‘వెండి చందమామలు’ కొత్త తరహా పుస్తకం

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ సంయుక్తంగా రచించిన ‘వెండి చందమామలు’ పుస్తకాన్ని ఇటీవల హైదరాబాద్లో ప్రముఖ దర్శకుడు, రచయిత వంశీ ఆవిష్కరించారు. ఈ పుస్తకం తొలి కాపీని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి రవిప్రసాద్ పాడి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ, పుస్తక రూపశిల్పి సైదేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, “1950, ‘60, ’70 లలో తెలుగునాట వెండితెర నవలలు ఓ వెలుగు వెలిగాయి. వాటిల్లో నాకు గురువుగారు ముళ్ళపూడి వెంకట రమణ రాసిన పుస్తకాలు ఇష్టం. నేను కూడా ఓ నాలుగు వెండితెర నవలలు రాశాను. అందులో ‘ తాయారమ్మ – బంగారయ్య’ మాత్రం పబ్లిష్ కాలేదు. మిగిలినవి పుస్తక రూపంలో వచ్చాయి. నేను రాసిన వెండితెర నవలల్లో బాగా పాపులర్ అయ్యింది ‘శంకరాభరణం’ వెండితెర నవల. ఇలా తెలుగులో ఉన్న అనేక వెండితెర నవలల మీద ఇలాంటి పరిశోధనాత్మక రచన ఇంతకు ముందు నాకు తెలిసి ఎవరూ రాయలేదు, రాలేదు. ఇవాళ పులగం చిన్నారాయణ, మిత్రుడు ఓం ప్రకాశ్ నారాయణ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో ఏ వెండితెర నవల ఎవరు రాశారు, అది ఎప్పుడు విడుదలైందనే పట్టిక కూడా ఇచ్చారు. ఇంత చక్కని పుస్తకం మంచి పాపులారిటీని తెచ్చుకుని, వెంటనే రీప్రింట్ కు రావాలని ఆశిస్తున్నా” అన్నారు. పుస్తక రచయితల్లో ఒకరైన పులగం చిన్నారాయణ మాట్లాడుతూ, “ఇరవై ఏళ్ళుగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేసినా కలగని తృప్తి సినీరంగానికి సంబంధించిన రచనలు చేయడంతో నాకు ఎక్కువ కలిగింది. గతంలో నేను రాసిన పుస్తకాలకూ, ఇప్పటి ఈ పుస్తకానికీ ప్రేరణ వంశీ గారే! ‘వెండితెర నవల’పై పుస్తకం రాయమని నాకు, మిత్రుడు ఓంప్రకాశ్ కు సలహా ఇచ్చింది కూడా ఆయనే. ఈ ‘వెండి చందమామలు’ రచనను తొలిసారి ‘పులగమ్స్’ అనే పేరుతో సొంతంగా ప్రచురించాను. రెండో పుస్తకంగా ఇళయరాజా గురించి వంశీ రాసిన ‘స్వప్నరాగలీనమ్’ను ప్రచురించాలని భావిస్తున్నా” అని తెలిపారు.
వడ్డి ఓంప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ, “మిత్రుడు పులగం చిన్నారాయణ సూచనతోనే గతంలో మేం రాసిన ‘వెండితెర నవల’లకు సంబంధించిన వ్యాసాన్ని మరిన్ని వివరాలతో, విస్తరించి ‘వెండి చందమామలు’ పేరుతో పుస్తకంగా తీసుకురాగలిగాం. ఈ పుస్తకంలో కేవలం వెండితెర నవలల గురించి రాయడమే కాకుండా, స్వర్గీయ ముళ్ళపూడి వెంకట రమణ మొదలు ‘నవోదయ’ రామ్మోహనరావు, శ్రీరమణ, వేమూరి సత్యనారాయణ, సింగీతం శ్రీనివాసరావు వంటి పెద్దల అభిప్రాయాలు పొందుపరిచాం. ఇంతవరకూ వచ్చిన వెండితెర నవలల జాబితాను కూడా ఇచ్చాం” అన్నారు.
ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్ సైదేశ్ ఈ సందర్భంగా తన కృతజ్ఞతలు తెలియచేశారు.

టాలీవుడ్ చరిత్రలో ఇంతవరకు వచ్చిన సుమారు 140 వెండితెర నవలల జాబితా, ఈ రంగానికి చెందిన పలువురి ప్రముఖుల అభిప్రాయాలు ఈ పుస్త కంలో జోడించారు. సినీరంగ పరిశోధకులు, ఆసక్తి గల అభిమానులు, ఔత్సాహి కులకు ఎంతో విలువైన సమాచారమిచ్చే పుస్తకమిది.
ధర: 50 రూపాయలు, పేజీలు: 92
ప్రతులకు: నవోదయ తెలుగు బుక్ హౌస్లు, సాహిత్య నికేతన్ మరియు ప్రముఖ పుస్తక దుకాణాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap