అమరుడైన సమర గాయకుడు – వంగపండు

పాట కాదు ప్రజల గుండె చప్పడు ఆయన… ఆయన పాటే విప్లవం… జనాట్యమండలి వ్యవస్థాపకుడు… ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడిన వంగపండు ప్రసాదరావు (77) గళం మూగబోయింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పెదబొందపల్లిలో తన నివాసంలో గుండెపోటుతో  ఆగస్ట్ 4న తన నివాసంలో కన్నుమూశారు.

వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు. 1972లో జననాట్యమండలిని స్థాపించారు.

మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచించిన వంగపండు.. పేద ప్రజలు, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు.

వంగపండు ప్రసాదరావు ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు. హేతువాది, ఉత్తరాంధ్ర గద్దర్గా పేరుతెచ్చుకున్నాడు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం అందుకున్నారు.

ఈయన పార్వతీపురం దగ్గర పెదబొండపల్లిలో 1943 జూన్ లో జన్మించారు. తండ్రి జగన్నాధం తల్లి చినతల్లి.2008, నవంబరు 23 న తెనాలిలో ఈయనకు బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ అవార్డును బి.నరసింగరావు చేతులమీదుగా ప్రధానం చేశారు.ప్రజలకోసం బ్రతికిన నాజర్ లాంటి కళాకారుడని వంగపండును పోలుస్తారు. వంగపండు ప్రసాదరావు, గద్దర్తో కలిసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ, హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. “యంత్రమెట్టా నడుస్తు ఉందంటే…” అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది.విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు, గద్దర్ మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.

విప్లవ కవిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు. వంగపండు ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర జానపదాలకు గజ్జెకట్టి ఆడిపాడారు.

వంగపండు జీవనం గురించి ఆయన చెప్పిన మాటలివి.
“మాది విజయనగరం జిల్లా పెదబొండపల్లి. పెరిగింది గ్రామీణ వాతావరణం. సామాన్య రైతు కుటుంబం. ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురు అన్నదమ్ములం. నేనే పెద్దవాడిని. చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫెయిల్‌ కావడంతో బొబ్బిలిలో ఐటీఐ చేశాను. అప్పట్లో చైనా యుద్ధంలో పాల్గొనాలనే పిలుపు వస్తే, ఆ ట్రైనింగ్‌ తీసుకున్నా. ఆ యుద్ధం ఆగిపోవడంతో ఊరుబాట పట్టా. అప్పటికే మా నాన్న ఊళ్లో భూమి అమ్మేసి, రాయగఢ్‌లో కొన్నాడు. అక్కడ ఆయనకు వ్యవసాయంలో కొన్నాళ్లు తోడుగా ఉన్నా. ఆ భూమి అడవికి దగ్గరగా ఉండేది. దీంతో అక్కడి గిరిజనులతో పరిచయాలు.. వారి పదాలు నా పాటల్లో బాగా దొర్లాయి. ఈ పనుల్లో పడి తెలిసిన పల్లె పదాలతో తోచిన బాణీలు కట్టుకుని పాడుతుంటే ఊళ్లో అంతా ‘ఓరేయ్‌ కవీ’ అని పిలిచేవారు. అప్పట్లో అర్థంకాని పదాలు రాస్తేనే కవిత్వం అనుకునేవాడిని. నేనేదో లల్లాయ పదాలతో పాటలు అల్లుకుపోయేవాడిని. నాచేత పాటలు పాడించుకుని, సరదా పడేవారు. అంతవరకు సరదా సరదాగా గడిచిపోయింది. పెళ్లైన రెండేళ్లకు మొదలైన నక్సల్స్‌బరి ఉద్యమం నాలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఎక్కడ ఉన్నా సరే ఉద్యమమే. అదే జీవితమైంది. ఆ ఉద్యమంలో ఎంతోమందిని కలిశా, ఎందరి కష్టాలనో చూశాను. జనాన్ని జాగృతం చేయడానికి వాటన్నిటినీ పాటగా రూపుకట్టా. ఆ ఊపులో 400కు పైగా జాన పద పాటలు రాసాను. వాటిలో 200కు పైగా గీతాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి.ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్‌ యార్డులో ఫిట్టర్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం కంటే ఉద్యమమే నాకు ఆత్మసంతృప్తినిచ్చేది. షిప్‌యార్డులో పని చేస్తూ ఉన్నా మనసంతా ఉద్యమం వైపే ఉండేది. దీంతో పదిరోజులు పనికెళ్లడం, ఇరవై రోజులు పాటలు పాడుకుంటూ ఊళ్లమ్మట పడి తిరగడం చేశా. అలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ , కర్ణాటక రాష్ట్రాలన్నీ తిరిగా. ఇలా తిరుగుతూ ఉంటే ఏమౌతుంది.. ఇంట్లో పూట గడవని స్థితి. ఒక పూట తింటే మరో పూట పస్తే! అయినా సరే నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఆరేళ్ల సర్వీసులో ఉన్నా తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పూర్తిస్థాయి ఉద్యమంలోనే ఉన్నాను”. ఇది ఆయన ముచ్చట. చివరి రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటి ధియేటర్ ఆర్ట్స్ జానపద విభాగంలో లెక్చరర్ గా పనిచేసారు. వీరి కుమార్తె వంగపండు ఉష కూడా జనపదగాయణి. ఉష ప్రస్తుతం ఏ.పి. స్టేట్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి కి చైర్ పెర్సన్ గా వున్నారు.

ఉత్తరాంధ్ర జానపదులను తెలుగు నేలన విస్తృతంగా ప్రచారం కల్పించడంలో వంగపండు విశేషంగా కృషి చేశారు.

పాటలు, రచనలతో అనేక మంది అభిమానాన్ని సంపాదించారు. శ్రీకాకుళం రైతాంగ పోరాటంతో వెలుగులోకి వచ్చిన ఆయన ఇటీవల కాలం వరకూ ఆట, పాటలతో అందరినీ అలరించారు. ఆయన మరణం సాహిత్య లోకానికి, విప్లవపోరాటాలకు తీరని లోటు.

వంగపండు మరణంపై ప్రజాగాయకుడు, విప్లవకవి గద్దర్‌ స్పందిస్తూ.. వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పడు. అక్షరం ఉన్నంత వరకు వంగపండు ఉంటాడు. ఆయన పాటలు 10 భాషల్లోకి అనువదించబడ్డాయి. గత మూడు దశాబ్దాలలో వందలాది పాటలు పాడారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఘనత వంగపండుది అని, మా బావ లేనిలోటు తీరనిదని తన సంతాపాన్ని తెలియజేసారు.

2 thoughts on “అమరుడైన సమర గాయకుడు – వంగపండు

  1. వంగపండు గారి పరిచయం మిగతావారికి వారి వారి భావాలకు స్పూర్తినిచ్చేదిగా వుంది
    ఒక గోప్పవిప్లవ కళాకారుడను సమాజం కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap