వ.పా. తో నా ముఖాముఖి – గంగాధరరావు

“చందమామ” మాసపత్రికలో వడ్డాది పాపయ్య చిత్రాలు (వ.పా) మరో లోక దర్శనం ఇచ్చేది ఈ అనుభవం నాకు బాల్యం నుండి.
స్వాతి పత్రిక వారు నా లేఖ వ.పా. గారికి పంపగా ఆయన నుండి నాకు ఇల్యాండ్ కవరు 2-12-1985లో వచ్చింది. ఆ తరువాత వారితో తొలిగా ముఖాముఖి 22-7-1987 బుధవారం రాత్రి అనుహ్యంగా జరిగింది.
కారణం ఓ మిత్రునితో విశాఖలో పని నిమిత్తం రైలులో వెలుతూ కసింకోట పేరు చూసాను. విశాఖ నుండి తిరిగి వస్తూ ఆ రాత్రి వ.పా. గారి ఇంటికి వెళ్ళాను.

M Gangadhararao

బయట ఆడుతున్న పిల్లలను వ.పా. గారిని పిలవమని చెప్పాను. ఆయన బయటకు వచ్చి నన్ను కసురుకున్నారు. వారికి గతంలో నేను రాసిన లేఖలు గుర్తు చేశాను. వారిపై నాకు గల అభిమానం కూడా వివరించాను. అయినా వ.పా. గారు కోపంగా గేటు అవతలనుండి (చూసావుగా ఇక వెళ్ళు… అని లోపలికి వెళ్ళిపోయారు) అప్పుడు గుర్తుకు వచ్చింది. గతంలో “మాలతి- చందూర్” ఆంధ్రప్రభ వీక్లీలో ప్రమదావనంలో వ.పా. గురించి ఆవిడ వ్రాసింది గుర్తుకు వచ్చింది. వ.పా. ఎవరిని దగ్గరకు రానివ్వరని, ఇంటర్వ్యూ ఇవ్వరని, దానికై ప్రయత్నిస్తే కోపగిస్తారని ఆమె చెప్పారని ఓ వైపు నాలో భయం, మరోవైపు తీరని ఆశ ఆయనను కలవాలని, తిరిగి వీధిలో ఆడుతున్న పిల్లల్ని బ్రతిమాలి వ.పా. వద్దకు లోపలికి పంపాను. అప్పుడు వ.పా. గారు మేడ దిగివచ్చి రా… అని తీసుకెళ్ళారు. దయతో ఆయన నడక వేగం ఎలా ఉందంటే త్రాచుమించిన వేగం. చూపుకు సింహం, ఆయనను చూస్తుంటే బుల్లెట్లు దూసుకొస్తున్నట్లు ఉంటుంది. నన్ను ఆయన మేడమీదకు తీసుకెళ్ళారు. అప్పటికి స్టాండ్ మీద వినాయక చవితి సందర్భంగా స్వాతి వీక్లికి చిత్రం గీస్తున్నది చూపారు. అప్పుడు ఆయనలో ఏ కోపము లేదు. మొదట చూసినదానికి ఇప్పుడు చూస్తున్నదానికి సంబంధం లేదు. నేను వారిని ఏది అడిగితే దానికి జవాబు చెప్పారు. అయినా నాకు ఏదో భయం. ఏమడిగితే ఏమి కోపమొచ్చి నన్ను పొమ్మంటారేమోనని.. కాని అదృష్టం అలా జరుగలేదు.

