సినిమాలు చేసేది అందుకే – పవన్ కల్యాణ్

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రీరిలీజ్ వేడుకను శిల్పకళావేదికలో ఆదివారం (04-04-21) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పలువురు హాజరయ్యారు.

కోవిడ్ నిబంధనల మధ్య వైభవంగా జరిగిన ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సినిమా ఫంక్షన్‌కు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా.. బండ్ల గణేష్ల మనం మాట్లాడలేం. పొలిటికల్ సభలో అయితే మాట్లాడొచ్చు కానీ, ఇక్కడ ఏం మాట్లాడతాం. నా గుండె, మనసు ఎప్పుడూ దేశం కోసం కొట్టుకుంటుంది. నేను మూడేళ్లు సినిమాలు చేయలేదంటే నాకు అంత టైమ్ అని అనిపించలేదు. నేను పని చేసుకుంటూ వెళ్లిపోయాను. దిల్ రాజు లాంటి నిర్మాత నాతో సినిమా చేస్తున్నారంటే నేను అదృష్టంగా భావిస్తా. కలలు కనేవాళ్లను నేను ఎప్పుడూ ఇష్టపడతా. దిల్ రాజు గారు అలా ఎన్నో కలలు కన్నారు. తొలిప్రేమ పోస్టర్ చూసే ఆయన సినిమా కొన్నారు. నా సినిమాలన్నీ దాదాపు ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. వకీల్ సాబ్ ద్వారా ఆయనను కలవడం సంతోషంగా ఉంది. నా కోసం కథలు రాయండి అని నేను ఎవరిని అడగలేదు. వేణు శ్రీరామ్ గారిలాంటి వ్యక్తులు పైకి ఎదుగుతుంటే వారికి నేనో, ఎవరో అవకాశం ఇచ్చామని చెప్పడం కాదు.. స్వశక్తితో వాళ్ళే అవకాశాన్ని దక్కించుకుంటారు. నేను నటుడిని ఆవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. సీఎం పదవి వస్తే అదృష్టం. అంతేకానీ దానికోసమే పని చేసేవ్యక్తిని కాను. సమాజం కోసం, దేశం కోసం మన పనిని మనం చేసుకుంటూ వెళ్లాలి.
అన్నయ్య మెగాస్టార్ అన్న మాటలే నమ్మ మీ ముందు నిలబెట్టాయి. రాజకీయాల్లోకి వెళ్లేలా చేశాయి. మీ అందరి అభిమానం సంపాదించే అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. కొంత మంది లాయర్లు మానవహక్కుల కోసం వారి జీవితాలనే త్యాగం చేశారు. మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులంటే నాకు ఎంతో గౌరవం. అలాంటి పాత్ర వకీల్ సాబ్’ ద్వారా చేయడం నా అదృష్టం. అమితాబ్ బచ్చన్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాను. ఆయన క్యారెక్టర్ చేయాలంటే నేను చేయగలనా అనుకున్నా. నా సినిమాలో సామాజిక స్పృహ ఉండేలా చూసుకుంటా. ఐటమ్ సాంగ్స్ కు బదులు దేశభక్తి పాటలు ఉంటే బాగుంటుంది. అనుకునేవాణ్ని కుటుంబ కథా చిత్రాలు చేయాలనే అనుకుంటా. వకీల్ సాబ్ అలాంటి సినిమా. స్త్రీమూర్తులందరికీ అంకితంగా వకీల్ సాబ్ సినిమా తీశాం. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ధైర్యంగా బయటకు వెళ్లే రోజులు రావాలి. నా సినిమా షూటింగ్స్ లో ఆడబిడ్డలను ఎవరైనా ఏడిపిస్తే నేను కర్రపట్టుకుని బయటకు వెళ్లేవాణ్ని. నా సినిమాలోని ఆడపిల్లలనే రక్షించుకోకపోతే నేను సినిమా హీరోను ఎలా అవుతా… ఈ దేశం బతకాలంటే ఆడబిడ్డల మాన, ప్రాణల రక్షణ చాలా అవసరం. భారత్ మాతాకీ జై అంటే సరిపోదు.. మన అడబిడ్డలను కాపాడుకునే సమాజం ఉండాలి. నిస్సహాయ స్థితిలో ఉన్న ముగ్గురు అమ్మాయిలను రక్షించే పాత్రలో నేను నటించడం నా అదృష్టం. నేను అన్ని సినిమాల కంటే ఈ సినిమాకు కొంచెం ఎక్కువ కష్టపడ్డా, లాయర్‌గా ప్రకాష్ రాజుగారు నటించడం నా పెర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకోవడానికి దోహదం చేసింది. రాజకీయంగా మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ, సినిమాల విషయానికి వస్తే ఆయన నాకు ఎంతో ఇష్టమైన నటుడు. తమన్ ఈ సినిమాకు మంచి సంగీతం అందించారు.

డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ: “ఫ్యాన్లందు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వేరయా అంటారు. నేను మొన్న ట్విట్టర్ ఓపెన్ చేస్తే పది మంది ఫ్యాన్స్ కల్యాణ్ గారిని జాగ్రత్తగా చూసుకోమని పెట్టారు. మామూలుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. దానికి మొదటగా ‘వకీల్ సాబ్ విజయభేరి మోగించబోతోంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ: “ఖుషీ, బంగారం తర్వాత పవన్ కల్యాణ్ గారితో మూడో సినిమా ‘హరిహరవీరమల్లు” తీస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా ఆయనతో కలిసి ఉండడం నాకు ఇష్టం. ఎవరికైనా ఏదైనా జరిగితే పవన్ తట్టుకోలేరు. అంత సున్నితమైన మనిషి. ఆయన రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాలు చేస్తున్నారంటే ఇదంతా ప్రజాసేవ కోసమే. ఇక్కడ సినిమాల్లో ఉంటూనే ఏపీలో ప్రజల్లోనూ ఉంటున్నారు. ఈయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత వస్తున్న తొలి సినిమా వకీల్ సాబ్. ఇది రీమేక్ సినిమా అయినా కల్యాణ్ గారు చేస్తే రీమేలా ఉందదు. ఈ సినిమాతో దిల్ రాజుగారికి మంచి పేరు వస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ: “ఏప్రిల్ 9న రియల్ పవర్ ఏంటో చూడబోతున్నాం. పవర్ స్టార్ పవర్ ఏంటో ఆరోజున తెలుస్తుంది.” అన్నారు.
చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ: “ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత చిన్న సినిమా అయినా ఒక రచయిత పెన్ను పెడితేనే మొదలవుతుంది. పింక్ రచయితకు, దర్శకనిర్మాతలకు, తమిళంలో రీమేక్ చేసిన దర్శకనిర్మాతలకు ముందుగా థ్యాంక్స్, నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే.. దిల్ రాజు గారు, త్రివిక్రమ్ గారి వల్ల వచ్చింది. కల్యాణ్ గారు హిమాలయ పర్వతం లాంటి వారు. నేను ఇండస్ట్రీలో ఫస్ట్ వర్క్ చేసింది కల్యాణ్ గారి యాడ్ కే. దిల్ రాజుగారు చెప్పినట్లు ‘తొలిప్రేమ’ రోజు సంధ్య థియేటర్ లో నేను కూడా ఉన్నాను. నిజంగా ఇది డెస్టినీ అని నమ్ముతున్నా. పవన్ కల్యాణ్ గారు కోరుకుంటే దేశంలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉంటారు. నా లాంటి మామూలు టైరెక్టర్‌ను ఆయన ఎంచుకున్నారంటే అది నా డెస్టినీ, నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో. నేను ఎప్పటికీ పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా గర్వపడతా.” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap