ఎప్పుడో.. చాలా ఏళ్ల క్రిందటి సంగతి.. జగద్విఖ్యాతులైన వీణ చిట్టిబాబుగారికి తంజావూరులో ఒక కచేరి ఏర్పాటు అయింది.మదరాసు నుండి వీణ తీసుకొని, రైలులో తంజావూరు చేరుకున్నారు ఆయన. అక్కడి సభా నిర్వాహకులు రైల్వే స్టేషనుకు వచ్చి,చిట్టిబాబు గారికి స్వాగతం పలికి,ఒక రిక్షాలో వారిని హోటలుకు చేర్చారు.అప్పట్లో తంజావూరు వంటి ఊళ్లలో రిక్షాయే అందరికీ ప్రయాణ సాధనం.
రిక్షా అతనితో “మళ్లీ సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చి,సారును కచేరీ జరిగే హాలుకు తీసుకు రావాలి” అంటూ చెప్పి,నిర్వాహకులు చిట్టిబాబుగారి వద్ద సెలవు తీసుకున్నారు.
చిట్టిబాబుగారు ఆరోజు మధ్యాహ్నమంతా హోటల్ లో విశ్రాంతి తీసుకొని,సాయంత్రానికి కచేరీకి సిద్ధం అయ్యారు.రిక్షా అతను సకాలానికి హోటలుకు వచ్చి,సామాను మోసే అలవాటుకొద్దీ వీణను తీసుకోబోతే,ఎవరి చేతికీ తన వీణ ఇవ్వటం అలవాటులేని చిట్టిబాబుగారు,అతనితో విషయం చెప్పి, తన బాగ్ అతని చేతికి ఇచ్చి,వీణతో రిక్షా ఎక్కారు.రిక్షా వేదికను సమీపించాక,దిగుతూ రిక్షా అతనితో,”బాబూ! ఇక్కడ నాకచేరీ సుమారు మూడు గంటలసేపు ఉంటుంది.అప్పటివరకూ నువ్వు ఇక్కడ చేసేదేమీ లేదు కనుక,ఈలోపుగా నీ బేరాలు చూసుకొని,తిరిగి తొమ్మిదిన్నరకు వచ్చి, నన్ను హోటల్లో దించితే సరిపోతుంది” అని,వేదికనెక్కారు చిట్టిబాబుగారు.
వేదికను దివ్యంగా అలంకరించారు నిర్వాహకులు..హాలంతా శ్రోతలతో నిండి ఉంది.’విరిబోణి’ అటతాళ వర్ణంతో అరంభమైన కచేరీ,ఒక్కొక్క అంశంతో ద్విగుణీకృతమైన రక్తిని సంతరించుకుంటూ సాగిపోయింది.సహజసుందరులైన చిట్టిబాబుగారు,చిరునవ్వుతో అలవోకగా అంగుళులు కదిలిస్తూ వీణపై పలికించిన రాగ,తాన,స్వర ప్రస్థారాలకు మైమరచిపోయి,కరతాళ ధ్వనులతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు జనం.సహకార వాద్యాలైన మృదంగ,ఘట విద్వాoసులూ లబ్ధప్రతిష్టులే..అద్భుత రీతిలో తమ సహకారం అందించారు వారు..
ఎలా గడచిపోయాయో తెలియదు..మూడు గంటలు..
‘పవమాసన సుతుడుబట్టు..’ అంటూ వైణికులు మంగళం ఎత్తుకున్నాక గానీ ఈలోకంలోకి రాలేదు శ్రోతలు.
నిర్వాహకుల ఆనందానికి హద్దులు లేవు.ఘన సత్కారం అందించారు…సభానంతరం..
చిట్టిబాబుగారిని అభినందించేందుకు వేదికపైకి బారులుకట్టారు జనం.
ఆ జనంలో..చివరినుండి ఒక చిరిగిన బనీనుతో,మాసిన గడ్డంతో అందరినీ తోసుకువస్తున్న ఒక వ్యక్తిని అడ్డుకున్నారు ముందున్న జనం.”ఎవడివయ్యా నువ్వు? ఏంకావాలిక్కడ? ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నచోటికి నీకేం పని?వెళ్లు వెనక్కి..”అంటూ గసురుతున్నారు..
“అయ్యా! ఒక్కపాలి ఆ వీనాయనతో మాటాడాల..ఎల్లనీయండి..” అంటూ వేడుకుంటున్న ఆ వ్యక్తిని చూశారు చిట్టిబాబుగారు.నిర్వాహకులతో,అతనిని తన దగ్గరకు పంపమని ఆదేశించారు.
దగ్గరకు వచ్చిన ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారాయన! ఆ వ్యక్తి..తనను అక్కడకు తెచ్చిన రిక్షా అతను.
దగ్గరకు రాగానే వినయంగా నమస్కరిస్తూ.. “అయ్యా! మీరు మామూలు మడిసి కాదు..దేవుడు పంపిన మహిమగలోరు..మీరు పైకి ఎల్లినాక,నేను బేరాలకి ఎల్దామనుకొని గుడా,కూసింతసేపు ఇందారని ఎనకమాల సుట్టగాలూస్తా నుంచొన్నా..ఆయ్యా! తమరి ఈన ఎంత పున్నెంసేసుకుందో.. ఏయో లోకాలకి నన్ను తీసుకెల్లిపోనాది..ఇయాల వాయించింది మీరు గాదు..బగవంతుడే..కాసేపు ఇందామనుకొన్న నేను..సివరి దాకా కదలనే లేకపోయా.. నేనెంత అదురుష్టమంతున్నో…నా రిక్షాల మిమ్మల్ని తెచ్చాను..అయ్యా! నిజం సెప్తున్నా..నేను రోజుకి పది రూపాయలు సంపాయిస్తా..అందులో అయిదు రూపాయలు ఇంట్ల ఇచ్చి,ఐదుపెట్టి మందు తాగతా..అలా అయితేనే మడిసిని..కానీ ఇయాల మీ ఈన ఇన్న తరువాత నాకింక జీవితంల తాగాలనిలేదు బాబు..కడుపు నిండిపోనాది..అయ్యా! ఇదిగో..ఈ పేదోడి ఆనందం కోసం..ఈ అయిదు మీరు ఉంచుకోవాల.” అంటూ తన గుప్పిట,నలిగిపోయిన అయిదు రూపాయల నోటుతీసి,చిట్టిబాబుగారి చేతిలో పెట్టి,మారు మాట్లాడనీయక,వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
చిట్టిబాబుగారి నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి.
చేష్టలుడిగి,చూస్తూ ఉండిపోయారు.”నిజంగా నా జీవితంలో మరువలేని రోజు ఇదే..ఏ సంగీత జ్ఞానం,స్వరపరిచయం లేని సామాన్య వ్యక్తి నా సంగీతాన్ని మెచ్చి,ఇచ్చిన ఈ బహుమానం,వెలకట్టలేనిది.ఒక కళాకారుడి జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది?” అనుకున్నారు.
చిత్రమేమిటంటే.. తనకొచ్చిన అవార్డులు,ప్రశంశాపత్రాల మాట ఎలాఉన్నా,ఆ రిక్షాఅతను ఇచ్చిన అయిదు రూపాయల నోటును మాత్రం చిట్టిబాబుగారు,తాను పరమపదించేవారకూ భద్రంగా దాచుకున్నారుట.
నీతి:- మనం ఏ స్థాయి కి వెళ్ళినా ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన… మనకంటూ ఉన్న కొన్ని మధురానుభూతులను ఎన్నటికీ మరచిపోరాదు.