వ.పా. గార్ని ప్రాధేయపూర్వకంగా కోరాను. మా మధ్య జరిగే సంభాషణ.. గాల్లో కలిసిపోతుంది.. దీన్ని శాశ్వతంగా వుండాలంటే “టేప్ రికార్డ్ పై… అన్నాను. అతి కష్టం పై ఆయన ఒప్పుకొన్నారు. అనుకోనివి.. ముందుగా సిద్ధపరచుకొని ప్రశ్నలు పలువిషయాలపై అడిగాను. దీని తర్వాత వారితో ఫోటో దిగాలన్న కోరిక కలిగింది… అర్థరాత్రి స్టూడియోలు మూత.. అయినా వ.పా గార్కి చెప్పగా వారే వెళ్ళి ఫోటోగ్రాఫర్ ని తీసుకొచ్చారు.
వ.పా తో బ్లాక్ & వైట్ లో పెద్ద ఫోటో దిగాక మరో ఫోటో అన్నాను. వ.పా. కోపడ్డారు. అయ్యా నేనెక్కకడో ఇరగవరం గ్రామం ప.గో. జిల్లా నుంచి వచ్చాను. ఈ ఫోటో సరిగ్గా లేకపోతే మరల మీతో ఫోటోకై ఇంత దూరం రాలేను కదా అన్నాను. ఈ రెండో ఫోటో కలర్ లో వేయమన్నాను. వ.పా. గారు కోపంగా అన్నారు కలర్ లో ఖర్చు ఎందుకు నీకు డబ్బులు చెల్లడం లేదా అన్నారు. సరే రెండో ఫోటో ‘బ్లాక్ అండ్ వైట్ లో… వ.పా. అన్నారు ఇద్దరం షేక్ హ్యాండ్ లో ‘ఫోటో” దిగాము. ఇంటర్వ్యూ చివర్లో వ.పా. “జయజయవంతి’ రాగం ఇష్టమని తనకి ఇష్టం అని పాడారు.

కోమలమైన స్త్రీ కంఠస్వరం మిశ్రితమైన గానం.. మనోహరంగా సాగింది.
చివరిగా ఓ కోర్కె అన్నాను. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అప్పట్లో… “బ్రహ్మశ్రీ విశ్వామిత్ర” తన సిన్మాలో “మేనక” పాత్రాదారికై అన్వేషిస్తున్నా అన్ని పత్రికల్లో ఇంటర్వ్యూలు. వ.పా. గారి దృష్టిలో “మేనక” ఎలా వుండేది చిత్రించి ఆఫోటో ఉన్నదాన్ని సర్ మాట ప్రకారం “మేనక చిత్రం” దానితో మరో చిత్రం గీసి పోస్ట’ పంపాను.
ఆ తర్వాత వ.పా. గారి ఇంటర్వ్యూ “ఉదయం” డైలీ 24-1-1988 ఆదివారం సంచికలో వచ్చింది. దీనికి ‘అరుదైన కుంచె’ టైటిల్ ….. వ.పా. గారికి కోపం రగిల్చింది. భాషా జ్ఞానం లేని తప్పుగా అర్థం అని విన్నాను. ఈ టైటిల్ నేను పెట్టలేదని ‘ఉదయం ” పత్రిక వారిదే అన్నా విన్లేదు. తెలియక జరిగిన ఈ తప్పు క్షమించమని ఎన్ని లేఖలు వ్రాసినా విన్లేదు. ఇక నీతో “కట్” అన్నారు తన 10వ లేఖ 3-1-1988లో, వ.పా. మరణం 30-12-1992 ఈ ఇంటర్వ్యూని స్వాతి మాసపత్రిక జనవరి 1994లో నాపేర టైటిల్ “చిత్రయోగి” ….క్లుప్తంగా వచ్చింది.
సరే వపా గార్ని …. 22-7-1987లో దర్శించినపుడు ఆ వృద్ధాప్యంలోనూ ఆయనలోని చురుకుదనం…నడకలో వేగం, నిరాడంబరత… ప్రచారానికి తాను దూరం అని చెప్పడం… మాటల మధ్యలో వెళ్ళి వక్క చితక్కొట్టి తమలపాకు, సున్నంతో నోటపెట్టుకొని ఆ రసం పీల్చడం పదేపదే చేయడం చూసాను.

వ.పా కోరినట్లు ఆ రాత్రి ఎన్నో జవాబులు విశేషాలు తెల్సుకొనే అవకాశం పోగొట్టుకొన్నాను. వ.పా ఇంటర్వ్యూలో విషయాలు క్లుప్తంగా….

  1. గుర్తింపు, ప్రశంస ఇవి గుర్రానికి మేతలేని మాలీషు వంటిదన్నారు. ఇది తెల్సుకునే వీటికి దూరంగా ఉన్న ఏనాటి నుంచో అన్నారు.
  2. ధర్మంవ్యాధుడి కథ గుర్తుకు తెచ్చుకోమన్నారు.
  3. జ్ఞాపకాలు, స్మారక చిహ్నాలు ఒట్టి పిచ్చి అన్నారు.
  4. కారల్ మార్క్స్, నన్ను బాగా చదవమన్నారు.
  5. వ్యక్తినికాదు, అతని కృషిని మాత్రమే గుర్తించాలి లేదంటే ఆవ్యక్తి ఊహకి తగ్గట్లుగా ఉండకపోవచ్చు. గనుక అని అన్నారు. 6. “కలర్” ఫోటోగ్రఫీ వచ్చాక “చిత్రకళ” నాశనమైంది.
  6. చిత్రకళకి జర్మని గతంలో పేరు ఇప్పుడు రష్యా అని అన్నారు.
  7. ఆయా పాత్రల ఆయా వ్యక్తుల రూపాల గురించి నేను ప్రశ్నించగా…
    ఎ) రాజసం – పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలు
    బి) ప్రాచీనత – పౌరాణికత – బెంగాలీలు
    సి) పౌరాణిక పాత్రధారణలు – తెలుగువారు ప్రసిద్ధులు
    డి) అందానికి – బెంగాలీలు
  8. పౌరాణిక పాత్రలకు “ఎన్టీఆర్” కు సాటిలేరు.
  9. ఘంటసాల గానానికి సరిలేరు.
  10. మనుష్యుల రూపాలు చూసి అంచనా వేయలేకున్నారు.
  11. ఆర్టిస్టులకి కొన్ని కొన్ని అలవాట్లో…. దురలవాట్లో సహజం కదా అని నేను అనగా… వ.పా …… తనకే అలవాట్లు
    లేవని ఉన్నదల్లా మీరు చూస్తున్నారుగా ‘సదా ఈ తాంబూలం మాత్రమే అన్నారు.
  12. చిత్రరచనని.. కవిత్వంతో మిళితం చేయుటమే తన ఆర్ట్ అన్నారు.
  13. ఏకాంతమే కోర్తాను, బొమ్మలు చిత్రించేటప్పుడు అన్నారు.
  14. బెనహర్, టెన్కమాన్మెంట్స్ హాలివుడ్ క్లాసిక్ చూసిన కళ్ళతో ఇతర సిన్మాలు చూడడం … కష్టమే అన్నారు.
  15. మాధవపెద్ది గోఖలే చిత్రకారులు, ‘చంద్రహారం” సిన్మాలు గొప్ప ఆర్ట్ అన్నారు.
  16. అమరావతిలో మన ప్రాచీన శిల్పాల ఆర్ట్ తప్పక చూడమన్నారు.
  17. కళనే ఆరాధిస్తానని దాని తాలుకు వ్యక్తుల్ని పట్టించుకోనని..
    ఆకాలంలో మద్రాస్.. చందమామ మాసపత్రికలో పని చేస్తున్నప్పుడు అవకాశం వుండి సినీ అగ్రహీరో ఎన్టీఆర్, గొప్పగాయకుడు ఘంటసాల వంటి వారిని చూడలేదన్నారు. ఆథ్యాత్మిక గురువులు వారి మహాత్యాలు వీటిపై తనకు గురి లేదన్నారు.

    2004లో “విశ్వ చిత్రకళ” మాసపత్రిక ద్వారా కళాకారులైన సుంకర చలపతిరావు గారి పరిచయం నాకు కల్గింది. వీరి ద్వారా వ.పా గారి ఆత్మీయ మిత్రులు పత్తి గణపతిరావు (రైల్వే ఉద్యోగి) శ్రీకాకుళం వారితో కలంమైత్రి. తర్వాత వ.పా కుమారుడు వడ్డాది రవిరామ్ గార్లతో కలం మైత్రి…
    -మంగెన గంగాధరరావు

2 thoughts on “వ.పా. తో నా ముఖాముఖి – గంగాధరరావు

  1. దేనికీ లొంగకుండా కళకే అంకితం అయిన వారి లోకం.. మహా గొప్పది!👍💐🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap