రాజమండ్రిలో దామెర్ల రామారావు కళాప్రాంగణంలో వరదావారి విగ్రహ ఆవిష్కరణ
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
6 జనవరి 2025 న రాజమహేంద్రవరం, శ్రీ దామెర్ల రామారావు చిత్ర కళామందిరం నందు మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్ర చిత్రకళా పితామహులు ఆచార్య వరద వెంకటరత్నం గారి విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఆవిష్కరించారు. కాస్త ఆలష్యంగా ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.
వరదా వెంకటరత్నం : ఆంధ్ర చిత్రకళా సంరక్షకునికి అక్షరనీరాజనం వరదా వెంకటరత్నం సామాన్యుడిలా కనిపించే సాహసి. ఆత్మీయుల ఆకాంక్షలకోసం నిండు జీవితాన్నే ఫణంగాపెట్టగల కొండంత త్యాగి. “ఆశయం చిన్నదేగా” అనుకొని ఓ అడుగు ముందుకేస్తే; అది తన నిండుజీవితాన్ని, విశాల కళల ప్రపంచాన్ని స్వాహా చేసినా లక్ష్యపెట్టని త్యాగశీలి.
చెడ్డీలనాటి స్నేహానికి, హితుడు చనిపోయాక కూడా తోడైనిలిచిన గంభీరుడు. నేటి సమాజంలో నిర్లక్ష్యం, ఎదుటివారి కోసం ఐదు నిమిషాలు వెచ్చించలేని స్వార్థం అలముకున్న తరుణంలో జీవిత సర్వస్వాన్నీ దారపోసినా, చరిత్ర ఎరుగని అజ్ఞాత నిస్వార్థ త్యాగి ఒకడుండేవాడని చెప్పినా నమ్మని జగతికి… సొంతకళ్ళ ఎదుట విస్తరించిన దామెర్ల రామారావు రంగుల కళా ప్రపంచం నిదర్శనంగా నిలిచివున్నా నమ్మలేని స్థితి. దాని వెనుక దాగిన చరిత్ర స్థానికులే మరిచిపోయే పరిస్థితుల్లో ఉంది మన ఆంధ్ర(అంధ) కళాప్రపంచం.
వరదా వెంకటరత్నం షష్టిపూర్తి సందర్భంగా వెలువడిన సావనీరులోని కథనాలు ఇతర రాతలు వెలుగు చూడకుంటే నేటికీ అదంతా కనుమరుగే.
గమ్యం అగమ్యగోచరమయినప్పుడు గతాన్ని తలుచుకున్న భవిష్యత్తు దర్శనమిస్తుంది. ఆక్రమంలో… 1961 అక్టోబరు 5న తొలిముద్రణ ముద్రితమైన “శ్రీ వరదా వెంకటరత్నంగారి జీవిత సంగ్రహము – కళాకృతులు” అన్న పేర ముద్రించబడ్డ పుస్తకం మరల ఇన్నేళ్లకు (64 ఏళ్ళకు) మాదేటి రవి ప్రకాష్ పూనుకొని ద్వితీయ ముద్రణకు నడుం బిగించి, వ్యయప్రయాసల కోర్చి సాకారంచేయడం జరిగింది. ఒక ఉద్యమంగా పూనుకొని ఈ పుస్తకాన్ని నేడు ఇక్కడ ఆవిష్కరించడం జరుగుచున్నది. “దామెర్ల రామారావు కళాప్రాంగణంలో వరదావారి విగ్రహ ఆవిష్కరణ 60 ఏళ్ళ నిరీక్షణ” అని వారు చెప్పినప్పుడు ఆయన ఈ సంకల్పానికి నేను ఒక కళాకారునిగా నా శక్తియుక్తులను అందించాను ఉడతా భక్తిగా.
“ఆర్థిక పరిపుష్టత, శక్తి సమృద్ధత లేకున్నా సత్ సంకల్పాలు ఎంతటి పనినైనా చేయిస్తుంది” అన్నది సత్యమని మరోమారు రుజువయింది. కళాకారులు సృష్టికారులు. శూన్యం నుండి వ్యవసాయం చేసి ఊహలకు సాకారం ఇవ్వగలిగిన బుద్ధి జీవులు. వరదా వెంకటరత్నం గారి షష్టిపూర్తి నాడు 36 పేజీల తొలిముద్రణ అయిన పుస్తకం వారు జీవించి ఉండగా వారి ప్రియశిష్యులు ప్రేమమీర సమర్పించిన అక్షర పుష్పాలు. అలా అచ్చయిన పుస్తకాన్ని ద్వితీయ ముద్రణను ఆయన 125 వ జన్మదినాన సంస్మరణ సంచికగా ఆ త్యాగమూర్తి జీవితం అందరికీ తెలియాలన్న సంకల్పంతో మరల అచ్చు వేయడం జరిగింది.
“త్యాగం ముక్తికి పరమపద సోపానం” అని ధర్మగ్రంథాలు చెప్పుచున్నాయి. మనిషి మరచిన ఒక గొప్ప లక్షణాన్ని, సాధించి చూపిన ఆ మహనీయుని కథను మనం చదవాలి. మన తెలుగు చిత్రకళా సంరక్షకుని కథను తెలుసుకోవాలి. ముక్తి పొందిన మానవుడి కీర్తి అజరామరంగా ఈ భూమండలంలో విరాజిల్లు తో సత్పురుషులు సదా చర్చించుకుంటూ జీవిస్తారు. అటువంటి సత్ కీర్తిని పొందిన వెంకటరత్నంగారు తన జీవితాన్ని ఆదర్శంగా జీవించి నిదర్శనంగా నిలిపి వెళ్లారు. మనిషి మరచిన ఒక గొప్ప లక్షణాన్ని గుర్తు చేసుకునేందుకు ఈ గ్రంథాన్ని వాడి కథ చిత్రకళ తపస్వి కథ మన కరోనా కష్టసమయంలో ప్రపంచం ఇల్లు వదిలి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితుల్లో వెంకటరత్నంగారి 125 వ జయంతోత్సవాలను జరిపితీరాలన్న సంకల్పంతో టేకి మృత్యుంజయరావు కోరిక మేరకు 8 ఎపిసోడ్ లను యూనివర్సల్ డయాస్ (ఆత్మకూరు రామకృష్ణ ఆర్టిస్ట్) అన్న యూట్యూబ్ చానల్ ద్వారా వరద వెంకటరత్నంగారి 125 వ జయంతోత్సవాలను జరుపుకోవడం జరిగింది. దాదాపు 50 మంది తమ తమ సందేశాలను వరదావారి కృషి – త్యాగాలను కొనియాడటం వారికి నివాళిగా పంపడం, వాటన్నిటినీ కూర్చి లఘచిత్రాలుగా తయారు చేసి ప్రసారం చేయడం జరిగింది. మాదేటి రవిప్రకాష్ వరద వెంకటరత్నంగారి మూర్తి స్థాపన దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వరదా వారి జీవితము – కళాకృషిని అందుబాటులో ఉన్న విషయ సంగ్రహాన్ని గ్రంథంగా అచ్చు వేయాలన్న ఆలోచన అమోఘమైనది.
కొన్ని వందల చిత్రాలను చిత్రించి, కొల్లలుగా చిత్రకారులను తీర్చిదిద్దిన గురోత్తములకు చిరు గ్రంథం అక్షర పుష్పగుచ్చంలా కానుక ఇవ్వాలనే భావన ప్రసంశాపాత్రమయినది.
ఈ పుస్తకం 1961లో “శ్రీ వరద వెంకటరత్నంగారి జీవిత సంగ్రహము – కళాకృతులు” అన్న నామకరణంతో అచ్చు వేయడం జరిగింది. వరదా వారితో గురుకులవాసం చేసిన BVS గారి కలం నుండి వెలువడిన ఆభరణం గ్రంథం – నిఖార్సయిన 24 కారెట్ల బంగారం తో తీర్చి దిద్దిన ఆభరణం ఈ గ్రంథం వ్యక్తిత్వం కలిగిన వరదావారి విశేష వ్యక్తి వరదా వారి జీవితం అంతో ఇంతో అక్షరాలకు దోరికిందంటే అది వారి శిష్యులయిన BVS, రాజాజీ, పిలకా వారు కలం వీరులు కావడమే! మనకు దక్కిన భాగ్యం.
ఈ వ్యాసాలు నాడు వారు వ్రాయకుంటే మనకు ఈపాటి సమాచారం కూడ లభించేది కాదు.
నాడు సరస్వతీ ప్రెస్ వారు ముద్రించటం, అదే పుస్తకాన్ని మరిన్ని హంగులతో మాదేటి రవిప్రకాష్ అల్లుడు గారి ప్రెస్ లో ముద్రించి మన ముందుకు తేవడం కాకతాళీయం. ఇందుకు చరిత్రే ఆధారం.
1961 అక్టోబరు 7వ తేదీన శీలా వీర్రాజు రాసిన “ఆంధ్ర చిత్రకళా పితామహులు – వరదా వెంకటరత్నం గారు” అన్న వ్యాసాన్ని కృష్ణా పత్రికలో అచ్చవడం, అలాగే వరదా వెంకటరత్నం గారు పరమపదించాక సమాచారం పత్రిక “కళాతపస్వి ‘శ్రీ వరదా’ కాల ధర్మం” శీర్షికతో ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో అచ్చువేయడం, పత్రికా సంపాదకులు సీతారామాంజనేయులు తన సంపాదకీయంలో వరదా వారి గురించి రాయడం విశేషం. నాడు రాజమహేంద్రవరంలో కళలకు, కళాకారులకు ఉన్న స్థానం ఉన్నతం. ఆదరణ కనుమరుగవుతున్న కళా ప్రతిభలకు ప్రోత్సాహం శూన్యం అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కార్యాచరణలు కళోన్నతికి తార్కాణంగా నిలుస్తాయని భావిస్తూ… ధన్యవాదాలుతో…
- ఆత్మకూరు రామకృష్ణ
కళలను, కళా కార్యక్రమాలను 64 కళలు.కామ్ ద్వారా బుధజన సమక్షానికి తీసుకెళుతున్న సంపాదకులు కళాసాగర్ గారికి కృతజ్ఞతలు