కొరకరాని కొయ్యి

తెల్లని ఖద్దరు పంచె, అదే రంగు లాల్చీ
చేతికో గడియారం కూడా లేని అతి సామాన్యుడు
తెలుగు చిత్రకళా రంగంలో అసమాన్యుడు !
ఆయనవి పిల్లి కళ్ళు, నిశీధి కూడా నిశీతంగా చూసే డేగ కళ్ళు అవి …
ఆయన చూపు ఓ రంగుల చిత్రం
ఆయన దృష్టి ఓ అద్భుత సృష్టి …

ఆయన పొట్టిగా ఉన్నా గీసిన గట్టి చిత్రాలు ఎన్నో…
ఆయన నిరాడంబరుడే కానీ ఆయన చిత్రాల్లో నాయకి, నాయకులంతా ఆడంబరులే…
ఆయన బలహీనంగా కనిపించినా ఆయన సృష్టించిన వారంతా బాహుబలులే …
ఆయన పల్లె జీవి అయినా, ఆయన చిత్రాల్లో పట్టణరాజసం ఉట్టిపడుతుంది…
ఆయన చిత్రకళా యోగే కాదు, భోగి కూడా
ఆయన వాస్తవం కంటే – ఊహల్లో ఎక్కువ జీవిస్తారు…
ఆయనకు పగలే రాత్రి, రాత్రే పగలు…
ఆయనకు పగలు విశ్రాంతి – నిశీధి నిశ్శబ్దంలో కళాసాధన…

ఆయనకు మిత్రులు లేరు – శత్రువులూ లేరు
ఆయనకు బాహ్య ప్రపంచం లేదు
వున్నదంతా కలల, కళల, రంగుల ప్రపంచమే…
ఆయన ఎవరిని కలవరు కానీ, ఆయన్ని అందరూ కలవడానికి ఇష్టపడతారు…
ఆయన ప్రచారాలకు, ప్రశంసలకు, పొగడ్తలకు దూరం !
ఆయనకు ఎవరూ తెలియదు కానీ
ఆయన కళాప్రతిభ అందరికీ తెలుసు…

ఆయన గురువు లేని ఏకలవ్య శిష్యుడు
ఆయన శిష్యులు లేని గురువు కూడా…
ఆయన జీవికకు సరిపడా ‘సిరి ‘ లేని, కళా శ్రీమంతుడు
ఆయన ఎవరికీ అభిమాని కాదు కానీ, ఆయనకి లక్షల్లో కళాభిమానులున్నారు…
ఆయన కళాశైలి ఒక నమూనా – అది ఇతరులకు దుర్భేద్యం
ఆయన చిత్రాలు తెలుగు సంస్కృతిక ప్రతీకలు అవి అభిమానులకు రసగుల్లాలు !

కరుణశ్రీ పద్యాలు కమనీయంగా ఉంటాయి
వపా చిత్రాలు రమనీయంగా ఉంటాయి …
ఆయన ప్రభుత్వం దృష్టిలో లేరు కానీ – అభిమానుల గుండెల్లో అమరుడు
ఆయనే కళాభిమానుల వడ్డాది పాపయ్య
ఆయన శ్రీకాకుళం లో పుట్టి, మద్రాసులో మెరిసి, కసింకోట లో కన్నుమూసారు.

(డిసెంబర్ 30న వడ్డాది పాపయ్య 27వ వర్ధంతి సందర్భంగా…)

-సుంకర చలపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap