చిత్రకళ ఆచార్యునిగా జగతికి జగన్మోహన సౌందర్య చిత్రాలను అందించిన ఘనత వరదా వెంకటరత్నం గారిది అని, ఆంధ్ర కేసరి యువజన సమితి పూర్వ అధ్యక్షులు దేశిరెడ్డి బలరామ నాయుడు అన్నారు. ఎందరో ప్రఖ్యాత చిత్రకారులను తయారుచేసిన వరదా 130 వ జయంతోత్సవం రాజమండ్రిలో దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం (5-10-2025) నాడు జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి చిత్ర జగతికి ఆయన చేసిన సేవల్ని పలువురు కొనియాడారు. దామెర్ల స్మారక చిత్రకళా పాఠశాల స్థాపించి 40 ఏళ్లు ఎన్నో సేవలు అందించిన వరదా చిత్రకళకు ఆరాధ్యుడు అన్నారు. సిల్క్ వస్త్రాలపై పారదర్శక జల ప్రక్షాళన శైలిలో రంగులు వేయడంలో వరదా ప్రత్యేకత ఉందని ఆంధ్ర కేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ రికార్డుల విజేత, విజయవాడ కేంద్రీయ విద్యాలయం చిత్రకళ ఆచార్యులు ఆత్మకూరు రామకృష్ణ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీవీఎస్ కృష్ణారావు, రఘుపాత్రుని సాయిబాబా, బెజవాడ రంగారావు రచయిత రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
