తెలుగు నేలపై వెల్లటూరి పూర్ణానంద శర్మ గారి పేరు తెలియని చిత్రకారుడు వుండరు. నవరంగ్ చిత్రకళా నికేతన్ ద్వారా నాలుగు దశాబ్దాల పాటు ఎందరో చిత్రకారులను ప్రోత్సహించిన ఘనత వారిది. గుంటూరు జిల్లా వెల్లటూరిలో వుంటూ జాతీయ స్థాయిలో చిత్రకళా పోటీలు నిర్వహించిన గొప్ప కళాసారధి పూర్ణానంద శర్మగారు.
పూర్ణానంద శర్మగారి మూడవ తరానికి చెందిన బాల చిత్రకారుడు ఈ ఆర్యన్ ప్రత్నస్. గుంటూరు కేంద్రీయ విద్యాలయం లో 10 వ తరగతి చదువుతున్న ‘ఆర్యన్’ పువ్వు పుట్టాగానే పరిమళిస్తుంది అన్న చందాన బాల్యం నుండి చిత్రకళ పై మక్కువతో చిత్రకళలో రాణిస్తున్నాడు. కేంద్రీయ విద్యాలయం డ్రాయింగ్ టీచర్ మృత్యుంజయరావు శిక్షణలో పాఠశాల స్థాయిలో, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక చిత్రకళా పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకొని తాత వారసత్వాన్ని నిలబెడుతున్నాడు.
‘ఆర్యన్’ సాధించిన విజయాలలో కొన్ని:
2022 సం.లో ఇండియా టూరిజం, భారత ప్రభుత్వం వారు ” ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన చిత్రకళా పోటీలలో పాల్గొని ఆంధ్ర ప్రదేశ్ లో ప్రథమ స్థానంలో నిలిచాడు.
2022 సం.లో మచిలీపట్నం ఆర్ట్ ఆకాడెమీ వారు నిర్వహించిన ఆన్ లైన్ ఆర్ట్ పోటీల్లో “బాల చిత్రరత్న” అవార్డ్ పొందాడు.
2018 సం.లో భగీరథ ఆర్ట్ ఫౌండేషన్ రాజమహేంద్రవరం వారు నిర్వహించిన చిత్రకళా పోటీలలో పాల్గొని “బెస్ట్ చైల్డ్ అవార్డ్ ” అందుకున్నాడు.
యంగ్ యన్వాయిస్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ వారు 2018 సం.లో నిర్వహించిన 10 వ అంతర్జాతీయ చిత్రలేఖన పోటీల్లో బాలల చిత్రకళా పోటీల్లో “బంగారు పతకాన్ని” గెలుచుకున్నాడు.
ఇంకా… కేంద్రీయ విద్యాలయ సంఘటన్, అజంతా కళారామం, CSIR, New Delhi, రాజమండ్రి చిత్ర కళానికేతన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని బహుమతులండుకున్నాడు ఆర్యన్. చిత్రకళా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆర్యన్ ని అశీర్వదిద్దాం.
ఆర్యన్ ప్రత్నస్ తండ్రి వెల్లటూరి కృష్ణ ప్రసాద్ కూడా చిత్రకారుడే.
-కళాసాగర్