నేడు చిత్రకళాతపస్వి : వరదా వెంకటరత్నం 127వ జయంతి సందర్భంగా ….
పరాయిపాలనలో మనదేశం అభివృద్ధి చెందిందా లేదా అనే విషయం ప్రక్కన పెడితే, మన ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు బ్రిటీష్ అధికారుల్ని మనం నిత్యం స్మరించుకోవాలి. అందులో మొదటివాడు ఆంధ్రను అన్నపూర్ణగా మార్చిన సర్ ఆర్డర్ కాటన్, రెండోవారు సి.బి.బ్రౌన్, ఈయన ప్రజాకవి వేమన వ్రాసిన పద్యాల్ని సేకరించి మనకందించారు. ఇక మూడో వ్యక్తి ఓ.జె.కూల్టే. ఈయన మన సంస్కృతిని, మన ఆచారాల్ని కళా రూపంలో మనకందించారు. కాటన్ అన్నదానం, బ్రౌన్ అక్షరదానం, కూల్డే కళాదానం చేసిన మహా వ్యక్తులు. ఈ ముగ్గురు మన రాష్ట్రానికి రాకపోతే, మన పరిస్థితి ఎలా వుండేదో ఊహించుకోండి. అందుకే ఈ త్రిమూర్తుల్ని మనం ఎల్లప్పుడు స్మరించుకోవాలి.
కూల్డ్ 1910-20 సం. మధ్య రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన దామెర్ల రామారావు, అడవి బాపిరాజు, వరదా వెంకటరత్నం, తదితర చిత్రకారులెందరినో మనకందించారు. ఆయన శిష్యరికంలో వీళ్లు అత్యుత్తమ కళాకారులుగా తయారై తర్వాత మన చిత్రకళకి జాతీయ, అంతర్జాతీయ కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన విషయం కళాకారులకు, కళాభిమానులకు ఎరుకే!
కూల్ష్ వెలిగించిన చిరుదీపం వరదా వెంకట రత్నం. ఆయన వెలిగించిన దీపాలు వందల్లా వ్యాపించాయి. అక్టోబరు 5న ఆయన 125వ జయంతి సందర్భంగా కొన్ని ముఖ్య విశేషాలు. వరదా అరుదైన చిత్రకారుడే కాదు, అంతకుమించిన చిత్రకళపాధ్యాయుడు, మానవతావాది. కళల కణాచిగా రాజమహేంద్రవరం ఈనాడు వెలుగొందటానికి వెంకటరత్నం కృషి ఎంతో వుంది. తన సహచరుడైన రామారావు కోసం తన సర్వస్వం త్యాగం చేసిన అమరుడు ఆయన. విద్య కోసం తన దగ్గరకు వచ్చిన విద్యార్థులకు మాయామర్మాలు, దాపరికం లేకుండా ఉచిత విద్యాబోధన చేసిన ఆదర్శ గురువు. విద్యాభ్యాసం పూర్తి అయ్యాక, జీవికకు వేరే ఉపాధి చూపిస్తూ సహాయ సహకారాలు అందించిన మానవతావాది ఆయన ఆశ్రమాలు, రుషివాటికలు గుర్తుకువచ్చేలా ఆయన పాఠశాల నడిపేవారు. చిత్రకళ చేపట్టినప్పటినుండి జీవితాంతం ఆ విద్య వదలని పరాక్రముడు ఆయన.
రాజమహేంద్రవరంలో ప్రముఖ చిత్రకారులు, తన సన్నిహితుడైన దామెర్ల రామారావు మరణానంతరం, ఆ చిత్రాల కోసం, చిత్రశాలను వందేళ్ల క్రిందట ఏర్పాటుచేసిన మార్గదర్శి. నాటికి నేటికి మనకున్న ఏకైక చిత్రశాల ఇదొక్కటే. నాటి పట్టణ ప్రముఖులు సేకరించి ఇచ్చిన నాల్గువేల రూపాయల్ని కూడా పాఠశాల అభివృద్ధికి ఇచ్చిన ఉదారులు వెంకటరత్నం. ఈ చిత్రశాల నేటికి అటు రామారావుకి, ఇటు రాజమండ్రికి ఎనలేని కీర్తిని తెచ్చి పెడుతున్నది.
వెంకట రత్నం, విద్యల నగరం విజయనగరం సమీపంలోనున్న ‘అలమండ’ అనే కుగ్రామంలో 1895 అక్టోబరు 5న జన్మించారు. రాజమండ్రి వీరేశలింగం హైస్కూలులో మెట్రిక్ చదివి, చిత్రలేఖనం అభ్యసించి, స్థానిక బాలికల పాఠశాలలో చిత్రకళోపాధ్యాయునిగా చేశారు. ఈ సందర్భంగా దామెర్లతో పరిచయం కల్గింది. ఇరువురూ కలిసి చిత్రకళా సాధన చేసేవారు. రామారావు ఆకస్మికంగా మరణించాక, ఆయన చిత్రాలని భద్రపర్చారు. అంతేకాక, రామారావు స్థాపించిన చిత్రకళాశాలకు 40 సంవత్సరాల పాటు వెంకటరత్నం ప్రిన్సిపాల్ గా కొనసాగారు. ఈ సమయంలో ఎందరో విద్యార్థుల్ని ఉత్తమ చిత్రకారులుగా, చిత్రకళోపాధ్యాయులుగా తీర్చిదిద్దారు.
వెంకటరత్నం ఎంతో ప్రతిభావంతైమన చిత్రకారులు. సిల్కు వస్త్రాలపై చిత్రాలు రాయడం వీరి ప్రత్యేకత. అంతేకాక వాస్లెక్నిక్ లో చిత్రాలు గీయడంలో సిద్ధహస్తులు. 1937 సం.లో బ్రిటీష్ ప్రభుత్వం అనేక దేశాలనుండి ఎన్నుకున్న 12 చిత్రాల్లో వెంకటరత్నం చిత్రం కావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఈయన వేసిన చిత్రాల్లో విరహిణి, గాంధర్వులు, విలాసిని, సముద్రుడు, ద్రాక్షారామదేవాలయం, అజంతా సుందరి, బ్రహ్మవిష్ణువు, చిత్రాలేకాక, అనేక ప్రకృతి దృశ్యాలు, స్కెచ్లు వేశారు. వీరి ప్రతిభకు మెచ్చి కేంద్రప్రభుత్వం ఉపకారవేతనాన్ని మంజూరు చేసింది.
ఆయన వద్ద విద్యనభ్యసించిన వారిలో పిలకా లక్ష్మీనరసింహమూర్తి, ఎం.రాజాజీ, దామెర్ల సత్యవాణి, శీలా వీర్రాజు, శ్రీకాళహస్తి పార్వతీశం, మరంగంటి సీతారామాచార్యులు, తదితరులు గురువులకు తగ్గ శిష్యులనిపించుకొన్నారు. ఆయన 1963 అక్టోబరు 11న కన్ను మూశారు.
-సుంకర చలపతిరావు
Nice Article sir
Maku spoortydayakanga vundi
Thank you sir
ఆచార్యా వరద వారి గురించి చక్కని వ్యాసం అందించిన శ్రీ సుంకర చలపతి రావు గారికి ధన్యవాదాలు.!
Very nice… ఆర్టికల్ 👌
చిత్రకళాతపస్వి వరదా వెంకటరత్నం గారి గురించిన శ్రీ సుంకర చలపతి రావు గారి వ్యాసం చిత్రకారులకు స్ఫూర్తి గా వుంది. వారికి అభినందనలు. –బొమ్మన్, కార్టూనిస్ట్ విజయవాడ.