చిత్రకళా తపస్వి వడ్డాది పాపయ్య

(శ్రీకాకుళం జిల్లా వాసి, స్వర్గీయ వపా గారి తొలి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి దివిలి అప్పారావు గారి అభిప్రాయం)

నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో శ్రీకాకుళం పెట్రోమాక్స్ వీధిలో వపాగారు నాకు తారసపడినపుడు, ఆ చిత్రకళా తపస్వికి వినమ్రంగా నమస్కరించేవాడిని. శిల్పకళలో నాకున్న ఆసక్తిని వారికి తెలియజేయగా చదువు పూర్తిచేసిన తరువాత కళలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టమని వారిచ్చిన సలహా మరియు వారందించిన అమృత ఆశీస్సులు నా విద్యారంగ అభివృద్ధికి, శిల్ప కళలో ఎదుగుదలకు ప్రేరణగా నిలిచాయి.

వపా గారి మరణానంతరం శ్రీకాకుళం నగరంలో నాగావళీ నదీతీరాన INTACH వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తేజోమూర్తుల విగ్రహాలలో నేను చేసిన ‘వపా’గారి విగ్రహం నాకు ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టింది. ‘వపా’గారి మొట్ట మొదటి విగ్రహం రూపొందించే అవకాశం నాకు రావడం నా అదృష్టం, ఈ వషయంలో మిత్రులు శ్రీ సుంకర చలపతిరావు గారి సహకారం మరువలేనిది. పవిత్ర నాగావళీ నదీ తీరాన, శ్రీకారంతో ప్రాకారం కట్టుకున్న శ్రీకాకుళంలో శ్రీమహాలక్ష్మి, రామ్మూర్తి దంపతులకు పాపయ్యగారి జననం చిత్రకళలో ఒక నవోన్మేషనం. చేయి పట్టి నడక నేర్చిన తండ్రే, కుంచె పట్టించి చిత్ర లేఖనంలో ఓనమాలు దిద్దించారు. వపాగారి చిత్రకళారంగ ప్రవేశం హనుమంతుని వర్ణ చిత్రంలో ప్రారంభమై, పౌరాణిక ఘట్టాలలోని అనేక కీలక వర్ణ చిత్రంలో ప్రారంభమై, పౌరాణిక ఘట్టాలలోని అనేక కీలక సన్నివేశాలు, పాత్రలను కమనీయంగా కాన్వాస్ పై తీర్చిదిద్దారు. తన చిత్రకళలో ఎక్కువగా ఆథ్యాత్మిక నేపధ్యమున్న చిత్రాలను గీయడం వెనుక, తన తండ్రి చిన్నతనంలో ఆసక్తిగా బోధించిన భాగవత కథలు ప్రభావం కనిపిస్తుంది. రవివర్మ చిత్రాలతో ప్రభావం కనిపిస్తుంది. రవివర్మ చిత్రాలతో ప్రభావితమై రంగులు మేళవింపులో వపా ఒక కొత్త అధ్యాయం లిఖించారు.

చిత్రకళలో ఒక విన్నూత్న శైలి పాపయ్యగారిని చిత్రకళా ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలిపింది. శక్తివంతమైన మొనదేలిన రేఖలు, ఒంపుసొంపుల గీతలు, వాటిలో మేళవించే రంగులు వపాకే ప్రత్యేకం. పల్లె పడుచును వేసినా, పౌరాణిక
ని వేసినా… పాపయ్య కల్పనా చాతుర్యం వర్ణణాతీతం. రతీమన్మధులు, నాగేశ్వరుడు, అర్ధనారీశ్వరులు, మొగలలో మొగ, శివమోహిని, మబ్బు – మధుర భావన, అమృత కామిని వంటి ఎన్నో మైమరిపించే చిత్రాలు చిత్రకళాభిమానుల హృదయఫలకాలపై చిరస్థాయిగా నిలిచాయి.

ముఖ్యంగా స్త్రీల యొక్క సౌందర్యం, శరీరసౌష్టవం, అలంకరణ, కనులలోని హవభావాలను నయనమనోహరంగా చిత్రించడంతో దిట్ట వపా. దేవతా మూర్తులు సైతం వపా కుంచెతో ఒదిగి కొత్త రూపును సంతరించుకున్నామనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
వపా చిత్రకళా వైభవాన్ని గుర్తించిన రేరాణి, అభిసారిక పత్రికల యజమాన్య మొదటిసారిగా వపా బొమ్మలను వారి పత్రికల ముఖ చిత్రాలుగా ప్రచురించుకొని, పాఠకుల దృష్టిలో విశేష ప్రజాదరణ పొందాయి. పాపయ్యగారి చిత్రాలను చూసి ముగ్ధులైన ప్రముఖ చిత్ర నిర్మాత చక్రపాణిగారు, వపాను మద్రాస్ పిలిపించుకొని చందమామ, యువలకు ముఖ చిత్రాలను వపా గారిచే వేయించారు. వపాగారి చిత్రాల వలన చందమామ, యువ పత్రికలు దక్షిణ భారతదేశంలో ప్రముఖ సంచికలుగా నిలిచియి. ప్రముఖ వారపత్రిక స్వాతి నేటికీ వపాగారి చిత్రాలను ముఖ చిత్రాలుగా ప్రచురిస్తుండటం వపా చిత్రాలకు ఉన్న ప్రజాదారణకు ఒక నిదర్శనం.

సంగీత, సాహిత్యాలపై ఆయనకు ఉన్న మక్కువ తన చిత్రకళలో ప్రతిబింబించేది. రాగాలకు, ఋతువులకు రూపాన్ని ఇచ్చిన చిత్రకళా శిఖరం వపా, ప్రచారానికి ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, చిత్రకళా వినీలాకాశంలో ప్రకాశించిన చిత్రకళా సూరీడు మన వపా. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో, చిత్రాలను అద్భుతంగా మలచడంలో వారి ఊహశక్తి అనన్య సామాన్యం. అనుకరణకు కూడా సాధ్యంకాని శైలి, ఊహలకు కూడా అందని రూపాలు, చిత్రాల కూర్పు, రేఖల జిగిబిగి కళాభిమానులకు ఊపిరి బిగబిట్టనిస్తాయి. చిత్రకళా శిఖరాన శ్రీకాకుళం మరియు ఆంధ్రదేశ్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన చిత్రకళా ధురంధురుడు మన ‘వపా’.

Divili Apparao

కళారత్న
దివిలి అప్పారావు (శిల్పి)
M.A.,M.Ed., M.Phil.,
శ్రీకూర్మం గ్రామం,
శ్రీకాకుళం జిల్లా

(పైన ఫోటో దివిలి అప్పారావు గారితో వపా గారి కుమారుడు వడ్డాది రవిరాం)

SA:

View Comments (1)

  • ఆహా, గొప్ప చిత్రకారుడు మన తెలుగునాట జన్మించడం మన అదృష్టం..ఆయన విగ్రహ రూపకర్త గారికి జన్మధన్యం, అసలు ఛాయాచిత్రం కూడా ఉంటే పోస్ట్ చేయండి...