వెల్లటూరి పూర్ణానంద శర్మ గారి 87వ జన్మదిన సందర్భంగా….
కళ కాసు కోసం కాదు, కళ సమాజం కోసం అని కృషిచేసిన గ్రామీణ చిత్రకారులు శ్రీ వెల్లటూరి. తెలుగు చిత్రకళా రంగంలో నాలుగు దశాబ్దాలుగా నిర్విరామకృషి చేసిన వీరి కళాప్రతిభ ఆంధ్రులకు తెలియనిది కాదు. వీరు గుంటూరు జిల్లా వెల్లటూరులో 1934 నవంబరు 1 న జన్మించారు. చిన్నతనం నుండి చిత్రకళపై ఆశక్తి మెండుగా వుండటం వల్ల చదువు అంతగా వంటబట్టలేదు. 1951 నుండి నాలు సంవత్సరాలు డ్రాయింగ్ పెయింటింగ్ డిజైన్ పరీక్షలలో కృషిచేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందారు. అనంతరం జీవనోపాధి నిమిత్తం గుంటూరు జిల్లా పరిషత్ లో ఆర్డు టీచరుగా చేరారు. 1951 నుండి వీరు కళామాతకు తన కళా ప్రతిభతో కళ్యాణ రేఖలను తీర్చిదిద్దుతున్నారు. ఇంతవరకు వేలాది రేఖాచిత్రాలు, వర్ణచిత్రాలు, పేపర్ కటింగ్ చిత్రాలు వివిధ దిన, వార, మాసపత్రికల్లో వివిధ పండుగ సందర్భాల్లో గీసి ఆంధ్ర పాఠకుల అభిమానం పొందారు. సహజంగా వీరు సంప్రదాయ చిత్రకారులు అయినప్పటికి దానికి సన్నిహితమైన జానపద చిత్రకళను ఆరాధిస్తారు. ఆధునిక కళాధోరణిలో కూడా కొన్ని చిత్రాలు గీశారు.
వీరు ఖరగ్ పూర్, సిద్దిపేట, భీమవరం, హైదరాబాదు, గుంటూరు, అమృతసర్ లో జరిగే చిత్రకళా పోటీలలో పాల్గొని అనేక బహుమతులు ప్రశంసా పత్రాలు గెలుపొందారు. వీరి వర్ణచిత్రాలలో కానుకలు, తలంబ్రాలు, స్నాతకం, సంగీత సాధన, జాలరి జంట సమిష్ట బహుళ ఆదరణ పొందాయి. .
1975లో హైదరాబాద్లో జరిగిన ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో వీరు తైలవర్ణాలలో చిత్రించిన గుణాఢ్యుడు బృహత్కథ ప్రదర్శింపబడి రూ. 1116/- లు ప్రభుత్వం సత్కారం పొందారు. 1986లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఆర్డు టీచర్ గా గుర్తించి సన్మానించింది. వీరు వివిధ సందర్భాలలో గీసిన చిత్రాలకు వ్రాసిన చిత్రకళా వ్యాసాలు కొన్నింటిని కూర్చి రేఖాంజలిగా వెలువరించారు. 1990లో తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో, రేఖా చిత్రాల్లో మన పండుగలు అనే గ్రంథాన్ని, 2000లో కళాదీపికను కూడా వెలువరించారు. వీరు ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ, బాలల అకాడమీ కార్యవర్గ సభ్యులుగా కూడా పనిచేశారు. వీరు స్వగ్రామమైన వెల్లటూరులో చిత్రకళోపాధ్యాయునిగా పనిచేస్తూ నవరంగ్ చిత్రకళానికేతన్ ద్వారా ప్రతి సంవత్సరం పిన్నలకు, పెద్దలకు, చిత్రకళా పోటీలు నిర్వహించారు. అనేకమంది యువ చిత్రకారులను తీర్చిదిద్ది, వారి జీవనోపాధికి తోడ్పడ్డారు. వీరు ఆగస్ట్ 13, 2007 లో గుంటూరులో కన్నుమూసారు.
-సుంకర చలపతిరావు (91546 88223)
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.
నేను 1975 లో పదవ తరగతి పరీక్షలు రాశాక వెల్లటూరు వెళ్లి నవరంగ్ చిత్రకళానికేతన్ -పూర్ణానందశర్మ గారు నిర్వహించిన చిత్రకళా పోటీలో ద్వితీయబహుమతి పొందాను. అది నిడుబ్రోలు కాలేజీలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో అందుకున్నాను.మధుర జ్ఞాపకాలను గుర్తు చేశారు. ధన్యవాదాలండీ