స్నేహం కోసం తపించిన చిత్రకళాచార్యుడు ‘వరదా ‘

ఆధునిక ఆంద్ర చిత్రకళను చరితార్ధం చేసిన తొలి చిత్రకారులలో ఒకరు ఆచార్య వరద వెంకటరత్నం గారు. కళ కాసుకోసమని కాకుండా కళ కళకోసమే అని భావించి జీవితాంతం అదే నిభద్దతతో కళా కృషి చేసి ఎందరో గొప్పకళాకారులను జాతికి అందించిన నిస్వార్ధ కళాకారుడు ఆచార్య వరదా వెంకటరత్నం గారు. అంతే గాక, చిరు ప్రాయంలోనే అజారామమైన కళను సృష్టించి అమరలోకాలకు ఏగిన తన బాల్య మిత్రుడు స్వర్గీయ దామెర్ల రామారావు యొక్క కళాసంపద ను కాపాడి దానిని భావితరాలకు అంద జేసేందుకు తన ఆరోగ్యం, ఆర్ధిక స్థితిని సైతం లెక్కచేయకుండా చిరస్మరణీయమైన కృషి చేసిన నిజమైన గొప్ప స్నేహితుడు వరదావెంకటరత్నం గారు.

వెంకట రత్నం గారు పూర్వవిశాఖ జిల్లానందలి ఆలమండ గ్రామ వాస్తవులైన శ్రీ వరదా సూర్యనారాయణ,అమ్మడు అనే దంపతులకు 1895 అక్టోబర్ 05 వ తేదీన జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన వీరిని తన పెదనాన్నతమ్మయ్య పెద్దమ్మ చిట్టేమ్మలు చేరదీసి పెంచారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు కుటుంభ సమేతంగా రాజమండ్రి కి వీరు తరలి రావడంతో రాజమండ్రి లో దామెర్ల రామారావు తో స్నేహం ఏర్పడింది. చిత్రకళాభిలాశులైన వీరిరువూరూ ఆ కాలంలో రాజమండ్రి లో వైభవంగా జరిగే నాటక పోటీలకు కావాల్సిన తెరలను చిత్రించడానికి వచ్చిన ఏ.ఎస్.రాం నాటక తెరలను చిత్రిస్తుంటే ఆశ్చర్యంగా గమనించేవారు. అలా చిత్రకళపై తొలుత వారిలో ఆసక్తి కలిగేల చేసిన వ్యక్తి ఏ.ఎస్. రాం అని చెప్పవచ్చు. సరిగ్గా అదే సమయంలో రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా వచ్చిన సర్ అస్వార్డ్ జేనిన్గ్స్ కూల్ద్రే వద్ద విద్యాభ్యాసం కి చేరడంతో అసలు సిసలైన కళ అంటే ఏమిటో కూల్ద్రే మహాశయుని వద్ద వారికి తెలుసుకునే అవకాసం ఏర్పడింది. అంతే గాక వారికి చిత్రకళలోని మరిన్ని మెలుకువలు నేర్పేందుకు కూల్డ్రే వీరి తల్లిదండ్రులను సైతం వొప్పించి బొంబాయి లోని ప్రఖ్యాత జే.జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి పంపించారు. అయితే జే. జే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి దామెర్ల రామారావు ఒక్కరే వెళ్లడం జరిగింది. ఆర్దికలేమి కారణంగా వరదా గారు అక్కడికి వెళ్ళలేక రాజమండ్రి నందే ఆగిపోయిన మిత్రుడు వరదా వెంకతరత్నంకి రామారావు అన్ని విదాలా తాను నేర్చిన మెలకువలను తెలియ జేస్తూ చిత్రకళా సాధనలో ముందుకు సాగేలా చేసారు. ఆ కృతజ్ఞతా భావంతోనే దామెర్ల మరనానంతరం వారి కళను కనుమరుగు కాకుండా భావితరాలకు అందించే గురుతర భాద్యత వరదా వారు తీసుకుని అజరామరమైన రామారావు యొక్క కళను చిరస్థాయిగా నిలిచేలా చేసిన గొప్ప స్నేహితుడు కళాజీవి ఆచార్య వరదా వెంకటరత్నం గారు.

రంగులమయమైన వాటిని వర్ణ చిత్రాలనుకుంటే రేఖలమయమైన వాటిని రేఖా చిత్రాలుగా పేర్కొంటాము. అయితే వరదా గారి చిత్రాల్లో కేవలం రంగులు మాత్రమే వుండవు అలాగని పూర్తిగా రేఖలు మాత్రమే వుండవు .రంగులు రేఖలు సమ్మిళితమైనది వీరి చిత్ర కళ అని చెప్ప వచ్చు. కొన్నీ ఈ చిత్రాల్లో రేఖా సౌందర్యం వర్ణ సౌందర్యాన్ని అదిగమించేవిగా వుంటే మరి కొన్ని చిత్రాల్లో వర్ణ సౌందర్యాన్ని రేఖా సౌందర్యం అదిగమించేలా వుంటాయి. అయితే ఎక్కువగా వర్ణ సౌందర్యాన్ని మించిన రేఖా సౌందర్యమే వీరి చిత్రాల్లో మనకు కనిపిస్తుంది అందుకే HE WAS THE MASTER OF LINE IN ALL ASPECTS అని సమకాలీన కళాకోవిదులు వరదాగారిని ప్రశంసించడం జరిగింది . చిత్రకళా మాధ్యమాలైన తైల,జల వర్ణాలతో పాటు టెంపరా, ఇండియన్ ఇంకు తదితర మాధ్యమాలలో వీరి కుంచె అందే వేసినదే అయినప్పటికీ టెంపరా మాధ్యమంలో వారు సృష్టించిన చిత్రాలలో వారి కళయొక్క ప్రత్యేకత ప్రస్పుటంగా కనిపిస్తుందని ప్రఖ్యాత కళా విమర్శకుడు సంజీవ్ దేవ్ గారు పేర్కొంటారు .అంతే గాకుండా సిల్కు వస్త్రంపై కూడా ఎన్నో చిత్రాలను వీరు చిత్రించడం జరిగింది

సాయంసంధ్యలో గోదావరి,కోటి లింగాలు, గోదావరి ఘాట్, బోటింగ్ ప్లేస్ ,రాజమండ్రి మ్యూజియం, ఫిషర్ బాయ్, ఎట్ ది టెంపుల్, ఇంటివద్దకు, పశువుల కాపరి, ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం, నర్తకి, విలాసిని, దమయంతి, విశ్వామిత్ర తపోభంగం, కైలాసనాద, గౌరీ శంకర్, సైరంద్రి, దమయంతి విడుదల, వేణుగానం, విష్ణు, విద్యాధరి, దేవదాసి, గంధర్వ శాప విమోచన మొదలైన చిత్రాలను గాని మనం గమనించినట్లయితే, గ్రామీణ నేపధ్యం. పురాణ సాహితీ గాధలు మరియు పచ్చని ప్రకృతి ప్రదేశాలు వీరి చిత్రాలకు ప్రధాన వస్తువుగా మనకు కనిపిస్తాయి.

వీరి చిత్రకళా వైచిత్రిని మనం గమనించినట్లయితే ప్రాచ్యకళా విధానంలోని లాలిత్యం, పాశాత్య కళావిదానంలోని వాస్తవికత నవ్య బెంగాల్ శైలినందు కనిపించే సాంప్రదాయం సమ్మిళితమైన ఒక ప్రత్యేక మైన శైలి వీరి చిత్రాలలో మనం చూస్తాము.అందుచేతనే ప్రాచ్యదేశాల కళా రీతినందలి సన్నని రేఖా సౌందర్యం, పారదర్శకమైన వర్నలేపనములు వాస్తవిక దృక్కోణంలో వుండి వీక్షకుడి మనసులో ఒక రసానుభూతిని రేకెత్తిస్థాయి వరదావారి చిత్రాలు.

1918లో బొంబాయినందలి జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చిత్రకళాభ్యాసం ముగించుకుని వచ్చిన పిదప రామారావు 1923లో రాజమండ్రి నందు ఆంధ్ర స్కూల్ అఫ్ ఆర్ట్ ని స్థాపించడం జరిగింది .ఆ తర్వాత రెండేళ్లలోనే అనగా 1925లో అకాల మరణం పొందడంతో అర్ధాంతరంగా వారి కుంచె ఆగిపోయినప్పటికి రాజమండ్రి లో వున్నఆ కొద్దికాలంలోనే రామారావు సృష్టించిన అజరామమైన వారి యొక్క కళాసృష్టిని, కృషిని శాశ్వతంగా భావితరాలకు అందించాలనే లక్ష్యంతో వరదాగారు అప్పటి తన ఆరోగ్యాన్ని ఆర్ధిక స్థితిని సైతం లెక్కచేయకుండా అహరహం శ్రమించి రాజమంద్రినందు తన దివంగత మిత్రుడు రామారావు పేరిట స్మారక చిత్రకళాశాలను స్థాపించడంలో వరదా వారి కృషి ఎంతో గొప్పది. ఆ కళాశాల స్థాపించిన తదుపరి దానికి తొలి ప్రిన్సిపల్ గ తానే వుండి దాదాపు నాలుగు దశాబ్దాలపాటు వందలాది చిత్రకారులను లోకానికి అందించిన గొప్ప చిత్రకళాచార్యుడు వరదా వెంకటరత్నం గారు.

చిత్రకళా ప్రపంచంలో తమదైన ముద్రవేసుకుని గొప్ప పేరు ప్రతిష్టలు గడించిన హెచ్.వి.రాం గోపాల్, పిలకా లక్ష్మి నరసింహ మూర్తి, దామెర్ల సత్యవాణి, బుచ్చి కృష్ణమ్మ,శీలా వీర్రాజు, ఏ.వి ధర్మారావు, వీట్టూరు హరిశంద్ర శర్మ, మరుగంటి సీతారామ శర్మ, నాగేశ్వరీ బాయి, ఎం.ఎస్. మూర్తి, వై.సుబ్బారావు బి.వి. నరసింహా రావు, బి.కరుణారావు వరదా వారి అనంతరం మరలా దామెర్ల చిత్రకళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి మరెంతో మందిని గొప్ప చిత్రకారులను లోకానికి అందించిన ఆచార్య మాదేటి రాజాజీ కూడా వరదా వారి శిష్యుడే కావడం విశేషం.

1923 నుండి 1940 మధ్య కాలంలో వరదా గారి చిత్రాలు మనభారత దేశంతో పాటు అనేక విదేశాలలో కూడా ప్రదర్శింపబడి ఎక్కువగా అమ్ముడుపోవడం వారి ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు. వీటిల్లో 1924లో వీరు చిత్రించిన “నటరాజు “ చిత్రం బ్రిటీష్ ఎంపైర్ చిత్రప్రదర్శనలో ప్రదర్శింపబడగా “కైలాస నాద “అన్న చిత్రం 1928 లో సౌత్ కింగ్స్టన్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శింపబడింది అలాగే ది స్ప్రింగ్., ఎట్ ది ఫీల్డ్, సముద్ర, నర్తకి తదితర చిత్రాలు 1940లో లండన్ లో జరిగిన ప్రదర్శనలో చోటు చేసుకుని విమర్శకుల ప్రశంశలను అందుకున్నాయి. 1925 ఏప్రిల్, 1927 నవంబర్, 1931 జనవరి, 1933 సంవత్సారాలలో ఆనాటి ప్రసిద్ద తెలుగు సాహితీ పత్రిక భారతి లో ఎన్నో చిత్రాలు వారదా వారివి ప్రచురింపబడ్డాయి.

1925 లో రామారావు స్మారక చిత్ర కళాశాల ఏర్పడిన నాటినుండి తన చివరిశ్వాస వరకూ మిత్రుడి ఆత్మ శాంతికి ఆశయ సిద్దికీ అహరహం కృషి చేసి వందలాది చిత్రకారులను తీర్చిదిద్దిన వరదావారు రంగుల ప్రపంచంలో విహరిస్తున్న తన బాల్య మిత్రుడు రామారావును కలుసుకొనేందుకు 1963 లో శాశ్వతంగా ఈ లోకాన్ని వీడడం జరిగింది.

చివరిగా లోకంలో ఎందరో కళాకారులు పుడతారు గిడతారు అలాగే ఎందరో గురువులు పుడతారు మరణిస్తారు కాని కాలంతో నిమిత్తంలేకుండా చిరకాలం లోకంలోనూ శిష్యుల హృదయాలలోనూ స్థానం కల్పించుకున్నవాళ్ళు మాత్రం కొందరే వుంటారు.అలాంటి కొద్దిమంది కళాకారులలో ఒకరు ఆచార్య వరదా వెంకట రత్నం గారు. అందుచేతనే నేటికి వారు పుట్టి 125 ఏళ్ళు అయినప్పటికీ ప్రజల గుండెల్లో ల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచి వున్నారంటే దానికి ఆయన చేసిన కృషి నిస్స్వార్ధమైన కళా సేవలే కారణం. అందుచేతనే కాలంతో నిమిత్తం లేకుండా ప్రజల గుండెల్లో వారు ఎప్పటికి సజీవంగా నిలిచే వుంటారు.

-వెంటపల్లి సత్యనారాయణ

5 thoughts on “స్నేహం కోసం తపించిన చిత్రకళాచార్యుడు ‘వరదా ‘

  1. మంచి మిత్రుల గురించి, వారి కళా కృషిని గురించి కళా ప్రపంచానికి తెలిపిన వెంటపల్లి వారి కృషి అభినందనీయం. వారి కలం మరెన్నో మంచి విషయాలని పాఠకులకు అందించాలని కోరుకుంటూ…….

    ……. శ్రీనివాస్ బీర, ఆర్టిస్ట్.ml😊😊

  2. కళాకారులైన ఇద్దరు మంచి మిత్రుల కళా సృజన గురించి గొప్పగా తెలిపిన వెంటపల్లివారి ప్రయత్నం అభినందనీయం. మీరు మరిన్ని కళా సంగతులు మాతో పంచుకోవాలని , మంచి కళాకారుల ప్రతిభను కళా ప్రపంచం ముందుకు తేవాలని కోరుకుంటూ…….. శ్రీనివాస్ బీర.

  3. వరద వెంకట రత్నం గారి గురించి మీరు వ్రాసిన ఆర్టికల్ చాలా బాగుంది స్నేహం యొక్క ఔ న్నత్యాన్ని ఆచరించి చూపిన మహానుభావులు మీ విశ్లేషణ చాలా బాగుంది🙏👏🏽👏🏽

  4. ‘He was the master of Line in all aspects ‘ వరదాచారి గురుంచి వ్రాసిన artcle బాగుంది !👌విశ్లేషణ ఉన్నతం గా ఉంది !అభినందనలు మిత్రమా !👍🏽🤝👏🏻👏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap