నా కార్టూన్ టీచరు గారి గురించి…. జయదేవ్

కార్టూనిస్ట్ వర్చస్వీ గురించి జయదేవ్ ‘వర్చస్వీ కార్టూన్లు ‘ పుస్తకం లో చేసిన జయదేవోపాఖ్యానం చదవండి…

కార్టూన్ పాఠాలు చెప్పే టీచర్లెవరైనా వున్నారా అనడిగాను యాభైయేళ్ళ క్రితం. నాకు సరైన సమాధానం దొరక లేదు. ఒకరోజు గీతల గురువు బాపుగారిని కలిసే మహద్భాగ్యం దక్కింది. ఆయనకీ యిదే ప్రశ్నకి సమాధానం దొరక లేదని చెప్పారు. ‘మరేం చేశారు సార్!’ అని భక్తి పూర్వకంగా నోరు మెదిపాను. – “పెద్దవాళ్ళు గీసిన కార్టూన్లు తిరగెయ్యడమే…! ఆ కార్టూన్లే మనకి కార్టూను పాఠాలు నేర్పుతాయి. ఆ కార్టూన్లు గీసిన వాళ్లే, కార్టూను టీచర్లు!” అన్నారు. “మహాప్రసాదం… ఇప్పటి దాకా మీ కార్టూన్లే ఫాలో అయ్యాను. ఇక ముందు కూడా అదే నా దారి” అని మనసులో అనుకున్నాను.

ఆ తర్వాత పలుమార్లు బాపుగారిని కలిసినప్పుడు వారి లైబ్రరీలో మహానుభావుల కార్టూన్ పుస్తకాలు కొన్ని స్ప(ద)ర్శించే పుణ్యం నాకు కలిగింది. క్రమేణా, నేనూ ఒక చిన్న లైబ్రరీ నా డెస్కు కింద పెట్టుకున్నాను. రోజూ ఆ లైబ్రరీ పుస్తకాలు సర్దడం, కార్టూన్ పేజీలు తిరగేయడం, కార్టూన్ టీచర్లతో ప్రైవేటు చెప్పించు కోవడం, కార్టూన్లు గీయడం, ఆనందంగా రోజులు గడపడం చేస్కుంటూ జీవితయానం సాగిస్తున్నాను.

ఇప్పుడు నాకు కార్టూను పాఠాలు చెప్పే టీచర్లు చాలా మంది ఉన్నారు. ఆ టీచర్లలో బాపు గారు, ఆర్కే లకణ్, మారయో, విన్స్, సెర్టియో అరగోనిస్, చంద్ర, బాలి, బాచి, గోపి, మోహన్, బాబు, రామకృష్ణ, శంకు, ఎవిఎం, రాగతి పండరి, సుభాని, రాజు, శ్రీధర్, శంకర్, మృత్యుంజయ్, సరసి, లేపాక్షి, మోహన్ కుమార్, సాయిక్రిష్ణ, ప్రసాద్ కాజ, నారాజ్, వర్చస్వి… లిస్టు చాలా పెద్దది. ఒక్కో టీచరు గురించి చెప్పాలంటే, ఎంతైనా చెప్ప వచ్చు. ఎన్ని పుటల వ్యాసమైనా రాయొచ్చు.

ఇప్పుడు రాయబోయే యీ నాలుగు మాటలు (అంటే, కష్టం మీద క్లుప్తంగా) నా కార్టూన్ టీచరు, వర్చస్వీ గారి గురించి. వర్చస్వీ, కవి, రచయిత, జోడిస్టు, ఆర్టిస్టు, క్యారికేచరిస్టు, కార్టూనిస్టు, చదువరి, పెద్ద ప్రభుత్వోద్యోగీ, యింకా చాలా మంచి మనిషి. అందుకే వర్చస్వీ టీచరును నేను వర్చ్యూస్వ గా ఆరాధిస్తాను.

రవి గాంచనిచో కవిగాంచును అంటారు. కవీ రవీ గాంచని చోటును కూడా వర్చస్వి సునాయాసంగా ఆక్రమిస్తారు. వర్చస్వి పట్టని అంశం లేదు, తొట్టని (ప్రాసకోసం యీ పదం రాశాను… తమిళంలో తొట్టని… అంటే తాకని అని అర్థం!) ప్రవేశం లేదు. ఏ పాఠం ఐనా (పాఠం = కార్టూను) ఆయన పాలలో తేనె కలిపి తాపిస్తారు. వర్చస్వి టీచరు చేతివేళ్ళు, సన్నటి పూచిక పుల్లని సైతం పట్టి బొమ్మ గీయగలిగే నైపుణ్యం గలవి, స్మార్ట్ ఫోను పెన్సిలుతో నిమిషాల్లో క్యారికేచర్లు సృష్టించి రంగులు పులమగలిగే చాతుర్యం గలవి. కుంచెతో రంగులు కలిపి, కాగితం మీద అందాలను నింపగలిగే సామర్థ్యం గలవి. ఆ వేళ్ళను నడిపే వర్చస్వీ మేధస్సుగదిలో మ్యాజిక్ కర్ర పొంచి వుంది. ఆ కర్ర కొనల్లో నక్షత్రాలు వెలుగు జిలుగులు చిమ్ముతాయి. భావాలు పుట్టి, పదాలు పొంగి, వాక్యాలు వర్షించి, గీతలు పుష్పిస్తాయి. మన గుండెలు పులకితం ఔతాయి. అర్థమైందనుకుంటాను, నా టీచర్లు ఎలాంటివాళ్ళో, ఎంతటి ప్రతిభావంతులో!
ఈ కార్టూన్ సంకలనంలో వర్చస్వి టీచరు, మ్యాజిక్ కర్రని ఝళిపించి, హాస్య, వ్యంగ్య రసాలని వొలికించారు. ఒక్కో కార్టూను పలురకాల భావాలని వ్యక్తం చేస్తుంది.

మనసుని రంజింప చేస్తుంది. మీరు యువ కార్టూనిస్టయితే, ఈ సంకలనంలో పాఠాలున్నాయి. పాఠకులయితే హాయిగా నవ్వుకుని ఆనందించదగిన కార్టూనులున్నాయి. వుండనా మరి!
-జయదేవ్

ప్రతులకు :
వర్చస్వీ కార్టూన్లు
ఎమెస్కో బుక్స్,
విజయవాడ, హైదరాబాద్ లలో,
చరవాణి: 9948356626

వెల: రూ. 100/-

5 thoughts on “నా కార్టూన్ టీచరు గారి గురించి…. జయదేవ్

  1. సత్యం తెలిపారు. కార్టూన్లు మాత్రమే కాదండీ. గొప్ప కళాకారులు వేసిన మంచి పెయింటింగు లను కూడా మనం అభ్యాసం చేస్తే మనం కూడా చాలా మెళకువలు నేర్చుకోవచ్చు! Practice makes a man perfect!

  2. నాకు ఓనమాలు నేర్పిన గురుత్యులు – శ్రీ జయదేవులుగారికి – పాదాభివందనాలు!

  3. నాకు ఓనమాలు నేర్పిన గురుత్యులు – శ్రీ జయదేవులుగారికి – పాదాభివందనాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap