చిత్రధ్వని…’వపా’

ఖరగ్ పూర్ లో మాకు ఒక బుక్ స్టాల్ వుండేది.
ఆ షాపుకి అన్ని దిన, వార, పక్ష, మాసపత్రికలు వచ్చేవి. వాటిలో చెప్పుకోదగ్గవి ఆంధ్ర సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక చందమామ,యువ మాస పత్రికలు.
నేను ప్రత్యేకంగా వీటిని మాత్రమే పేర్కోడానికి కారణమేవిటంటే…
ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ పత్రికలు కొన్ని పండగ సమయాల్లో మద్రాసుకు చెందిన కునేగా మరికొళొందు అనే సెంటు పూసుకుని వస్తే–యువ దీపావళి ప్రత్యేక సంచిక వడ్డాదిపాపయ్య గారి చిత్రాలతో ముస్తాబై వచ్చేది. అలాగే చందమామ కూడా వారి ముఖ చిత్రాలతో వచ్చేది.

1960 దశకంలో మా ఖరగ్ పూర్ లో కునేగా సెంటు పేరు, వడ్డాదిపాపయ్య గారి పేరు తెలియనివారు లేరంటే అది అతిశయోక్తి మాత్రం కాదు.
కునేగా సెంటు వీశేషమేవిటంటే ఆ సెంటు చాన్నాళ్ళ పాటు ఆ పరిమళం పోకుండా వుండేది. అందుకని పత్రికలు చదవని వారు సైతం సెంటు పూసుకుని వచ్చిన పత్రికల్ని కొనుక్కుని అల్మిరాలోని బట్టల అడుగున దాచేవారు, దాంతో అల్మిరా తలుపులు తెరిచినప్పుడల్లా పరిమళం గుప్పుమనేది చాన్నాళ్ళపాటు.

వడ్డాదిపాపయ్య గారి చిత్రాలు చూడ్డానికి వేయి కనులు చాలవులే అన్నట్టు వుండేవి.ఎందుకంటే విలక్షణత, సలక్షణత వారి చిత్రాల్లో కనిపించేది.అందుకే అవి పాఠకుల మనసులు ఊయలలూపేవి. వివిధ వర్ణాల మేలవింపుతో ఆయన కుంచె ఎన్ని విన్యాసాలో చూపేది. ఆందుకని ఆ రోజుల్లో కునేగా పేరుని పాపయ్యగారి పేరును ఎవరూ మరచిపోయేవారు కాదు.

నేడు కునేగా పేరు తెలీని వాళ్ళున్నారేమో గాని వపా గారి పేరెరుగని వారు లేరు.
దీపావళి ప్రత్యేక సంచిక యువ వచ్చినట్టే హిందీలో దీపావళి, రత్నదీప్ అనే రెండు ప్రత్యేక సంచికలు వచ్చేవి.రత్నదీప్ లో ముల్గాంకర్ అనే చిత్రకారుడి చిత్రాలు వచ్చేవి. అయితే వపాగారి చిత్రాల్లో వుండే లాలిత్యం, వర్ణసమ్మేళనం ముల్గాంకర్ చిత్రాల్లో వుండేది కాదు. వపా గారి వర్ణసమ్మేళనం ఆశ్చర్యపరిచేది. చిన్న ముఖంలో కూడా ఎన్ని రంగులో వుండి చూపరులను అబ్బురపాటుకు గురిచేసేది.

Deepavali YUVA magazines

యువ దీపావళి ప్రత్యేక సంచికకు ప్రత్యేకంగా పాఠకులుండేవారు.అటువంటివారిలో నేనొకడిని.
వారి చిత్రాల కింద వపా అనే సంతకం ముత్యాల్లాంటి అక్షరాలతో కనిపించేది. అది వడ్డాదిపాపయ్య అనే పేరుకి సంక్షిప్త నామం అని అందరికీ తెలిసిందే.అంతేకాదు. నిలువు గీతకి అటు ఇటు రెండు సున్నాలతో ఒక డిజైన్ కూడా వుండేది. ఒకటి వ అనే అక్షరంలోని సున్నాకి మరోటి పా అనే
అక్షరంలోని సున్నాకీ చిహ్నాలు.అటువంటి విలక్షణ సంతకం మరే చీత్రకారుడిలోనూ నేను చూడలేదు.

వపా గారితో నాకేమీ పరిచయం లేదు గానీ ఒకే ఒక్కసారి మాత్రమే ఆయనని నేను చూశాను. అది కూడా నా చిన్నప్పుడు.
అదెలా జరిగిందంటే…
ఖరగ్ పూర్ లో విజ్ఞాన సమితి అనే సంస్థ ఒకటి ఉండేది. ఆ సంస్థ అక్కడి ఆంధ్రభవనంలో రెండుసార్లు ఉగాది రోజున చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఒక ఏడాది అందులో నేను పాల్గొని లైట్ హౌస్ చిత్రం వేసి ఇచ్చాను. మా పెద్దన్నయ్య మైదానంలో గడ్డి మేస్తున్న ఆవు బొమ్మ వేసి ఇచ్చాడు.

‘వపా’ చిత్ర కళా ప్రదర్శన: ఒక ఏడాది చిత్ర ప్రదర్శనకి పాపయ్య గారిని ఆహ్వానిస్తే ఎక్కడికీ వెళ్ళని పాపయ్య గారు ప్రవాసాంధ్రుల మీద ఉండే అభిమానంతో ఆ ప్రదర్శనకి హాజరై సమితి సభ్యుల అభ్యర్ధన మేరకు అప్పటికప్పుడే బొగ్గుతో ఆర్ట్ పేపర్ల మీద కొన్ని చిత్రాలు గీసి ఇచ్చారు. అనంతరం సమితి సన్మానాన్ని కూడా అందుకున్నారు. అంతకు మించి ఆయన ఎక్కడా సన్మానం చేయించుకున్నట్టు లేదు. ఆయనకి పబ్లిసిటీ కూడా ఇష్టపడేది కాదు.
ఆయనకి ఆంధ్రాభిమానం ఎక్కువ. మద్రాసులో విజయా ఆఫీసులో ఉద్యోగం చేసిన తను కట్టుకునే పంచెలు,లాల్చీలు ఆంధ్రకి వచ్చే కొనుక్కునే వారు.
ఆయన మద్రాసు నుంచి వచ్చేశాక అనకాపల్లికి దగ్గరలోని కశింకోటలోని ఇంటిలోనే వుండేవారట. ఎక్కడికీ వెళ్ళడం కానీ ఎవరినీ కలవడంగానీ చేసేవారు కాదట. స్వాతి వార పత్రికకి కూడా ముఖచిత్రాలు వేస్తుండే రోజుల్లో స్వాతి యాజమాన్యం కోరిక మీద పాపయ్యగారి మిత్రుడు,రచయిత,ఎల్.ఐ.సి ఉద్యోగి ఇచ్చాపురపు రామచంద్రంగారు పాపయ్యని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే వారికి మిత్రమే పాపయ్య తన ఇంటిలోనికి ఆహ్వానించారట.అది కూడా తెల్లకాగితం మీద ప్రశ్నలు రాసిస్తే వాటికి ముత్యాలకోవలాంటి అక్షరాలతో సమాధానాలు రాసి యిచ్చారని జీవితబీమా సంస్థ అనకాపల్లి శాఖలో ఉద్యోగం చేస్తున్న నా మిత్రుడు, రచయిత రంగబాబు తెలిపారు. వపా గారు ఎవరినీ కలవకుండా ఒక రుషిలాగా అఃతర్ముఖుడై శేష జీవితం గడిపారని ఆయనన్నారు.

‘వపా’ గారి కొన్ని చిత్రాల్లో కశింకోట పరిసరాల్లోని ప్రకృతి కనిపిస్తుంది.ఆ తాటి చెట్లు,శారదా నది పరీవాక ప్రాంతాలు ఆ చిత్రాల్లో గోచరిస్తాయి.
ఖరగ్ పూర్ ఐ.ఐ.టి. లోని లైబ్రరీలో తెలుగు విభాగాధిపతిగా ఉద్యోగం చేసి రిటైరై ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న తెనాలి వాస్తవ్యులు బాలంరాజు కృష్ణం రాజు గారు నాకు మంచి మిత్రులు. వారు నాకు వాట్సాప్ లో పాపయ్యగారి గురించి తెలియపరుస్తూ ‘తెనాలిలో ఉన్న నా ఆత్మీయ మిత్రుడు, సుమారు ఐదు వేల పైచిలుకు చిత్రాలు గీసిన గొప్ప చిత్రకారుడు శ్రీ గోలి సత్యనారాయణ వడ్డాదిపాపయ్య గీసిన అద్భుతమైన చిత్రాలు నాకు పంపారు.ఇది నాకు అత్యంత సంతోషం కలిగించిన విషయం అని మీకు తెలియజేసుకుంటున్నాను’అనిరాశారు.

Madhavi Sanaraa

ఆంధ్రదేశంలో వందలాది మంది ప్రసిద్ధులైన చిత్రకారులెందరో ఉన్నా. గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినా జనసామాన్యానికి వడ్డాదిపాపయ్య, బాపుని తెలిసినంతగా మిగతా వారి గురించి తెలీదు. వారిరువురూ తెలుగు కళాకాశంలో సూర్య చంద్రులనిపిస్తారు.

మాధవీసనారా
(కవి, సీనియర్ పత్రికా విలేఖరి)

2 thoughts on “చిత్రధ్వని…’వపా’

  1. చాలా విపులంగా వ్యక్తీకరించారు.
    మనసును కదిలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap