ఫలాపేక్ష నెరుగని ఆచార్య వరదుడు – వెంకటరత్నం

‘ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడు’అన్న గ్రంథం ఆచార్య వరదా వెంకటరత్నం గారికిచ్చిన గొప్ప నివాళి. ఈ గ్రంథాన్ని చదివిన ప్రతీ ఒక్కరూ ముందుగా ప్రచురించిన రవిప్రకాష్, కూర్చిన రామకృష్ణలకు ధన్యవాదాలు చెప్పుకోకుండా ఉండలేరు. మరి ఈ పుస్తకం, మన చేతుల్లోకి వచ్చి, తెలుగు చిత్రకళా చరిత్ర ఎలా ఏర్పడిందో తెలియజేస్తున్నది. ఆచార్య వరదా గారు మన తెలుగువారికి చిత్రకళా దీక్ష నిచ్చిన గురువర్యులు. వీరి గురించి ఈ గ్రంథంలో వారి అసంఖ్యాక శిష్యుల మనోగతాలూ 16 మంది శిష్యుల వ్యాసాలలో ప్రతిఫలించాయి. వరదా వారి చిత్రాలతోపాటు మరెన్నో విశేషాలు ఇందులో చోటు చేసుకున్నాయి.

దామెర్ల రామారావు గారితో స్నేహంతో పాటు, చిత్రకళాభ్యాసం చేసిన మిత్రుడు వరదా వెంకటరత్నం. రామారావు అకాల మరణం, ఆ వెంటనే భార్యాసుతుల మరణంతో భావి జీవితం నిస్సారమై, వికల మనస్కుడై, ఇక ఏమీ లేదు అన్న స్థితిలో గొప్ప ఆశయం ఏర్పడి, అదే ఆ తరువాత అంతా అయ్యింది. మనసు, జీవన ప్రవృత్తులు రెండూ స్నేహితుని ఆశయాన్ని సాధించే తపనలో మునిగి పోయాయి.

రాజమండ్రిలో స్నేహితుని చిత్రాలకు ఒక కోవెల ఏర్పాటు చేసి, ఆచార్య పీఠం అధిరోహించి వందలాది శిష్యులను తయారు చేయగలిగారు. నేడు మనకు దర్శనమిచ్చే రామారావు గారి చిత్రకళా నిధిని జాతికి వరదా వారు ఇచ్చినదే. దామెర్ల వారి సతీమణికి చిత్రకళను నేర్పి, ఉపాధ్యాయినిగా చేసి రామారావు గారి ఆత్మకు శాంతినిచ్చారు.

అంతర్జాలంలో 19వ శతాబ్దంలో ఉన్న తెలుగు చిత్రకారుల కోసం అన్వేషించినపుడు, చిత్రకారులెవరు లేరని వచ్చిన సమాధానం నివ్వెరపాటుకు గురిచేసింది. మానవ జాతిలో కళాకారులు లేని కాలమంటూ ఉండదు. కానీ చరిత్రకు ఎక్కేంత కృషిచేసిన వారు లేక పోవడం వలననే ‘ఎవరూ లేరు’అన్న సమాధానం వచ్చిఉండవచ్చు. ఆ విధంగా చూస్తే 20వ శతాబ్దం ఆదిలో చిత్రకళా మొక్కను నాటింది దామెర్ల రామారావు గారైతే, ఆ మొక్కను సంరక్షించి, పెంచి పోషించింది వరదా వెంకటరత్నం గారు. ఆ మొక్క అనతికాలంలోనే మహావృక్షంగా ఎదిగేందుకు వరదా వారు 40 సం॥ల పాటు అంకితమై పోవడమే కారణం. ఆ మహావృక్షం పుష్పించి ఫలించి అసంఖ్యాక గొప్ప చిత్రకారులను అందించి మన రాష్ట్ర చరిత్రలోనే చిత్రకళలో రాజమహేంద్రానికి మొదటి స్థానాన్ని వరంగా ప్రసాదించింది. గ్రంథ ప్రకాశకులు రవి ప్రకాష్ పలుకుల్లో వరదా వారి గురించి చెప్తూ “తానెక్కలేని శిఖరాలకు తానే నిచ్చెనై తన శిష్యుల ఉన్నతికి మార్గంగా నిలిచార”ని గొప్పగా రాశారు.

వరదా వారి విగ్రహ ఆవిష్కరణకూ ఈ నివాళి గ్రంథం వెలుగులోకి తీసుకురావడానికీ రవి గారు ఎంత పరితపించారో, ఎంత శ్రమ పడ్డారో అదంతా చూసిన ప్రత్యక్ష సాక్షులం మేము. అలాగే వీరి ఆశయాన్ని తెలుసుకున్న కవి-చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణ వరదా వారి పుస్తకాన్ని తీసుకురావడంలో విశేష కృషిసల్పి చక్కని పుస్తకాన్ని మన చేతులకు అందించారు. ఈ గ్రంథ రూపకల్పన కూడా చిన్నదేమీ కాదు. ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యత, మరో పక్క ప్రపంచ రికార్డ్ పొందే స్థాయిలో కళా సాధన, ఇంకో పక్క ఇంటి బాధ్యతలు. ఇన్నింటి మధ్యలో ఈ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అలంకరించి రవిప్రకాష్ గారి కలను నిజం చేసారు.

ఈ గ్రంథాన్ని అంకితం పొందిన వారు ఆచార్య మాదేటి రాజాజీ. వరదా వారి శిష్యాగ్రణి. వీరు కూడా ఉన్నత భవిష్యత్ ముందుండగా వదులుకుని వరదా వారి పిలుపునందుకొని రాజమండ్రి వచ్చి గురువు గారి ఆశయాలను నిజం చేసారు. జీత భత్యాలు రాకపోయినా మనుగడ కష్టమైనా తాను కళా సాధన చేస్తూ, అనేక మంది కళార్తిని తీర్చిన త్యాగ జీవి. రాజాజీ అలా రావడం వల్లనే నా వంటి శిష్యులకు రాజాజీ గారి వద్ద శిష్యరికం చేసే భాగ్యం దక్కింది. ఇన్ని విషయాలనందించిన ఈ గ్రంథం ప్రతీ ఒక్క చిత్రకళాభిమానినీ చేరవలసి ఉంది. అయితే ఈ పుస్తకంలో వరదా వెంకటరత్నం గారి చిత్రాలు కొన్నైనా రంగుల్లో ప్రచురించి ఉంటే గ్రంథం మరింత ఆకర్షణీయంగా ఉండేదన్నది నా అభిప్రాయం. ఈ గ్రంథం అందించిన రవి గారికి, రామకృష్ణ గారికి కళాభినందనాలు, ధన్యవాదాలు.

సమీక్ష: N.V.P.S.S. లక్ష్మీ (పద్మ)
‘ఆంధ్ర చిత్రకళా సంరక్షకుడు’
సంపాదకుడు: ఆత్మకూరి రామకృష్ణ
వెల : రూ. 300/-
ప్రతులకు: మాదేటి రవిప్రకాష్ (93933 89458)

Share via
Copy link
Powered by Social Snap