విశ్వవిఖ్యాత వైణికుడు – వీణాపాణి

‘కళను నమ్ముకున్న కళాకారుల ప్రతిభకు అవార్డులు, రివార్డులే కొలమానాలు. అవార్డుల్లో అత్యుత్తమమైనది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు’’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా లండన్‌లోని భవన్స్‌ ప్రాంగణంలో సంగీత వేడుక జరిగింది. సంగీతంలోని విశిష్టమైన 72 మేళకర్త రాగాలను ఏకధాటిగా 61 గంటల 20 నిమిషాల పాటు వీణావాదన చేసి గిన్నిస్‌ను సొంతం చేసుకున్నారు తెలుగు సినిమా సంగీత దర్శకుడు వీణాపాణి. ఈ సందర్భంగా వీణాపాణిని సత్కరించిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఇంత గొప్ప గౌరవం దక్కటం తెలుగువారితో పాటు, భారతీయులందరి అదృష్టం. ఆ మధ్య తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ చిత్రానికి వీణాపాణిగారు చేసిన సంగీతం కూడా నాకు ఎంతగానో నచ్చింది. ఇటువంటి కళాకారులను వ్యక్తిగతంగా, వృత్తిగతంగా గౌరవించటం మన సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం’’ అన్నారు.
‘‘మన తెలుగువాడు ఇంతటి ఘనకీర్తిని సాధించటం మనందరికీ ఎంతో గర్వకారణం’’ అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘వీణాపాణి అసలు పేరు రమణమూర్తి. ఆయనకు వీణాపాణి అని నామకరణం చేసింది నేనే అని గర్వంగా చెప్తున్నాను. వీణాపాణి అంటే సరస్వతీ దేవి. అలాంటి పేరు పెట్టుకున్నందుకు సార్ధక నామధేయుడయ్యాడు. గాంధీగారు ప్రేయర్‌ చేసుకుని తిరిగిన లండన్‌ వీధుల్లోని భవన్స్‌లో ఈయన సాధించిన ఈ అద్భుతాన్ని ప్రపంచానికి తెలియచెప్పటం కోసం గిన్నిస్‌ వారు ఆయనకు అవార్డు ప్రధానం చేయటం వీణాపాణి పూర్వజన్మ సుకృతం’’ అన్నారు.
రచయిత–దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘దేవస్థానం’ చిత్రానికి సంగీత దర్శకుడు, పాటల రచయిత కూడా వీణాపాణీనే. చిన్న అవార్డు అందుకోవటం ఎంతో కష్టమైన ఈ రోజుల్లో గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించటం అంటే మాటలా. ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి’’ అన్నారు.
వీణాపాణి మాట్లాడుతూ– ‘‘నేను సాధించిన ఈ గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డును మానస్ఫూర్తిగా ఆ మహాత్మునికి అంకితమిస్తున్నాను ” అన్నారు.

1 thought on “విశ్వవిఖ్యాత వైణికుడు – వీణాపాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap