![నాటక రంగ దిగ్గజాల శతదినోత్సవ సదస్సు](https://64kalalu.com/wp-content/uploads/2024/10/VeenaAwards_Tenali-795x350.jpg)
-8 నుంచి 12 వరకు తెనాలిలో పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు నిర్వహణ
–నాటక వికాసానికి కృషి చేస్తున్న ప్రముఖులకు స్మారక పురస్కారాలు
_______________________________________________________________________
కళ మన కోసం… మేము కళ కోసం నినాదంతో… వీణా అవార్డ్స్ పేరుతో కళల కాణాచి, తెనాలి, వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ సంయుక్తంగా జాతీయస్థాయి చతుర్థ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ ఏడో తేదీన కళాప్రముఖుల శతజయంతి సదస్సు నిర్వహించనున్నారు. తెనాలికి చెందిన ప్రసిద్ధ రంగస్థల నటుడు, ‘మాయల ఫకీర్’ ఫేం వల్లూరు వెంకట్రామయ్య, సాంఘిక నాటకం వైభవానికి కృషిచేసిన నటుడు కన్నెగంటి నాసరయ్య, శతాధిక నాటకాలను రచించి, ఆంధ్ర ప్రజలను ఉర్రూతలూగించిన నాటక రచయిత కొడాలి గోపాలరావు, పల్నాడుకు చెందిన నాటక రచయిత బెల్లంకొండ రామదాసు శతజయంతి సదస్సు నిర్వహించనున్నారు. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో నిర్వహించనున్న సదస్సుకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, అధ్యాపకుడు డాక్టర్ డీ.ఎస్ఎన్. మూర్తి అధ్యక్షత వహిస్తారు. రంగస్థల నటుడు, గుణనిర్ణేత, విశ్లేషకుడు కారుమూరి సీతారామయ్య ఆత్మీయ అతిథిగా పాల్గొంటారు.
సదస్సు అనంతరం ఈ ప్రముఖుల పేరిట ఆవార్డులను ప్రదానోత్సవం చేస్తారు.
ఆచంటకు వల్లూరు పురస్కారం:
ఐదు దశాబ్దాలకు పైగా ఉన్న నటజీవితంలో తెనాలి నటుడు వల్లూరు వెంకట్రామయ్య చౌదరి, బాలనాగమ్మ నాటకంలోని మాయలఫకీర్ పాత్రలో దాదాపు 3,500 వేల ప్రదర్శనలిచ్చారు. ప్రముఖ రంగస్థల రచయిత, నాటక విశ్లేషకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు వీరి గురించి ప్రసంగిస్తారు. విజయవాడకు చెందిన ప్రముఖ రంగస్థల పౌరాణిక నటుడు, నంది ఆవార్డుగ్రహీత ఆచంట బాలాజీనాయుడును వల్లూరు వెంకట్రామయ్య చౌదరి స్మారక పురస్కారంతో సత్కరిస్తారు.
రామారావుకు నాసరయ్య స్మారక అవార్డు:
తెనాలి నటుడు కన్నెగంటి నాసరయ్య జనతా ఆర్ట్ థియేటర్ లో సాంఘిక నాటకానికి పట్టం కట్టారు. పౌరాణిక పద్యనాటకాల హోరు కొనసాగుతున్న కాలంలో సాంఘిక నాటకాలను జనరంజకంగా ప్రదర్శిస్తూ ప్రేక్షకాదరణను పొందారు. అయిదారు దశాబ్దాల క్రితమే సాంఘిక నాటక ప్రదర్శనలో పలు ప్రయోగాలను చేశారు. ఆయన శత జయంతి సంవత్సరంలో జరిగే ఈ సదస్సులో బాపట్ల జిల్లా వెదుళ్లపల్లికి చెందిన నాటకరంగ విశ్లేషకుడు అంబటి మురళీకృష్ణ, నాసరయ్య గురించి ప్రసంగిస్తారు. పల్నాడు జిల్లా రంగస్థల నటుడు, దర్శకుడు. టీవీ సీరియల్స్ రచయిత జరుగుల రామారావుకు నాసరయ్య స్మారక అవార్డును ప్రదానం చేసి సత్కరిస్తారు.
శివప్రసాద్కు గోపాలరావు అవార్డు:
రాష్ట్రంలోని ఇద్దరు శతాధిక నాటక రచయితల్లో ఒకరైన కొడాలి గోపాలరావు శతజయంతి స్మారకోపన్యాసాన్ని ఆయనపై పరిశోధన చేసిన వేల్పుల బుచ్చిబాబు చేస్తారు. ప్రముఖ కథా, నాటక రచ యిత, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ కు గోపాలరావు ఆవార్డు ప్రదానం చేసి సన్మానించనున్నారు.
శశిమోహన్ కు రామదాసు పురస్కారం:
నయాగరా నాటక కవిగా ప్రసిద్ధి పొందిన బెల్లంకొండ రామదాసు శతజయంతి స్మారకోపన్యాసాన్ని ఇదే వేదికపై ఏర్పాటుచేశారు. పల్నాడు. జిల్లా నరసరావుపేట దగ్గర్లోని పమిడిపాడు వీరి సొంతూరు. ప్రముఖ పాత్రికేయుడు రెంటాల జయదేవ వీరి జీవితవిశేషాలు, ప్రత్యేకతలను వెల్లడిస్తారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నాటక రచయిత జమ్మలమడక శశిమోహన్ ను రామదాసు పురస్కారంతో సత్కరిస్తారు. సదస్సు, అవార్డుల ప్రదానోత్సవం విరామంలో శ్రీదుర్గా భవాని నాట్యమండలి, తెనాలి వారి పద్యనాటిక ‘శ్రీకృష్ణరాయబారం’ (పాన్సు సీను) ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
-కె.యస్.