
“నిర్దూషణా గుణవతీ రసభావపూర్ణా / సాలంకృతిః శ్రవణ కోమలవర్ణరాజిః / సామామకీన కవితేవ మనోభిరామా / రామాకదాపి హృదయాన్మమగనాపయతి (6వ శ్లో). ఇందులో జగన్నాధుడు వ్యక్తపరిచినట్లు, “విహారి”గారి జగన్నాధ పండిత రాయలు పాఠకుల హృదయాలలో తిష్టవేసి కూర్చున్నాడు. దీనికి ఉదాహరణ “సంచిక”లో వచ్చిన “జగన్నాధ పండిత రాయలు” సీరియల్ నవలగా కుదురుకుని, ఆ నవల మీద వచ్చిన విమర్శనా, సమీక్షల సమాహారం “వైజయంతి” మాల యై “విహారి ” గారిని అలంకరించి మంచి పుస్తకంగా రూపాంతరం పొందింది.
ఇందులో అంతరించిపోతున్న గొప్ప చరిత్ర మాత్రమే కాదు, భాషా, పదాలు, రాజకీయాలు, హిందూ మత ధర్మము, ఆనాటి జీవనశైలి,మతసామరస్యానికి పెద్దపీట వేసిన విషయం, పెద్దలు తమ సమీక్ష లలో వ్యక్తపరిచారు. పాఠకుల భావాలు వారి ఉద్వేగం కూడా ప్రచురించారు.
విహారి గారి విద్య, జీవితం ప్రతిభా, గుర్తింపులు వివరంగా చెప్పడం జరిగింది. నా “నుడి” డా. కె.వి.రమణగారు, “జగన్నాధ పథ చక్రాల్” సుధామ గారు,”అమృత నైవేద్యం” నేతి సూర్యనారాయణ శర్మ గారు. “వైజయంతి” “విహారి” గారి “జగన్నాధ పండిత రాయలు” రచన నవలా సమాలోకనమ్.
‘కాలం చెల్లన కథలకు జీవం నింపిన కలం’ అంటారు డా. అద్దంకి శ్రీనివాస్ గారు. కొత్త పదాలు, పదబంధాలు ఉపయోగించటం, ఉదాహరణకు ‘రాత్రి నీలిరంగులో కులుకుతోంది ‘బయట ఎండ దబాయిస్తోంది’ కర్మ మార్గం జ్ఞానం పొందడానికే అని జగన్నాధుడు అంటాడు. తెలుగు వాడి ప్రజ్ఞా, ప్రాభవానికి ‘సాహిత్య స్పూర్తిపతాక’గా జగన్నాధుడిని భావించారు విహారి గారు అంటారు మాకినీడి సూర్య భాస్కర్ గారు.’ వీర సాహస కవి’ కథామృతంగా చరిత్ర రచనాభిమాని శిరిపురపు అన్నపూర్ణ భావించారు.
‘ఆవరణలోని వేపచెట్టు గాలితో ఆడుకుంటుంది”ఓ చిలుక ఒకటి జామ చెట్టు కి, సపోటా చెట్టు కి మధ్యన దూరాన్ని కొలుస్తున్నది’ లవంగి వృత్తాంతం చెప్పి చెప్పినట్లు గా చెప్పి గడుసుగా తప్పుకున్నారు విహారి అంటారు. మంచు తెర కప్పిన మల్లెపువ్వు లానే ఉంటాయి పాఠకులకు అంటారు డా. తుమ్మలపల్లి వాణీ కుమారి గారు.
జగన్నాధ పండిత రాయలు విరాట్ రూపం, ధీషణ, లౌక్యం, సమయజ్ఞత, దిట్టతనం రచనలో కనిపిస్తుంది. ఆ రచన చేయటంలో విహారి గారు రచయితగా శ్రమ, మేధస్సు, సమయస్ఫూర్తి, భాషమీద పట్టు, చరిత్రతో పాటు, ఆ పాత్ర విశిష్టత రక్షించటంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఉర్దూ పదాలు ప్రయోగించడం లో భాషాపరంగా చిన్న వత్యాసాలు సలీం గారు చెపుతూ జాగ్రత్తలు చెప్పారు. ఊహాత్మక చారిత్రక తవ్వకం అంటారు సాగర్ శ్రీరామకవచం. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు డా.వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు.
జ్ఞానాన్వేషి-నిత్య సత్య విహారి, వీర సాహస కవి జగన్నాధుని జైత్రయాత్ర చారిత్రక నవలా సాహిత్యంలో పరమోత్కృష్టం. విహారి రసాకృతి నుంచి వెలువడిన అనర్ఘ రత్నం. “రచనా నాస్తి నిప్పులా” అంటారు డా. జి.వి. పూర్ణచంద్.
ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ గారిని ప్రశంసిస్తూ రోగికి వైద్యం ఎంత ఉపయోగమో, అలాగే మంచి రచన పాఠకుల హృదయాలను రంజింప చేస్తూ, విషయ గ్రహణం ఇస్తూ, భాషా జ్ఞాన శుద్ధి చేస్తుంది అంటారు. చారిత్రక అంశాల మేళవింపు, పాండిత్యం, మంత్రాంగాల్లో వీర విహారం సరస్వతీ దేవి అనుగ్రహం అంటారు పెద్దలు విశ్లేషకులు, సమీక్షకులు. పండితరాయామృతము రస రమ్య జగన్నాధీయం.
అశేష అభిమానుల్ని సంపాదించుకున్న “జగన్నాధ పండిత రాయలు”, “వైజయంతి” సమీక్షా మాల ధరించి నవలా సమాలోకనమ్ గా వెలువడటం, విహారి గారి రచనా వైభవానికి ప్రతీక అనవచ్చు. మన కాలపు జగన్నాధ పండిత రాయలు, విహారి గారు అంటారు మాకినీడి సూర్య భాస్కర్ గారు. జగన్నాధ పండిత రాయలు చదివిన వారికి నిజమే సుమా! అనిపించింది.
-శిపురపు అన్నపూర్ణ
ప్రతులకు: వైజయంతి – జగన్నాథ పండితరాయలు (నవలా సమాలోకనమ్)
రచయిత: విహారి
వెల: రూ. 200/-
మొబైల్: 98480 25600