తెలుగు సాహిత్య, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన అరుదైన స్థానం పొందిన మహనీయుడు వేమన. భాషను, భావాన్ని ప్రజలకు చేరువ చేసిన ఘనత వేమనకే దక్కుతుంది.
వేమన కాలం, ప్రాంతం, సంఘటనలు, భావాజాలం ఇలా అన్ని ఇతమిద్దంగా తేలకపోవడం వలన అనేక అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి. వేమన పద్యం ఎదో కానిదేదో కూడా నిర్ధారించలేని పరిస్థితి ఎదురవుతుంది. వేయికి మించి ఉండని వేమని పద్యాలు దాదాపు ఆరువేల పద్యాలుగా కనిపిస్తున్నాయి. వేమన పద్యాలు ఎవో శాస్త్రీయంగా తేల్చవలసిన పని గత వందేళ్ళుగా అలోచనలలోనే మిగిలిపోయింది. ఇకనైన ఆ పనికి పూనుకోందాం.
వేమన పద్యాలను పరిశీలిస్తూ పోతే.. వేమన జీవితంలో తొలిదశనుండి చివరిదాకా ఒక క్రమానుగత పరిణితి కనిపిస్తుంది. ఒక తాత్వికత ఎలా రూపం తీసుకొంటుందో కనిపిస్తుంది. సమాజానని పరిశీలించడం, గుణ,దోషాలను సత్య దృష్టితో వివేచన చేయడం, సమాజం ఎలా ఉండాలో ఒక మార్గాన్ని చూపడం కనిపిస్తుంది. తాను ఎందుకు రాయాలో, ఎవరికోసం రాయాలో స్పష్టమైన దృక్పథం కనిపిస్తుంది.
వేమన గారు కేవలం రాయడంతోనే తన పని అయిపోయిందని కాకుండా వరకే, సమాజంలో మార్పు కోసం ప్రత్యక్షంగా కార్యాచరణకు కూడా పూనకొన్నాడని నా బలమైన నమ్మకం. ఇందుకు సంబంధించిన ఆధారాలు కోసం మరింత సమయం పట్టవచ్చు. వేమన జీవితం పై జానపదుల ఐతిహ్యాలు,వేమన అనచరులు గుర్రాలపై పసుపు బట్టలతో తరుగాడే సంప్రదాయం కార్యచరణనే సూచిస్తాయి.
వేమన పద్యాలను నాలుగు నేర్చుకోవడంతోనే మన పని అయిపోదు. ఆయన భావాలను ఆచరించడమే మన ముందున్న కర్తవ్యం.
వేమన గురించి పరిశోధన
వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి – యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు
తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయడానికి కృషి చేసినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాలకై రెడ్డి కృషి చేశాడు.
-డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి