ఆకట్టుకున్న ‘నేచురలిజం’ ఆర్ట్ ఎగ్జిబిషన్

–ఘనంగా ముగిసిన సాయి వైష్ణవి సోలో చిత్రకళా ప్రదర్శన
-సందర్శకులను ఆకట్టుకున్న వర్ణచిత్రాలు

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా ప్రముఖ యువ చిత్రకారిణి సాయి వైష్ణవి ఏర్పాటు చేసిన ‘నేచురలిజం’ సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన సందర్శకులకు కనువిందు చేసింది.

ప్రముఖ చిత్రకారుడు వట్టూరి శ్రీనివాసరావు శిష్యురాలైన సాయి వైష్ణవి.. తన కుంచెకు పదునుపెట్టి మొత్తం 34 అద్భుతమైన కళాఖండాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. అక్రిలిక్ రంగులను (Acrylic Paint) ఉపయోగించి ప్రకృతి రమణీయతను, ఆధ్యాత్మికతను ఆమె కాన్వాస్‌పై జీవకళ ఉట్టిపడేలా ఆవిష్కరించారు. ఒక సీనియర్ ఆర్టిస్ట్‌ను తలపించేలా ఎంతో పరిణతితో.. పక్షులు, వృక్షాలు, దైవిక రూపాలతో పాటు మానవునికి, ప్రకృతికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని తన వర్ణచిత్రాల ద్వారా అద్భుతంగా ప్రతిబింబించారు.

ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా ప్రముఖులు ఆకెళ్ళ రాఘవేంద్ర, నయనతార నందకుమార్, సరోజ బాలా, మునగ రామ్మోహన్ రావు తదితరులు హాజరై చిత్రాలను వీక్షించారు. సాయి వైష్ణవి ప్రతిభను వారు ప్రత్యేకంగా అభినందించారు. పెద్ద సంఖ్యలో తోటి కళాకారులు, కళాభిమానులు, కుటుంబ సభ్యులు ఈ ప్రదర్శనను సందర్శించి చిత్రాలను ఆసాంతం ఆస్వాదించారు.

ఉచితంగా జాతీయ జెండాలు, చిత్రాల పంపిణీ:
ఈ చిత్రకళా ప్రదర్శన నేపథ్యంలో దార్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులలో సుమారు 30 మందికి పైగా ‘మేరా భారత్ మహాన్’ జాతీయ జెండాలను, అలాగే దార్ల మురళీకృష్ణ రచించిన ‘సంక్షిప్త రామాయణం’ గ్రంథం తాలూకు లామినేట్ చేసిన ముఖచిత్రాలను ఆయన ఉచితంగా పంపిణీ చేశారు.

–కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap