సాంస్కృతిక సౌందర్య సృష్టికర్త వడ్డాది పాపయ్య

వ్యవసాయ కళాశాలలో ఆర్టిస్టు – ఫోటోగ్రాఫర్ గా, సినిమా రంగంలో కళాశాఖలోనూ పనిచేసిన సింగంపల్లి సత్యనారాయణ గారికి వపా తో వున్న అనుబంధం …

చిత్రకళా రంగంలో నిష్ణాతులు, ఎంతో ప్రతిభావంతులైన వడ్డాది పాపయ్యగారి గురించి – వారితో నాకున్న ప్రత్యక్ష అనుబంధం గురించి సాగర్ గారు వ్రాయమనటం నా అదృష్టం. ఇది నేను ఊహించని పరిణామం. ఈ విషయంలో సాగర్‌ గార్కి వారి మిత్రులు చలపతిరావు గారికి అభినందనలు – చందమామ పుస్తకాలు చూసిన వారందరకు వడ్డాది పాపయ్యగారు తెలుసు – యువపత్రికకు కూడా ఆయన చిత్రాలు వేసారు. వపా గారు తెలుగు వానిగా పుట్టటం ఆంధ్రుల అదృష్టం. .

నేను మద్రాసులో కొద్దికాలం సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ వాలి గారి వద్ద ఉండేవాడిని. ఆయన అంజలీదేవి తీసిన చిత్రాలకు కళాదర్శకులుగా ఉండేవారు. 1969వ సం.లో వారు ఏకవీర చిత్రానికి పనిచేసేటప్పుడు నేనూ వారితో పాటు ఆ చిత్రానికి పనిచేసాను. ఆవిధంగా సంపూర్ణ రామాయణం, భక్తతుకారాం మొదలైన సినిమాలకు పనిచేస్తూ.. వాహినీ స్టూడియోలో చీఫ్ ఆర్టిస్టుగా పనిచేసే జయరామిరెడ్డిగారి వద్ద కూడా ఉండే అవకాశం దొరికింది. ఇవన్నీ నా వ్యక్తిగత విషయాలు. అయితే నేను మద్రాసులో ఉన్నప్పుడు ఒకరోజు చందమామ ముద్రించే ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ చందమామ చిత్రకారులైన చిత్రగారిని, శంకర్ గారిని కలిశాను. వారిద్దరూ చందమామ స్టాఫ్ అంతా కూర్చొనే ఒక పెద్ద హాలులో కూర్చొని చిత్రాలు వేస్తున్నారు. తరువాత వారిని వపా గారిని చూడాలి ఎక్కడుంటారని అడిగాను. వారు అవకాశమిస్తే చూడండి ఆ ముందుగదిలో ఉంటారని చూపించారు.

నేను హాలులోంచి వరండాలోకి వెళ్ళి అక్కడనుండి కుడి ప్రక్కకు వెళ్ళాను. ముందు ఒక కిటికీ వచ్చింది. ఆ లోపల చూస్తే ఒకాయన చిత్రాలు వేస్తున్నాడు. ఆయనే వపా గారని గుర్తించాను. తరువాత ఒక గుమ్మం వచ్చింది. లోపలకు వెళ్ళాను. ఆయన వేస్తున్న పెయింటింగ్ ను ఆపుచేసి నావంక ఇబ్బందిగా చూశారు. ఆయన గదిలోకి ఎవరూ రావటం ఇష్టపడరు. అక్కడ ఆయనకు ఎదురుగా ఒక కుర్చీనే ఉంది. అందులో కూర్చోమని సైగ చేశారు. ఒక గంటపైనే మౌనంగా కూర్చున్నాను. ఆయన పని చేసుకుంటున్నారు.

Swapna Sowbhagyam

టేబుల్ మీద బ్రెష్ లు పెట్టుకొనే ఒక స్టాండుంది. తన చిత్రాలలో వేసే ఒక గుర్తు 010 మాత్రం ఆ స్టాండుకు చుట్టూ డిజైన్ లా వేశారు. నాకు కనిపించకుండా బోర్డు అడ్డంగా పెట్టుకొని చిత్రం ఏదో వేస్తున్నారు. ఆయన చూడటానికి పొట్టిగా తెల్లగా … ఇంకా తెల్లటి జుబ్బా పంచి కట్టుకొని నీలంరంగు కనుగుడ్లతో బలంగా కనిపిస్తారు.
ఆ సమయంలో నాకో విషయం జ్ఞాపకమొచ్చింది. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో పనిచేసే రామారావు, పూర్ణచంద్రరావు, మురళి మొదలైన ఆర్టిస్టులందరూ కలసి ఆయనను చూడటానికి శ్రీకాకుళంలోని వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. వీరి రాకను గమనించిన వపా గారు తన గదికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయారట. ఈ బాపట్ల చిత్రకారులు చూసి చూసి తిరుగు రైలులో బాపట్లకు వచ్చేశారు. వారి అనుభవం నాకు చెప్పారు. ఈ విధంగా చాలామందికి వపా గారితో జరిగిన అనుభవాలు విన్నాను.

ఇలాంటి అనుభూతులను స్మరించుకుంటూ చాలా సేపు కూర్చున్నాను. తర్వాత ధైర్యం చేసి “మీరు చిత్రాలు వేయటానికి ఎవరైనా స్త్రీ మూర్తిని మోడల్ గా పెట్టుకున్నారా? అని అడిగాను. ఆయన ఏమీ మాట్లాడలేదు.

చాలాసేపు కూర్చున్నాక ఆయన లేచి ఒక పెట్టెలోనుండి కొన్ని చిత్రాలు తీసుకువచ్చి నా ముందు పెట్టారు. అవన్నీ వపా గారు స్వయంగా వేసిన చిత్రాలు. ఒక గంట సేపు చూశాను. తర్వాత ఆయన మాట్లాడుతూ నేను బాగా వేసిన చిత్రాలు కాకుండా నాకు నచ్చనివి, వ్యర్ధమనుకున్నవి మాత్రం ముద్రిస్తారు అన్నారు. ఆ సమయంలో నాకనిపించింది ఏటంటే చందమామ అధిపతులు, యాజమాన్యంపై ఆయనకు సదభిప్రాయం, గౌరవం లేదని, కాని కళాకారునిగా – ఒక బాధ్యతగల ఉద్యోగిగా మాత్రమే పనిచేస్తున్నారని. నేను చందమామ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే అనిపించింది. అంతపెద్ద సంస్థను నిర్వహించేవారు ఫ్యాక్టరీ కార్మికుల్లాగ మాత్రమే అక్కడ పనిచేస్తున్నవారిని చూస్తున్నారని. ఎందుకంటే చందమామ పత్రిక కధలను బట్టి ప్రజలు కొనటం లేదు. అందులో కథలకు వేసిన చిత్రాలు చూసి ఆకర్షితులవుతున్నారు. ఆ ఇంగిత జ్ఞానం ఉన్న పెద్దలు రచయితలకు, చిత్రకారులకు సకల సౌకర్యాలతో కూడిన గదులు ఏర్పాటు చేయాలి. ఆ సంస్కారం లేదు కాబట్టే చిత్రాగారు, శంకర్ గారు అందరిమధ్య టేబుల్లు వేసుకొని చిత్రాలు వేస్తున్నారు. ఆ టేబుల్లపై ఇండియన్ ఇంకు బాటిల్, ఒక చిన్న గుడ్డ ముక్క మగ్గులతో నీళ్ళు మాత్రముండేవి. చిత్రాలు వేయటానికి కావలసిన మేటరు ఒక సన్నటి పేపర్ పై ముద్రించి పంపేవారు. అవసరమైన చోట అండర్‌లైన్ వేసి ఉండేది. అది చదివి చిత్రాలు వేసేవారు. హంగు, ఆర్భాటం లేని గొప్ప చిత్రకారులు వారిద్దరు. ఇద్దరూ మహనీయులే.

ఇంకా కాసేపు అయ్యాక వపాగారు పని ఆపుచేసి, తన చిత్రాలు అన్నీ తీసుకొని జాగ్రత్తగా పెట్టెలో పెట్టుకొని, ఇంక బయలుదేరదాం పద అన్నారు. గదికి తాళం వేసి నడుస్తూవుంటే ఆయనను అనుసరించాను. అప్పటికే స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు.

మేము ప్రెస్ దాటి రోడ్డుమీదకు వచ్చాం. ఆయన మాట్లాడకుండా కోడంబాకం చేపల మార్కెట్ కు తీసుకువచ్చారు నన్ను. మార్కెట్ లోపలకు తీసుకువెళుతూ ఉంటే, చాపలు కొనుక్కొంటారేమో అనుకున్నాను, కాని అడిగే చనువుగాని, ధైర్యంగాని లేదు. చేపలు అమ్మే ఒక అమ్మాయిదగ్గర అగారు. “ఆమె ఎట్లాగుంది?” అని అడిగారు. ‘ముక్కు కళ్ళు బాగున్నాయండి” అన్నాను.

అట్లాగే ఇంకో ఆమె వద్దకు తీసుకువెళ్ళి- ఆమె గురించి అడిగారు. కొంచెం ధైర్యమొచ్చింది. నాకు తోచింది చెప్పాను. ఆ విధంగా చేపల బజారంతా తిప్పి ఆడ, మగ అనుకోకుండా అడుగుతూ వచ్చారు. నేను నాకు తోచినది చెప్పేవాడిని. మార్కెట్ నుండి బయటకు వచ్చాక వీళ్ళే నా మోడల్స్. ప్రతి ఒక్కరిలో ఉన్న అవయవ స్వరూపాలను నా చిత్రాలతో వేస్తూ ఉంటాను అన్నారు. తరువాత వారి ఇంటివైపు తీసుకువెళుతూ నావివరాలు అడిగారు.
___________________________________________________________________
మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది…………………….

“మీదేవూరు -?”
“ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురమండి”
“మీరేం చేస్తున్నారు”?
“తిరుపతి వ్యవసాయ కళాశాలలో ఆర్టిస్టు – ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాను”
“అక్కడ వ్యవసాయం తప్ప బొమ్మలతో పనేంటి”
“మాచేత కీటకాలు,ఆకులు-పువ్వులు, చెట్లు వేయించి విద్యార్థులకు చూపించి టీచర్లు చదువులు చెబుతారు. మాకు కీటకాలు ఇస్తారు – వాటి భాగాలను మైక్రోస్కోపులో చూస్తూ పెద్దవిగా శాస్త్రీయంగా వేయాలి. ఇవన్నీ ఎంటమాలజీ డిపార్టుమెంటుకు సంబందించినవి. కెమిస్ట్ – బోటనీ – ఫిజియాలజీ అగ్రాగమి, ఎకనామిస్టు, ట్రేడింగ్ డిపార్టుమెంటు అడిగే చెట్టు, పువ్వులు, ఆకులు రోగాలను ఉన్నది ఉన్నట్లు వేయాలి – ఇంజీనిరింగ్ వారు వ్యవసాయానికి సంబంధించిన క్రొత్తమిషర్లు కనిపెట్టే ముందు మేము వేసిన చిత్రాలను బట్టి కరారు చేస్తారు. వీటిని మైక్రో, మేక్రో ఫొటోలు తీయాలి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, పరిశోధకులకు, రైతులకు మాతో చాలాపని ఉంటుంది అని చెప్పాను. ఇంకా ఆశక్తిగా చాలా విషయాలు అడుగుతూనే ఉన్నారు.

“మీరేం చదువుకున్నారు?”
“హైదరాబాద్ లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ అండ్ ఆర్కెటెక్చర్ కాలేజీలో అప్లైడ్ ఆర్ట్ చదువుచున్నానండి”
“మీ టీచర్లెవరు?
“వాటర్ కలర్ పెయింటింగ్ నేర్పింది కొండపల్లి శేషగిరిరావుగారు, అట్లాగే మా గురువులు వడ్లమూడి మధుసూధనరావు, సావక్కర్, సంపూర్కర్, మహమ్మద్ సిద్దిర్, గులామలి, మసూద్’ మహమద్, భూషన్, వాసుదేవరావు, మనోహర్ రావు వంటి చాలామంది మాకు విద్యనేర్పారు. ” అని చెప్పాను.
చిత్రమేంటంటే వారందరి గురించి వపాగారికి తెలుసు. వారి గురించి ఆయన చాలాసేపు చెప్పారు.
“ఇంతకీ మద్రాసు ఎందుకొచ్చారన్నారు?”
“మద్రాసులో ఆర్ట్ డైరెక్టర్ వాలిగారి వద్ద ఉండి సినిమాలకు పనిచేస్తున్నానన్నాను”. ప్రస్తుతం ఏకవీర, సంపూర్ణ రామాయణం, భక్తతుకారాం సినిమాలకు పనిచేస్తున్నానని చెప్పాను.
అక్కడ కళాకారులకు సరైన గౌరవాలు లభించవు. స్వయంగా ‘చిత్రకారునిగా బ్రతకడం మంచిదని చెప్పారు. ఈ లోపల ఇల్లు వచ్చింది. ఇంట్లోకి తీసుకువెళ్ళి చాలా మర్యాదగా కూర్చోమన్నారు. తర్వాత పెద్ద కప్పుతో కాఫీ ఇచ్చారు. అది ఇద్దరు త్రాగవచ్చు. అంత కాఫీ ఉంది. ఇంట్లో గుమ్మాలపై అలంకరించిన చిత్రాలు చూపించారు. దుర్గ, లక్ష్మి, సరస్వతి మొదలైనవి చూశాను.

తర్వాత ఆయన చాలసేపు మాట్లాడారు. చీకటి పడిపోతుంది. మర్లా కలుస్తానని చెప్పి బయలుదేరాను. అందరూ చెప్పిన వపావేరు – నేను చూసిన వపా వేరు.
తర్వాత నా అనుభవాలు ఎవరికి చెప్పినా నమ్మలేదు. నేను మద్రాసులో ఉన్నంతకాలం అవకాశం దొరికినప్పుడల్లా ఆ కళాకారుల్ని కలుస్తూనే ఉండేవాడిని. వారు ముగ్గురు చిత్రకళా మేరు పర్వతాలు క్రోక్విల్ నిట్లు – బ్రేషన్లు వారి చేతిలో ప్రపంచ ప్రజలను మైమరపించే మంత్రదండాలు. వారి చిత్రణ విధానం చూసి ముగ్ధుడినైపోయేవాడిని వారు ముగ్గురు సకల శాస్త్రాలలో విజ్ఞాన నిధులు. వారిలో మనం త్రవ్వుకొనే కొద్ది లభించే సంస్కారం వినయం, సాంస్కృతిక విలువలు లభిస్తాయి. అవన్ని నేను అనుభవించాను.

Sarswathi artist VaPa

మనలో విపరీతమైన ఓపిక, సహనం, వారిపై గౌరవం ఉండాలి. దేవుడు నాకాశక్తి ఇచ్చాడు. అందుకే ఆ పెద్దలనుండి చాలా విషయాలు తెలుసుకున్నాను.
నేను వాహినీ స్టూడియోలో జయరాంరెడ్డిగారి వద్ద ఉన్నప్పుడు రోజూ ప్రెస్ కి వెళ్ళి అక్కడ వెళ్తున్నప్పుడు వీరిని కలిసేవాడిని.
వపాగారు చిత్రాలు వేసే విధానం చూసే వాడిని, వాల్ మేడ్, హ్యండ్ మేడ్ పేపర్లేకాక అన్ని డ్రాయింగ్ పేపర్లపై చిత్రించేవారు. పోస్టర్, వాటర్, కేక్ కలర్స్, ఇండియన్ ఇంక్, చయనీస్ ఇంక్ కూడా వాడేవారు. 12వ నెంబరు బ్రెష్ తో కూడా ఆయన డబుల్ జీరో బ్రెష్ సన్నగా గీసేవారు. అవసరాలకు తగ్గట్టు బ్లేడు, దారం తాటాకు వంటివి టెక్చర్ కోసం వాడేవారు. దేనితో ఏ ఎఫెక్ట్ వస్తుందో ఆ అవసరాన్ని బట్టి వాడేవారు. “రంగులే అన్ని భావాలకు మూలం” ఆ రంగులతోటే కాగితంపై ఆడుకున్నారు. అన్ని ప్రాంతాలవారు ఆ చందమామ ముఖ చిత్రం చూసి పొంగిపోయేవారు.
ఆయన చాలా విషయాలు మనసు విప్పి మాట్లాడరు. ఆయన సంబాషణను బట్టి నాకర్ధమయింది, అది మీతో పంచుకుంటున్నాను. ఆయనకు భారతీయ సనాతన ధర్మం మీద విపరీతమైన గౌరవం ఉంది. రామాయణ భారత ఇతిహాసాలు, పురాణాలు, భాగవతంతో పాటు అన్ని రకాల సాహిత్యాలు చదివారు. ఖగోళ, జ్యోతిష, ప్రాకృతిక శాస్త్రాలపై సంపూర్ణమైన అవగాహన ఉంది.

ఉపనిషత్తుల సారాన్ని బాగా గ్రహించారు. ఇవన్నింటి గురించి సందర్భాన్ని బట్టి చెప్పేవారు. ఒకసారి మీకు సాహిత్యమంటే ఇష్టమన్నారు. ఏ సాహిత్యమన్నాను. శరత్ బాబు, ప్రేమ్ చంద్, ఠాగూర్వ ఏమయినా చదివారా అన్నారు. శరత్ రచనలను బొల్లిముంతల శివరామకృష్ణగారి అనువాదాలు చదివానన్నాను. ఆ రచనలలోని కథ, పాత్రలు, సన్నివేశాలపై ఆయన అభిప్రాయం చెప్పారు. తెలుగులో ఏం చదివారన్నారు. అడివి బాపిరాజు గారివి, విశ్వనాధ సత్యనారాయణగారివి, బుచ్చిబాబు మొదలైన వారివన్నీ చదివానన్నాను ఆయన ఆకవుల రచనలు, గొప్పతనంపై విషయాలు చెప్పారు.
ఆ సందర్భంలో కరుణశ్రీ, జంద్యాల పాపయ్య శాస్త్రిగారి పుష్ప విలాసం కావ్యాలకు మీరు వేసిన చిత్రాలు చూసేనన్నాను. కరుణశ్రీ, ఉదయశ్రీ మొదలైన కావ్యాలలోని పద్యాల గురించి, కరుణశ్రీ వారి గొప్పతనం చెప్పారు. చందమామలో చేరక ముందు వేసిన చిత్రాలవి అని చెప్పారు. ఎన్నో రకాల సంభాషణలు జరిగాయి ఆ విధంగా మా ఇద్దరి మధ్య.

వారి విజ్ఞానం విషయంలో నేను ఎన్ సైకిలోపిడియా బ్రిటానికా” వంటి జ్ఞానముంది. అటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రాంతపు చిత్రకారుడు కావటం మన అదృష్టం. చిత్ర ప్రదర్శనలలోను, వేదికలపైన ప్రేక్షకులు చిత్రకారుని – అతని చిత్రాలు చూస్తారు. కాబట్టి ఆ స్థలంలో చిత్రకారుని మెచ్చుకోవడం జరుగుతుంది. కాని చందమామ వంటి పత్రికలలోని చిత్రాలు చూసి చాలా బాగ వారి చిత్రాలు అంటే – ఆ స్పందన చిత్రకారులకు అందవు. అందుచేత వపాగారి చిత్రాలను కీర్తించే వారి గురించి వారికి తెలియదు. మరో ముఖ్యమైన విషయం అంధ్ర ప్రజలకుగాని, పాలకులకుగాని, కళలను ఆస్వాదించడం, కళాకారులను ప్రోత్సహించడం అనే సంస్కారం, సంకల్పం అణువంతయినా లేదు. అందుకే వపా, బాపూ వంటి ఎందరో కళాకారులు మరుగున పడిపోయారు.

దామెర్ల రామారావు, అంట్యాకుల పైడిరాజు, కూల్డే, వరదా వెంకటరత్నం, చాంకూర్ సత్యనారాయణ, మారేమండ, మొక్కోపాటి, అంకాల, యస్.వి. రామారావు, కృష్ణారెడ్డి, భరధ్వాజ వంటి వందలాది చిత్రకారుల చిత్రాలు – అనేక ప్రాంతాలలో ప్రదర్శనలు పెట్టి – చిత్రకళ వర్క్ షాపులు, పోటీలు నిర్వహిస్తే మన తర్వాతి తరం పిల్లలలో చైతన్యం కల్గించిన వారమౌతాము. చందమామ, యువపత్రికల వరకు పరిమితం కాకుండా. వారి జీవిత చరిత్ర వారి చిత్రాలు, వారు వాడిన వస్తువులు లోకానికి తెలియాలి. ఈ మధ్య స్వాతి పత్రిక ముఖచిత్రం వపా గారి సరస్వతి వేశారు. అందులో ఆమె వాయించే వీణనాదం లోకమంతా వ్యాపించేట్టు – విశ్వచైతన్యాన్ని కల్గిస్తున్నట్లు చిత్రించారు. దీనిని బట్టి చిత్రకారులలో తాము వేయాలనుకొనే చిత్రపువిషయ అవగాహన, రసానుభూతి, కల్పన, అనుకరణ అభివ్యక్తి, సృజన, మొదలైన అంశాలే కళాకరుని ఆలోచనలో పుట్టిన భావం భౌతిక రూపం దాల్చడానికి – చిత్రకారుడు అనుభవించే ప్రసవవేధన వర్ణనాతీతం. అది అనుభవించే వారికే తెలుస్తుంది.
“ప్రకృతి రమణీయతను చిత్రకారుడు తన హృదయాల్నీ ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొంది చిత్రాన్ని చిత్రిస్తారు.”

Singampalli Satyanarayana


మన పెద్దలు చిత్రరచనను ఇట్లా వివరించారు “రూపబేధ ప్రమాణాన్ని భావలావణ్య యోజనం సాదృశ్యం, వర్ణికాచితం ఇతిరూడంగీకం” దీనినే ఆంగ్లేయులు ‘లైను, కలర్, వేల్యూ, ప్లీసు, టక్చర్, స్పేస్” అని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యమైనది పాఠకులలో స్పందిచే మనస్తత్వం – ప్రోత్సహించే స్వభావం కావాలి. అప్పుడుగాని వపాగారి చిత్రాలు – ఆ చిత్రాలో నిఘాడంగా ఇమిడ్చిన భావాలు అర్థం చేసుకోలేం. వారిని అర్ధం చేసుకొని అభిమానించి వారిపై వ్యాసాలు వ్రాసిన వారందరకు, నిర్వహకులకు ధన్యవాదాలు.

-సింగంపల్లి సత్యనారాయణ, తిరుపతి.(91770 40578)

18 thoughts on “సాంస్కృతిక సౌందర్య సృష్టికర్త వడ్డాది పాపయ్య

 1. వపా గారితో మీకున్న అనుభవాలు నిజంగా చాలా గొప్పగా వున్నాయి .నిజంగా మీరు ఎంతో అదృస్ట వంతులు సర్ .ఆయన తెలుగు సాహిత్యాన్ని అంతగా యెరిగి యున్న వారు కనుకనే అన్ని విషయాలను అంత ప్రతిభావంతంగా తన కుంచె కౌశలంతో ఒక తపస్సుగా వర్ణీకరించ గలిగారు .మీఅనుభవాలను చక్కగా 64 కళలు .కం లో వ్యక్తీకరించిన తీరు చాల బాగుంది .అందుకుమీకు ఎడిటర్ కళాసాగర్ గారికి అభినందసనలు

 2. ఈ ఆర్టికల్ బాగుంది. వపా గారి చిత్రాలు అనితరసాధ్యం….. ఆయనశైలి మరొకరు అనుకరించడం అసాధ్యమని నాకనిపిస్తుంది…గొప్ప చిత్రకారులు వపాగారు. వపా గారి గురించి మంచి ఆర్టికల్ సమర్పించారు. ధన్యవాదాలు.
  బివిఎస్, రచయిత, కార్టూనిస్ట్

 3. వపా. గారి గురించి తెలియని చాలా విషయాలు తెలిపారు.
  Kadali Srinu

 4. బొమ్మన్ ఆర్టిస్ట్ & కార్టూనిస్ట్. విజయవాడ. says:

  *వపా *గారి గురించి శ్రీ సింగం పల్లి సత్యనారాయణ గారి వ్యాసం ఎంతో ఆసక్తి కరం గా వుంది. రచయిత కు, మీకూ ధన్యవాదములు. –బొమ్మన్ కార్టూనిస్ట్ విజయవాడ.

 5. సింగంపల్లి సత్యనారాయణ గారు వపా గారితో తన అనుభవాలు మనకు పంచిన సాగర్ గారికి, సుంకర చలపతిరావు గారికి హృదయపూర్వక
  కృతఙ్ఞతలు.
  సింగంపల్లి వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

 6. శ్రీ సింగంపల్లి సత్యనారాయణ గారికి.. నమస్కారములు. వపా గారి గురించి మీరు రాసిన చక్కని వ్యాసం లో వపా గారి భావాలు .. మరెన్నో విషయాలు తెలిసాయి.
  అబ్అహిన్నిఅన్తదన్రఅలు. ధన్యవాదాలు. సాధ్యమైన వపా గారి శైలిని ప్రత్యక్షంగా చూసిన మీరు నిజంగా అదృష్టవంతులు. సంపాదకులు కళా సాగర్ గారికి ప్రత్యేక అభినందనలు.

 7. శ్రీ సింగంపల్లి సత్యనారాయణ గారికి.. నమస్కారములు. వపా గారి గురించి మీరు రాసిన చక్కని వ్యాసం లో వపా గారి భావాలు .. మరెన్నో విషయాలు తెలిసాయి.
  అభినందనలు. ధన్యవాదాలు. అనితర సాధ్యమైన వపా గారి శైలిని ప్రత్యక్షంగా చూసిన మీరు నిజంగా అదృష్టవంతులు. సంపాదకులు కళా సాగర్ గారికి ప్రత్యేక అభినందనలు.

 8. ఈ వ్యాసం లో వ పా గారి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు

 9. శ్రీ పాపయ్య గారి కోట్లాది అభిమానులలో నేనూ ఒకడిని. మీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. ధర్మపురి త్యాగ రాజు, Vizag.

 10. చాలా చక్కగా ఉన్నది అండి మీ article. ఒక ప్రముఖ చిత్రకారుడు గురించి ఇలా సమగ్రముగా అన్ని కోణాల ను వివరంగా తెలిపారు.ధన్యవాదములు . నమస్కారములు.

 11. వపాdn గారి గురించి ఎంత చెప్పినా కొంతే అవుతుంది . మీరు చాలా బాగా చెప్పారు . మన చిత్రకారుల గురించి జీవిత కధలు రాయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap