వెలుతురు చెట్లు – కవిత్వం

మట్టిని దేహానికి రంగుగా పూసుకుని, ఆ వాసనతో మదిని నిండుగా నింపుకుని దారి పక్కన వున్న సేవకుల్ని హృదయంలోకి ఒంపుకుని ప్రకృతినే గురువుగా ఎంచుకున్న విద్యార్థి కవనాలతో కదం తొక్కుతూ ఘనమైన గంధపు వాసనల, నిర్భీతిగా ప్రవహించే ప్రశ్నల, హృదయాన్ని బరువెక్కించే భావనల బంధనాల్లో చిక్కుకుంటే కలిగే అనుభూతిని “వెలుతురు చెట్లు” మోసుకొచ్చిన వెన్నెల రూపంలో శాంతయోగి యోగానంద అందించారు. మొదటి సంకలనంలోనే వైవిధ్యమైన శీర్షికలను ఎంచుకుని తన వ్యక్తిత్వాన్ని, నిశిత పరిశీలనను మేళవించి సుఖాల్ని సంతోషాల్ని, ఆకల్ని ఆవేశాన్ని, ఆవేదనని అనుభవాన్ని వెలుతురు చెట్లనే చలువ పందిరి కింద పాఠకుల అంతరంగంలోకి ఒంపుతారు.

సమస్యల్లో కూరుకుని నిరాశలో మగ్గే వారికి వచ్చి పోయే గాలివానల వంటి వాటికి బెదరక చెదరక అంతర్లీనంగా హోమాగ్నిని రగిల్చుకుని కంకణ బద్దులై సాగిపోతూ, ప్రయత్నిస్తూ, యజ్ఞంలా శ్వాసిస్తూ గమ్యాన్ని చేరుకోవాలని తను మెచ్చిన పక్షి పాత్రలో పొదిగిన స్ఫూర్తిని ఆరంభ కవితలోనే పరిచయం చేస్తారు. ప్రపంచంలోని దు:ఖాన్ని తన దు:ఖంగా భావించి ఉఫ్ మని ఊదేయడానికి ఊపిర్లు ఊరికే వస్తాయా? అంటూ ప్రశ్నిస్తూనే భూమి చెట్టుకు పూసిన కొమ్మలే కదా దేశాలన్నీ అనే అద్భుతమైన అభివ్యక్తితో అందరినీ ఆలోచింపజేస్తూ నామద్యేయాన్ని సార్థకం చేసుకున్న శాంతి కాముకుడు దర్శమిస్తాడు కవిలో…….

ఆకలి కడుపుతో ఆకలిని తినేసి ఆకలి లేదనే అమ్మ త్యాగాన్ని, సజీవ చైతన్య మూర్తిని, గోరంత ప్రేమకే తపించే ప్రేమ పిపాసిని, గుండెల్ని పిండి ప్రేమ సుధారాగాల్ని పలికించే స్త్రీ మూర్తిని అక్షర బద్ధం చేయాలంటే సృష్టి కావ్యాన్ని లిఖించినట్లేనని అమ్మ జాతి పట్ల తనకున్న మధురభావనల్ని వినమ్రంగా నివేదించిన తీరు హృదయాన్ని బరువెక్కిస్తుంది. చెల్లని నాణేన్ని చేతబట్టుకొని కొట్టుకు వెళ్ళిన, రాతి పలకలపై కొంగ గీతల్ని గీసిన, చంకనెక్కి ముద్దు మురిపాల్ని ప్రతిఫలంగా పొందిన అందమైన బాల్యంలో నేనొక దేవుడినని అమాయకంగా చెప్పడం, వస్తువును శిల్పంగా మలిచిన తీరు పాఠకుల్ని బాల్యంలోకి తీసుకెళ్ళడంలో కృతార్థుడు అయ్యాడు కవి.
చినుకు రాకకై ఎదురుచూడగా ఎరుపెక్కిన నేలతల్లి ఒడిలోనే జీవితాన్ని సాగిస్తూ, కండలు కరిగి కదిలే పీనుగులా మారినా, బోలెడు కష్టాలు చుట్టిముట్టినా సడలని కొండంత గుండె బలంతో అందరికీ అన్నం పెట్టే రైతన్న దయనీయ స్థితిని మానవీయ కోణంలో చూడని కొంగజపం చేస్తూ రైతు పక్షాన నిలబడని సంఘాలకిది న్యాయమా అని నిగ్గదీసి నిలదీశారు. వారి కష్టాలను, దగాపడ్డ జీవితాన్ని కళ్ళ ముందు ఆవిష్కరిస్తూ నేను నేలమ్మ ముద్దుబిడ్డల పక్షాన నిలబడిన కవి యోగానంద గారు.దారి పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న సొట్టలు పడ్డ పాత ఇత్తడి చెంబు ముఖాల్లో స్థిత ప్రజ్ఞులైన మునుల్ని దర్శించడం ఈయనకే సాధ్యమయింది. చిన్నపాటి బేరాలకే వంశవృక్షం అడిగి ఆత్మబంధువుల్లా మారే జాలి గుండె గల ఆత్మీయుల్ని గుర్తించడంలోనే కవి హృదయ సౌందర్యాన్ని, సామాజిక అంశాలపై తనకున్న నిశిత పరిశీలనను అభినందించుటకు మాటలు చాలవు.

చిన్నపిల్లలా అడుగులు వేసేందుకు ఉరకలేసే నీటికి తన తనువును పరిచిన, ఎన్నో గొంతుల్సి తడిపిన, మైదానాలకు సస్యశ్యామల గీతాన్ని నేర్పిన నదీమతల్లి ఆంతరంగంలోకి పరకాయ ప్రవేశం చేశారు. కనుకనే నదిలోని ఇసుక మేటలు చెప్పే బోలెడు కథల్ని, ప్రవాహం తెచ్చిన తీపి గుర్తులతో పఠితుల హృదయానికి శీతల స్పర్శను కలిగిస్తూనే,కళ్ళు చెమర్చేలా చేసిన గాయాల సైకత శిల్పాన్ని ఆవిష్కరిస్తారు.పూరి గుడిసెల్లోని రంగులు మార్చని గోడల్ని, ఎంగిలి కాని మనసుల్ని, చూరులోకి దూరిన ఉత్తరాల్ని, కంకుల చుట్టూ తిరిగే పిచ్చుకల పిల్లకాయల్ని హృదయంలా పరుచుకున్న మట్టితో బంధాన్ని ఏర్పరచుకున్న స్వచ్ఛమైన మనుషుల్ని ఎంతో హృద్యంగా పాఠకుల మనో ఫలకంపై ముద్రిస్తారు.

జీవితంలోని ఎత్తుపల్లాలను గణించిన అనుభవ వైశాల్యంతో సామాజిక చింతన సమాజహిత కాంక్షను కలబోసి తాత్విక దృష్టితో వాస్తవిక ప్రపంచానికి అన్వయించడంలోని ఎత్తుగడ అభినందనీయం. విలక్షణమైన ఊహాశీలతతో చైతన్యాగ్ని గోళాల్ని కుమ్మరించే కవనాలతో నిద్రాణమై ఉన్న మనుషుల్ని తట్టి లేపుతుంది. సమాజానికి అవసరమైన ధాన్యపు రాశిలా 57 కవితల్ని 93 పుటల మైదానంలో పండించారు.వైవిద్యమైన శీర్షికలతో గాఢత నిండిన శిల్పంలో ఉద్వేగ పరవశుల్ని చేసే మాటల మార్మికత గోచరిస్తుంది.
“వెలుతురు చెట్లు” నుండి వచ్చే వెలుగంతా సమాజంలోని చీకటి లోయల్ని వెన్నెల మైదానంలా మార్చే జీవమున్న అక్షర ప్రవాహంలో తడిసి ముద్దవ్వాలంటే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.

పుట్టపర్తి మల్లికార్జున (9490439029)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap