తిరుమల ఆలయంలో వరాహస్వామి వర్ణచిత్రం

విజయవాడ చిత్రకారునికి దొరికిన అరుదయిన అవకాశం.

తిరుమలలోని ఆది వరాహస్వామి ఆలయంలో సెప్టెంబర్ 1 న వరాహస్వామి జయంతిని నిర్వహించారు. రెండు వేల యేళ్ళ చరిత్ర కలిగిన తిరుమలలో కొనేరు సమీపంలో వున్న ఆది వరాహస్వామి విగ్రహ స్వరూపం స్పష్టంగా భక్తుల సందర్శనార్థం వుంచే ఆలోచనతో ఈ.ఓ. ధర్మా రెడ్డి గారు విజయవాడకు చెందిన చిత్రకారుడు ఎన్.వి. రమణ కు వరాహస్వామి వర్ణ చిత్రాన్ని రూపొందించే పని అప్పగించారు. స్వహతాగా వెంకన్న భక్తుడయిన రమణ గారు తన ప్రతిభతో 5X3.5 అడుగుల సైజులో ఆది వరాహస్వామి చిత్రాన్ని పూర్తి చేసారు. ఈ వర్ణ చిత్రాన్ని స్వామి జయంతి రోజున ఈ.ఓ. ధర్మా రెడ్డి గారి చేతుల మీదుగా గుడిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చిత్రకారుడు ఎన్.వి. రమణను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసారు.
మూడు దశాబ్దాలకు పైగా చిత్రకళతో పెనవేసుకపోయిన జీవితం  రమణ గారిది.  కళలు అనేవి మనిషిలో పుట్టుకతోనే నిగూఢంగా దాగివుండి, కృషితో, సాధనతో రాణిస్తాయి అని నమ్మే వారిలో రమణ గారొకరు. నమ్మడమే కాదు, తనకు స్వహతాగా అబ్బిన కళకు స్వయంకృషితో నగిషీలు చెక్కుకున్నారు. విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రమణగారు చదువకున్నది తక్కువే అయినప్పటికీ, బ్రతుకు బడిలో నేర్చుకున్న పాఠాలెన్నో… అవే ఆయనకు బొమ్మలతో స్నేహాన్ని కుదిర్చాయి. జీవన గమ్యాన్ని నిర్దేశించాయి. ‘రమణ ఆర్ట్స్’ పేరుతో విజయవాడలో స్టూడియోను స్థాపించి అప్రతిహాసంగా కళాసృష్టి చేస్తున్నారు.  వీరు రూపొందించిన చిత్రాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి మ్యూజియంలో 7 అడుగుల జగన్మోహనావతారం’ తంజావూరు పెయింటింగ్, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం చిత్రకోటమండపంలో ఈయన చిత్రించిన 54 ఫ్రేముల రామాయణ చిత్రాలు ప్రదర్శించబడుతున్నవి.

-కళాసాగర్

SA: