
లలిత గీతం మూగవోయింది! ప్రముఖ కవి, లలిత సినీ గేయ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కనుమూశారు. ఆయన వయసు 76. ఒక గొప్ప లలిత గీతాల రచయితను తెలంగాణ కోల్పోయింది. రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం ఆయన్ని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అమెరికా అటా వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైదరాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారు. నెల రోజులు ఆసుపత్రిలోనే ఉండి నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. నిన్న మళ్ళీ ఇబ్బంది అనిపించడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబరు 6 న ఉదయం తుది శ్వాస విడిచారు. లలిత గీతం ఆగిపోయింది.
వడ్డేపల్లి కృష్ణ 1948 లో సిరిసిల్ల లో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాగోల్ లో స్థిరపడ్డారు. తపాళా శాఖలో ఉద్యోగం చేశారు. పిల్ల జమీందార్ చిత్రంలో ‘నీ చూపులోన విరజాజి వాన’, పెద్దరికం సినిమాలోని ‘ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే’, భైరవ ద్వీపం చిత్రంలో ‘అంబా శాంభవి’ లాంటి ఆణిముత్యాల లాంటి పాటలు రచించిన సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించగా అన్ని వేదికలపై ఆ నృత్య రూపకం మార్మోగింది. సాహిత్య రంగంలో 25 ప్రక్రియల్లోను రచనలు చేసిన ఏకైక రచయిత వడ్డేపల్లి కృష్ణ.
సినారె ఇష్టపడిన రచయిత వడ్డేపల్లి కృష్ణ. వందేళ్ల లో వెలువడిన పదివేల లలిత గీతాలను పరిశీలించి పిహెచ్.డి. పూర్తి చేశారు. వందలాది లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి. 40 పైగా నృత్య రూపకాలు రాశారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.ఆయన దర్శకత్వం వహించిన ఎక్కడికి వెళ్తుందో మనసు చిత్రం లో సాయి కుమార్ హీరోగా నటించారు. సంచలనం సృష్టించిన బలగం సినిమాలో ఆయనే స్వయంగా నటించారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అటా, తానా వేడుకల్లో ప్రతి ఏటా పాల్గొంటూ సాహిత్య చర్చల్లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన ‘గోభాగ్యం’ లఘు చిత్రం అంతర్జాతీయంగా అనేక పురస్కారాలు పొందింది. బతుకమ్మ, రామప్ప రామణీయం లాంటి అనేక లఘు చిత్రాలకు నంది పురస్కారాలు వచ్చాయి.
నాకు మంచి ఆత్మీయులు. మూడు దశాబ్దాల అనుబంధం. తెలంగాణ వచ్చాక కెసిఆర్ తనకు అన్యాయం చేశారని కలసినప్పుడల్లా ఆవేదన వ్యక్తం చేస్తుండే వారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తనకు గుర్తింపు లభించిందని చెప్పేవారు. కేంద్ర సాహిత్య అకాడమీ తనను చిన్న చూపు చూస్తుందనే వారు. ప్రతి ఏటా ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారం కోసం తనను ఎంపిక చేసి చివరి నిముషంలో తప్పిస్తున్నారని ఒకసారి కంట తడి పెట్టుకున్నారు. తెలుగు మహాసభలు రాజమండ్రిలో జరిగినప్పుడు ఇద్దరం మూడు రోజులు ఒకే గదిలో ఉండి ఉదయాన్నే వాకింగ్ కు వెళుతూ ఎన్నో విశేషాలు పంచుకున్నాం. జూన్ నెలలో అటా వేడుకలకు అట్లాంటా లో కలుసుకున్నాం. రెండు రోజుల క్రితం తెలుగు సినీ రచయితల సంఘం ‘జీవన సాఫల్య పురస్కారం’ ఇచ్చిందని, ఇప్పుడైనా తన గురించి కళలో రాయాలని కోరారు. త్వరలో కలుద్దాం రాస్తాను అన్నాను. రెండు రోజులకే ఆయన ఆరోగ్యం సహకరించక కనుమూశారు. మిత్రుడికి అశ్రు నివాళి. పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు రావాల్సి వుంది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
–డా. మహ్మద్ రఫీ