నేలకొరిగిన “మహా వృక్షం”

హరిత యాత్రలో అలసిన వనజీవి… ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత.

వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని కోటికిపైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన ధన్యజీవి రామయ్య. తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేసి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రకృతిపై ఆయనకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదంటే.. తన ముగ్గురు మనవరాళ్లకు చెట్ల పేర్లు పెట్టారు. ప్రకృతి, పచ్చదనంపై ప్రేమతో తన మనవరాళ్లకు చందన పుష్ప, హరిత లావణ్య, వనశ్రీ అనే పేర్లు పెట్టారు. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు.

జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారంచేసిన ఆయన రోడ్ల పక్కన, పాఠశాలలు, దవాఖానలు, దేవాలయాల్లో మొక్కలు నాటారు. రామయ్య సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

చిన్నప్పటి నుండి ‘చెట్లను పెంచండి’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపుతూ.. స్వయంగా మొక్కలు నాటుతూ పర్యావరణానికి విశేషమైన సేవ చేసిన వారు దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య.‌ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ పర్యావరణ మార్పులని వనజీవి రామయ్య తరచూ చెబుతుండేవారు. దీనికి పరిష్కారం ఉన్న అడవులను సంరక్షించడంతో పాటు.. ప్రతి ఒక్కరూ కొత్తగా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడమే అని ఆయన బలంగా విశ్వసించారు. ఈ దిశగా ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. తన జీవితాన్నే పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసిన వనజీవి రామయ్య, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

బాల్యం-విద్యాభ్యాసం: ఆయన 1937 జూలై 1న లాలయ్య, పుల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఆతని స్వగ్రామం ముత్తగూడెం. పంటపొలాలు రెడ్డిపల్లిలో ఉండటంతో ఇక్కడికి చిన్నప్పుడే వచ్చి స్థిరపడ్డారు. ముత్తగూడెం పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు.

“అమ్మ నాటిన బీర గింజలు… అమ్మ నుంచి స్ఫూర్తి…

చిన్నతనంలో ఇంటి పెరట్లో అమ్మ బీర గింజలు నాటి బీరకాయలు పండించడం చూశారు. అగ్గిపెట్టెలతో ఆడుకునే అగ్గిపుల్లలు కూడా నాటితే అవి పండుతాయని భావించి ఇంటి ముందు ఇంట్లోని అగ్గిపుల్లలు నాటారు. అగ్గిపెట్టె కనిపించక పోవడంతో అమ్మ అడిగితే బీర గింజల్లా భూమిలో నాటానని చెప్పారు. అగ్గిపుల్లలు మొలవవని, విత్తనాలు మొలుస్తాయని చెప్పడటంతో నాటి నుంచి వివిధ రకాల విత్తనాలను సేకరించి వాటిని నాటి మొక్కలు పెరిగితే ఆ పచ్చదనాన్ని చూసి సంతోషపడేవారు. అలా అమ్మ నాటిన బీర గింజలను చూసి స్ఫూర్తి పొందారు.”

ఆ సమయంలోనే ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం- లాభాలు’ అనే పాఠం అతనిలో స్ఫూర్తినింపింది. తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా భాగంలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అది మొదలు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రామయ్య మొక్కలనే బహుమతిగా ఇస్తూ పెంచాలంటారు.

వ్యక్తిగత జీవితం: రామయ్యకు ఆయన 15వ ఏట ఖమ్మంజిల్లా, కొణిజెర్ల మండలం తుమ్మలపల్లికి చెందిన జానమ్మతో ఇరువైపులా పెద్దల నిర్ణయంతో వివాహం అయ్యింది. వీరికి నలుగురు సంతానం అందులో ముగ్గురు కుమారులు ఒక్క కుమార్తె. ఆయన చిన్నతనం నుంచి కుటుంబ భారాన్ని మోస్తూనే జీవితాంతం మొక్కలను పెంచుతున్నారు.

సామాజిక సేవ: రామయ్య 60 సంవత్సరాల వయస్సులోనూ అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించి, మొక్కలు పెంచి, పదిమందికి పంచుతుంటారు. వేసవి వచ్చిందంటే వీరు అడవులు తిరుగుతూ రకరకాల విత్తనాలు సేకరిస్తుంటారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేస్తారు. ఎవరికీ తెలియని చెట్ల పేర్లు. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోతారు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు, ఖాళీ జాగాల్లో, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గింజలు నాటుతాడు. తొలకరి చినుకులు పడగానే ఆ గింజలను నాటేపని ప్రారంభిస్తారు. ఈ మొక్కలను పది మందికీ పంచి హరితహారం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి.

స్వీయ ప్రచార సాధనాలు: పరిసరాలలో దొరికే అనేక వ్యర్ధ పదార్ధాల నుంచి తన ప్రచార సాధనాలను రామయ్య తయారుచేసుకోగలరు. ట్రాక్టర్లు బాగుచేసే షెడ్ లలో దొరకేగుంద్రని రింగులపై తన స్వంత డబ్బులతో రంగుడబ్బాలు కొని కుదిరినట్లు అక్షరాలు రాస్తారు. తలకి ఎప్పుడూ ఇటువంటి ఒక రింగును ఆహార్యంగా ధరించడం ద్వారా తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించాలని కోరుకుంటారు. చిన్న చిన్న మంటి ప్లాస్టిక్ కుండలు పాత్రలు, రింగులు, డబ్బాలు ఇలా ఒక్కటేమిటి ఎటువంటి వస్తువునైనా మొక్కల పెంపకాన్ని ప్రొత్సహించే ప్రచార సాధనంగా మార్చడంలో రామయ్యగారు దిట్ట. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా “వృక్షోరక్షతి రక్షిత:” అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని వెళ్ళఇ అక్కడ ప్రచారం చేస్తారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా మొక్కలనే బహుమతులుగా ఇచ్చి వాటిని పెంచమని ప్రోత్సహించే వారు.

“హరిత యాత్ర దిన చర్య:

“ప్రతీరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచి ఇనుపరేకులు, కార్డుబోర్డులను గుండ్రంగా కట్ చేసి ఆకుపచ్చ రంగు వేసి ఆరాక, దానిపై ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ నినాదం రాస్తారు. ఆరు గంటల దాకా ప్రజల్లో చైతన్యం నింపేందుకు కావాల్సిన హరిత చక్రాలను తయారు చేస్తుంటారు. అనంతరం వేపపుల్ల నోట్లో పెట్టుకొని నా ద్విచక్రవాహనంపై విత్తనాలు తీసుకొని ఉదయం 11 గంటల దాకా రోడ్లు, చెరువులు, కాల్వ గట్లు, గుట్టలపై తిరుగుతూ విత్తనాలు నాటుతుంటారు. 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి నాలుగు పత్రికలు చదువుతారు. పత్రికల్లో హరిత హారం, చెట్ల పెంపకంపై వచ్చిన కటింగులు చేసి భద్రపర్చుకుంటారు. కొంచెం విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మళ్లీ హరిత ద్విచక్ర వాహనంపై వెళుతూ రాత్రి ఆరుగంటల దాకా విత్తనాలు నాటుతుంటారు. ఇలా ప్రతీ నిత్యం విధి నిర్వహణలాగా ప్రతీ రోజూ మొక్కలు నాటుతూనే ఉంటారు”.

120 రకాల మొక్కల చరిత్రను…

ఎవరైనా రామయ్య వద్దకు వెళ్లి విత్తనాలు, మొక్కలు కావాలని అడిగితే.. అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చి మొక్కలు నాటాలని, సంరక్షించాలని చెబుతుంటారు. ఏ శుభకార్యానికి వెళ్లినా విత్తనాలు, మొక్కలు తీసుకువెళ్లి ఇస్తుంటారు. పర్యావరణహిత కార్యక్రమాలకు వెళ్తే ‘వృక్షో రక్షితి.. రక్షితః’ తదితర నినాదాలు రాసిన ప్లకార్డులు సదరు ప్రాంతంలో ఏర్పాటు చేసిరావడం రామయ్య లక్షణం. రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. రామయ్య 120 రకాల మొక్కల చరిత్రను తేలికగా వివరిస్తారు.చెట్టు గొప్పదనాన్ని తెలిపేలా 60 వరకు పాటలు, 2 వేలకు పైగా సూక్తులు రాశారు. మొదట్లో మొక్కలు నాటుతుంటే అందరూ చూసి నవ్వినా అలాంటి వారిని పట్టించుకోకుండా పచ్చని వనాలే లక్ష్యంగా మొక్కలతోనే సహాజీవనం చేశారు.

యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తికి అరుదైన శిక్ష, నిజంగా గ్రేట్….

మెుక్కలపై ఆయనకు ఎంత ప్రేమ అంటే, 2022లో ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. రామయ్య ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఉదయం పూట ఆయన తన ఇంటి దగ్గర మొక్కలకు నీరు పోయడానికి టూవీలర్‌పై బయల్దేరగా.. వెనక నుంచి ఓ డీసీఎం వాహనం ఆయన బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. కాలు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ని ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు యాక్సిడెంట్ చేసిన డ్రైవర్‌కు అరుదైన శిక్ష విధించారు రామయ్య. పోలీస్ స్టేషన్‌లో కేసు వద్దని.. బదులుగా అతడిచే 100 మొక్కలు నాటించి వాటిని సంరక్షించేలా చూడాలన్నారు. అలా తనకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని క్షమించడంతో పాటు మొక్కలపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.

పాఠ్యాంశంగా రామయ్య జీవితం: మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించారు. 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు.

అవార్డులు:

*2017 సంవత్సరానికి పద్మశ్రీ (సామాజిక సేవ)
*2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర
*యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్‌
*1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు
*ఖమ్మం రోటరీ క్లబ్ అవార్డు.

*కోటికిపైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి.

దరిపల్లి రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో 2025 ఏప్రిల్ 12న మరణించాడు.
‘వృక్షో రక్షతి రక్షిత’ అంటూ ప్రకృతిపై ప్రేమను చాటుకున్న ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ సామాజిక కార్యకర్తగా పర్యావరణ పరిరక్షణ కోసం తుదిశ్వాస వరకు కృషి చేసిన ఆయన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

ఏ. శ్రీనివాస రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap