వాడుకలో గంధర్వ గాయకులున్నారు గాని, గంధర్వ చిత్రకారులు లేరు. అలాగే పురాణ ఇతిహాసాలలో దేవతలకు విశ్వకర్మలాంటి శిల్పాచార్యులు, నాట్యాచారులు వున్నారు గాని, చిత్రాచార్యులు లేరు. బహుశా ఈ పదాలు పుట్టేనాటికి చిత్రకళ అంతగా బాసిల్లి ఉండక పోవటం కారణమనుకుంటాను.
ఏది ఏమైనప్పటికీ గడిచిన మూడు తరాల వార్కి, అందున చిత్రకళాభిమానులకు పరచయం అవసరం లేని పేరు “వపా”. ఆయనకు వున్న అనంతకోటి మంది అభిమానులలో నేనూ ఒకణ్ణి. ప్రతి ఒక్క చిత్రకారుడు ఒకో ప్రతెక్యమైన శైలి వుంటుంది. కానీ అన్నీ రకాల శైలిలలో అద్భుతంగా చిత్రించగల ప్రావిణ్యం ఒక్క వపాకు మాత్రమే వుంది.
చాల మందికి దొరకని అదృష్టం : వారి చిత్రాలలో నన్ను అత్యంత ఆకర్షించిన చిత్రం యువ మాసపత్రికకలో వారు వేసిన “మబ్బుమధుర భావన”. ఆ చిత్రాన్ని చిత్రించడానికి (కాపీ) చేయడానికి నేను అనేక మార్లు ప్రయత్నించాను. కాని కనీసం ముప్పై, నలభై శాతం కూడా సాధించలేక పోయాను. అయితే వారి అభిమానులలో చాల మందికి దొరకని అదృష్టం, నేను అందిపుచుకున్న అవకాశం ఏమంటే, కొన్ని నెలలపాటు స్వాతి వారపత్రికలో పేజి మేకర్ గా పని చేసిన కాలంలో వారి ఒరిజినల్ పెయింటింగ్స్ తో సహవాసం చేసే అవకాశం నాకు దొరకడం. ఆ క్రమంలోనే మబ్బు మధుర భావన ఒరిజినల్ పెయింటింగ్ నేను అక్కడే చూడటం జరిగింది. నన్నడిగితే అదో వండర్ అనే చెబుతాను. చిత్రకళను అభిమానించే వారికి చాలామట్టుకు ఇటాలియన్ చిత్రకారుడు మైఖేల్ ఎంజిలో గురించి చెప్పనవసరం లేదనుకుంటాను. అతను ఎప్పుడో ఐదు వందల సం.రాల క్రితం బ్రౌన్ (గోధుమ) కలర్ పేపర్ మీద మేరి, జీసెస్ స్కెచ్ వేసాడు. బహుశా అతని గురించి నేను చదివి ఉండకపోతే, ఆ స్కెచ్ ఐదు వందల సం.రాల క్రితం వైట్ (తెలుపు) కలర్ పేపర్ మీదే వేసివుంటాడని, కాల క్రమేణ అది మాసిపోయి బ్రౌన్ కలర్ కి మారివుండవచ్చునని నేను అనుకునేవాణ్ణి. కాని అతను ఒక ప్రత్యేక ఫలితాన్ని ఆశించి బ్రౌన్ కలర్ పేపర్ మీద స్కెచ్ వేసి, హైలెట్స్ పెట్టాడు. ఇక వపా గారి విషయానికి వస్తే వారు మబ్బు మధుర భావన చిత్రానికి అదే టెక్నిక్ వాడి బ్రౌన్ కలర్ పేపరూ మీద వేసారు. ఆ పెయింటింగ్ లో ప్రత్యేకించి ఆ పేపర్ తాలుక బ్రౌన్ కలర్ ఎక్కడ అవసరమో, అక్కడ పేపర్ని వదిలేసి, మిగిలిన భాగాన్నంతా పెయింట్ చేసారు. ఈ టెక్నిక్ తెలియక పోతే బ్రహ్మ దేవుడికి కుడా అంత అందంగా పెయింటింగ్ వేయడం సాధ్యం కాదు. తలక్రిందులుగా తప్పస్సు చేసిన, ఈఫిల్ టవర్ ఎక్కి దూకిన సరే. అంతేకాదు ఆ టెక్నిక్ తెలిసినా కూడా వపా గారి స్ధాయిలో పెయింట్ చేయడం అన్నది నభూతో నభవిష్యతి. ఆ టెక్నిక్ తెలిసిన మైఖేల్ ఎంజిలోకి కుడా అంత అందంగా ఆ బొమ్మ వేయలేడు. గడిచిన ఐదు వందల సం.రాలలో ఇదే టెక్నిక్ ని చాల మంది వుపయోగించి వుంటారు. కాని వపా గారి అంత చక్కగా వాడుకున్న వారు మరొకరు లేరని చెప్పాలి. రకరకాల షేడ్స్, కలర్స్ వున్న పేపర్లను తీసుకోని, వాటి స్వాభావిక రంగునే తన పెయింటింగ్ లో ఒక కలర్ గా ఆయన ఉపయోగించిన విధాన్ని మరొకరి వల్ల అంత చక్కగా సాధ్యం కాదు. వారు ఉపయోగించిన టెక్నిక్ లలో కేవలం మచ్చుకి ఇదొకటి మాత్రమే. ఈ పెయింటింగ్ గురించి నేను చెప్పింది చాల తక్కువనే చెప్పొచు.
మోడల్ అవసరం లేని చిత్రకారుడు: నాకు తెలిసినవరకు ఎంత గొప్ప చిత్రకారుని కైనా ఎదో ఒక మోడల్ కావాలి. ఈ ఆధునిక కాలంలో అయితే తమకు కావలసిన పాత్రలను ఫోటోలు తీసుకుని, వాటినాధరంగా చిత్రించే ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు వున్నారు. కాని వాటి అవసరం లేని చిత్రకారుడు వపా. కాని కొన్ని సందర్భాలలో వారు కూడా కొన్ని ఇతర చిత్రకారుల చిత్రాలను ప్రేరణ చేసుకున్నారు. ఉదాహరణకి 1970 లో ప్రారంభించబడిన స్వాతి మాస పత్రిక ప్రారంభ సంచికకు బాపు గారు వేసిన ముఖచిత్రాన్ని, తిరిగి వపా గారు 1985లో అదే స్వాతి వారపత్రికకు ముఖచిత్రంగా వేసారు. బహుశా ఈ రెండు ముఖచిత్రాలను చూసినప్పటికీ, ఈ విషయం చాల మందికి గుర్తించి వుండరు కూడా. దేనినైన ప్రేరణగా తీసుకున్నా కూడా ఒక శాతం కూడా పోల్చలేనంత గొప్ప శైలి వపా గారిది.
మరో ఉదాహరణ శ్రీ రాజా రవివర్మ పెయింటింగ్ ప్రేరణతో 1964 సం.రంలో చందమామకి వేసిన ముఖచిత్రం. మీరే చుడండి అసలు దీనిని ఎవరైనా అనుకరణ అనగలరా. ఎవరి శైలి వారిదే అంటారు గాని ఏ చిత్రం బాగుందనే విషయాన్ని చెప్పడానికి తప్పకుండ మొహమాట పడతారు.
వారి ప్రతి పెయింటింగ్ ఒక మహా అద్భుతమే. 1976 సం.రంలో చందమామకు వేసిన మరో ముఖచిత్రం, రాముడు లంక చేరడానికి నీలుడు వారధి నిర్మిస్తున్న సన్నివేశం. నీలుని మెడలో వ్రేలాడుతున్న ఒడంబం, అతని చేతిలోని తాపీ, సదరు పనికీ వినియోగించే చెక్క బద్ద, ఇటువంటి ఆలోచనలు మానవ మాత్రునికేవరికైన వస్తాయా? ఒక్క వపాకి తప్ప. సమకాలిన సమాజంలోని సాధన సామగ్రిని కుడా పురాణ ఇతిహాసాలలో ఇంత చక్కగా ఉపయోగించ గలిగిన మరో చిత్రకారుని చూప మనండి ఎవరినైనా… నిస్సంకోచంగా సాధ్యం కాదు. 1970 వ సం.రంలో చందమామకి వేసిన మరో చిత్రం. అర్జనుడు మత్య్స యంత్రాన్ని చేదిస్తున్న పెయింటింగ్. వపా గారు మత్స్య యంత్రాన్ని చిత్రించిన విధం మరో నరమానవుని వల్ల సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. వారి తదనంతరం వాటిని చూసి వేయోచ్చెమో గాని, స్వతహాగా సృష్టిన్చడం కలలో మాటే.
ఒకే సన్నివేశాన్ని వివిధ చిత్రకారులు వివిధ రకాలుగా చిత్రించడం మన చూస్తాం. కాని ఒకే సన్నివేశాన్ని, ఒకే చిత్రకారుడు వివిధ రకాలుగా చిత్రించడం ఒక్క వపా గారి వల్లే సాధ్యం. ఇది మచ్చుకు మాత్రమే. ఇటువంటి వాటిని ఆయన కోకొల్లలుగా సృష్టించారు.
వారు వేసిన ముఖ చిత్రాలే కాదు, వివిధ పత్రికల కధలకు వేసిన బొమ్మలు కూడా చాల వైవిధ్యమైనవి. యువ మాసపత్రికలోని ప్రతి ఇలస్త్రేషన్ ఒక పుత్తడి బొమ్మే. ఇక చందమామలోని డభైయోవ దశకంలో 53 నెలలపాటు నిర్విరామంగా వచ్చిన పంచతంత్రం కధకు వారు వేసిన బొమ్మలు, రచన కథను సగం మాత్రమే చెబితే మిగిలిన సగం కధ వారి బొమ్మలే చెప్పాయి. వాటిలో కొన్నిటిని వారు చిత్రంలోని కొన్ని పాత్రలు ఫోర్ గ్రౌండ్లో, చిత్రం యొక్క ఫ్రేమ్ దాటి బయటకి చిత్రించడం అప్పటికి అదో కొత్త ఒరవడి. ఆ విధానం పాఠకుల దృష్టిని, వారికి తెలియకుండానే కధలో మరింత ఇన్వాల్వ్ చేస్తుంది. పేజి డిజైనింగ్ లో ఇదీ ఒక టెక్నిక్. తర్వాతి కాలంలో అటువంటి టెక్నిక్ ప్రఖ్యాత కామిక్ బుక్ డ్ఛ్ కామిక్స్ మొదలైన వాటిలో కనిపిస్తుంది. మరల అటువంటి అద్భుతమైన పంచతంత్రం మార్కెట్లో దొరకలేదు.
ఇక వారి చిత్రాలలోని భామల అందాలు చెప్పడానికి నా దృష్టిలో అయితే మాటలు లేవు. కొంత మందిని చూసి బాపు బొమ్మలా వుందంటారు. లేదంటే పలనా హిరోలా వున్నడంటారు. కాని ఎంత అందంగా వున్నా వపా బొమ్మల వుందని అనరు. ఎందుకంటే ఆ అందం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. నా యాభై రెండు సం.రాల జీవితంలో నేను ఒకేఒక్క సారి అటువంటి అందాన్ని, కొంచెం ఒళ్ళు చేసిన వపా గారి బొమ్మను చూసాను. కాని తర్వాతెన్నడు అటువంటి అందం నాకు తారసపడ లేదు.
వ్యాపార చిత్రకళ: ఇక వారి బొమ్మలల్లోని శారీరక సౌష్టవం (ఎనాటమీ) వారికి మాత్రమే సాధ్యం. అలా అని అన్నీ బొమ్మలలోను ఖచ్చితత్వం వుండదు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకూ, నేను వారి పెయింటింగ్స్ పరిశిలించినంత వరకు, వారెన్నడు ఒక సారి వేసిన స్కెచ్ ని గాని, పెయింటింగ్ ని గాని సరిదిద్ద లేదు. ఎలా వస్తే అలానే వదిలేసారు. అందుకు కారణం బహుశా వారు ఎదో అద్భుతాని సృష్టించాలని ఏనాడు అనుకుని వుండరు. రైతు వ్యవసాయం చేస్తున్నట్టు, తాపీమేస్త్రి గోడ కడుతున్నట్లు అతి సాధారణంగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటా వేల్లిపోయారేమో గాని, ప్రత్యేక శ్రద్ధతో చిత్రించిన చిత్రాలను మాత్రం మన చూసిన, చూస్తున్నా చిత్రాలలో ఓ ఒక్కటి ఉండదని నేను భావిస్తున్నాను. రవి గాంచ్చనివి కవిగాన్చునేమో గాని, వపా గారు తలచినవి ఏ కవి కాంచలేడు. వారు మనసు పెట్టి చిత్రించిన చిత్రాలను, వేటిని ఈ ప్రపంచం చూసివుండలేదని నా ప్రఘాఢ విశ్వాసం. బహుశా తన జీవితాన్ని ఒక యోగిలా గడిపారన్నది అందరికి విసధమే, వారి జీవితాన్ని గురించి, వారి గురించి తెలిసిన వాళ్ళను వేళ్ళ మీద లెక్కగట్ట వచ్చు. వారు జీవితాంతం వ్యాపార చిత్రాలనే చిత్రించారు. చందమామకు ముందు తర్వాత కూడా వివిధ పత్రికలకు వారు చిత్రాలు వేసిన, చందమామ యువ చిత్రాలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. చందమామ యాజమాన్యం వారు కళను వ్యాపారానికి వినియోగించడంలో సిద్ధహస్తులు కనుక, వ్యాపార పరంగా వారికి ఉపయోగం అనుకున్న బొమ్మలను మాత్రమే వపా గారితో వేయిన్చారన్నది నూరు పైసల నిజం. వాటితోనే వపా గారు ఇన్ని మహా అద్భుతాలు సృష్టించారు.
ఫ్రెండ్లీ ప్రింటింగ్ కలర్స్: అరవై దశకం నుండి ఎనభైవ దశకం వరకు వపా గారివే కాకుండా చాలా మంది అప్పటి గొప్ప గొప్ప వ్యాపార చిత్రకారుల ఒరిజినల్ పెయింటింగ్స్ నేను చాలా చూసాను. వాటిలో చాలా వాటిని బాగా పరిసీలించాను కుడా. ప్రింటింగ్లో వారి పెయింటింగ్స్ మహా వస్తే 75% లేదా అంతకంటే తక్కువ క్వాలిటి మాత్రమే వచ్చేవి. ఒక్క వపా గారి పెయింటింగ్స్ తప్ప. వారు టెక్నాలజీ పరంగా ప్రింటింగ్ లో ముద్రణకు అనువుకాని ఏ కలర్ షేడ్ ని తన ఏ ఒక్క పెయింటింగ్ లో వినియోగించలేదు. అందువల్ల ఏ ఒక్క పెయింటింగ్ లో కూడా ఒరిజినల్లో వున్నా క్వాలిటి ప్రింటింగ్ లో ఏమాత్రం తగ్గలేదు. పైగా ఒరిజినల్ కంటే ప్రింటింగ్ లో ఇంకా ఎక్కువ క్వాలిటీతో, ఇంకా అందంగా వుండే బొమ్మలు ఎన్నో వున్నాయి. అప్పటి ప్రింటింగ్ టెక్నాలజీ లో ఆయన ఎంత నిష్ణాతుడో చెప్పడానికి వేరే ఏ నిదర్శనం అక్కరలేదు. అలా అని అప్పటి మిగిలిన చిత్రకారులేవారిని తక్కువ చేయాలనే ఆలోచన కాదు. ఇదే విషయం గురించి చందమామ గత చిత్రకారులు పి.ఎస్. బాబు, ఆర్టిస్ట్ తో మాట్లాడుతున్నపుడు వారు ఈ విషయం చెప్పడానికి ఒక మంచి పదం చెప్పారు. వపా గారు “ఫ్రెండ్లీ ప్రింటింగ్ కలర్స్” మాత్రమే వాడేవారని. ఇక యువ మాసపత్రికలో, ప్రత్యేక సంచికలకు తప్ప మిగిలిన వాటికి వారు వేసిన కట్ కలర్ డిజైన్స్, ప్రింటింగ్ నిమిత్తం కలర్ సపరేషన్ చేయడానికి, అప్పటి టేక్నిషియన్లకు ఖచ్చితంగా దుంప తెగే వుంటుంది.
వారు చిత్రకళలోనే కాకుండా పురాణ ఇతిహాసాలలోను, రచనా వ్యాసంగంలోనూ, సంగీతం, జ్యోతిష్య శాస్త్రాలలో విశేష పరిజ్ఞానం కలవారు. యువ మాస పత్రికకు వారు కర్నాటక, హిందుస్తానీ రాగాల పేర్లతో, ఆయా రాగ లక్షణాలను బట్టి బొమ్మలు వేసారు. అదే విధంగా జన్మ నక్షత్రాలను, వాటి లక్షణాలకు అనుగుణ వ్యక్తికరనతో కూడా బొమ్మలు వేసారు. వారి జీవితంలో అతి ముఖ్యమైనదైన చందమామకి వస్తే, ఆంధ్రులకు అందివచ్చిన ఒక మహా అద్భుత వరం చందమామ అయితే, ఆ చందమామకు కల్గిన ఒక గొప్ప కామధేనువు వపా. అప్పటి, ఇప్పటి పిల్లల పుస్తకాలలో చందమామను ప్రత్యేక స్థానంలో నిలిపింది అందులోని బొమ్మలు మాత్రమే. చందమామ వ్యవస్థాపకులు ఆనాటి పెట్టుబడి దారి వ్యవస్థకు ప్రతీకలు మాత్రమే కాదు, ప్రతిరూపాలు కూడా. ఒక వపా, ఒక చిత్రా, ఒక శంకర్, ఒక దాసరి సుబ్రమన్యం, మరెందరో ఆ సంస్థ అభివృద్ధి వెనక్కున్న అదృశ్య మూల స్థంభాలు. నాకు వపా గారి గురించి తెలిసింది చాల తక్కువ, కాస్తోకూస్తో వారి బొమ్మలతోనే పరిచయం. వారిని గూర్చి చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా ఒక గ్రంధమే అవుతుంది, సందేహం లేదు. అందుకే వారిని గంధర్వ చిత్రకారులనడానికి, అది చాల చిన్న మాట అనుకుంటాను.
-సత్యం పెదసింగు
అద్భుతమైన కళాకారుని గురించి మహాద్భుతంగా చెప్పిన విధానం చూసీ ఇంకా ఉంటే చదవాలనిపించేంత అద్భుతంగా ఉంది.గురువుగారి గురించిన పూర్తి విషయాలతో ఆయన జీవిత చరిత్ర ప్రచురించ ప్రార్థన…. ఇవి మా జీవితాలకు ప్రేరణ…ఎన్నో సాధించాలనే జిజ్ఞాసను ప్రతీ ఒక్కరిలో నింపగలిగే స్పూర్తి ప్రధాతలౌతాయి
అద్భుతమైన చిత్రకారులు వపా గారి గురించి తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. వారిపై ఉన్న కొండంత అభిమానం మరో కొండంత పెరిగింది. మీ కు అభినందనలు సత్యం పెదసింగు గారూ🙏🙏
గంధర్వ చిత్రకారుడు వపా గారి గురించి, ఆయన చిత్రించే విధానాన్ని చక్కగా వర్ణించారు.ధన్యవాదములు సత్యం పెదసింగు గారూ.
Entha manchigaa gurtu chesaro! Chaala thanks. Rare photos kuudaa! Best wishes, Kiranmayi I
Very good analysis on VaPa paintings and style. Thanq Sir…
వడ్డాది పాపయ్య గారి బొమ్మలగురించి చక్కటి విశ్లేషణ చేసారు. ధన్యవాదాలు.