ఘనంగా వపా – బాపు ఆర్ట్ అకాడెమి 5 వ వార్షికోత్సవం ..
దక్షిణ భారత చిత్రకారులతో వర్కు షాప్-చిత్రకళా ప్రదర్శన ..
వపా – బాపు ఆర్ట్ అకాడెమి 5 వ వార్షికోత్సవ సందర్భంగా 15 మంది చిత్రకారులతో వర్కు షాప్ మరియు చిత్రకళా ప్రదర్శన పాలకొల్లులో మూడు రోజులపాటు నిర్వహించారు.
ఎందరో సినీ నటులకు, రంగస్థల కళాకారులకు, చిత్రకారులకు నిలయం పాలకొల్లు. ముఖ్యంగా ఎస్.ఎం. కేతా, ఈశ్వర్, గంగాధర్, రామారావు, లంక భాస్కర్ లాంటి చిత్రకారులు ఎందరో సినీ పరిశ్రమకి తమ సేవలను అందించారు. కళలకు ప్రసిద్ది చెందిన ఈ పట్టణంలో ఇటీవల ప్రముఖ చిత్రకారులంతా కలిసి ఒక చోట చేరి తమ చిత్రకళా నైపుణ్యంతో కళాభిమానుల్ని కట్టిపడేశారు. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన ఈ దక్షిణ భారత చిత్రకారుల ప్రదర్శన అబ్బురపరచేలా సాగింది. చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన కళాఖండాలు చూసి అద్భుతమంటూ ప్రశంసల జల్లు కురిపించారు. పట్టణ జీవనాన్ని ప్రతిబింబించేలా పాలకొల్లు పెదగోపురం, ఎదురుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, మెయిన్ రోడ్డు, ఆలయంలోకి వెళుతున్న భక్తులతో వేసిన పెయింటింగ్ అందర్నీ ఆకర్షించింది. పట్టణానికి చెందిన జీఎస్ఎన్ వేసిన జాతీయ నాయకుల చిత్రాలు ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడకు వచ్చిన పలువురు చిత్రకారులు తమ అనుభవాలల్నీ, అనుభూతుల్ని మీడియాతో పంచుకున్నారు. నేటి తరంలో చిత్రలేఖనంపై తల్లిదండ్రులకు చిన్న చూపు ఉందని.. తమ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని కోరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో ఉన్న కళాత్మకతను ప్రోత్సహించడం లేదని వాపోయారు. చిత్రకళ ద్వారా తాము మంచి సంపాదనే కాకుండా పేరు ప్రఖ్యాతులు.. అంతకు మించి మానసిక ఆనందం పొందుతున్నామని చెప్పారు. ఇలాంటి రంగాన్ని ఎంచుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు పెడతారనేది వాస్తవం కాదని, యువతలో ఈ కళ పట్ల ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు.
ముగింపు కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు బి.ఏ. రెడ్డి గార్ని సత్కరించారు. ఈ కార్యక్రమం లో 64కళలు.కాం ఎడిటర్ కళాసాగర్, చిత్రకారులు ఒస్మాన్ ఖాన్, దేవీప్రసాద్, ఎన్.యస్. శర్మ, కడలి సురేష్, బి. సూర్యనారాయణ, బాబు పాల్గోన్నారు. పిల్లలకు నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో విజేతలకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేసారు. అకాడెమి ప్రెసిడెంట్ రాఖీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆర్టిస్ట్ బాబు రెండు మూడు నిమిషాల్లో లైఫ్ స్కెచ్ లు వేసి సందర్శకులను అబ్బురపరిచారు.
Nice program sir
Very good event in Palakol but I missed.