“వైచిత్రీ ప్రియత్వం ఒక మంచి గుణం అయినప్పటికీ దీనిని గూర్చి పరిశోధన చేసినవారు లేర”ని ఆచార్య డా. సి. నారాయణ రెడ్డి ఒకానొక సందర్భంలో అన్నప్పుడు… ఎం.ఏ, ఎం.ఫిల్ విద్యార్థి దశలో ఉన్న యువ సంగయ్య తన పరిశోధనకు ప్రేరణగా స్వీకరించారు. “వారు వేసిన పునాది రాయిపైనే నేను చిన్న మేడను కట్టుకున్నానంటారు” కృతజ్ఞతాపూర్వకంగా… ‘ఆధునికాంధ్ర కవిత్వంలో వ్యక్తీకరణ వైచిత్రీ ప్రియత్వం’ గ్రంథ రచయిత డా. లగడపాటి సంగయ్య గారు.
పై విషయ పై పరిశోధనకు అనుమతించిన ఆచార్య డా. బి. రామరాజు, డా. గోపాలకృష్ణ రావు, డా. కులశేఖరరావు గార్లకు పర్యవేక్షించిన డా. ఎస్వీ. రామారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు సంగయ్య గారు. అంతటి ప్రముఖుల సమక్షంలో ఇంతటి పరిశోధన జరుపుకున్న ఈ గ్రంథానికి మరో ప్రామాణికం అవసరం లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయం(1982-84)లో పురుడుపోసుకున్న ఈ ఎం.ఫిల్ గ్రంథం ఇన్నాళ్ళ(2026)కు వెలుగు చూడటం… హర్షించాలో, దుఃఖించాలో తెలియకున్నది. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఒక పరిశోధనా జ్ఞానప్రసాదం – గ్రంథం రూపంలో సాహిత్య ప్రియులకు చేరువైంది. 28 ఏళ్ల ఉద్యోగ జీవితం ముగించుకొని, 14 ఏళ్ల విరామ జీవితానంతరం… ఆయన కలం అవిశ్రాంతంగా పయనిస్తూనే ఉన్నప్పటికీ… ఎందుకో బాగా సమయం తీసుకున్నది.
సంగయ్య గారు పరిశోధనా వ్యాసాలు, గ్రంథ రచనలు, తెలుగు పత్రికల్లో వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, వచన కవితలు, సదస్సుల్లో పాల్గొంటూ సాహిత్య సేవ చేస్తున్నప్పటికీ.. ఎందుకో బాగా సమయం తీసుకున్నారు.
ఈ పరిశాధన రచన ‘కామ్ చలావ్’ పద్ధతిలో సాగింది కాదు. అలనాటి ఏం.ఫిల్ లోనే ఇంతటి పరిశ్రమ చేసిన లగడపాటి సంగయ్య గారు ఘనుడు, వారి గురువులు అసమాన్యులు. కవిత్వానికి వైచిత్రి ఉండాలి, సమాజాన్ని ఆకర్షించాలి. అప్పుడే సమాజానికి ఏదైనా చెప్పగలం అన్నది కవిత్వ సిద్ధాంతం. వైవిధ్యానికి, వైశిష్యానికి, వైచిత్య్రానికి కవులు కారకులు అయ్యారన్నదే సారాంశము.
ఇది ఒక రిసర్చ్ గ్రంథం. పరమ ప్రామాణికాలతో నిండిన కవితాశాస్త్ర గ్రంథం. కావ్యసాహిత్యం నుండి త్రవ్వితీసిన భావజాలం. పండితుల కొరకు రాసిన పుస్తకం. పరిశోధనాగ్రంథం ఎలా ఉంటుందో చూడాలనుకునే వారికి ముచ్చటేసే గ్రంథం. ప్రతి వాక్యానికి ప్రమాణాలును రచయిత మాలలో దాగిన దారంలా వివిధ కాలాల్లో ఉద్దండులైన సరస్వతీమూర్తులు వదిలిన కవిత్వపు తునకలను కూర్చుతూ, తాను చెప్పాలనుకున్న ప్రామాణికమైనటువంటి విషయాలను చేర్చుతూ రాసిన పుస్తకం… ‘ఆధునికాంధ్ర కవిత్వంలో వ్యక్తీకరణ వైచిత్రీ ప్రియత్వం’.
కుంతకుడు వక్రోక్తిని కావ్యజీవితంగా భావిస్తే, విశ్వేశ్వరుడు చమత్కారాన్ని కావ్యజీవితంగా భావిస్తాడు. క్షేమేంద్రుడు ఔచిత్యం వల్ల చమత్కారం కలుగుతుందంటాడు. జగన్నాధుడు శబ్ధర్థ పరంగా, రీతి గుణాలంకారపరంగా చమత్కారం సాధ్యమంటాడు. భాషా శాస్త్రం పూర్వం ఎంతగా అభివృద్ధి చెందిందో ఈ గ్రంథం అద్దం పడుతుంది. కావ్యాల్లోని వైచిత్రి అన్న పదానికి ఎన్ని ఉదాహరణలు ఉపయోగించారో. పద పదానికి నిర్వచనం ఇచ్చారు. వైచిత్రీని కుంతకుడు వక్రోక్తిగా కవి వ్యాపారవక్రతగా చెప్పి ఆరు విధాలుగా పేర్కొంటే, క్షేమేంద్రుడయితే ఏకంగా 10 విధాలుగా పేర్కొన్నాడంటే చూడండి. కాలంతోపాటు కవి పేరు మారుతుంది తప్ప, కవి హృదయం మాత్రం ఎప్పుడూ అదే. కవిత్వ లక్షణము అదే. వైచిత్రీ అంటే ఇదే మరి!
ఇందులోని విషయసూచికను ఒకసారి పరిశీలించినట్లయితే వైచిత్రి స్వరూప స్వభావాలు అన్న ప్రథమ అధ్యాయంలో ప్రాచీనులు – వైచిత్రి నిర్వచనం, ఆధునికులు- వైచిత్రి నిర్వచనం, వైచిత్రి – వక్రోక్తి, వైచిత్రి – చమత్కారం, వైచిత్రి – చిత్ర కవిత్వం అన్న విషయాలు వివరించారు. రెండవ అధ్యాయమైన పూర్వ కావ్వాలు – వైచిత్రిలో ప్రాచీన కవిత్వం- వైచిత్రి, భావ కవిత్వం- వైచిత్రి, మూడవ అధ్యాయంలో వైచిత్రి ప్రభావం అంటూ రెండు మార్గాలను సూచించారు. సామాజిక పరిస్థితులు ప్రభావం, పాశ్చాత్య సాహిత్య ప్రభావం ఎలా ఉండేదో ఆయన వివరించడం జరిగింది.
ఆధునిక కవిత్వం వైచిత్రీ ప్రియత్వం అన్న నాలుగవ అధ్యాయంగా మొదలు పెడుతూ రూప వైచిత్రి అన్న శీర్షిక క్రింద సమ్మిధాన వైచిత్రి, శబ్దవైచిత్రి, ముద్రణలేఖనా వైచిత్రి, సంఖ్యా వైచిత్రి, శీర్షికలో వైచిత్రి, ఛందో వైచిత్రి అని ఆరు ఉపశీర్షికలను ఆయన వివరించారు. భావ వైచిత్రి అనేటువంటి శీర్షిక క్రింద అలంకారాలు – భావవైచిత్రి, వైజ్ఞానిక పద్ధతులు- భావవైచిత్రి, ప్రతీకలు – భావవైచిత్రిని, చివరగా వస్తు వైచిత్రిని వివరించారు.
ఈ పుస్తక పరిశోధనను పూర్తిచేసేందుకు సంగయ్య గారు దాదాపు 90 పుస్తకాలను పరిశోధించటం, నాలుగు పత్రికలను తిరగవేయటమూ జరిగింది.
ఆధునిక ఆంధ్ర కవిత్వంలోకి పరికించి చూస్తే ఆ చూపుల్ని అలాగే లాగేసుకునే గుణం వైచిత్రీకి ఉంది. ఆధునిక ఆంధ్ర కవిత్వంలో కూడా మొదటి మూడు దశాబ్దాల్లో స్తబ్దంగా ఉంది అంటారు సంఘయ్య గారు. ఈ వైచిత్రి వ్యామోహం పెల్లుబికిందని చెప్పడానికి తార్కాణంగా అనేక మంది రచయితలు ఈ మార్గంలో రచనలు చేశారు అంటారు. 1943 కి ముందు వెనక తెలుగు సాహిత్యాన్ని వీరు లాండ్ మార్కుగా తీసుకున్నారు.
“కాలార తిరగ నేర్చిన బిడ్డ దాది నిర్బంధాలకి ఎదురు తిరగినట్లు…” కవిత్వంలో నిబంధనలకి తావులేదు, కనుక కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. అయితే, ఈ ప్రయోగాలు వైచిత్రి కిందికి రావు. కానీ వైచిత్రి మాత్రం ఒక గొప్ప ప్రయోగమే. ప్రయోగంలో ఒకరు కొత్త దారి చూపిస్తే కాస్తోకూస్తూ వైవిధ్యం చూపిస్తూ అదే దారిలో నడవడం జరిగింది. కానీ వైచిత్రిలో ఒక కవి చేసే రచనల్లోనే ఒక దానికంటే ఒకటి- వైరుధ్యం కంటే మించిన వైచిత్రీయంతో- మెరుపులు కురిపిస్తాయి అని, ప్రతికవి విశిష్టమైన మార్గంలో పడించాడు అంటారు.
కవుల సంఖ్య పెరుగుతున్నప్పుడు కవితల సంఖ్య పెరగుతుంది. అత్యున్నతంగా రాస్తున్నామని అనిపించుకునేందుకు పడే తపన, తత్ఫలిత వ్యక్తికరణం, వైచిత్రి ప్రియత్వానికి హేతువవుతుందంటారు.
వైచిత్రి అనేది కవిత్వంలో కొత్తదనం, ఆకర్షణ, ఆశ్చర్యాన్ని కలిగించే లక్షణం. అది పాఠకుని హృదయాన్నీ, బుద్ధినీ ఏకకాలంలో ప్రభావితం చేసి కవిత్వానికి ప్రాణం పోస్తుంది. అయస్కాంతం ఇనుపరజనును కదిలించినట్లుగా బుద్ధికి గిలిగింతలు పెట్టి కదిలేట్లు చేసి, హృదయాన్ని బుద్ధిని ఏకం చేసి విస్మయ విద్యుత్తాడితులను చేసేది. ఆశ్చర్యఘాత భావనను చూపి పాఠకుల్ని ఆకర్షించేది. రెండు క్షీణయుగాల మధ్య వారిదిగా నిలిచేది అసలైన కవిత్వానికి జీవకర్రగా ఊతమిచ్చేది ఈ వ్యక్తీకరణ వైచితీ ప్రియత్వం అంటారు రచయిత.
పండితులు వైచిత్య్రానికి ఇచ్చిన నిర్వచనాలు, ఉదాహరణలు ఇందులో కొల్లలుగా ఉన్నాయి. ఇది కవుల పుస్తకం. చదివి అనుసరించాల్సిన పుస్తకం. ఇది కవిత్వ నిర్మాణం చేయాలనుకున్న వారికి కవిత్వ శాస్త్ర గ్రంథం. కవిత్వం చదివే పాఠకుడికి కవి, కవిత్వ నిర్మాణాలతో గొడవలేదు. పడవ నడిపేవాడికి నదీ శాస్త్రాలతో పనిలేదు; పడవ, తెడ్డు, నీరు తెలిస్తే చాలు. అలాగే పాఠకుడికి కవితా సౌందర్యం అందితే చాలు.
ఇది అద్భుత గ్రంథం. ప్రాచీన, ఆధునిక కావ్య నిర్మాణం శాస్త్రీయంగా నిర్వహించాలనుకున్న యువతకు గురుస్థానంలో ఉండదగిన గ్రంథం. ఆపోసన పట్టవలసిన గ్రంథం. రచయిత లగడపాటి సంగయ్య గారు అద్భుత పరిశోధన ఫలం. విమర్శకుల ఆసక్తిని పెంచేలా రచన చేశారు. సమీక్షించాలనుకున్న వారి స్థాయిని పెంచే గ్రంథం. చదివినవారికి సాహిత్యం పట్ల మక్కువను పెంచే గ్రంథం. సాహిత్యకారులకు తాను పూర్వం విహరించిన నగర వీధులనే పునః పరిచయం చేయిస్తుంది.
కవి తన మనసులోని భావాన్ని తక్కువ మాటల్లోనూ, గాఢమైన ప్రభావంతోనూ, హృదయానికి హత్తుకునేలా వ్యక్తీకరించగలగాలి(ఇ.ఇ. కమ్మింగ్స్ శైలిలా) అంటారు.
పద్యానికి రెండు అంచులు ఉన్నాయి. ఒకటి ఆంగిక స్పర్శ, రెండవది అర్థవిస్తీర్ణత. చందస్సు ఎక్కువగా ఆంగిక స్పర్శకు చెందింది. అలంకార అర్థ విస్తీర్ణతకు చెందింది. కవిత్వానికి ఉంటాయని చెప్పే అనేకం ఈపై రెండు గుణాల కలయిక వల్ల వచ్చే ఒకానొక కొత్తదనమే వైచిత్రి. పద్యాన్ని మనకు పరిచయం చేసేది చనపు చేసేది కూడా ఈ వైచిత్రే. ఒకటి శబ్దపరమైన కొత్తదనం రెండవది భావ పరమైన కొత్తదనం. ఈ రెండింటిని నింపుకున్న కళాకారుల వల్ల వైచిత్రి ఆరాధ్యమవుతుందని చెప్పారు.
డా. సుప్రసన్న గారి అభిప్రాయం ప్రకారం, భాషలో వాక్యనిర్మాణం, సమాసాల కల్పన, పదాల సంక్షిప్తీకరణ, కొత్త పదాల సృష్టి, పదాలకు కొత్త అర్థాల ఆపాదన వంటి మార్పుల ద్వారా కవులు శబ్ద వైచిత్రిని సృష్టిస్తారు. ఇవి కవి ప్రతిభను బట్టి విభిన్న రూపాల్లో వ్యక్తమవుతాయని ఆయన వివరించారు.
గుంటూరు శేషేంద్ర శర్మ గారి అభిప్రాయం ప్రకారం, ఆశ్చర్యాన్ని కలిగించే ప్రత్యేకమైన కవితా వ్యక్తీకరణే వైచిత్రి. కవిత్వంలో కనిపించే విశిష్ట దృష్టి (దృగ్విశేషం) మరియు ప్రత్యేక వాక్ప్రయోగం (వాగ్విశేషం) వల్ల వైచిత్రి ఉత్పన్నమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆధునిక ఆంధ్ర కవిత్వం వైచిత్రీ ప్రియత్వం అన్న ఈ గ్రంథాన్ని వివరించేందుకు మరో ఇంతటి పుస్తకం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతటి విషయ సమూహం ఇందులో నిక్షిప్తమైవుంది అనడంలో సందేహం లేదు. ఆనాటి పరిశోధన ఎంత గాఢంగా ఉండేదో ఈ పుస్తకాన్ని పరిశీలించిన మీదట అర్థమవుతుంది. సాహసికులు మాత్రమే ఇలా తమ పరిశోధనా గ్రంథాలను అచ్చువేయించడం జరుగుతుంది. ఆ కోవలోకి సంఘయ్య గారు వస్తారు కానీ, ఇంత ఆలస్యంగా ఈ పుస్తకాన్ని అచ్చు వేయించడం బాధాకరమని చెప్పవలసి ఉంటుంది. తాజాగా తీసిన వెన్నను ఆవకాయలా ఊరపెట్టి ఎన్నాళ్లకో ఇలా అందించడం బాధ పడవలసిన విషయం. సాహిత్య లోకం ఆలోచించాల్సిన విషయం కూడా ఇదే. సాహిత్యంలో పరిశోధనా ఫలాలు జనాల్లోకి రాలేదా లేక పరిశోధనలకు ప్రోత్సాహం లభించడం లేదా… ఇలాంటి పరిశోధన గ్రంథాలను అచ్చువేయాలనుకున్న వారు ఈ గ్రంథాన్ని చూసిన తర్వాతైనా మరింత ఉత్సాహంతో, పట్టుదలతో తమ గ్రంథాలను అచ్చు వేయించుకోగలరని భావిస్తున్నాను. “ఎవరో వస్తారని ఏదో చేస్తారాని ఎదురుచూసి మోసపోకుమా…” అన్నట్లు.
ఇంత పరిశోధన పూర్తిచేసి సంగయ్యగారు చివరగా నుడివిన పలుకులు రెండూ ఇవి “విచిత్రమే సౌందర్యం- సౌందర్యమే విచిత్రం” అని! మేధావులైనటువంటి కవుల, రచయితల పరిశోధనా ఫలాలైన గ్రంథాలను చీకటి గదులకు, ట్రంకుపెట్టెలకు పరిమితం కాకుండా, ఇన్నేళ్లకైనా ఆ పరిశోధనా ఫలాన్ని వెలుగు చూసేలా చేసినటువంటి ఈ గ్రంథం తెలుగు సాహితీకారులకు మార్గదర్శనం చేసేందుకు అచ్చై మన చేతుల్లోకి రావడం ఒక భాగ్యంగా భావించాలి. డా. లగడపాటి సంగయ్యకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి చావా విశ్వనాథం గారికి ఈ పుస్తకాన్ని అంకితమివ్వడం ఆయన లోని మనసుకు, మమతకు తార్కాణం. ముఖపత్ర రచయిత కూడా ఆయనే కావటం… స్వయంగా తన గ్రంథానికి చిత్రీకరించుకోవటంలో ఆయనలోని మరోప్రతిభను గుర్తించి అభినందించి తీరాలి.
సమీక్షకుడు: ఆత్మకూరు రామకృష్ణ
ప్రతులకు రచయిత: డా. లగడపాటి సంగయ్య (94907 69242)
