ఎన్నో చిత్రాల్లో స్పష్టం చేశాడు.
ఇక అజంతా fabrics లోని designs తను చిత్రించిన పాత్రలకు కట్టిన బట్టలలో, అలంకారాలలో మండప designs లో కూడా తను చిత్రించి, ఆ ప్రాచీన ప్రజా జీవన విధానాన్ని చెప్పకనే చెప్పియున్నాడు.
ఒక మహిళా నర్తకి నాట్య భంగిమను వెనుకకు తిరిగి వయ్యారంగా నర్తిస్తున్న చిత్రంలో కదలికలను body rythm ద్వారా తను moment ను కల్పించి అదే చిత్రాన్ని ఎన్నో చిత్రాలలో repeat చేసి తన నిర్దిష్టమైన చిత్ర శైలిని అందించాడు. అయితే నిశితంగా పరిశీలిస్తే కేవలం వెలుగు నీడలకే ప్రాధాన్యతనీయకుండా రేఖా లాలిత్యానికి ప్రాధాన్యత కల్పించి సున్నితమైన లేత రంగులలో చిత్రాన్ని అలంకరించాడు.
Comparative study with west: వెర్మియర్ యూరోపియన్ చిత్రకారుడు, ఇతని జీవితం మొత్తం అద్భతమైన అవగాహనతో గీసిన చిత్రాలలో లభ్యమౌతున్నవి 17 మాత్రమేనట. కాంతి సంయోజన అనే అంశాలకు ప్రాధాన్యతనిచ్చి గీసిన అద్భుత కళా ఖండాలు అవి. అలానే లియోనార్డో డావిన్సీ కూడా అమిత మేధతో వివిధ రంగాలలో ప్రయోగాత్మకమైన అంశాలను సాధిస్తూ చిత్రకారుడిగా కూడా Renaissance period లో ధృవ తారగా నిలిచాడు.
ఇతడు కూడా చాలా తక్కువ వర్ణ చిత్రాలు గీసినా ఆ అద్భుత చిత్రాలకు ఎన్నో drawings చేస్తూ వర్ణ చిత్ర రీతిని పరిపుష్టం చేశారు. ఏ చిత్రాన్ని తీసుకున్నను వాటిలోని పాత్రలను (characters) విశదీరీకిస్తూ ఆ పాత్రల శరీర సౌష్ఠవాన్ని, శరీర విన్యాసాన్ని, ముఖ కవళికలను, హస్త-పాద అమరికలను మరియు వస్త్రాలంకరణలను అభ్యసిస్తూ (study of drapery), ఎన్నో రకాల రేఖా చిత్తు చిత్రాలు నిర్మించేవారు. ఇది western academic పద్ధతిలో ఒక అంశం.
అయితే అదే పద్ధతిని దామెర్ల వారు అవలంభించినట్లుగా ప్రతి చిత్రానికి వివిధ రేఖా చిత్రాలు, రేఖా చిత్తు చిత్రాలు వివిధ భంగిమలలో చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా nude model study చేస్తూ తత్సంబంధిత పాత్రకు వస్త్రాలంకరణ (drapery), కేశాలంకరణ మరియు ఆభరణాలు గీసి ఉన్న బహుళమైన రేఖా చిత్రాలను ఆ gallery collectionను నేను చూసిన పిదప అర్థమైంది.
ఆతని ప్రణాళిక నిర్దిష్టమైన చిత్ర రేఖా విన్యాసం ఘనమైన ప్రణాళిక “ఇది ఇలానే” అనే నిబద్ధతతో కూడిన అభ్యాస ప్రక్రియ. చక్కని ప్రణాళికాబద్దమైన అభ్యాసం అతని శైలి
ఇందులో భారతీయ చిత్ర సూత్రాన్ని చెప్పకనే చెప్పుచున్నాడు చిత్రకారుడు.
అమృతా షేర్గిల్ వంటి కళాకారిణి కూడా European academic systemను అభ్యసించినా కూడా ఆఖరుకు తన స్వదేశానికి తిరిగి వచ్చి భారత్ ను పర్యటించి అజంతా, ఎల్లోరా వంటి చిత్రాలను గమనించి ఆ తర్వాత తన సొంత బాణీని అనుసరించినట్లే దామెర్ల వారు కూడా ఎంత European Academy studies నీ J.J. school లో విద్యాభ్యాసమును అభ్యసించిననూ అనంతర కాలములో దేశాటన వంటి భారత ముఖ్య ప్రాంతాలను సందర్శించి భారతీయ మూలాలను అన్వేషిస్తూ తర్వాత 3 సంవత్సరాల కాలములో తాను చేసిన కృషి భారత చిత్ర సూత్ర లక్షణాలను వ్యక్తం చేయటానికి ప్రయత్నించిన ప్రయత్నంగా తన జీవిత పర్యంతం చేసిన కృషి సాక్షిభూతంగా నిలిచింది.
E.B. Hebbel గారి సూచనలు అనుసరించి అవనీంద్రనాథ్ ఠాగూర్ విదేశీ మాధ్యమాలను ప్రక్కన పెట్టి స్వదేశీ జలవర్ణ మాధ్యమాలను ఆలంబనగా చేసుకుని భారతీయ చిత్ర శైలిని ఎలా అనుసరించారో అలానే కూల్డ్రే దొరగారి సూచనల మేరకు రామారావు గారు భారత సాంసృతిక శాస్త్రీయ జానపద శైలులను కూలంకుషంగా అధ్యయనం చేసుకుని తనవంతు సహకారంగా భారతీయ చిత్ర లక్షణాలను ప్రయోగాత్మకంగా నిరూపించటానికి ప్రయత్నం చేసినట్లుగా ఆతని (sketches) రేఖా చిత్రాల ద్వారా, జలవర్ణ చిత్రాల ద్వారా మనకు తేటతెల్లమవుతోంది.
శ్రీ రామారావుని నిస్వార్థ జీవి ఎలా అంటే తను విద్య నేర్చుకొని దేశాటన చేసి అనుభవాన్ని గడిచి తను నేర్చిన విద్యను నిస్వార్థంగా తన మిత్రులతో సంప్రదించుకుంటూ వారిని కూడా ప్రభావితం చేస్తూ ఎదిగిన, ఎదగాలనుకుని ఆంధ్రా చిత్రకళా సమాజాన్ని ఏర్పరచి తనతో పాటు తనతోటి వారు కూడా ఎదగాలని కోరుకుని ఈ రాజమహేంద్రిలోనే తన చిత్ర రచన కొనసాగించాడు. అతను స్వార్థపరుడే అయితే తన ఎదుగుదలను చూసుకుని పైపై పోకడలతో ఇతర ప్రాంతాల ప్రభావం పొంది అన్య వ్యవస్థాపూరితమైన జీవితం సాగించేవాడు కదా. కనుకనే తానీ దేశమంతా పర్యటించినా కూడా చివరకు తన ప్రాంతానికే పరిమితమై ఇక్కడ నుండే తన కళా వ్యాసంగాన్ని కొనసాగించి స్వచ్ఛమైన తెలుగువానిగా బ్రతికి మనకు మార్గ దర్శకులైనారు.
కాలిపారాణి ఆరని ఆ పెళ్ళికూతురునే, తన స్నేహితురాలుగా మైత్రిసలిపి model గా ఎన్నో చిత్రాలలో చిత్రించి ఆమె రూపాన్ని ఆరాధించిన ప్రేమజీవి కళారాధకునిగా ఆరాధించిన ధన్య జీవి. చిత్రకళయే తపస్సుగా ఉపాసించి సిద్ధత్వమును పొందిన సిద్ద పురుషుడు. ఆ సిద్ధత్వములోని ఆ నటరాజ కృత్యములలో ఐక్యమైన ముక్తి సాధకుడు. కళాస్రష్ఠ శ్రీ దామెర్ల రామారావు న భూతో న భవిష్యతి.
వీరి ప్రభావముతోనే అయిస్కాంతము ప్రక్కన ఉన్న ఇనుప ముక్కకు కూడా అయిస్కాంత తత్వం అబ్బినట్టు బుచ్చి కృష్ణమ్మ కూడా సోదరుని మార్గమే అనుసరించి చిత్రకళా చరిత్రలో తాను కొన్ని పేజీల చరిత్రకు పాత్రురాలైనారు.
వరదా వెంకట రత్నం వంటి ప్రాణ స్నేహితుడు ఉండగా రామారావు గారి చిత్రాలకు మరి లోటు ఏమి ఉండదు.
రామారావు గారి చిత్రాలు వరదా వారి రక్షణలో లక్షణముగా ఆనాడు ప్రదర్శనకు యోగ్యమగుట వరదా వారి అకుంఠిత దీక్ష, పట్టుదల, త్యాగము, స్నేహశీలతకు నిదర్శనము. ఆ తర్వాత తరములో ఆచార్య రాజాజీ గారి పర్యవేక్షణలో ఆర్ట్ గ్యాలరీ మరియు చిత్ర కళా బోధనా సంస్థగా రామారావుగారి చిత్రాలు ఒక యూనివర్సిటీ syllabus లా బోధించబడ్డాయి.
ఈ రామారావు అనే వటవృక్షం కింద సేదతీరిన కళా విద్యార్థులు తారా నగేష్, టేకి మృత్యుంజయ రావు వంటి వారెందరో రాజమండ్రి ప్రాంతానికి ఇటువంటి ఆరోగ్యకరమైన కళావాతావరణం ఏర్పడటానికి దోహదపడిన శ్రీ రామారావు గారి ఆశ్రయము చిత్రకళా రంగానికి ఒక పట్టుకొమ్మ.

అనుకోకుండా ఆ భగవంతుని అనుగ్రహం తటస్థించిన అవకాశంగా మరలా రామారావు గారి గ్యాలరీలోని చిత్రాలు sketches కొన్ని చూడటం జరిగింది. అయితే నేను వీక్షించిన మొదటి నాటి నుండి నేటి వరకు గ్యాలరీలోని చిత్రాలు తమ కళను కోల్పోతూ మసకబారుతూ తన భవ్యత క్షీణదశకు చేరుతున్నట్లు వ్యక్తిగతంగా నాకనిపించింది. ఇలాంటి ప్రముఖమైన చిత్రకారుడి చిత్రాలకే రక్షణలేనట్లుగా భావించాను. ఈ ఆధునిక జీవన విధాన ధోరణిలో కొట్టుకుపోతూ భావి చరిత్రను మరిచే ప్రమాదం భావి తరాలకు చరిత్ర అనే పుటలు చెరిగిపోయి మన చిత్రకళా సంస్కృతిని మరిచిపోయే ప్రమాదం ఉంది. కనుక నేటికైనా తత్సంబంధిత అధికారులు, కళాకారులు, కళాభిమానులు, కళా ప్రేమికులు ఈ విషయమై తగు జాగ్రత్తలు పాటించి జాతి సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఇప్పటికే కళ తప్పిన చిత్రాలెన్నో, చిరిగిపోయిన కాన్వాస్ లు ఎన్నో, మాయమైన చిత్ర కృతులెన్నో, మిత్రులారా గమనించారా !!?
మీ రాయన గిరిధర గౌడ్
కళావైభవాన్ని …. కాపాడుకోవలెనన్న దీక్షాదక్షతలు
పాలకులకు, కళాకారులకు ఉండి తీరాలి!
గొప్ప కళాకారుల జీవిత చరిత్రను మన పాఠ్యాంశాల్లో చేర్చాలి!! గ్రంథాలయాలు ఎలా ఏర్పాటు చేసుకున్నామో, గ్యాలరీలు కూడా అలా ఏర్పాటు చేసుకోవాలి!!! చరిత్ర చెరపివేయలేనిది!! చరిత్రకు
సాక్షి చరిత్రే అవుతుంది….కళలు లాగే కళాకారుల జీవితాలు కూడా….అజరామరమైనవి!!
ఈ కాలంలో రాయన గిరిధర గౌడ్ గారు మన మిత్రులకు దొరకడం ఒక వరం. వారి సలహాలను పాటించి మిత్రులమందరం కలిసికట్టుగా దామెర్లవారి సంపదను కాపాడుకుందాం🙏
తప్పని సరిగా చెయ్యాలి